ఆత్మ విశ్వాస ప్రపూరితంగా సాగుతున్న దిల్ రాజు జైత్రయాత్ర

Tollywood Successful Film Producer Dil Raju Continues His Success Spree,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Dil Raju Success Spree,Tollywood Successful Film Producer Dil Raju Birthday,Producer Dil Raju Recent News

నిర్మాత అనే పదానికి అర్థంగా, అద్దంగా నిలిచిన మహానుభావులు,మహామహుల చరిత్ర ఏనాడో ముగిసిపోయింది… గతించిన వైభవంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రస్తుతం ‘నిర్మాత’ అంటే సమూహంలో ఒంటరి. చుట్టూ ఎందరో ఉన్నా, అందరూ ఉన్నా నిర్మాత ఘోష, గోడు అరణ్యరోదనే అవుతున్నాయి. నిజానికి సినిమా అనే సప్తవర్ణ సౌధానికి మూల స్థంభమైన నిర్మాత ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాడు. నిర్మాత మనుగడే ప్రశ్నార్థకమైన నేటి ప్రతికూల పరిస్థితుల్లో ఆత్మవిశ్వాస ప్రపూరితంగా అద్భుత విజయాలను అందిపుచ్చుకుంటున్న నిర్మాత ఒకరున్నారు. ఇండస్ట్రీలో నిర్మాతలు అందరూ చెప్పుకొని బాధపడే సమస్యలు, సవాళ్లు ఆయనకూ ఉన్నాయి. కానీ ఆయన వాటిని అధిగమించే విధానం, ఎదుర్కొనే పద్ధతి విభిన్నంగా ఉంటుంది. అస్తవ్యస్తంగా మారిన చిత్ర నిర్మాణ ధోరణుల దుష్ఫలితాలకు అతీతంగా నిర్మాణ వ్యూహాన్ని రచించుకుంటూ అనితర సాధ్యమైన విజయాలతో దూసుకుపోతున్న ఆ అగ్రశ్రేణి, ఆదర్శ నిర్మాత మరెవరో కాదు…’ దిల్ రాజు’.

వరస నిర్మాణాలతో, వాటిలో అధిక శాతం విజయాలతో ” Top Producer of Tollywood” గా ఎదిగిన “దిల్ రాజు” పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అనే 3 విభాగాల ” రారాజు” గా శిఖరాగ్రలపై తన విజయ బావుటా ఎగురవేస్తున్న దిల్ రాజుకు హ్యాపీ బర్త్డే చెప్తూ ఆయన విజయ ప్రస్థానానికి అక్షర అభినందనలు పలుకుతుంది ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”.

తెరవెనుక ఉండే నిర్మాతకు తెర మీద కనిపించే స్టార్స్ తో సరిసమానమైన ఐడెంటిటీ, ఇమేజ్ ఏర్పడటం సంథింగ్ స్పెషల్ గా అనుకోవాలి. ఈ రోజున ఉభయ తెలుగురాష్ట్రాలలో ఏ టాప్ స్టార్ కు తీసిపోని ఫేషియల్ ఐడెంటిటీ అగ్రనిర్మాత దిల్ రాజు కు ఉంది.

ఇక తెలుగు చలన చిత్ర పరిశ్రమలో దిల్ రాజు సాధించుకున్న స్థాన విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొత్తగా వస్తున్న బడ్డింగ్ స్టార్స్ మొదలుకొని టాప్ స్టార్స్ వరకు ప్రతి ఒక్కరూ దిల్ రాజు సినిమాల్లో నటించాలని కోరుకోవటం తో పాటు దర్శకులు,సాంకేతిక నిపుణులు, ఆయన చిత్రాలకు పనిచేయాలని అభిలషించే స్థాయికి ఒక నిర్మాత ఎదగటం మామూలు విజయ విశేషం కాదు. అయితే ఈ ఐడెంటిటీ, ఈ టాప్ పొజిషన్ 35 సినిమాల నిర్మాతగా ఎదిగిన ఈ రోజున కొత్తగా వచ్చిపడింది కాదు… కెరీర్ ప్రారంభం నుండే గొప్ప అభిరుచి, సమర్థత గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు దిల్ రాజు.

2003లో “దిల్” చిత్రంతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించి ‘దిల్ రాజు’ గా గుర్తింపు పొందినప్పటినుండి చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షక లోకంలోనూ ఆయన సాధించిన అసాధారణ విజయాలతో పాటే ఆయన గ్రాఫ్ పెరుగుతూ వచ్చింది. నిర్మాతగా 15 సంవత్సరాల ప్రస్థానంలో సంఖ్యాపరంగా , సక్సెస్ పరంగా ఆయన సాధించిన అద్భుత విజయాలు ఆయన నిర్మాణ దక్షతకు నిదర్శనంగా నిలుస్తాయి.

తెలుగు చిత్రపరిశ్రమలోని మూడు ప్రధాన విభాగాలైన నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన విభాగాలలో ఒక వ్యక్తి ఏదో ఒక విభాగంలో మాత్రమే రాణించటం జరుగుతుంది. అయితే ఈ మూడు విభాగాలలో అద్భుత విజయాలు సాధించిన వారి జాబితాలో మూడవ ప్రముఖుడిగా నిలుస్తారు దిల్ రాజు. ఈ మూడు విభాగాల్లోనూ తిరుగు లేని వ్యక్తులుగా, వ్యవస్థలుగా ఎదిగిన స్వర్గీయ డా-డి.రామానాయుడు, అల్లు అరవింద్ ల తరువాత అంతటి ఘనతను దక్కించుకున్న టవరింగ్ ఫిలిం పర్సనాలిటీ “దిల్ రాజు” అనటంలో అతిశయోక్తి లేదు ఏమాత్రం లేదు.

ఇక ఈ పదిహేనేళ్ల కాలంలో నిర్మాతగా దిల్ రాజు నుండి వచ్చిన 30 చిత్రాలలో 18 సూపర్ హిట్ ( దిల్, ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, కొత్త బంగారులోకం, హరే రామ హరే హరికృష్ణ , బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, శతమానం భవతి, నేను లోకల్, దువ్వాడ జగన్నాథం, ఫిదా, రాజా ది గ్రేట్, ఎంసీఏ) చిత్రాలు ఉన్నాయి.

ఇక ఆయన సినిమాలలో 7ఎబో యావరేజ్( మున్నా, పరుగు,ఆకాశమంత, గగనం, కేరింత, శ్రీనివాస కళ్యాణం, హలో గురూ ప్రేమ కోసమే) హిట్స్ ఉండగా 5 ఫ్లాప్ ( జోష్, మరో చరిత్ర, రామయ్య వస్తావయ్యా, ఓ మై ఫ్రెండ్, కృష్ణాష్టమి) చిత్రాలు ఉన్నాయి. ఇక ఆయన సమర్పణలో నాలుగు చిత్రాలు( తూనీగ తూనీగ, పిల్లా నువ్వు లేని జీవితం, జవాన్, లవర్) చిత్రాలు వచ్చాయి.

ఇలా 30 చిత్రాలలో 25 చిత్రాలు విజయవంతం కావటం ఏ నిర్మాత చరిత్రలోనూ నమోదవ్వని unbeatable record గా చెప్పుకోవచ్చు.

ఇక 2017 లో దిల్ రాజు సాధించిన “డబుల్ హాట్రిక్” ప్రపంచ సినీ చరిత్రలోనే ఒక అరుదైన, అద్భుతమైన, అనితరసాధ్యమైన రికార్డుగా నిలిచిపోయింది.ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక ప్రొడక్షన్ హౌస్ నుండి వరుసగా ఆరు సినిమాలు విడుదలై ఆరూ అద్భుత విజయాలను సాధించటం ఇంతవరకు ప్రపంచ సినీ చరిత్రలో జరిగిన దాఖలాలు లేవు. ఇది దిల్ రాజుకు మాత్రమే దక్కిన అసాధారణమైన రికార్డు, అరుదైన గౌరవం. ఈ విధంగా నిర్మాణం- పంపిణీ- ప్రదర్శన విభాగాలు మూడింటిలోనూ అద్భుత విజయాలను సాధిస్తున్నప్పటికీ ప్రతి చిత్రాన్ని, ప్రతి ప్రయత్నాన్ని తొలి ప్రయత్నంగా భావిస్తూ భయభక్తులతో, అంకిత భావంతో పనిచేయగలగడం దిల్ రాజు లోని స్థితప్రజ్ఞత కు నిదర్శనం. ఆయన కళ్ళలో తొణికిసలాడే ఆత్మవిశ్వాసం కొందరికి గర్వంగానో, అహంభావం గానో అనిపిస్తే అనిపించవచ్చు గానీ పాజిటివ్ కోణంలో ఆలోచించే ఎవరికైనా ఆ కళ్ళలో ” పని- ఫలితం ” అనే కార్యాచరణ మాత్రమే కనిపిస్తుంది.

డబ్బింగ్ చిత్రాల నిర్మాతగా 2002లో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన “దిల్ రాజు” ఈ రోజున తెలుగు చలన చిత్ర రంగంలో ఒక అగ్రశ్రేణి నిర్మాతగా, పంపిణీదారునిగా, ప్రదర్శకుడిగా ఎదగడం వెనుక దాగి ఉన్న సక్సెస్ ఫార్ములా ఒక్కటే…

అదే” హార్డ్ వర్క్”.

జయాపజయాలకు అతీతమైన మానసిక స్థితికి ఎదిగి work is worship అనే సూత్రాన్ని త్రికరణశుద్ధిగా ఆచరిస్తూ ముందుకు సాగుతున్న దిల్ రాజు నేటి యువ నిర్మాతలకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నారు. 1970 డిసెంబర్ 18న జన్మించిన దిల్ రాజు ఈ జన్మదినంతో 50వ పడిలోకి ప్రవేశిస్తున్నారు.నిర్మాత అంటే ఆడంబరాలు, ఆర్భాటాలు, మెహర్బానీల కోసం కోట్లు గుమ్మరించేవాడు కాదు… నిర్మాత అంటే కథ కథనాలతో పాటు 24 శాఖల పని తీరుపై సమగ్ర అవగాహన, సాధికారికమైన అదుపాజ్ఞలు కలిగినవాడు అని తన ప్రతి చిత్రం ద్వారా నిరూపిస్తున్న “ఐడియల్ ప్రొడ్యూసర్” దిల్ రాజుకు “Many many returns of the Day“.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here