ఓ బేబి మూవీ రివ్యూ

Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Oh Baby Movie Public Talk, Oh Baby Movie Review, Oh Baby Movie Review And Ratings, Oh Baby Movie Story, Oh Baby Review, Oh Baby Telugu Movie Live Updates, Oh Baby Telugu Movie Public Response, Oh Baby Telugu Movie Review, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Oh Baby Movie Review

సాధారణంగా విదేశీ చిత్రాల కథలను చాలా తెలివిగా, ఎవరికీ అనుమానం రాకుండా లిఫ్ట్ చేసి మన నేటివిటీలో ముంచి తేల్చి తమ సొంత కథలుగా ప్రకటించుకొని మరీ సినిమాలు తీస్తుంటారు కొందరు కథాచౌర్య నిపుణులు. అయితే అలాంటి కథా తస్కరణకు పాల్పడకుండా డైరెక్ట్ గా ‘ మిస్ గ్రానీ’ అనే కొరియన్ ఫిలిం రీమేక్ రైట్స్ అఫీషియల్ గా కొనుక్కుని ఆ విషయాన్ని ఓపెన్ గా ప్రకటించి
‘ఓ..బేబీ’ అనే టైటిల్ తో  రైట్ రాయల్ గా రీమేక్ చేశారు సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతలైన డి సురేష్ బాబు, సునీత తాటి, టీజీ విశ్వ ప్రసాద్.

”అలా మొదలైంది” ఫేమ్ నందినీరెడ్డి దర్శకత్వంలో  సమంత టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ఈరోజు
(జులై 5) విడుదలైంది. విపరీతమైన ప్రీ రిలీజ్ బజ్ క్రియేట్ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

బేబీగా పిలువబడే 73 ఏళ్ల సావిత్రి ( సీనియర్ నటి లక్ష్మి) కాలేజీ ప్రొఫెసర్ అయిన కొడుకు  శేఖర్ (రావు రమేష్) పనిచేసే కాలేజీ లోనే క్యాంటిన్ నడుపుతుంటుంది. పెద్దవాళ్ల మానసిక సంఘర్షణను, సైకాలజీని డీల్ చేసే “జరియాట్రిక్స్” ప్రొఫెసర్ అయిన శేఖర్ తల్లికి – భార్య (ప్రగతి)కి మద్య నలిగిపోతుంటాడు. తన చాదస్తం , నోటి దురుసుతో అందరిని ఉతికి ఆరేసే బేబీ మనవడి (తేజ సజ్జ)ని మాత్రం తెగ గారాబం చేస్తుంది. బ్యాండ్ సింగర్ అయిన మనవడిని పెద్ద గాయకుడిగా చూడాలన్నది బేబీ ఆశ. ఇక బేబీ బాల్య స్నేహితుడు చిట్టి బాబు( రాజేంద్ర ప్రసాద్) ఇరుగుపొరుగున ఉంటూ బేబీకి అతని కుటుంబానికి అండదండగా, పెద్ద దిక్కుగా వుంటాడు. అయితే బేబీ నోటిదురుసు వల్ల కోడలు మనస్తాపంతో మంచం పట్టిన నేపథ్యంలో ఆమెను ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేర్చమని సలహా ఇస్తాడు డాక్టర్. తన కారణంగా కోడలు అనారోగ్యం పాలైందని తెలుసుకున్న బేబీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటుంది. ఇంతలో మనవడు
తన బ్యాండ్ షో చూడటానికి రమ్మని ఫోన్ చేయడంతో ఆ ఫంక్షన్ కు వెళుతున్న బేబీకి ఒక వ్యక్తి తారసపడతాడు. ఆమె చేతిలో చిన్న వినాయకుడి బొమ్మ పెట్టి ” ఇన్నాళ్లు నీకు అన్ని విధాల అన్యాయం చేశాడని దేవున్ని తిట్టుకుంటున్నావుగా …     ఇక అంతా మంచి జరుగుతుందిలే ”
అంటాడు… తిరిగి చూసేటప్పటికి అతను కనిపించడు… ఇంతలో ఒక ఫోటో స్టూడియో కనిపిస్తే అందులో సావిత్రి, భానుమతి వంటి పాత తరం నటీమణుల ఫోటోలు చూస్తూ లోపలకు వెళుతుంది. ఇందాక కనిపించిన వ్యక్తే  ఫోటోగ్రాఫర్ రూపంలో కనిపిస్తాడు… మంచి ఫోటో తీయమని కూర్చుంటుంది బేబీ.

కట్ చేస్తే బోరున  వర్షం కురుస్తుండగా ఫోటో స్టూడియో నుండి గొడుగు పట్టుకుని చెంగుచెంగున ఇరవై నాలుగేళ్ల నవ యువతి బయటకు వస్తుంది…. అంటే 73 ఏళ్ల బేబీ 24 ఏళ్ల పడుచు( సమంత)గా మారిపోయింది. తనకు ఏం జరిగిందో…  తను ఎందుకు అలా మారిపోయిందో  తెలియదు గాని అనూహ్యంగా వచ్చిపడిన అందమైన రూపాన్ని, నవ యవ్వన పడుచుదనాన్ని చూసుకుని ఆశ్చర్యపోతూ మురిసిపోతుంది బేబీ.

ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. ఇరవై నాలుగేళ్ల నవయవ్వనంలో ఉన్న ఆ అమ్మాయి  73 ఏళ్ల “బామ్మ” అని తెలియక ఇతర పాత్రలు పడే ఆరాటం, గందరగోళమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

నందిని రెడ్డి హ్యాండిలింగ్ : 

అలా మొదలైంది తో సక్సెస్ ఫుల్ గా   మొదలైన నందినీరెడ్డి డైరెక్టోరియల్ జర్నీ లో కళ్యాణ వైభోగం లాంటి మంచి సినిమా ఉన్నప్పటికీ తరువాత ఆ రేంజ్ సక్సెస్ ను అందుకోలేకపోయింది. మరొక మంచి హిట్ కోసం నందిని రెడ్డి నిరీక్షణ “ఓ..బేబీ ” తో ఫలించింది అని చెప్పవచ్చు.బోలెడంత హాస్యోష్పత్తికి అవకాశమున్న ఈ టిపికల్ అండ్ నావల్ పాయింట్ కు సమంత లాంటి పర్ఫార్మర్  తోడవడంతో ” ఓ..బేబీ” అనే  చక్కని మెసేజ్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్ ను అందించటంలో సక్సెస్ అయ్యారు నందిని రెడ్డి. ముఖ్యంగా మన నేటివిటీకి ఏ మాత్రం సంబంధంలేని ఒక కొరియన్ ఫిలిం లోని మెయిన్ పాయింట్ తీసుకుని దాన్ని అడాప్ట్ చేసుకున్న విధానం సింప్లీ సూపర్బ్. అలాగే కాస్టింగ్ సెలక్షన్ విషయంలో చాలామంది దర్శకులు ఓవర్ కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తారు. చేయించుకునేది మనమే కదా ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు అనే అతి విశ్వాసంతో మిస్ కాస్టింగ్ చేస్తుంటారు. కానీ ఈ మధ్యకాలంలో
ఒక ప్రపోర్శనేట్ కాస్టింగ్ ను చూసిన సినిమా”ఓ..బేబీ” అని చెప్పవచ్చు. పాత్రల నైజానికి తగిన ఇమేజ్, బాడీ లాంగ్వేజి, పర్ఫార్మెన్స్ ఉన్న నటీనట వర్గాన్ని సెలెక్ట్ చేసుకోవడంలో నందిని రెడ్డి సెంట్ పర్సెంట్ సక్సెస్ అయ్యారు.

అసలు 73 ఏళ్ల బామ్మ 23 ఏళ్ల యువతిగా ఎలా మారింది అనే ఒక  లాజిక్ ను ఎక్స్క్యూస్ చేయగలిగితే
ఈ మినీ ఫాంటసీ ఎంటర్టైనర్ ద్వారా చెప్పిన మెసేజ్ మాత్రం స్ట్రైట్ గా గుచ్చుకుంటుంది. తల్లిదండ్రులను, పెద్ద వాళ్లను అర్థం చేసుకుని ఆదరించవలసిన విధానాన్ని అద్భుతంగా టీచ్ చేసిన సినిమా ఇది. కుటుంబ బాంధవ్యాలు, మానవ సంబంధాలు మృగ్యమైపోతున్న ఈ రోజుల్లో ఇంత చక్కని సందేశాన్ని వినొదాత్మకంగా చెప్పిన “ఓ..బేబీ” యూనిట్ కు అభినందనలు. మొత్తానికి డైరెక్టర్ పరంగా ‘ఓ..బేబీ ని ఒక వెల్ హ్యాండిల్డ్ ఫిలిం అని అభినందించవచ్చు.

ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ :

“మహానటి” తరువాత టైటిల్ రోల్ లో ఒక  హీరోయిన్ పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేక ప్రస్తావనలు, ప్రశంసలు వినపడటం “ ఓ..బేబీ” విషయంలోనే జరుగుతుంది. 73ఏళ్ల ముదుసలి 23 ఏళ్ల పడుచుగా మారినప్పటికీ మాట తీరు, బాడీ లాంగ్వేజ్ అలాగే ఉన్నాయి అని చెప్పటం కోసం సమంత  ఆ బామ్మ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసిందనే చెప్పాలి.

ఇక బేబీ పాత్ర చుట్టూ పరిభ్రమించే ఇతర పాత్రల్లో అతి కీలకమైన పాత్రలు రాజేంద్రప్రసాద్ పోషించిన చిట్టి బాబు, రావు రమేష్ పోషించిన లెక్చరర్ పాత్రలకు ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. బేబీ మనవడిగా నటించిన యువ నటుడు సజ్జ తేజ చాలా చలాకీగా ఉన్నాడు.. ఇక ఈ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో హీరోగా నా క్యారెక్టర్ కు ప్రిఫరెన్స్ ఏముంటుంది అనుకోకుండా మంచి సినిమాలో భాగం కావాలి అనుకుని నాగ శౌర్య ఈ సినిమా చేయటం బాగుంది. ఇతర పాత్రలు పోషించిన ప్రగతి,ఊర్వశి, ఐశ్వర్య, హేమంత్ తదితరులు అప్ టూ ద క్యారెక్టర్ రిక్వైర్మెంట్ అన్నట్లు   బాగా చేశారు.

ఇక పెర్ఫార్మెన్స్ పరంగా వెరీ వెరీ స్పెషల్ మెన్షన్ సీనియర్ నటీమణి లక్ష్మికి దక్కుతుంది. 73 ఏళ్ల బామ్మ గా ఉన్న కొద్ది సేపట్లోనే what an actress అనిపించేలా అద్భుతంగా నటించారు లక్ష్మి. ఇక ప్రత్యేక లైట్నింగ్ క్యారెక్టర్స్ లో జగపతిబాబు, అడవి శేషు, నాగ చైతన్యలు మెరవటం కాస్టింగ్ వెయిట్ ను పెంచింది.

ఇవి  తెరమీద కనిపించిన వారికి దక్కే ప్రశంసలు కాగా తెరవెనుక దర్శకురాలు నందినీ రెడ్డి తరువాత
డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాలకు మంచి మార్కులు పడ్డాయి. పాత్రల బాడీ లాంగ్వేజిని, స్వభావ స్వరూపాలను దృష్టిలో పెట్టుకొని డైలాగ్స్ రాసి మెప్పించాడు లక్ష్మి భూపాల. తెలుగు వారి జీవన విధానంలో భాగమైన అచ్చ తెలుగు సామెతలను సందర్భోచితంగా రాసి చాలా మంచి ఎంటర్టైన్మెంట్కు అవకాశం కల్పించాడు లక్ష్మీ భూపాల.

మిక్కీ జె మేయర్ మ్యూజిక్ పాస్ అనిపించుకోగా రిచర్డ్ ప్రసాద్ కెమెరా, జునైడ్ ఎడిటింగ్ తదితర టెక్నికల్ అంశాలు బాగున్నాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్ర నిర్మాణం పట్ల పూర్తి అవగాహన కలిగిన నిర్మాతలు”ఓ..బేబీ” కి ఏం కావాలో అవి సమకూర్చి ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ ను అందించటంలో సక్సెస్ అయ్యారు. మొత్తానికి అంచనాల అంచులను అందుకున్న” ఓ.. బేబీ” కమర్షియల్ గా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here