రాజమౌళి సినీ ప్రయాణానికి 22 ఏళ్ళు పూర్తి.. స్పెషల్ స్టోరీ

Rajamouli Completes 22 Glorious Years in the Film Industry

ఎస్ఎస్ రాజమౌళి.. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు. దేశంలో ఆయన మేకింగ్ స్టైల్, విజన్‌కి సరితూగే దర్శకులే లేరంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమా హిట్టే.. కెరీర్‌లో ఒక్క ప్లాప్ మూవీ కూడా లేదంటే ఆయన కెపాసిటీ ఏంటో ఇట్టే అర్ధమవుతుంది. రాజమౌళి నుంచి సినిమా వస్తుందంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుందని, పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని అభిమానులే కాదు, సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడతారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి ఖ్యాతి దేశం ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తం అయింది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు దేశం ఖ్యాతిని కూడా ఆస్కార్ వేదికపై ఘనంగా చాటారు. నేటితో రాజమౌళి సినీ ప్రయాణం 22 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాజమౌళి సినీ ప్రయాణంపై స్పెషల్ స్టోరీ..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాజమౌళి తొలుత టీవీ సీరియల్స్ తీసేవారు. ‘శాంతినివాసం’ అనే సీరియల్ తో ప్రతిభ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినిమాల్లో అవకాశం అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వం వహించిన తొలి సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘స్టూడెంట్ నం.1’. ఎన్టీఆర్‌కి ఇది రెండవ చిత్రం కావడం గమనార్హం. 2001 సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతో ఎన్టీఆర్‌కి ఓవర్ నైట్ స్టార్‌డమ్ తెచ్చిపెట్టింది. దీని తర్వాత మరోసారి ఎన్టీఆర్‌తో జత కట్టిన రాజమౌళి ‘సింహాద్రి’ సినిమా చేశారు. 2003లో విడుదలైన ఈ సినిమా తెలుగునాట ప్రభంజనం సృష్టించింది. అప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్‌ మాస్ హీరోగా అవతరించగా.. రాజమౌళి అగ్రదర్శకుల స్థాయికి చేరిపోయారు.

అనంతరం ‘దిల్’ సినిమాతో విజయం అందుకుని అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా ‘సై’ సినిమాను రూపొందించారు రాజమౌళి. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియని లేని రగ్బీ ఆటను పరిచయం చేశారు. 2004లో విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అయింది. ఆ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఛత్రపతి’ తీయగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రంతో ప్రభాస్ రేంజ్ టాప్ లెవెల్ కి వెళ్ళింది. ఇక ఆపై రవితేజతో ‘విక్రమార్కుడు’ తీసి మరోసారి సాలిడ్ హిట్ అందుకున్నారు రాజమౌళి. 2006లో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇది హిందీ సహా దాదాపు అన్ని ఇతర భాషల్లో రీమేక్ కావడం విశేషం.

ఇక 2007లో మరోసారి ఎన్టీఆర్‌తో కలిసి ‘యమదొంగ’ సినిమా తీసి.. ఈ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత 2009లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘మగధీర’ సినిమా చేసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. ఈ సినిమా అన్ని చిత్రాల రికార్డులను అధిగమించింది. దీంతో రాజమౌళి టాలీవుడ్‌లో నం.1 డైరెక్టర్ అనిపించుకున్నారు. అయితే ఈ సినిమా అనంతరం రాజమౌళి తన పంథా మార్చారు. అప్పటివరకు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆయన 2010లో అనూహ్యంగా కమెడియన్ సునీల్‍ కథానాయకుడిగా ‘మర్యాద రామన్న’ సినిమా తీసి విజయం సాధించారు. దీని తర్వాత ప్రయోగాత్మకంగా ‘ఈగ’ సినిమా చేసి సంచలన విజయం అందుకున్నారు.

ఈ క్రమంలో రాజమౌళి తెలుగు చిత్రాల స్థాయిని పెంచేలా సినిమాలు తీశారు. 2015లో ప్రభాస్ హీరోగా ‘బాహుబలి-1’ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించి దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాతో రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. దీనిని కొనసాగిస్తూ 2017లో ఆయన రూపొందించిన ‘బాహుబలి-2’ రూ.1,000 కోట్లు కలెక్షన్స్ పైగా సాధించిన తొలిచిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా దాదాపు రూ.1500 కోట్లు కలెక్ట్ చేసినట్లు చెబుతుంటారు. ఇక దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా 2022లో ‘ఆర్ఆర్ఆర్’ అనే మల్టీ స్టారర్ తీశారు రాజమౌళి. ఈ సినిమా దేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం అలరించింది. ఈ సినిమాతో రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు.

ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ అవార్డ్, 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ సహా అనేక పురస్కారాలను గెలుచుకుంది. అలాగే హాలీవుడ్ ప్రఖ్యాత దర్శకులు, రచయితలూ, నటీనటులు ఈ సినిమా చూసి అచ్చెరువొందామని, రాజమౌళికి ఫ్యాన్స్ అయ్యామని బహిరంగంగా తెలిపారు. ఈ నేపథ్యంలో రాజమౌళి తన తర్వాతి సినిమాగా సూపర్ స్టార్ మహేశ్ బాబుతో ఫారెస్ట్ అడ్వెంచరస్ మూవీ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆఫ్రికా అడవుల బ్యాక్‌డ్రాప్‌లో ట్రెజర్ హంట్ కథాంశంగా ఇది ఉండనుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.

ఇదిలా ఉండగా.. ఇక రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహా భారతం’ ఉండనే ఉంది. అత్యంత భారీ బడ్జెట్ మూవీగా, ఇండియాలోని అన్ని భాషలలోని నటులతో ఎవరూ ఊహించని విధంగా దీనిని రూపొందించనున్నారని తెలుస్తోంది. అయితే కథ పరంగా ‘మహా భారతం’ అతి పెద్ద సబ్జెక్ట్ అని, సినిమాగా తీయాలంటే చాలా భాగాలుగా రూపొందించాల్సి ఉంటుందని రాజమౌళి తన అభిప్రాయాన్ని ఇప్పటికే తెలియజేశారు. కాగా దీనిని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో రిలీజ్ చేయాలనీ కూడా ఆయన భావిస్తున్నారు. అందుకోసం నాణ్యత పరంగా ఎక్కడా రాజీ లేకుండా.. హాలీవుడ్ టెక్నీషియన్స్ సహకారం తీసుకోవాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా రాజమౌళి అన్ని సినిమాలకు ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం. అలాగే ఆయన అన్న ఎంఎం కీరవాణి సంగీతం అందించడం మరో విశేషం. సో.. రాజమౌళి గారు తన తదుపరి చిత్రాలతో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, తద్వారా తెలుగు సినిమా ఖ్యాతిని మరింతగా ఇనుమడింపచేయాలని ఆశిస్తూ.. తెలుగు ఫిల్మ్ నగర్ నుంచి ఆయనకు ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 5 =