సినిమాని చూడాలన్న ప్రేక్షకుల కోరికని ‘కోవిడ్-19’ ఆపలేదు..!

COVID 19 Cant Stop Telugu Audience From Watching Movies
COVID 19 Cant Stop Telugu Audience From Watching Movies

పుట్టిన ప్రతి మనిషి తాను ఏ రంగంలో రాణించినా, రాణించకున్నా.. సంపాదించినా సంపాదించుకున్నా.. అలసిపోయినా, ఆనందంగా ఉన్నా.. తన దినచర్యలో ఒక్కసారైనా.. సినిమాని చూడాలి, సినిమా గురించి వినాలి, సినిమా గురించి మాట్లాడాలి అని అనుకుంటూనే ఉంటాడు. అసలు సినిమా ఊసులు లేకపోతే పొద్దే పోనివాళ్లు అసంఖ్యాకం, అనేకం అంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా ఎవరికైనా ఊహించని కష్టాలు ఎదురైతే వాడికి ‘సినిమా-కష్టాలు’ వచ్చాయి అంటుంటారు. అటువంటిది ఈ ‘కోవిడ్-19’ రూపంలో సినిమాకి, సినిమావాళ్ళకి నిజంగానే ‘సినిమా-కష్టాలు’ వచ్చి పడ్డాయి. ఓ రకంగా చూస్తే సినిమాకి కష్టాలు రావడం వాటిని తట్టుకుని సినిమా నిలబడటం సినిమాకి కొత్త ఏమీ కాదు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘దూరదర్శన్’ వచ్చింది, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘వి.హెచ్.ఎస్.’, ‘వి.సి.ఆర్.’ అండ్ ‘ఎల్.డి.’ ప్లేయర్స్ వచ్చాయి, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘వీడియో పైరసీ’ వచ్చింది, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘శాటిలైట్ ఛానల్స్’ వచ్చాయి, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘వి.సి.డి.’, ‘డి.వి.డి.’ అండ్ ‘బ్లూ రే’ ప్లేయర్స్ వచ్చాయి, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘క్రికెట్’ అండ్ ‘ఐ.పీ.ఎల్.’ విత్ బెట్టింగ్ వచ్చాయి, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘టీవీ సీరియల్స్’ అండ్ ‘గేమ్ షోస్’ వచ్చాయి, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘హై స్పీడ్ ఇంటర్నెట్’ విత్ ‘వరల్డ్ సినిమా’ అండ్ ‘యూట్యూబ్’ ఛానల్స్ వచ్చాయి, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది. ‘ఓ.టి.టి.’ విత్ ‘అమెజాన్ ప్రైమ్’ అండ్ ‘నెట్ ఫ్లిక్స్’ వచ్చాయి, థియేటర్ లో సినిమా తట్టుకుని నిలబడింది.

అలా.. సినిమా ఓ మహా సముద్రపు ‘అల’లాంటిది. ‘అల’లాగానే నిశ్చింతగా నిశ్చలంగా బతకడం సినిమాకి చేతకాదు. కానీ, ‘అల’లాగా పడినా లేవగల సత్తా, దమ్ము మాత్రం సినిమాకి ఉన్నాయి. ఈ ‘కోవిడ్-19’యే కాదు, దాని తల్లో జేజమ్మలెన్ని వచ్చినా సినిమా ధియేటర్‌కి వెళ్ళి, అసంఖ్యాకమైన ప్రేక్షకుల మధ్య కూర్చుని ‘వెండితెర’ మీదే సినిమాని చూడాలన్న ప్రేక్షకుల కోరికల్ని కట్టడి చేయలేవు, ఆ ఆనందాల్ని చంపలేవు. ఎందుకంటే, సినిమా ద్వారా వచ్చే నవరసాల్లోని ప్రతి అనుభూతిని స్మార్ట్ ఫోన్ తెర లేదా బుల్లితెరలపై అస్సలు పొందలేము, వాటికన్నా చాలా చాలా చాలా పెద్దదైన ‘వెండితెర’పై పొందాల్సిందే. మన ఇంట్లో సినిమాని వేసుకుని మనకి వీలు చిక్కనప్పుడు మధ్యలో ఆపుతూ, వీలు కుదిరినప్పుడు కొనసాగిస్తూ ఏ అనుభూతినీ పొందలేము, మధ్యలో ఎక్కడా ఆపకుండా కంటిన్యూగా చూస్తూ ‘వెండితెర’పై ఆ అనుభూతిని పొందాల్సిందే. అలా అని చెప్పి, సినిమా ద్వారా వచ్చే ఏ అనుభూతినైనా ఒంటరిగా కూర్చుని పొందలేము, భిన్న మనస్తత్వాలతో ఉన్న భిన్న వయస్కులతో నిండిన ప్రేక్షక సమూహం మధ్యలో కూర్చుని ‘వెండితెర’పై పొందాల్సిందే. ఉదాహరణకు.. ఓ సంభాషణకో, ఓ సన్నివేశానికో మనకి నవ్వు రాకపోయినా.. సినిమా థియేటర్ లోని మన చుట్టుపక్కలవాళ్ళు నవ్వుతుంటే మనకి తెలియకుండానే నవ్వేసుకుంటాం. అలాగే ఓ రోమాంచిత, వీరోచితమైన సన్నివేశంలో కథానాయకుడి పంచ్ డైలాగ్స్ కి సినిమా థియేటర్ లోని ప్రేక్షకులు ప్రదర్శించే పతాకస్థాయి ప్రశంసలు, ఈలలు, చప్పట్లు ఎక్కడో ఒంటరిగా చూస్తూ అస్సలు పొందలేం, ఓ సినిమా థియేటర్ లో సమూహం మధ్య కూర్చుని ఆ మజాని పొందాల్సిందే, అనుభవించాల్సిందే. అందుకే మా సినిమాలకి సినిమా థియేటర్లలోనే ప్రేక్షకులు అసలైన పట్టాభిషేకాలు, సిసలైన బ్రహ్మోత్సవాలు జరిపారు, జరుపుతూనే ఉంటారు అని గట్టిగా నమ్ముతాను నేను. అదే నిజం కూడా!!

అంతటి ప్రతిభావంతమైన సినీ పరిశ్రమకి వచ్చిన వాళ్ళు, వచ్చేవాళ్లు ఎవరైనా సరే ఖచ్చితంగా కళాసేవ చేద్దామని రారు, అలా చెప్పుకోవడం ఆత్మద్రోహం అవుతుంది కూడా. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ వాళ్లకున్న మరియు వాళ్లకి చేతనైన కళాతృష్ణ తీర్చుకుందామనే వస్తారు. అలా కళాతృష్ణను తీర్చుకోవటం కోసం, కళామతల్లి సాక్షాత్కారం కోసం సినీ పరిశ్రమకి వచ్చిన అనేక మందిలో నేనూ ఒకడినే. ‘నాకు తెలియని దాని గురించి వాదించను, తెలిసిన దాని గురించి ఎవ్వరు చెప్పినా వినను’ అంటూ నా ‘సీతయ్య’ చిత్రంలో కథానాయకునిలా అవగాహనతో కూడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు కొనసాగుతున్న ఇన్నేళ్ల నా కెరీర్ లో జయాపజయాలు రెండూ నన్ను వరించాయి. “రేయ్!! విన్‌ అయ్యాక కొట్టే చప్పట్లు కంటే విన్‌ అవుతావని కొట్టే చప్పట్లు ఎక్కువ కిక్కునిస్తాయి.” అని నా ‘దేవదాసు’ చిత్రంలో, ఓ కీలకమైన సన్నివేశంలో కధానాయకుడు తన స్నేహితులతో చెప్పే డైలాగ్‌లా.. ఇక్కడి నా సన్నిహితులు మరియు నా ‘ఎన్. ఆర్. ఐ.’ స్నేహితులు నాతో.. “నీలోని కళాతృష్ణ మీద, నీ క్రియేటివిటీ మీద, దానికి నువ్వు పడే కష్టం మీద మాకు పూర్తిగా నమ్మకం ఉంది, నువ్వు నమ్మిన సినిమా తియ్‌, అన్నిరకాలుగా నీకు అండగా మేము నిలబడతాం, తప్పకుండా నువ్వు మళ్లీ సక్సెస్ కొడతావ్” అంటూ నన్ను ప్రోత్సహిస్తున్నారు. “అచ్చిమాంబా!! మనం అనుకున్నవి ఎప్పుడూ జరగవు, అనుకోనివే అప్పుడప్పుడు జరుగుతుంటాయి.” అని నా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంలో మరో కీలకమైన సన్నివేశంలో కథానాయకుడు ప్రతినాయకితో చెప్పే డైలాగ్‌ లోని ఫిలాసఫీని నేను బాగా నమ్ముతాను. ఆ దేవుని దయతో కాలం చూపించబోయే నిజాలు.. అవి చేదువైనా, తీపివైనా అసలవి ఏ రూపంలో వచ్చినా సమస్థాయిలో స్వీకరించాల్సిందే. స్వీకరిస్తానికి మనసా, వాచా, కర్మణా నేను సిద్ధం కూడా!!

మే 23, నా జన్మదినం. ఈ సందర్భంగా.. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు చెప్పిన నా గురువులందరికీ, తన దివ్యమోహనరూపంతో సినిమా పట్ల, సినిమా రంగం పట్ల నాకు ఆకర్షణ పెంపొందించిన అన్న ‘ఎన్. టి. ఆర్.’ గారికి, నాకు దర్శకుడిగా జన్మనిచ్చిన ‘సెల్యూలాయిడ్ సైంటిస్ట్’ ‘అక్కినేని నాగార్జున’ గారికి, నా సినీ జీవన ప్రయాణంలో తమ సహాయ సహకారాలు అందించిన ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణులందరికీ, క్లిష్ట సమయాల్లో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ కొండంత అండదండలందించిన పెద్దలు, సన్నిహితులు, స్నేహితులు, బంధుమిత్రులందరికీ, నా జయాపజయాల్లో వెన్నంటి నిలిచిన మీడియా మిత్రులందరికీ వెలకట్టలేని కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ..

ఈ ‘కోవిడ్-19’ వల్ల ‘అడవి కాచిన వెన్నెల’లా ఒంటరితనాన్ని అనుభవిస్తున్న మా సినీ పరిశ్రమ అతి త్వరలోనే జనజీవన స్రవంతిలో మమేకమై పూర్వపు ప్రకాశాన్ని తిరిగి పొందాలని ఆశిస్తూ, అభిలషిస్తూ..

మీ
భవదీయుడు
వై. వి. ఎస్. చౌదరి

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 3 =