ఆ సినీ శిఖరం ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ….

Remembering Dasari Narayana Rao Garu On His Birth Anniversary

ఆయన పేరు- విశ్వ విఖ్యాతం
ఆయన కీర్తి – ఆచంద్రతారార్కం
ఆయన శక్తి – అప్రతిహత పాశుపతాస్త్రం
ఆయన ప్రతిభ – బహుముఖ విస్తృత విశ్వరూపం
ఆయన లక్ష్యం – సమస్త జన సంక్షేమం
ఆయన మనసు – మర్మం ఎరుగని భోలా శంకరం

ఒక్కడే అందరిగా అందరూ ఒక్కడుగా
ఐదు దశాబ్దాల ఆత్మవిశ్వాస ప్రపూరిత
మహా పథoగా సాగింది ఆయన జీవితం.
ఇంతకూ ఎవరాయన ?
ఇంకెవరు..!?
ఇంతటి అక్షరాభినందనల భారానికి సరితూగగల ఏకైక సినీ దిగ్గజం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు కాక మరెవరు!?

ఈరోజు మే 4…
శతాధిక చిత్ర దర్శక శిఖరం మా గురువుగారు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారి జన్మదినం.
తన అసమాన బహుముఖ ప్రజ్ఞా ప్రదర్శనతో తెలుగు చలన చిత్ర పరిశ్రమను నాలుగున్నర దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన ప్రతిభాశాలి దాసరి నారాయణరావు నిష్క్రమణకు అప్పుడే మూడేళ్లు నిండిపోయాయి.

మే 4 దాసరి జయంతి అయితే… మే 30 ఆయన వర్ధంతి.

ఇలా ఒకే నెలలో జనన మరణాలు సంభవించడం చాలా కొద్ది మంది విషయంలో జరిగే అరుదైన సంభవం. జయంతి వేడుకల సంతోషాన్ని మరువక ముందే వర్ధంతి సంస్మరణల విషాదాన్ని ఎదుర్కొనవలసిరావటం నిజంగా దురదృష్టకరం. ఏది ఏమైనా కాలం ఇచ్చిన కఠినమైన తీర్పుకు ఎవరైనా తల ఒగ్గక చేయగలిగింది ఏమీ లేదు.

ఇక దాసరి జయంతి సందర్భంగా ఆయన ప్రతిభా విశేషాల ప్రస్తావనకు వస్తే- ఇండియన్ సినిమా హిస్టరీలో
లబ్దప్రతిష్టులైన సినీ దిగ్గజాలు ఎందరెందరో ఉన్నప్పటికీ దాసరి నారాయణరావు స్థాన విశిష్టత మాత్రం
ఎవ్వరూ అందుకోలేనిది… అది అనితర సాధ్యమైనది అన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరు.ఒక వ్యక్తి యొక్క బహుముఖ ప్రతిభా సామర్థ్యాలు ఇంత విస్తృతంగా వినియోగింపబడిన దాఖలాలు సినీ చరిత్రలో ఇంతకుముందెన్నడూ కానరావు.

గురువుగారు దాసరి నారాయణరావు గారి ఫంక్షన్లు ఎన్నింటికో వ్యాఖ్యాతగా వ్యవహరించిన నేను ఆయనను వేదికపైకి ఆహ్వానించేటప్పుడు వాడిన పదాలలో , విశేషణాలలో అణు మాత్రం అతిశయోక్తి గాని , అనౌచిత్యం గానీ దొర్లకుండా జాగ్రత్త పడేవాడిని. ఎందుకంటే గురువు గారికి పొగడ్తకు అభినందనకు మధ్య ఉన్న వ్యత్యాసం స్పష్టంగా తెలుసు. మోతాదు మించితే మొదటి మొట్టికాయ ఆయన నుండే పడుతుందని నాకు తెలుసు. అందుకే అతిశయోక్తి అనిపించని వాస్తవాలనే చెప్పేవాడిని. కావాలంటే మీరే జడ్జ్ చేయండి.ముందుగా సభా సందర్భాన్ని ఆవిష్కరించిన తరువాత గురువుగారిని వేదికపైకి ఆహ్వానిస్తూ “శతాధిక చిత్రాలు- దశాధిక రంగాలు- దశముఖ ప్రజ్ఞా పాటవాలు కలసి వెలసిన సినీ శిఖరం దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారిని సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ” అని ఒక సభలో స్వాగత వచనాలు పలికితే… మరొక సభలో- ” చిత్ర పరిశ్రమలోని సమస్యల ముళ్ళ పొదలను తాను కౌగలించుకుని పరిష్కారాల పూల గుత్తులను పరిశ్రమకు పంచిన కార్యసాధకులు – వన్ అండ్ ఓన్లీ ట్రబుల్ షూటర్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ” అనే వాడిని.

ఇలా దాదాపు శతాధిక సందర్భాలలో గురువుగారి ప్రతిభా సామర్థ్యాలను సభా ముఖంగా అభివర్ణించే అదృష్టం నాకు దక్కింది. అయితే ఏ సందర్భంలోనూ ఆయనను అతిగా పొగిడాను , అవాస్తవాలు చెప్పాను అనే ఆత్మన్యూనతాస్థితి నాకు ఎదురు కాలేదు. ఆయన ఘనతకు, కీర్తి ప్రతిష్టలకు తగిన స్థాయిలో ఆయనను ఆవిష్కరించగలిగానా లేదా అని మదనపడేవాడిని. అయితే నా భుజం తట్టి” చాలా బాగా మాట్లాడావురా… నా గురించి చక్కని విశ్లేషణతో మాట్లాడే వాళ్లలో నువ్వొకడివిరా” అని గురువుగారు అభినందిస్తుంటే నా ఆనందానికి హద్దులుండేవి కావు.

ఇక వ్యక్తిగతంగా ఆయనతో నా అనుబంధ, సహచర్య, సాన్నిహిత్యాలను గురించి తలచుకుంటే మనసు పులకించి పోతుంది. ఆయన ఇంటిలోని అడుగడుగుతో, అణువణువుతో మమేకమైన నాకు
ఇప్పుడు ఆ వీధి వైపు గాని, ఆ ఇంటికి గాని వెళితే ఏదో తెలియని అవ్యక్తమైన బాధతో మనసంతా భారంగా మారిపోతుంది. ఆయన సుదీర్ఘ చలనచిత్ర జీవిత సాఫల్యానికి గుర్తులుగా నిలిచిన ఆ శతదినోత్సవ జ్ఞాపికలు, సన్మాన పత్రాలు, ఫోటోలు చూస్తుంటే గుండె బరువెక్కుతుంది.

ఆలనా పాలనా లేకుండా దుమ్ము ధూళితో, చెత్తాచెదారాలతో నిండిపోయిన ఆ ఇంటిని చూస్తుంటే
ఆలివర్ గోల్డ్ స్మిత్ వ్రాసిన “The Deserted Village ” అనే పోయెమ్ గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆ ఇల్లు ఒక శిథిల భవనం… ఒక కూలిన కోట… ఒక చేజారిన వైభవ చిహ్నం.. “ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమ సమూహములు” అని జాలిగా, ఆర్తిగా రోధించే నాకూ, నావంటి ఎందరో ఆయన శిష్య ప్రశిష్యులకు ఆ ఇంటి నుండి ఎలాంటి వెలుగులు, జిలుగులు కనరావు.

అది ఆయనతోనే అంతరించిన వైభవం… చాలామంది సినీ ప్రముఖుల legacy వారసుల ద్వారా వారి తదనంతరం కూడా అప్రతిహతంగా కొనసాగుతుంది… కానీ ఎందరెందరో నటీనట సాంకేతిక వర్గ సంపత్తిని పరిశ్రమకు అందించిన దాసరి నారాయణరావు ఘనత మాత్రం ఘనీభవించిన మంచు శిఖరం లాగా ప్రతిష్ఠితమైనదే తప్ప సజల స్రవంతి లాగా పరవళ్ళు తొక్కుతూ పరుగులు పెట్టే అదృష్టం లేకపోవటం నిజంగా దురదృష్టకరం.

ఏది ఏమైనా.. ఎవరు కొనసాగించినా,
కొనసాగించలేక పోయినా దాసరి ప్రతిభ, ప్రతిష్ట, ప్రఖ్యాతి, ప్రాభవాలు
నిత్య నీరాజనాలు అందుకుంటూనే ఉంటాయి.
తెలుగు సినీ సామ్రాజ్య
వైభవ చరిత్రలో
దాసరి ఒక రారాజు-
దాసరి ఒక అమాత్యుడు,
దాసరి ఒక సైన్యాధ్యక్షుడు-
దాసరి ఒక సైనికుడు,
దాసరి ఒక నాయకుడు-
దాసరి ఒక కార్మికుడు,
దాసరి ఒక రాజు-
దాసరి ఒక బంటు
దాసరి ఒక శక్తి-యుక్తి
వెరసి వ్యవస్థగా విస్తరిల్లిన
” విస్పోటనం” దాసరి
దట్సాల్..

(గురువు గారి ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ – ఎడిటర్ ప్రభు ది తెలుగు ఫిలింనగర్.కామ్)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here