కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కించడంలో లెజెండరీ డైరెక్టర్ కె.బాలచందర్ తీరే వేరు. అలా ఈ దర్శకదిగ్గజం ఆవిష్కరించిన అపూర్వ చిత్రాల్లో ‘అంతులేని కథ’ ఒకటి. “కుటుంబంలోని అందరి అవసరాలను తీర్చే క్రమంలో తన జీవితాన్నే త్యాగం చేసిన సరిత అనే ఓ పడతి కథే” ఈ సినిమా. ఇందులో సరితగా జయప్రద ప్రధాన పాత్ర పోషించగా… రజినీకాంత్, నారాయణరావు, శ్రీప్రియ, “ఫటాఫట్” జయలక్ష్మి తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. వీరితో పాటు కమల్ హాసన్ కూడా అతిథి పాత్రలో దర్శనమిచ్చారు. తెలుగులో రజినీకాంత్, కమల్ హాసన్, నారాయణరావు, శ్రీప్రియకి ఇదే తొలిచిత్రం కావడం విశేషం. ఇక ఇందులో సరితగా జయప్రద అభినయం కమనీయం, రమణీయం, చిరస్మరణీయం. తమిళ్ మూవీ ‘అవల్ ఒరు తొడర్ కాదల్’(సుజాత)కు రీమేక్‌గా ఈ ‘అంతులేని కథ’ను రూపొందించారు దర్శకనిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలచందర్ చిత్రాల్లో కథ, కథనాలు, పాత్రలే కాదు… పాటలకి కూడా సముచిత స్థానం ఉంటుంది. ఆయన సినిమాల్లో వచ్చే పాటలన్నీ సందర్భోచితంగానూ… పాత్రలనో, పాత్రల స్వభావాలనో తెలియజేసే విధంగానూ ఉంటాయి. `అంతులేని కథ`లోనూ అదే శైలి కనిపిస్తుంది. ఈ సినిమాలోని పాటలకు “మనసు కవి” ఆచార్య ఆత్రేయ గీత రచన చేస్తే… బాలచందర్ ఆస్థాన సంగీత దర్శకుడు ఎం.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పన చేసారు. వాటిలో ముఖ్యంగా “దేవుడే యిచ్చాడు వీధి ఒకటి”, “కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు”, “ఊగుతుంది మీ ఇంట ఉయ్యాల”, “ఏమిటీ లోకం” వంటి పాటలు పాత్రల స్వభావాలను చెబితే… “ తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల” పాట మాత్రం సినిమాలోని సరిత పాత్రను ప్రతిబింబించేలా ఉంటుంది. ఆండాళ్ ప్రొడక్షన్స్ పతాకంపై రమా ఆరనంగల్ నిర్మించిన ఈ సినిమా… ఉత్తమ తృతీయ చిత్రం, ఉత్తమ నటి(జయప్రద) విభాగాల్లో “నంది” పురస్కారాలను కైవసం చేసుకుంది. 1976 ఫిబ్రవరి 27న విడుదలై విశేషాదరణ పొందిన ‘అంతులేని కథ’… నేటితో 44 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: