” ముదితల్ నేర్వగరాని విద్యను గలవే ముద్దార నేర్పించినన్” అంటాడు భర్తృహరి. నిజంగానే ప్రేమ మీరగా నేర్పిస్తే ఆడవాళ్లకు అబ్బని విద్యగాని, అందుకోలేని విజయంగాని ఏదీ లేదు. విద్యా,వైద్య, వ్యాపార, రాజకీయ, శాస్త్ర, వైజ్ఞానిక, క్రీడా, కళాది రంగాలలో స్త్రీలు సాధించిన విజయాలు, వారు నెలకొల్పిన రికార్డులు మగవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. నరకాసుర వధలో సత్యభామ సాహసం, స్వతంత్ర్య సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి తెగువ, స్వతంత్ర భారతంలో ఇందిరాగాంధీ చాతుర్యం ఇవన్నీ మహిళా విజయానికి ప్రతీకలుగా నిలిచే విశేషాలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక సినిమా రంగానికి వస్తే వ్యవస్థాగతంగా ఇది పురుషాధిక్య రంగమే అయినప్పటికీ ఇక్కడ కూడా మహిళలు బహుముఖ ప్రజ్ఞతో రాణించిన సందర్భాలు కోకొల్లలు.మగవారికి ఏ మాత్రం తీసిపోని విధంగా కొండొకచో మగవారి కంటే ఆధిక్య ప్రదర్శన చేసిన సందర్భాలు లేకపోలేదు. “హమ్ కిసీ సే కమ్ నహీ” అన్నట్లు ఎవరికి ఏ మాత్రం తీసిపోని విధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళలు సాధించిన విజయాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఒకసారి మననం చేసుకుందాం.
దానికంటే ముందు మహిళా స్వేచ్ఛ, మహిళా సాధికారత, మహిళా వికాసం వంటి అంశాలపట్ల ఒక ప్రాథమిక అవగాహన అవసరం. స్వేచ్ఛ అనేది ఎవరికో ఎవరో ఉదారంగా చేసే దయాబిక్ష కాదు. స్త్రీ పురుష భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి జన్మహక్కు స్వేచ్ఛ. ఈ ప్రాథమిక, మౌలిక హక్కు గురించి తెలియకుండా, తెలుసుకోకుండా స్త్రీలకు స్వేచ్ఛ ఇవ్వాలి, స్త్రీలకు వ్యక్తిగత స్వాతంత్ర్యం ఉండాలి అని నినాదాలు ఇస్తూ సంఘ సంస్కర్తలుగా , స్త్రీ వాదులుగా ఫోజులు కొడుతుంటారు.ఒకరికి ఒకరు స్వేచ్ఛ ను ఇవ్వడం ఏమిటి? అలా ఒకరి దయాబిక్ష గా వచ్చేది… ఇచ్చేది… పుచ్చుకునేది స్వేచ్ఛ కానే కాదు. అలా కాకుండా స్వతంత్ర ప్రతిపత్తితో తమదైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకుంటూ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అద్భుత విజయాలను అందిపుచ్చుకున్న కొందరు మహిళా రత్నాలను గురించిన వివరాలు విశేషాలు ఏమిటో చూద్దాం. చిత్రపరిశ్రమలోకి ఆడవాళ్లు రావటాన్ని విచిత్రంగా, నిషిద్ధంగా చూడబడిన రోజులనుండి ఆడవాళ్ళు ఆల్ రౌండర్స్ గా ఎదిగిన పరిణామక్రమాన్ని ఒకసారి మననం చేసుకుందాం.
డాక్టర్ భానుమతి:
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళా విజయ వికాసాల గురించి మాట్లాడాల్సి వస్తే ముందుగా ప్రారంభించాల్సింది డాక్టర్ భానుమతి రామకృష్ణ నుండి.1939లో “వరవిక్రయం” చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన భానుమతి ఒక నిజమైన మహిళా రత్నం అని చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే కాదు… మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోనే భానుమతి లాంటి “లేడీ ఆల్రౌండర్”
మరొకరు లేరు. బహుభాషా నటి, గాయని, రచయిత్రి, నిర్మాత, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, స్టూడియో అధినేత అయిన భానుమతికి దక్కని గౌరవం, ఆమె అందుకోని బిరుదు లేదు అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.1956లో ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంచే ప్రత్యేక సన్మానాన్ని పొందిన భానుమతి భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులను అందుకున్న తొలి నటీమణి. ఇక రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు, ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, తమిళనాడు ప్రభుత్వ అవార్డు, తమిళనాడు కలైమామణి అవార్డు, ఫిలింఫేర్ లైఫ్ టైమ్ ఎచీవ్ మెంట్ అవార్డు ఇంకా ఎన్నెన్నో అవార్డులను అందుకున్నారు. తన భర్త రామకృష్ణతో కలిసి తమ కుమారుడు భరణి పేరున భరణి స్టూడియోను, భరణీ పిక్చర్స్ సంస్థను స్థాపించి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా స్వీయ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తూ మూడు భాషలలో చండీరాణి, ఆ తరువాత అంతా మనమంచికే , అమ్మాయి పెళ్లి, భక్త ధ్రువ మార్కండేయ చిత్రాలను నిర్మించారు. తెలుగు చలన చిత్ర రంగంలోనే కాదు మొత్తం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భానుమతి వంటి మహిళా బహుముఖ ప్రజ్ఞాశాలి మరొకరు లేరన్నది నిర్వివాదాంశం. ఒక నటీమణి పేరు మీద భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేయటం కూడా ఒక అరుదైన విశేషమైతే ఆ ఘనతను దక్కించుకున్న తొలి దక్షిణాది నటీమణీ భానుమతి.2013లో మరణానంతరం భానుమతి పేరున పోస్టల్ స్టాంపును విడుదల చేసింది భారత ప్రభుత్వం.
శ్రీమతి విజయ నిర్మల:
చిత్ర పరిశ్రమలో మహిళా విజయాన్ని గురించిన ప్రస్తావన వస్తే అందరి మననంలోకి వచ్చే మరో మహిళా రత్నం శ్రీమతి విజయ నిర్మల. నటి, నిర్మాత, రచయిత్రి , దర్శకురాలు, వ్యాపారవేత్త అయిన విజయనిర్మల అంతటి సుదీర్ఘమైన, విజయవంతమైన కెరీర్ మరెవ్వరికీ లేదని చెప్పవచ్చు. బహుభాషా నటిగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలలో వందలాది చిత్రాలలో నటించిన విజయనిర్మల దర్శకురాలిగా మారి 43 చిత్రాలకు దర్శకత్వం వహించి అన్బీటబుల్ వరల్డ్ రికార్డు తో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని కైవసం చేసుకోవటాన్ని మరే మహిళకు సాధ్యం కాని అద్భుత కార్య సాధనగా అభివర్ణించవచ్చు. విజయ కృష్ణ మూవీస్ సంస్థను స్థాపించి స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు విజయనిర్మల. తన భర్త సుప్రసిద్ధ కథానాయకులు ఘట్టమనేని కృష్ణ వెనుక ఒక గొప్ప గైడింగ్ ఫోర్స్ గా నిలబడటమే కాకుండా అన్నదమ్ములకు, బంధు వర్గానికి, సిబ్బందికి పెద్దదిక్కుగా, స్ఫూర్తిప్రదాతగా నిలిచి, చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నెన్నో సత్కార్యాలను నిర్వహించి దాన ధర్మాలతో ఎందరినో ఆదుకున్న వితరణశీలి శ్రీమతి విజయ నిర్మల. ఉత్తమ నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఎన్నెన్నో అవార్డులు అందుకున్న విజయనిర్మల చిత్ర పరిశ్రమలో కూడా ఎన్నో బాధ్యతాయుతమైన పదవులను నిర్వహించారు.
చిత్ర పరిశ్రమకు సంబంధించినంతవరకు ఆల్ రౌండర్స్ గా అగ్రతాంబూలం భానుమతి, విజయనిర్మల గార్లకు దక్కుతుంది. వీరు కాకుండా కొందరు సీనియర్లు, మరికొందరు జూనియర్లు గురించి చెప్పవలసి వస్తే ఆనాటి కన్నాంబ, కృష్ణవేణి, శాంత కుమారి, అంజలీదేవి, సావిత్రి వంటి మహిళ రత్నాలను మననం చేసుకోవాలి. వారి గురించి సంక్షిప్తంగా….
కన్నాంబ:
తెలుగు నటీమణుల్లో తొలి తరానికి చెందిన మహానటి కన్నాంబ. రంగస్థల నటిగా నట జీవితాన్ని ప్రారంభించిన కన్నాంబ సినిమా రంగంలో అద్భుత నటీమణిగా రాణించడమే కాకుండా నిర్మాతగా కూడా ఎదిగి గొప్ప చిత్రాలను నిర్మించారు. తన భర్త ప్రముఖ నిర్మాత అయిన కడారు నాగభూషణం తో కలిసి రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థను ప్రారంభించి తెలుగు, తమిళ భాషలలో దాదాపు 30కి పైగా చిత్రాలను నిర్మించారు. నటి, గాయని, నిర్మాత అయిన కన్నాంబ తన చిత్రాల ద్వారా ఎంతోమంది నటీనటులకు అవకాశాలు కల్పించారు. సుప్రసిద్ధ హాస్యనటుడు, దర్శక నిర్మాత అయిన పద్మనాభంను సినిమా రంగానికి పరిచయం చేసింది కన్నాంబే కావటం విశేషం.1935లో హరిశ్చంద్ర చిత్రం ద్వారా పరిచయమైన కన్నాంబ దాదాపు 170 కి పైగా చిత్రాలలో నటించారు. 1911 అక్టోబర్ 5న జన్మించిన పసుపులేటి కన్నాంబ 1966 మే 7న కన్నుమూశారు.
కృష్ణవేణి:
తొలి తరం నటీమణుల్లో కృష్ణవేణి గొప్ప ఆల్రౌండర్. నటి, నిర్మాత, దర్శకురాలు, గాయని అయిన కృష్ణవేణి 1924 డిసెంబర్ 26న రాజమండ్రిలో జన్మించారు. బాలనటిగా రంగస్థలంపై రాణించి చిత్రపరిశ్రమలోకి నటిగా ప్రవేశించిన తరువాత మీర్జాపురం రాజాను వివాహం చేసుకుని నిర్మాతగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.1949లో ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వంలో ఆమె నిర్మించిన “మన దేశం”చిత్రం ద్వారా ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావు, ఘంటసాల చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు రమేష్ నాయుడుని కూడా పరిచయం చేశారు. ఎమ్మార్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించడమే కాకుండా తరువాతి కాలంలో ఉద్దండులు గా ఎదిగిన ఎందరో ప్రముఖులను పరిశ్రమకు పరిచయం చేసిన కృష్ణవేణిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. 95 ఏళ్ల వయసులో కూడా ఇప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్న కృష్ణవేణి ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిం నగర్ లో తన కుమార్తె ప్రముఖ నిర్మాత అయిన
అనురాధ దేవితో కలిసి ఉంటున్నారు.
శాంత కుమారి:
తొలితరం నటీమణుల్లో మరో సుప్రసిద్ధ నటి, గాయని, నిర్మాత అయిన శాంత కుమారి సుప్రసిద్ధ దర్శకులు పి.పుల్లయ్య సతీమణి. చిత్రపరిశ్రమలోనే ఆది దంపతులుగా ప్రస్తుతించబడే పుల్లయ్య- శాంత కుమారిలను అప్పట్లో అందరూ ” అమ్మ- నాన్న” అని సంబోధించేవారు. తమ కుమార్తె పద్మ పేరుమీద స్థాపించిన పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై అర్ధాంగి, సిరి సంపదలు, ప్రేమించి చూడు, వెంకటేశ్వర మహత్యం వంటి పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అలాగే రాగిని పిక్చర్స్ పతాకంపై కూడా కొన్ని చిత్రాలు నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావును తొలిసారిగా “ధర్మపత్ని” చిత్రం ద్వారా బాల నటుడిగా వెండితెరకు పరిచయం చేసిన ఘనత వీరిదే. నటి, నిర్మాత, గాయని, సంగీత విధ్వాంసురాలు అయిన శాంతకుమారిని 1998లో రఘుపతి వెంకయ్య అవార్డు తో సత్కరించింది రాష్ట్ర ప్రభుత్వం.
వెల్లాల సుబ్బమ్మ అసలు నామధేయం అయిన శాంత కుమారి 1920 మే 17న ప్రొద్దుటూరు లో జన్మించారు. ఆలిండియా రేడియోలో సింగర్ కూడా అయిన శాంత కుమారి 1936లో మాయాబజార్( శశిరేఖా పరిణయం) చిత్రం ద్వారా నటిగా పరిచయం అయ్యారు. నటిగా, నిర్మాతగా సుదీర్ఘమైన సినీ జీవిత ప్రస్థానం కలిగిన శాంత కుమారి 2006 జనవరి 16న కన్నుమూశారు.
అంజలీదేవి:
తొలితరం నటీమణుల్లో అంజలీదేవిది ఒక ప్రత్యేకమైన, గౌరవప్రదమైన స్థానం. లవకుశ చిత్రంలో సీత పాత్ర ద్వారా ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించిన అంజలీదేవి అంతకు మునుపే నటిగా, నిర్మాతగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని ఉన్నారు.1927 ఆగస్టు 24న పెద్దాపురంలో జన్మించిన అంజలీ దేవి అసలు పేరు అంజమ్మను సినిమాల్లోకి వచ్చాక అంజనీ కుమారిగా మార్చుకున్నారు. అయితే దర్శకుడు పి. పుల్లయ్య ఆమె పేరును అంజలీదేవి గా మార్చారు. తన భర్త ప్రముఖ సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు తో కలిసి అంజలీ పిక్చర్స్ సంస్థను స్థాపించి సువర్ణ సుందరి, స్వర్ణ మంజరి, భక్త తుకారాం, అమ్మ కోసం, సతీ సక్కుబాయి, మహాకవి క్షేత్రయ్య, చండీప్రియ వంటి మొత్తం 27 చిత్రాలను నిర్మించారు. తన సుదీర్ఘమైన నట జీవితంలో తెలుగు తమిళ కన్నడ భాషలలో 350కి పైగా చిత్రాల్లో నటించిన అంజలీదేవికి దక్కని గౌరవం లేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ తో సత్కరించగా పలుమార్లు ఫిలింఫేర్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు అంజలీదేవి.
రఘుపతి వెంకయ్య అవార్డు, అక్కినేని నేషనల్ అవార్డు, తమిళనాడు ప్రభుత్వ కలైమామణి అవార్డు, రామినేని ఫౌండేషన్ అవార్డు లతోపాటు ఎన్నోసార్లు ఉత్తమ నటిగా వందలాది అవార్డులు అందుకున్నారు అంజలీదేవి. పుట్టపర్తి సాయిబాబా భక్తురాలైన అంజలీదేవి ఆయన జీవిత చరిత్ర ఆధారంగా సీరియల్ కూడా నిర్మించారు. తెలుగు చలన చిత్ర రంగ విశిష్ట మహిళల్లో ఒకరైన అంజలీదేవి 2014 జనవరి 13న స్వర్గస్తులయ్యారు.
సావిత్రి :
ఇక తెలుగు నటీమణుల్లో మహానటి సావిత్రి స్థాన విశిష్టత గురించి కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. బహుభాషా నటి గా, నిర్మాతగా, దర్శకురాలిగా గొప్ప ఉద్దాన పతనాలను చూసిన సావిత్రి చిన్నారి పాపలు, మాతృదేవత, ప్రాప్తం( తెలుగులో మూగమనసులు) చిత్రాలకు దర్శకత్వం వహించారు. భానుమతి తరువాత భారత ప్రభుత్వం గౌరవార్ధ పోస్టల్ స్టాంప్ విడుదల చేసింది సావిత్రిదే కావటం విశేషం. పలుమార్లు ఉత్తమనటి అవార్డు పొందిన సావిత్రి చరిత్ర మహానటి పేరుతో బయోపిక్ గా వచ్చి సంచలన విజయాన్ని సాధించడం ప్రజాబాహుళ్యంలో ఆమెకున్న ఆరాధన భావానికి నిదర్శనం. 1936 డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరు లో జన్మించిన సావిత్రి 1981 డిసెంబర్ 26న చనిపోయారు.
ఇవి చిత్ర పరిశ్రమలో చరిత్ర సృష్టించిన మహిళామణుల విశేషాలు. వీరంతా తొలితరం మహిళా రత్నాలు కాగా ఆ తరువాత తరంలో కూడా జయసుధ, జయప్రద, జీవిత, కలిదిండి జయ వంటి మహిళలు బహుముఖ ప్రజ్ఞతో, బహుముఖ వ్యాపకాలతో అద్భుత విజయాలను సాధించి చిత్ర పరిశ్రమలో మహిళా విజయానికి, వికాసానికి ప్రతీకలుగా నిలిచారు.
వారందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా తన తరఫున, తన పాఠకులకు తరఫున హృదయపూర్వక అభినందనలు పలుకుతుంది” ద తెలుగు ఫిలిం నగర్. కాం”.
[youtube_video videoid=tYbkfXs57Rg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: