తెలుగు తెరపై పలు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలు సందడి చేశాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ పరంగా సంచలనం సృష్టించాయి. ఆ చిత్రాలలో అనుష్క ద్విపాత్రాభినయంలో రూపొందిన ‘అరుంధతి’ ఒకటి. డార్క్ ఫాంటసీ హారర్ ఫిల్మ్ గా రూపొందిన ఈ సినిమాని మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత శ్యామ్‌ప్రసాద్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్మించగా… శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ జనరంజకంగా తెరకెక్కించారు. గద్వాల్ యువరాణి అరుంధతిగా, జేజమ్మగా రెండు విభిన్న పాత్రల్లో అనుష్క నటన ఎప్పటికి గుర్తుండిపోతుంది. అలాగే… `వదల బొమ్మాళి వదలా` అంటూ పశుపతిగా విలన్ పాత్రలో సోనూసూద్ అభినయం చూపరులను మెస్మరైజ్ చేసింది. కైకాల సత్యనారాయణ, మనోరమ, అర్జన బాజ్వా(దీపక్), షాయాజీ షిండే, సుభాషిణి, భానుచందర్, చలపతిరావు, బేబి దివ్య గణేష్, లీనా సిద్ధు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడు కోటి నాలుగు పాటలతో పాటు… మూడు ఇన్‌స్ట్రుమెంటల్స్ ను స్వరపరిచారు. పాటల విషయానికొస్తే… డా.సి.నారాయణరెడ్డి రచించిన ‘జేజమ్మ’, వేటూరి సుందరరామ్మూర్తి కలం నుంచి జాలువారిన ‘భు భు భుజంగం’, అనంత శ్రీరామ్ సాహిత్యమందించిన ‘చందమామ’ పాటలు బాగా ప్రాచుర్యం పొందాయి. అలాగే చింతపల్లి రమణ సంభాషణలు, సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం కూడా ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలచాయి. సంక్రాంతి కానుకగా 2009 జనవరి 16న విడుదలైన `అరుంధతి`… నేటితో 10 వసంతాలను పూర్తిచేసుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`అరుంధతి` – కొన్ని విశేషాలు
* అప్పటివరకు గ్లామర్ రోల్స్‌కే పరిమితమైన అనుష్కని స్టార్‌గా నిలబెట్టిన సినిమా ఇది. `అరుంధతి`కి ముందు, తరువాత అన్నట్లుగా అనుష్క కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమా ఇది. ఈ చిత్రం తరువాత పలు హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌లో అనుష్క నటించినా… `అరుంధతి` స్థాయి గుర్తింపు అయితే దక్కలేదనే చెప్పాలి. ఈ సినిమా విడుదలై దశాబ్దం గడిచినా… తెలుగు ప్రజల్లో అనుష్క `అరుంధతి`గానే గుర్తుండిపోయిందంటే అతిశయోక్తి కాదు.
* `అమ్మోరు`, `అంజి` తరువాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించిన గ్రాఫిక్స్ ఓరియెంటెడ్ మూవీ `అరుంధతి`. ఈ చిత్రంతో… నిర్మాణదక్షతకు పర్యాయపదంలా నిలచారు శ్యామ్‌ప్రసాద్ రెడ్డి.
* బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాదు… అవార్డుల పంట కూడా పండించింది ఈ విజువల్ వండర్. 2009కిగానూ `ఉత్తమ నటి`గా అనుష్క, `ఉత్తమ సహాయ నటుడు`గా సోనూసూద్ `ఫిలిం ఫేర్` అవార్డులను సొంతం చేసుకున్నారు. అలాగే… ఉత్తమ ప్రతినాయకుడు (సోనూసూద్), ఉత్తమ బాలనటి (దివ్య నగేష్), ఉత్తమ ఎడిటర్ (మార్తాండ్ కె.వెంకటేష్), ఉత్తమ కళా దర్శకుడు (అశోక్), ఉత్తమ ఆడియోగ్రాఫర్ (రామకృష్ణ, మధుసూదన్ రెడ్డి), ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ (దీపా చందర్), ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ (రమేష్ మహంతి), ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ (పి.రవి శంకర్), స్పెషల్ ఎఫెక్ట్స్ (రాహుల్ నంబియార్), స్పెషల్ జ్యూరీ అవార్డు (అనుష్క) … ఇలా రికార్డు స్థాయిలో పది విభాగాల్లో `నంది` పురస్కారాలను సొంతం చేసుకుంది `అరుంధతి`.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: