మీ తొలి చిత్రానికి “దొంగ రాముడు” అనే టైటిల్ పెట్టడం దొంగతనాలను గ్లోరిఫై చేయడం కాదా?

#SwarnaYugamLoAnnapurna,Latest Telugu Movies News,Swarna Yugam Lo Annapurna – First Daily Web Article Series on Telugu Website,Swarna Yugam Lo Annapurna Web Article Series,Swarna Yugam Lo Annapurna Web Series,Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 40,Telugu Cinema Updates,Telugu Film News 2019,Telugu Filmnagar
Swarna Yugamlo Annapurna – First Daily Web Article Series – Part 40

గత ఎపిసోడ్ తో అన్నపూర్ణ వారి చిత్ర నిర్మాణ చరిత్ర ముగిసింది. తెలుగు వెబ్ సైట్స్ చరిత్రలోనే తొలిసారిగా ఒక సినీ నవలను దారావాహిక రూపంలో అందిస్తూ ఇప్పటికీ 39 భాగాలుగా “స్వర్ణ యుగంలో అన్నపూర్ణ” పుస్తకాన్ని మీ ముందు ఆవిష్కరించాం. ఇప్పుడు మీ ముందుకు తెస్తున్న 40 వ ఎపిసోడ్ లో సుప్రసిద్ధ నిర్మాత, అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దుక్కిపాటి మధుసూదనరావు అనుభవాలను, అభిప్రాయాలను ఇంటర్వ్యూ రూపంలో ఇస్తున్నాను. స్వర్ణ యుగంలో అన్నపూర్ణ పుస్తకంలో చివరి అధ్యాయంగా దుక్కిపాటి మధుసూదనరావు ఈ ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ పుస్తకాన్ని నేను 1992-93 సంవత్సరాలలో రాశాను. అంటే 25 సంవత్సరాల క్రితం చేసిన ఈ ఇంటర్వ్యూలో మధుసూదన రావు గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, ఆవేదన, పరిస్థితులు ఇప్పుడు ఇంకా అధ్వానంగా తయారయ్యాయి. అయితే చిత్ర నిర్మాణంలో పాటించవలసిన మౌలిక సూత్రాలను, నిర్మాణ ప్రమాణాలను గురించి మధుసూదన రావు గారు చెప్పిన కొన్ని విధి విధానాలు అన్ని కాలాలకు, సందర్భాలకు వర్తిస్తాయి. అనుభవాలు మనుషులను ఆచార్యులను చేస్తాయి.
22 చిత్రాల నిర్మాణ బాధ్యతల భారాన్ని మోసి నిర్మాణ రంగంలో కాకలు తీరిన అనుభవజ్ఞుడిగా గౌరవింపబడే మధుసూదన రావు గారి ఆలోచనలు, అభిప్రాయాలు ఎలా ఉండేవో ప్రశ్నలు- జవాబుల రూపంలో చూడండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* ప్రశ్న-

మధుసూదన రావు గారూ!మీ తొలి చిత్రానికి” దొంగ రాముడు” అనే టైటిల్ పెట్టారు కదా! అంటే హీరో దొంగతనాలు చేస్తాడు.. పరిస్థితులు ఏవైనప్పటికీ దొంగతనం చేయటం సమర్థనీయం కాదు ! మీరు సినిమా పేరునే ‘దొంగరాముడు’ అని పెట్టడం
దొంగతనాన్ని గ్లోరిఫై చేయడం కాదా?

జవాబు-

పాత్ర స్వభావంలో నేర ప్రవృత్తి ఉన్నప్పుడు ఆ పాత్ర చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు అలా చేయటం సమర్థనీయమని చెబితే అది మీరన్నట్లు దొంగతనాన్ని గ్లోరిఫై చేసినట్లు అవుతుంది. నేరాలు చేయడం వల్ల ఉత్పన్నమయ్యే ప్రతికూల పరిస్థితులు హీరోను ఏమీ చేయలేవు… హీరో వాటిని ధైర్యంగా ఎదిరిస్తాడు.. చట్టం నుండి తప్పించుకో కలుగుతాడు… అలా నేరాలు చేయడం వల్లనే అతనికంత సుఖము, సౌఖ్యము, పేరు ప్రఖ్యాతులు వచ్చాయని.. అసలు అతను సాహసంగా దొంగతనాలు చేయడం వల్లనే హీరోయిన్ అతన్ని ప్రేమించింది అని చూపటం జరిగితే ‘ దొంగతనాన్ని గ్లోరిఫై చేసినట్లు అవుతుంది. కానీ మా ‘దొంగ రాముడు’ చిత్రం లో హీరో తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తాడు. ఏ చెల్లెలు సుఖ సంతోషాల కోసం తను దొంగతనం చేసాడో ఆ చెల్లెలినే కష్టాలపాలు చేస్తాడు. చివరకు ప్రియురాలు కూడా అతన్ని అసహ్యించుకుంటుంది . జైలు నుండి విడుదలై వచ్చాక పశ్చాత్తాపంతో ఆమెకు క్షమాపణలు చెప్పుకున్నాడు. కాబట్టి హీరో ప్రవృత్తిని బట్టి ఆ చిత్రానికి “దొంగ రాముడు” అనే టైటిల్ పెట్టడం జరిగింది. సో.. ఇందులో మేము దొంగతనాన్ని ఏ మాత్రం గ్లోరిఫై చేయలేదు.. కాబట్టి మా సినిమాకు దొంగరాముడు అని టైటిల్ పెట్టటంలో అనౌచిత్యం ఏమాత్రం లేదు అని చెప్పగలను.

ప్రశ్న:

మధుసూదన్ రావు గారూ! ఒక చిత్రానికి కథను ఎన్నుకునేటప్పుడు మీరు పరిగణలోకి తీసుకునే అంశాలు ఏమిటి?

జవాబు:

* కథను ఎన్నుకునేటప్పుడు తొలుత పాత్ర స్వభావాలను, సన్నివేశాల్లోని నిబద్ధతను పరిశీలించాలి. ఒక చిత్రం లోని పాత్రలు సమాజం నుండి తీసుకున్నవై ఉండాలి. మన సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉంటారా? అని చూస్తే’ ఉంటారు’ అనే సమాధానం రావాలి. ఇలా జరగటానికి అవకాశం ఉంటుందా? అని ఆలోచిస్తే ‘ ఉంటుంది’ అదే సమాధానం రావాలి .
అంతేగాని” మరీ సినిమాల్లో విడ్డూరం కాకపోతే ఏమిటిది? అని ప్రేక్షకులు ఆశ్చర్యపోకూడదు. తెరమీద తాము చూస్తున్న పాత్రలు తమ లాంటి వ్యక్తులే అనే భావన ప్రేక్షకుల్లో కలగాలి. అలా కలిగినప్పుడు థియేటర్లలోని ప్రేక్షకులకు తెరమీది పాత్రలకు మధ్య ఒక ‘రాపో’ ఏర్పడుతుంది. కాబట్టి ఒక చిత్రానికి కథను ఎన్నుకునేటప్పుడు మన సామాజిక పరిస్థితులకు చేరువలో ఉన్న కథాంశమేనా అని పరిశీలించడం ముఖ్యం.

ప్రశ్న:

ప్రస్తుతం మన చిత్రాలు కలుషితమయ్యాయని మంచి సినిమాలు రావటం లేదని కొందరు పెద్దలు వాపోతున్నారు. నిజంగానే మన చిత్రాల్లో కలుషిత ధోరణులు ఎక్కువయ్యాయి అంటారా? అందుకు కారణాలు ఏమిటి?

జవాబు:

* అలా వాపోయే పెద్దల్లో నేనూ ఒక్కడిని. మన సినిమాలు ఎలా ఉంటున్నాయో, మన సినిమాలకు ఎలాంటి పేర్లు పెడుతున్నారో , ఎలాంటి వేషధారణ కనిపిస్తుందో, హింస, సెక్స్, ద్వందార్ధాలను ఎలా చొప్పిస్తున్నారో మీకు మాత్రం తెలియనిదా? అదేదో మా వంటి వారితోనే చెప్పించి
” ఆ… ఈ పెద్ద వాళ్ళదంతా చాదస్తంలే” అనిపించటం ఎందుకు? ఒకప్పుడు బెంగాలీ చిత్రాల తరువాత ఉన్నత ప్రమాణాలు గల ఉత్తమ కథా చిత్రాలు ఎక్కువగా తెలుగులోనే వచ్చాయి. ఈ రోజున మన దేశం మొత్తం మీద ఎక్కువ చిత్రాలు నిర్మించే వారిగాను, ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టేవారు గాను మాత్రమే గుర్తింపు పొందాము తప్ప ‘ ప్రమాణాల’ దృష్ట్యా చూస్తే మనమూ, మన సినిమాలు ఎంతో దిగజారిపోతున్నాయి అనిపిస్తుంది. సంవత్సరానికి 150 పైగా సినిమాలు నిర్మించే తెలుగు చిత్ర పరిశ్రమ ఎన్ని సినిమాలను” పనోరమ”కు పంప కలుగుతుంది? ఎన్ని తెలుగు సినిమాలు జాతీయస్థాయిలో అవార్డులు, కనీస గుర్తింపును పొంద గలుగుతున్నాయి? ఒకప్పుడు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలకు ఆదర్శప్రాయంగా, కథా భాండారంగా భాసిల్లిన తెలుగు చిత్ర పరిశ్రమ ఈ రోజున అరువు కథల కోసం అర్రులు చాస్తుంది అంటే మరి ఆలోచించే నాలాంటి వారికి బాధే కదా!

ప్రశ్న:

విజయవంతమైన కథలను ఇతర భాషల నుండి తీసుకోవటానికి మీరు వ్యతిరేకులా?

జవాబు:

* మంచి అనేది ఎక్కడ ఉన్నా తీసుకోవటంలో తప్పులేదు. కానీ అలా తీసుకోవటానికైనా ఒక పద్ధతి ఉండాలిగా ? వేలం వెర్రి ధోరణులు, వెర్రితలలు వేసే పద్ధతులు ఎప్పుడూ అనర్థదాయకమే. ఈ రోజున ఒక తమిళ చిత్రం షూటింగ్ మద్రాస్ లో ప్రారంభం అయితే దాని రీమేక్ రైట్స్ కోసం తెలుగు నిర్మాతలు క్యూలో నిలబడుతున్నారు. ఎందుకీ దౌర్భాగ్యం? ఆ తమిళ చిత్రం పూర్తయి, విడుదలై విజయవంతమైంది అని పేరు వచ్చేదాక కూడా ఆగలేని మన నిర్మాతల ఆత్రం మన చిత్రాల స్థాయిని దిగజార్చుతుంది. మన తెలుగు చిత్రాలలో తెలుగుదనం పాలు తగ్గిపోయి ఏదో మనది కాని వాతావరణం కనిపిస్తోంది. పరభాషా చిత్రాల రైట్స్ తీసుకుని రీమేక్ చేయడం తప్పు కాదు. కానీ మక్కీకి మక్కీ కాపీ కొట్టడం ఏమిటి? ఆ కథను మన వాతావరణానికి మలచుకుని, మన నేటివిటీని జోడించి శ్రద్ధగా తీసుకుంటే మంచి ఫలితాలు రావచ్చు.
మినిమం టైం లో మేగ్జిమమ్ క్యాష్ చేసుకోవాలనే ఆరాటమే ఈ అనర్థాలకు దారి తీస్తుంది.

ప్రశ్న:

మీ దృష్టిలో ఒక సినిమా విజయవంతం కావటానికి దోహదపడే అంశాల ప్రాధాన్య క్రమం ఏమిటి?

జవాబు:

* చిత్ర నిర్మాణానికి ప్రాధాన్యత క్రమంలో చూస్తే మంచి కథ ప్రధానాంశమని అందరూ అంగీకరిస్తారు. పాత్రకు తగిన నటీనటులు, సన్నివేశాలకు తగిన బలమైన సంభాషణలు పడితే మంచి ఎస్సెట్ అవుతుంది. కథా బలానికి మంచి సంగీతం తోడైతే గొప్ప సక్సెస్ చేకూరుతుందని గతంలో చాలాసార్లు రుజువైంది. మిగిలిన అంశాలన్నీ వాటి ప్రాధాన్యతను అవి కలిగి ఉన్నాయి.

ప్రశ్న:

స్టార్ డమ్ మీద మీ అభిప్రాయం ఏమిటి?

జవాబు:

* నేను ఎప్పుడూ స్టార్ డమ్ కు వ్యతిరేకిని కాను. అయితే” స్టార్ డమ్” కథ కన్నా ఎప్పుడూ గొప్పది కాలేదు. స్టార్ డమ్ అనేది పాత్రల స్వభావ స్వరూపాల్లో ఇమిడిపోగలిగి ఉండాలి. కథ కోసం స్టార్ కావాలి కానీ.. స్టార్ కోసం కథ కాకూడదు. పూర్వం రామారావు, నాగేశ్వర రావు గార్లు
కూడా స్టార్ డమ్ ను ఎంజాయ్ చేశారు. కానీ వారి స్టార్ ఇమేజ్ కి అనుగుణంగా, అనుకూలంగా కథలో మార్పులు చేయమని ఎప్పుడూ డిమాండ్ చేయలేదు. కథ నిర్ణయం అయ్యాకే హీరో ను నిర్ణయించుకోవటం ఆ రోజుల్లో జరిగింది. హీరో ను నిర్ణయించుకున్న తరువాత అతను ఇచ్చిన డేట్స్ లో పూర్తయ్యే కథ ఈరోజు కావలసి వస్తోంది. అందువల్లే అనర్థాలన్నీ వస్తున్నాయి.The present day hero of our cinema is very rarely seen in our society.

ప్రశ్న:

సంగీతపరంగా ప్రస్తుతం వస్తున్న పాటల గురించి చెప్పండి.

జవాబు:

* పాటల్లో పదాలు వినిపించటం పోయి చాలా కాలమైంది. సంగీత దర్శకుడు ఇచ్చిన ట్యూన్ కు పాట రాయటం అనేది ఒక చక్కని ప్రక్రియ. ఒక రకంగా ఇది పాటల రచయిత ప్రతిభకు చాలెంజ్ వంటిది. అయితే ప్రాశ్చాత్య వాయిద్యాల జోరులో, హోరులో మ్యూజిక్ తప్ప పాటలోని సాహిత్యం వినిపించడం లేదు. థియేటర్ నుండి బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఆ రణగొణ ధ్వని వల్ల పాట పల్లవి ఏమిటో కూడా చెప్పలేకపోతున్నాడు.

ప్రశ్న :

ఆ రోజుల్లో ఉద్ధృతంగా వచ్చిన బాంబే టాకీస్, న్యూ థియేటర్స్, ప్రభాత్ సంస్థల చిత్రాల ప్రభావం మీ చిత్రాల్లో ఎక్కువగా ఉండేదని అంటారు.. ఇది ఎంత వరకు నిజం?

జవాబు :

* చాలావరకు నిజం.. ఈ మూడు సంస్థల చిత్రాలను నేను చదువుకునే రోజుల్లో విపరీతంగా చూసేవాడిని. సమాజంలోని రకరకాల సమస్యల నేపథ్యంలో చిత్రాలు తీసేవి ఆ సంస్థలు. బాంబే టాకీస్ వారు కామెడీ, ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తీస్తే, న్యూ థియేటర్స్, శాంతారామ్ గారి ప్రభాత్ వారు విధవా వివాహం వంటి సోషల్ ప్రాబ్లమ్స్ మీద, హిందూ ముస్లిం యూనిటీ మీద చిత్రాలు తీసేవారు. నాకు తెలియకుండానే ఆ చిత్రాల ప్రభావం నామీద పనిచేసింది. వారి చిత్రాల నుండి నేను గ్రహించింది ఏమిటంటే- ఒక చిత్రానికి ఐడియల్ అండ్ ఐడెంటిఫైడ్ క్యారెక్టర్స్, క్రియేటివిటీ, ఎంటర్టైనింగ్ కామెడీ, బెస్ట్ మ్యూజిక్, టెక్నికల్ ఎక్సలెన్సీ, అంతర్గత సందేశం- అనే ఎలిమెంట్స్ చిత్ర నిర్మాణానికి అత్యావశ్యకాలు
అని.

ప్రశ్న:

ప్రజెంట్ జనరేషన్ యొక్క చిత్ర నిర్మాణ ధోరణులను అభిశంసించటం తప్ప అభినందించ గల అంశాలు ఏమీ మీ దృష్టిలో లేవా ?

జవాబు:

* ఎందుకు లేవు.? ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి. ఆ రోజుల్లో మేం తీసినవే గొప్ప చిత్రాలు, అవే కళాఖండాలు అనే అభిప్రాయం నాకు లేదు. ఈ రోజుల్లో కూడా అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్న యువ దర్శకులు, నిర్మాతలు చాలామంది ఉన్నారు. గీతాంజలి, రోజా వంటి చిత్రాలు తీసిన మణిరత్నం, శివ తీసిన రామ్ గోపాల్ వర్మ, అంకురం తీసిన ఉమామహేశ్వరరావు వంటి దర్శకులు వండర్స్ చేస్తున్నారు. అయితే వీరిలో ప్రతిభ ఉన్న చాలా మంది దర్శకులు ఎక్కువగా వైలెన్స్ ను ఎక్స్ పోజ్ చేస్తున్నారు.’ శివ’ చిత్రాన్ని తీసుకుంటే కాలేజీ లైఫ్ ను చాలా గొప్పగా చిత్రీకరించారు. నేను మొదటి నుండి చెబుతుండే ‘ క్యారెక్టర్ ఐడెంటిటీ’ శివ చిత్రంలో నాకు బాగా కనిపించింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర సమాజంలో కనిపిస్తుంది. అయితే హింసను అంత ఎక్కువగా చూపించాల్సిన అవసరం లేదు. అది అండర్ ఎలిమెంట్ గా ఉంటే బాగుండేది అనిపించింది. హింసను 50 శాతం తగ్గించినా ఆ చిత్ర విజయానికి ఎలాంటి లోటు ఉండేది కాదు.

ప్రశ్న:

మీరు ఆ రోజుల్లో’ ఇద్దరు మిత్రులు’ లో తొలి ద్విపాత్రాభినయం ను చూపించి సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టారు కదా… ప్రస్తుత యువతరం దర్శక నిర్మాతలు రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పురోభివృద్ధిని తమ చిత్రాలకు చక్కగా ఉపయోగించుకుంటున్నారు అని మీరు భావిస్తున్నారా?

జవాబు:

* ఎక్సలెంట్ గా ఉపయోగించుకుంటున్నారు. కానీ టెక్నికల్ ఎక్సలెన్సీ ఒక్కటే చిత్ర విజయానికి దోహదపడుతుందనే భ్రమల్లో కూడా చాలామంది యువ దర్శకులు ఉన్నారు. పటుత్వం గల కథకు సాంకేతిక అంశాలు దోహదపడాలి. సాంకేతికత అనేది సినిమాలో ఒక భాగం గా ఉండాలే తప్ప అది కథ ను డామినేట్ చేసేలా ఉండకూడదు.

ప్రశ్న:

ప్రస్తుతం మన చిత్రాల్లో సెక్స్, వైలెన్స్ మితిమీరుతున్నాయని ఉంటున్నారు కదా… మీ రోజుల్లో మాత్రం చెడ్డ చిత్రాలు రాలేదా?
జవాబు:

* మా రోజుల్లో ఫెయిల్ అయిన సినిమాలు, బాగా లేని సినిమాలు, బాగా తియ్యలేకపోయిన సినిమాలు వచ్చాయి కానీ చెడ్డ చిత్రాలు రాలేదు. సెక్స్, వైలెన్స్ లను చొప్పించాలని ప్రయత్నపూర్వకంగా తీసిన సినిమాలు లేవు. అసలు మన తెలుగు సినిమాల్లోనే కాదు… మొత్తం ఇండియన్ సినిమాకు ఈ రెండు జాడ్యాలను అంటించిన చిత్రాలు మలయాళంలో వచ్చిన “హర్ నైట్స్”, హిందీలో వచ్చిన “షోలే”. దేశవ్యాప్తంగా ఈ చిత్రాలు విపరీతంగా డబ్బు చేసుకోవటంతో క్రమంగా చాపకింద నీరుగా వీటి ప్రభావం మన చిత్రాల్లోకి పాకింది. ఈ రోజున మన సినిమాల్లో పెచ్చుపెరిగిన అసభ్య, అశ్లీల, హింసాత్మక ధోరణులకు కారణం ఈ రెండు చిత్రాలే అంటారు పరిశీలకులు.

ప్రశ్న:

ఈ రోజున చాలా మంది దర్శక నిర్మాతలు ముఖ్యంగా కొత్తగా వస్తున్న యువ దర్శకులు కొందరు కమర్షియల్ గా హిట్ అవ్వాలి అంటే ఈ మసాలాలన్నీ must and should అని సమర్థించుకుంటున్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏమిటి?

జవాబు:

* మీ ప్రశ్న లోనే ఉంది జవాబు. అది కేవలం సమర్థించుకోవడమే. కమర్షియల్ అవుట్ లుక్ అంటే వైలెన్స్, సెక్స్ వంటి మసాలాలు గుప్పించటమే అనుకుంటున్నారు చాలామంది. కళను, వ్యాపారాన్ని సమంగా, సమాంతరంగా నడిపించగలగటం ఒక కళ. ఇలాంటి వారు హర్ నైట్స్ , షోలే చిత్రాలను ఉదాహరణగా చెబుతారు తప్ప శంకరాభరణం, మరో చరిత్ర, సీతారామయ్యగారి మనవరాలు, గీతాంజలి, రోజా వంటి చిత్రాలను చెప్పరు.

ప్రశ్న:

చెడ్డ చిత్రాలను జనమే తిప్పికొట్టాలని అక్కినేని నాగేశ్వరావు గారు లాంటి ప్రముఖులు చెబుతుంటారు. జనం తిప్పికొట్టడం ఏమిటి? అది మంచి చిత్రమో చెడ్డ చిత్రమో చూడందే ఎలా తెలుస్తుంది? – అనే వాదన ఒకటి ఉంది. ఈ విషయంలో మీ విశ్లేషణ ఏమిటి?

జవాబు:

* ప్రతి సినిమాను జనం చూసే మంచిచెడ్డలు నిర్ణయించడం లేదు. అలా నిర్ణయించటం కోసమే జనం ప్రతి సినిమాకు వెళ్లాలంటే విడుదలయ్యే ప్రతి చిత్రం హిట్ అవుతుంది. మరి అలా కావటంలేదు. దానికి కారణం మౌత్ పబ్లిసిటీ. దాన్నే చిత్రం ‘టాక్’ అంటారు. తొలి రోజున సినిమా చూసి జనం అది’ బాగోలేదు’, ‘బాగుంది’ అని చెప్తే ఇతరులు వెళ్లడమా వద్దా అని నిర్ణయించుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా పని చేసేది జనం ‘అభిరుచి’. మంచి చిత్రాలకు ‘బోర్’ అని ముద్రవేసి మసాలా చిత్రాలకు ‘ బ్రహ్మాండం’ అన్ని బ్రాండ్ వేసేది జనం అభిరుచే. ఆ అభిరుచి ఉత్తమంగా ఉంటే చెడు చిత్రాలు వెను తిరుగుతాయి. కాబట్టి చెడ్డ చిత్రాలను జనమే తిప్పికొట్టాలి అని చెప్పడం కొంతవరకు సమంజసమే.

ప్రశ్న:

మధుసూదన రావు గారూ! ఆకర్షణలకు, దురలవాట్లకు చేరువగా ఉండే చిత్ర పరిశ్రమలో మీకు డ్రింక్ చేయడం, సిగరెట్ కాల్చటం వంటి దురలవాట్లు ఏమీ లేవు అంటారు.. నిజమేనా?

జవాబు:

* నిజమే!.. బి.ఎన్.రెడ్డి గారు” నాకు ఒక్క సిగరెట్ అలవాటే ఉంది. నీకు అది కూడా లేదు- సినిమా ఇండస్ట్రీలో నేనే బుద్ధిమంతుడిని అనుకున్నాను… నీవు నాకంటే బుద్ధిమంతుడివి “- అని జోక్ చేసే వారు.

ప్రశ్న:

చివరిగా ఒక ప్రశ్న.. అన్నపూర్ణ సంస్థ నుండి వచ్చే చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మరలా మీ సంస్థ నుండి ఒక చిత్రాన్ని ఎప్పుడు ఆశించవచ్చు?

జవాబు:

* ప్రస్తుత పరిస్థితుల్లో చిత్ర నిర్మాణం జరపాలి అంటే మాస్ మసాలాలు గుప్పించడం తప్పనిసరి అనే పరిస్థితులు ఉన్నాయి. స్టార్స్ తో సినిమాలు తీయాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. నా స్థాయికి నేను డైరెక్ట్ గా స్టార్స్ తో మాట్లాడతాను కానీ వారి డేట్స్ చూసే మధ్యవర్తులతో లావాదేవీలు జరపలేను. కాబట్టి మా చిత్రాల నిర్మాణ సరళకి అనువైన కథ, అందుకు తగిన ఆర్టిస్టులను చూసుకుని త్వరలోనే ఒక చిత్రాన్ని నిర్మించాలనే తలంపుతో ఉన్నాను…
అంటూ తన సుదీర్ఘ అనుభవాల వివరణకు ముగింపు పలికారు చిత్ర నిర్మాణ యోధుడు దుక్కిపాటి మధుసూదనరావు.

అయితే తన సుదీర్ఘ సినీ జీవితాన్ని ఒక విజయవంతమైన చిత్రంతో ముగించాలనుకున్న కోరిక నెరవేరకుండానే మార్చి 26, 2006న స్వర్గస్తులయ్యారు దుక్కిపాటి మధుసూదనరావు.

(సశేషం)

(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి జనవరి 3న చదవండి. )

(తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో తన విజయానికి, అన్నపూర్ణ సంస్థ ఆవిర్భావ వికాసాలకు తోడ్పడిన ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియ చేసే క్రమంలో దుక్కిపాటి మధుసూదనరావు చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వచ్చే ఎపిసోడ్ లో మీ ముందు ఆవిష్కరిస్తాను.)

[subscribe]

[youtube_video videoid=d2pqCrUPACM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =