సందేశాత్మకం – వినోదాత్మకం కౌసల్యా కృష్ణమూర్తి

2019 Telugu New Movie Reviews, Kousalya Krishnamurthy Movie Mouth Talk, Kousalya Krishnamurthy Movie Public Opinion, Kousalya Krishnamurthy Movie Public Talk, Kousalya Krishnamurthy Movie Rating, Kousalya Krishnamurthy Movie Review, Kousalya Krishnamurthy Movie Story, Kousalya Krishnamurthy Telugu Movie Review, Kousalya Krishnamurthy Telugu Movie Review And Rating, Latest telugu movie reviews, latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

క్రీడా నేపథ్య చిత్రాలు వెల్లువగా వస్తున్న సీజన్ ఇది. ఈ మధ్యనే తెలుగులో మజిలీ, జెర్సీ వంటి చిత్రాలు విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక అంతకు  ముందు హిందీలో లగాన్,దంగల్ తెలుగులో గోల్కొండ హై స్కూల్, వంటి చిత్రాలతో పాటు చాలామంది క్రికెట్ తారల బయోపిక్స్ విడుదలయ్యాయి… మిశ్రమ ఫలితాలను అందుకున్నాయి. అయితే ఆ చిత్రాలు అన్నింటిలోనూ ఆయా క్రీడల నేపథ్యాన్ని ,  క్రీడాకారుల జయాపజయాలను మాత్రమే చూపించారు. కానీ ఒక క్రీడా నేపథ్య చిత్రానికి రైతు సమస్యల నేపథ్యాన్ని జోడించి మంచి సందేశాత్మక చిత్రాన్ని అందించాలన్న ఆలోచనే విభిన్నమైంది.

తమిళంలో “కణా” పేరుతో విడుదలై అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్న ఒక క్రీడా నేపథ్య చిత్రాన్ని “కౌసల్య కృష్ణమూర్తి” పేరుతో తెలుగులోకి రీమేక్ చేసి ఈ రోజు విడుదల చేసింది సుప్రసిద్ధ నిర్మాణసంస్థ క్రియేటివ్ కమర్షియల్స్. ఒరిజినల్ వెర్షన్ అద్భుత విజయాన్ని సాధించడంతోపాటు తెలుగు వెర్షన్ కు రీమేక్ స్పెషలిస్ట్ భీమనేని శ్రీనివాసరావు దర్శకుడు కావటం, కె. ఎస్. రామారావు వంటి అగ్ర నిర్మాత నిర్మించటంతో సినిమా పట్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఆ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన “కౌసల్యా కృష్ణమూర్తి” ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

ఇరగవరం అనే చిన్న గ్రామంలో కృష్ణమూర్తి( రాజేంద్ర ప్రసాద్) ఒక మధ్యతరగతి రైతు. అతనికి వ్యవసాయం పంచప్రాణాలు అయితే క్రికెట్ ఆరో ప్రాణం. క్రికెట్ లో ఇండియా ఓడిపోతే చిన్న పిల్లాడిలా  కన్నీళ్ళ పర్యంతమై ఏడ్చేస్తాడు. తండ్రి అలా ఏడవటం చూసిన అతని చిన్నారి కూతురు కౌసల్య ఎప్పటికైనా ఇండియా తరఫున క్రికెట్ ఆడి కప్పు కొట్టాలి  తండ్రి ముఖంలో ఆనందాన్ని చూడాలని  తీర్మానించుకుంటుంది.

ఊహ తెలియని ఆ చిన్న వయసులో ఆ పసి మనసులో నాటుకుపోయిన ఆ కోరిక ఒక  బలీయమైన లక్ష్యంగా మారుతుంది. ఆరేళ్ల వయసు నుండి పదహారేళ్ల ప్రాయం వరకు పెరిగిన కౌసల్య( ఐశ్వర్య రాజేష్) తో పాటే ఆ లక్ష్యం కూడా పెరుగుతుంది. ఊరిలో  క్రికెట్ ఆడే కుర్రాళ్ల తో కలిసి తిరుగుతున్న కూతురి మీద రకరకాల వ్యాఖ్యలు, విసుర్లు, విమర్శలు రావటం చూసి మొదట్లో బాధ పడినప్పటికీ ఆమె లక్ష్యం లోని చిత్తశుద్ధిని గమనించి తండ్రితోపాటు తల్లి( యాంకర్ ఝాన్సీ) కూడా ప్రోత్సహిస్తారు. కౌసల్యను వన్ సైడ్ లవ్ గా ప్రేమించే ఆ ఊరి యువకుడు (కార్తీక్ రాజు) అతని మిత్రబృందం కూడా కౌసల్య కు అండగా నిలబడతారు.

ఒకవైపు కౌసల్య మహిళా క్రికెట్ లో ఒక ఆశాకిరణంగా ఎదుగుతుంటే మరోవైపు వర్షాభావ పరిస్థితులతో పాటు అనేక కారణాల వల్ల కృష్ణమూర్తి రైతుగా కుంగి  పోతుంటాడు. బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన కార్పొరేట్ కేటుగాళ్లను ఏమీ చేయలేని బ్యాంకింగ్ వ్యవస్థ పంట రుణాలు తీసుకున్న రైతులను మాత్రం రోడ్డు కీడ్చుతుంటారు. ఈ నేపథ్యంలో ఎదురైన అవమానాలను ఎదుర్కొంటూ కౌసల్య మహిళా క్రికెట్ లో ఎలాంటి విజయాన్ని సాధించింది… ఒక రైతుగా  తన తండ్రికి జరిగిన అవమానానికి అంతర్జాతీయ వేదిక మీద ఎలాంటి సమాధానం చెప్పింది అన్నదే ” కౌసల్య కృష్ణమూర్తి” కథాంశం. ఒకవైపు క్రికెట్ ప్రపంచంలోని చీకటి కోణాలను చూపిస్తూనే మరోవైపు సమాంతరంగా రైతు సమస్యల లోతులను అర్థవంతంగా ఆవిష్కరించిన ఒక అరుదైన సందేశాత్మక ప్రయోగం ఈ చిత్రం.

భీమనేని శ్రీనివాస్ దర్శకత్వం:

రీమేక్ చిత్రాలను కేక్ వాక్ లాగా చాలా ఈజీ గా తీసిపడేయచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ నిజానికి ఒక భాషలో సక్సెస్ అయిన చిత్రాన్ని ఒరిజినల్ ఫ్లేవర్ మిస్ అవ్వకుండా రీమేక్  చేయడంలోనే నిజమైన సవాలు ఉంది.  ఆనాటి సుస్వాగతం నుండి మొన్నటి సుడిగాడు దాక ఎన్నో సినిమాల ద్వారా ఆ ఛాలెంజ్ ని స్వీకరించి సక్సెస్ చేసిన భీమనేని శ్రీనివాసరావు  “కౌసల్య కృష్ణమూర్తి” చిత్రాన్ని కూడా
అదే స్థాయిలో రీమేక్ చేసి వెల్డన్ అనిపించుకున్నారు.

పల్లెటూరు నేపథ్యంలో ఉండే సహజమైన వాతావరణాన్ని, అనుబంధాలను ఎంత సహజంగా చిత్రీకరించాడో ఆధునిక క్రికెట్ ప్రపంచం లోని ఇన్ అండ్ ఔట్స్ ను కూడా అంత ఎఫెక్టివ్ గా చిత్రీకరించారు. అయితే ఈ చిత్రానికి మాతృక అయిన ‘కణా’ చిత్రంలోని ఒరిజినల్ షాట్స్ ను ఇందులో వాడుకోవడం జరిగింది.  మ్యాచింగ్ షాట్స్ తీయటంలో ఎలాంటి మిస్ మేచింగ్ జరగకపోవటం వల్ల ఒరిజినల్ చూడని వాళ్లకు ఈ సినిమా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మొత్తం మీద రీమేక్ స్పెషలిస్ట్ గా తనకున్న ఇమేజ్ ని భీమనేని శ్రీనివాసరావు చాలా వరకు కీప్ అప్ చేశాడు అని చెప్పవచ్చు.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

ఈ చిత్రంలో  నటనకు అవకాశం ఉన్న నాలుగు ప్రధాన పాత్రలు కనిపిస్తాయి. కౌసల్య, కృష్ణమూర్తి, హీరోయిన్ తల్లి, క్రికెట్ కోచ్. ఈ 4 పాత్రలలో కౌసల్య గా నటించిన ఐశ్వర్య రాజేష్, కృష్ణమూర్తి గా నటించిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్  నువ్వా నేనా అన్నట్లు నటించారు. క్రికెట్ లో ఉన్నత శిఖరాలకు ఎదగాలన్న కసి పట్టుదల ఉన్న పాత్రలో ఐశ్వర్య రాజేష్ చాలా చక్కగా నటించింది.

ఒకప్పటి యువ హీరో ,కీర్తిశేషులు రాజేష్ కుమార్తె అయిన ఐశ్వర్య సుప్రసిద్ధ హిందీ నటి కాజోల్ ను పోలి ఉండటంతో తెరమీద ఒక “మినీ కాజోల్” ను చూసినట్లు అనిపించింది. ఇక అమాయకత్వం, మంచితనం, ఆత్మాభిమానం కలిగిన ఒక నిస్సహాయ రైతు పాత్ర దొరికితే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప అభినయ ప్రమాణాలను ఆవిష్కరించగలరో చెప్పటానికి “కౌసల్య కృష్ణమూర్తి” చిత్రాన్ని మరొక తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. ఇక క్రికెట్ కోచ్ గా శివకార్తికేయ అప్పియరెన్స్, పర్ఫార్మెన్స్ లలో మంచి స్టైల్ కనిపిస్తుంది. ఇక హీరోయిన్ తల్లిగా ఝాన్సీ, ఫ్యామిలీ ఫ్రెండ్ గా సీనియర్ యాక్టర్ సివిఎల్, హీరోయిన్ ను ప్రేమించే వన్ సైడ్ లవర్ గా కార్తీక్ రాజు, కామెడీ పోలీస్ ఇన్స్పెక్టర్ గా వెన్నెల కిషోర్ , డ్రిల్ల్ మాస్టర్ గా ఘర్షణ రవి, హీరో ఫ్రెండ్ గా వర్ధమాన కమెడియన్ మహేష్ తదితరులు పాత్రోచితంగా నటించారు. రుణాల వసూల పేరుతో రైతులను వేధించే బ్యాడ్ బ్యాంక్ మేనేజర్ పాత్రలో చిత్ర  దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు నటించడం విశేషం.

ఇక టెక్నికల్ విషయానికి వస్తే కెమెరామెన్ ఆండ్రు, మ్యూజిక్ డైరెక్టర్ డి ఎన్ థామస్, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావులతో పాటు  అన్ని శాఖల వారు  అవసరమైన మేరకు సహకరించిన తాలూకు గుడ్ రిజల్ట్ కనిపించింది. దశాబ్దాలుగా ఎన్నెన్నోవిజయవంతమైన చిత్రాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్స్  సంస్థ నుండి వచ్చిన” కౌసల్యా కృష్ణమూర్తి” లో మేకింగ్ వేల్యూస్ కు కొదవలేదు. కథా నేపథ్యానికి అవసరమైన మేరకు ఖర్చు చేసి ఒక మంచి సందేశాత్మక చిత్రాన్ని నిర్మించిన యువ నిర్మాత, ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు తనయుడు కే ఏ వల్లభకు మంచి అభినందనలు దక్కుతాయి అనడంలో సందేహం లేదు.యువతలో , రైతు ప్రపంచంలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించడానికి ఉపయుక్తమయ్యే మంచి సందేశాత్మక కథాంశంతో రూపొందిన” కౌసల్య కృష్ణమూర్తి” లాంటి చిత్రాలు ఇంకా ఇంకా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కౌసల్య కృష్ణమూర్తి తెలుగు మూవీ రివ్యూ
  • Story
  • Screen Play
  • Direction
  • Performance
3.3
Sending
User Review
0 (0 votes)

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here