ఎప్పుడు ఏ క్రైసిస్ వచ్చినా ఫిల్మ్ ఇండస్ట్రీ ముందుంటుంది.. తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani Srinivas Yadav About Telugu Film Industry

ఈ కరోనా కష్టకాలంలో ఎవరు పలకరించినా ఏదో తెలియని ఊరడింపు పొందిన భావన కలుగుతుంది. ముఖ్యంగా కరోనా కరాళ నృత్యం చేస్తూ ప్రపంచాన్నే దిగ్బంధనం చేసిన విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరి పలకరింపు కోసం పరితపిస్తున్న నేపథ్యంలో “మీకోసం నేను ఉన్నాను… మా ప్రభుత్వం ఉంది” అనే భరోసా ఇస్తూ రాష్ట్ర మంత్రి పలకరిస్తే ఎంతో ఊరటగా అనిపిస్తుంది కదూ… చిత్ర పరిశ్రమకు అలాంటి ఊరటను, భరోసాను ఇవ్వటం కోసం తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖమాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు వచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర సినీ సంబంధిత మంత్రులు చేయని విధంగా కష్టకాలంలో సినిమా పరిశ్రమను పలకరించిన ఏకైక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రమే. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు గల సుదీర్ఘ అనుబంధాన్ని పురస్కరించుకొని ఆయనను సినిమాటోగ్రఫీ మంత్రిగా నియమించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడుతూ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య గొప్ప సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. లాక్ డౌన్ విధించిన గత 40 రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఒక్క ప్రెస్ మీట్ కూడా జరగలేదు. సి సి సి స్థాపనతో తమకు తామే సహాయపడుతూ, తమను తామే ఓదార్చుకుంటున్న చిత్ర పరిశ్రమకు తలసాని శ్రీనివాస్ యాదవ్ పలకరింపు గొప్ప ఊరటనిచ్చి , స్తైర్యాన్ని నింపింది. ఇప్పటికిప్పుడు చిత్ర పరిశ్రమకు చేయగలిగేది ఏమీ లేకపోయినప్పటికీ మీకు అండగా మా ప్రభుత్వము ఉంటుంది అనే భరోసా కల్పిస్తూ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీనివాస్ యాదవ్ సినీ ప్రముఖులను పలకరించటం అభినందనీయం. ఇంత క్లిష్ట సమయంలో కూడా తమ సమస్యల పరిష్కారానికి సమయం కేటాయించిన మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ కు సినీ ప్రముఖులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ విశేషాల సమగ్ర వివరణ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న తరుణంలో అన్ని రంగాలలాగానే ఫిలిం ఇండస్ట్రీ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది… అయితే ఈ కరోనా కొద్దిరోజుల్లో తొలగిపోగానే పరిశ్రమ సమస్యల మీద దృష్టి సారిస్తాం “- అంటూ తెలుగు చిత్ర పరిశ్రమకు భరోసా కల్పించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈరోజు ఉదయం ఫిలిం ఛాంబర్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ కరోనా నేపథ్యంలో పరిశ్రమకు సంబంధించిన అనేక అంశాలను ప్రస్తావించారు.

ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ” తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తదితర సంస్థలు చిత్ర పరిశ్రమ సమస్యలపై నాకు మెమోరాండాలు అందజేశారు.మిగిలిన అన్ని రంగాల్లాగానే చిత్ర పరిశ్రమ మీద కూడా కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన విభాగాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి సంక్షోభ పరిస్థితులలో ఎలాంటి చర్యలు తీసుకుంటే పరిశ్రమ పూర్వ స్థితికి చేరుకుంటుందో అందుకు అవసరమైన సత్వర చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ కరోనా సంక్షోభాని కంటే ముందే పరిశ్రమ సమస్యల మీద దృష్టి సారించి పరిశ్రమ పెద్దలతో చర్చలు జరుపవలసిందిగా ఆదేశించినమీదట నేను చిరంజీవి గారు, నాగార్జున గారు తదితర సినీ ప్రముఖులతో మూడు దఫాలుగా చర్చలు జరిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాటిని అమలు చేసి పరిశ్రమ సమస్యల పరిష్కారానికి ఒక పాలసీని ప్రకటించబోతున్న తరుణంలో ఈ కరోనా సమస్య వచ్చిపడింది. ఆ సమయంలో జరిగిన చర్చల గురించి, ప్రస్తావించిన విషయాల గురించి మీ అందరికీ తెలుసు. త్వరలోనే ఈ కరోనా మహమ్మారిని తరిమికొట్టి మంచి రోజులు రాగానే పరిశ్రమ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేసుకుందాం. ప్రస్తుత కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీలో కరోనా క్రైసిస్ చారిటీ సంస్థను స్థాపించి దాదాపు 14 వేల మంది సినీ కార్మికులకు నిత్యావసరాలను పంపిణీ చేయటం అభినందనీయం. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడిన ప్రతి సారి చిత్ర పరిశ్రమ ముందుకొచ్చి సహకరిస్తుంది. అయితే సి సి సి ద్వారా అందుతున్న సహాయానికి తోడు ప్రభుత్వ పరంగా కూడా సినీ కార్మికులకు చేయూత లభిస్తుంది. సినీ కార్మికుల్లో దాదాపు అందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. సాధారణ ప్రజలకు ఇచ్చినట్లుగానే సినీ కార్మికులకు కూడా
రేషన్ కార్డు మీద బియ్యము, ఇతర నిత్యావసర వస్తువులతోపాటు 1500 రూపాయలు వారి వారి అకౌంట్స్ లో పడటం జరిగింది. అలాగే ముందు ముందు కూడా సి సి సి వారి చేయూత తో పాటు ప్రభుత్వం నుండి లభించే బెనిఫిట్స్ కూడా సినీ కార్మికులకు కొనసాగుతాయి. గతంలో జిఎస్టి విధి విధానాల రూపకల్పన విషయంలో కూడా చిత్ర పరిశ్రమకు తక్కువ టాక్స్ విధించే లాగా ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిపిన విషయం మీ అందరికీ తెలిసిందే. సినిమాటోగ్రఫీ మంత్రి అనే హోదా లో కాకుండా చిత్ర పరిశ్రమతో విశేషమైన అనుబంధం కలిగిన వ్యక్తిగా పరిశ్రమ సమస్యలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారాలకు ప్రయత్నిస్తాను. ఈ కరోనా ప్రతిష్టంభన తొలగిపోయాక పరిశ్రమ పెద్దలు అందరితో కూర్చుని ఒక సమగ్రమైన విధానాన్ని రూపొందించుకుందాం… ఈ లోపల ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు…”
అన్నారు తలసాని శ్రీనివాస యాదవ్.

ఆ తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకు సావధానంగా సమాధానాలిచ్చారు మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్.

ప్రశ్న : లాక్ డౌన్ ఈనెలాఖరుకు ఎత్తేసినప్పటికీ పరిస్థితుల తీవ్రత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? పరిశ్రమ యథాస్థితికి రావడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

తలసాని: నిజానికి ఇది ఎవరూ ఊహించింది కాదు… అన్ని రంగాల లాగానే చిత్ర పరిశ్రమ కూడా ఒక ప్రధాన రంగం. కరోనా ప్రభావం దీని మీద కూడా తీవ్రంగా ఉంది. ఇక లాక్ డౌన్ తీసేశాక షూటింగ్స్, ఇతర సినిమా వ్యాపకాల విషయంలో అందరితో చర్చించి , అందరి సహకారంతో పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.

ప్రశ్న: థియేటర్స్ పరిస్థితి ఏమిటి..? ఇప్పట్లో ఓపెన్ చేస్తారా ?

తలసాని: థియేటర్స్ విషయంలో కూడా పరిశ్రమ వర్గాలతో చర్చించిన తరువాతనే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కరోనా విషయంలో భౌతిక దూరం అనేది ఒక ప్రధానమైన నిబంధన కాబట్టి అప్పటికి కరోనా తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనే దాన్నిబట్టి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి.

ప్రశ్న: పవర్ టారిఫ్, బ్యాంక్ లోన్స్ విషయంలో మారటోరియం వంటి అంశాలలో ప్రభుత్వం ఏమైనా మినహాయింపులను ఇచ్చే అవకాశం ఉందా.. ఆ పరంగా ఎలాంటి నిర్ణయాలను ఆశించవచ్చు.?

తలసాని: పవర్ టారిఫ్ విషయంలో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి. ఇక మారటోరియం విషయానికి వస్తే ఎవరెవరు బ్యాంకుల నుండి లోన్స్ తీసుకున్నారో వారి ట్రాక్ రికార్డును బట్టి ఆయా బ్యాంకులు నిర్ణయాలు తీసుకుంటాయి. ఇలాంటి విధాన నిర్ణయాల విషయంలో కరోనా ప్రభావం తగ్గిన తర్వాతనే స్పష్టత వస్తుంది.

ప్రశ్న: పరిస్థితులు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా అనే స్థాయిలో తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో లాక్ డౌన్ తరువాత పరిశ్రమకు సంబంధించి మీరు అడ్రస్ చేసే తొలి ప్రాధాన్యతాంశం ఏమిటి?

తలసాని: కరోనా ప్రభావం అన్ని రంగాలపై ఉండటంతో సమస్యలు, ఇబ్బందులు కూడా రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి అన్నిటి మీద ఒక ఉమ్మడి కార్యాచరణ ఉంటుంది. ఏ సమస్య తీవ్రత ఏమిటో పరిశ్రమ వర్గాలు చెప్పిన తరువాత ఆ సమస్యల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది.

ప్రశ్న: షూటింగ్స్ కు పర్మిషన్స్ ఇవ్వటంలో కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు ముందున్నాయి… ఆ మేరకు జీవోలు కూడా విడుదల చేశాయి.. మరి పర్మిషన్స్ విషయంలో
మన ప్రభుత్వ వైఖరి ఎలా ఉండబోతుంది?

తలసాని: పర్మిషన్స్ ఇవ్వటం పెద్ద సమస్య కాదు… పర్మిషన్స్ ఇచ్చినంత మాత్రాన షూటింగులు ప్రారంభమయ్యే పరిస్థితులు లేవు… స్టెప్ బై స్టెప్ అన్నట్లు ఒకదాని తరువాత ఒకటి చేసుకుంటూ పోవాలి. రెండు నెలలు లాక్ డౌన్ లో ఉన్నాము.. షూటింగులు చేయటానికి పరిశ్రమే సన్నద్ధంగా లేనప్పుడు పర్మిషన్స్ విషయంలో తొందరపడవలసిన అవసరం ఏముంది?

ప్రశ్న: రెండు తెలుగు ప్రభుత్వాలు ఏ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చిత్ర పరిశ్రమకు సంబంధించిన నిర్ణయాలలో సమన్వయం చాలా అవసరం. మరి తెలంగాణ ప్రభుత్వంగా మీరు తీసుకునే నిర్ణయాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు మధ్య సమన్వయం ఎలా సాధ్యం?

తలసాని: తెలుగు సినిమా ఇక్కడ ఉంది అక్కడ ఉంది కాబట్టి దానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో సమన్వయం చాలా అవసరం. అయితే మేము నిర్ణయాలు తీసుకునే ముందు అవి రెండు రాష్ట్రాల చిత్ర పరిశ్రమలకు ఉపయుక్తంగా ఉండే లాగా ఆంధ్ర ప్రదేశ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తో కూడా సంప్రదించి ఒక ఉమ్మడి ఎజెండాతో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే చిత్ర పరిశ్రమకు సంబంధించిన నిర్ణయాల విషయంలో మా అధికారుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకుంటాం.. ఎందుకంటే టాక్స్ సిస్టం, ఇతరత్రా రాయితీల విషయంలో మాకంటే అధికారులకే ఎక్కువ అవగాహన ఉంటుంది.. అంటూ ప్రశ్నోత్తరాలకు ముగింపు పలికారు తలసాని శ్రీనివాస్ యాదవ్.

చివరి ముక్తాయింపు గా మాట్లాడుతూ శ్రీనివాస్ యాదవ్” నేను ఇందాక చెప్పినట్టు ఏ కష్టం వచ్చినా సినిమా వాళ్ళు మేమున్నాము అని ముందుకు రావటం చాలా అభినందనీయం. తమలో తాము సహాయం చేసుకోవటానికి చిరంజీవి గారి ఆధ్వర్యంలో సి సి సి ని స్థాపించుకుని చక్కని సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. అంతకంటే ముందే సినీ ప్రముఖులందరూ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశారు. వారందరికీ ప్రభుత్వ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్దిరోజుల్లో కరోనా తీవ్రత తగ్గి మామూలు పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి అటు ప్రభుత్వం వారు గాని, ఇటు పరిశ్రమ వారు గాని ఒక నెలకు మించి నిత్యావసరాల అందించవలసిన అవసరం ఉండదు. అంతేకాకుండా ప్రభుత్వం రోజుకు లక్ష మందికి అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా భోజనం పెడుతుంది. అందుకు ఎందరో దాతలు, సేవా సంస్థలు సహకార అందిస్తున్నాయి. త్వరలోనే పరిస్థితులు యథాస్థితికి వస్తాయి కాబట్టి మరొకమారు పరిశ్రమ పెద్దలు అందరితో చర్చలు జరిపి ఒక బృహత్తర కార్యాచరణను ప్రకటిస్తాం” అంటూ మీడియా మీట్ కు ముగింపు పలికారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ కార్యక్రమంలో చలనచిత్ర ప్రముఖులు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ……, నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజ సూర్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =