తారక మంత్రం తనువు చాలించి నేటికి 24 ఏళ్లు

Remembering Legendary Actor NTR Garu On His Death Anniversary

తెలుగువారి అత్యంత దురదృష్టకర
దినాలలో ఈరోజు అంటే… జనవరి 18 ముందుంటుంది. ఎందుకంటే
ఈ రోజునే తెలుగు జాతి ఒక జాతిరత్నాన్ని కోల్పోయింది.

మూడు దశాబ్దాలకు పైగా మహోన్నత నటుడిగా, రెండు దశాబ్దాలకు పైగా మహా నాయకుడిగా తెలుగువారి జీవన విధానంలో అంతర్భాగంగా వెలిగిన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావును కోల్పోయిన దుర్దినం జనవరి 18.

1996 జనవరి 18 తెల్లారేసరికి ఎన్టీఆర్ మరణ వార్త దేశాన్ని దావాలనంలా కమ్మేసింది. ఒక మహానటుడిగా చిత్ర పరిశ్రమలో, ఒక మహానాయకుడిగా రాజకీయరంగంలో ఆయన ఆచరించిన క్రమశిక్షణ, నెలకొల్పిన విధి విధానాలు, చేసిన సేవలు, తీసుకున్న నిర్ణయాలు, కనబరిచిన తెగువ, సాధించిన విజయాలు ఒక్కసారిగా తెలుగువారి జ్ఞాపకాల కళ్ళముందు సుళ్లు తిరిగాయి. రాముడిగా, కృష్ణుడిగా తెలుగువారి గుండె గుడిలో కొలువైన తారక రాముడు ఇక లేరు అన్న వార్త విన్న తెలుగు జాతి నివ్వెర పోయింది.
వందలాది చిత్రాల్లో ఆ మహానటుడి అభినయ విశ్వరూపాన్ని తిలకించి పులకించిన తెలుగు ప్రేక్షక లోకం నిచ్చేష్ట అయింది.

కిలో రెండు రూపాయల పథకంతో కడుపు నింపుకున్న పేదవాడి కళ్ళు ఆ జననేత మరణ వార్త విని తడిసి ముద్దయ్యాయి…

మద్యపాన నిషేధం మొదలు ఆయన తీసుకున్న వందలాది నిర్ణయాలు, ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణల తాలూకు ఫలితాలను అనుభవించిన మహిళలు, బడుగు బలహీన వర్గాలకు ఎన్టీఆర్ మరణ వార్త శరాఘాతమే అయింది.

స్వపక్ష, ప్రతిపక్ష , శత్రు మిత్ర భేదం లేకుండా తెలుగువారైన ప్రతి ఒక్కరి
హృదయాన్ని కలచివేసిన ఆ మహామహుడి నిష్క్రమణకు నేటితో 24 ఏళ్లు పూర్తయ్యాయి.

అయినా
ఆయన జ్ఞాపకాలు పదిలం…
ఆయన స్ఫూర్తి, కీర్తి, మూర్తి పదిలం
ఆయన పోషించిన అద్భుత పాత్రల
అభినయ విశ్వరూపం పదిలం…
నట దర్శక నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన
సేవల విలువ అనంతం….
వెరసి
ఒక కారణజన్ముడిగా
ఆ దివంగత దివ్య పురుషుడి
జీవితమే ఒక పాఠ్యాంశం.

జోహార్ ఎన్టీఆర్….
జోహార్ ఎన్టీఆర్…..
జోహార్ ఎన్టీఆర్……

 

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here