పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు రంగరిస్తే వచ్చే ముగ్ధ మనోహరమైన రూపం… అతిలోకసుందరి శ్రీదేవి సొంతం. కేవలం అందానికే కాదు… అందమైన అభినయానికి కూడా చిరునామాగా నిలిచారు శ్రీదేవి. బాలనటిగా భళా అనిపించి… కథానాయికగా కవ్వించి… రెండు విధాలా స్టార్ డమ్ చూసిన శ్రీదేవి జయంతి నేడు. ఈ సందర్భంగా ఆమె నటనాప్రస్థానానికి సంబంధించిన జ్ఞాపకాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాలుగేళ్ల చిరు ప్రాయంలోనే ‘కందన్ కరుణై’ (1967) అనే తమిళ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు శ్రీదేవి. ‘తునైవన్’ అనే తమిళ చిత్రంలో బాల మురుగన్‌గా ప్రేక్షకులను మురిపించిన శ్రీదేవి… ‘మా నాన్న నిర్దోషి’(1970)తో తెలుగులోనూ తొలి అడుగులు వేశారు. తెలుగులో బాలనటిగా ‘బడిపంతులు’, ‘బాలభారతం’, ‘భార్యాబిడ్డలు’, `భక్త తుకారం` వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా ‘బడిపంతులు’ చిత్రంలో “బూచాడమ్మ బూచాడు” అంటూ అల్లరి చేసినా… ‘భార్యాబిడ్డలు’ సినిమాలో “చక్కనయ్య చందమామ” అంటూ ప్రేక్షకుల కంట తడిపెట్టించినా అది ఒక్క శ్రీదేవికే చెల్లిందంటే అతిశయోక్తి కాదు.
“కాలమనే నదిలో కదిలే కర్మమనే నావమీద… ఎవరితోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు నువ్వేలే” అన్న చందాన స్కూల్, కాలేజీ అంటే తెలీని శ్రీదేవి… చదువుకునే వయసు మొత్తం సినిమాలకే అంకితం చేశారు. అనంతరం ’16 వయదినిలే’(1977)తో తమిళంలోనూ, అదే సినిమా రీమేక్ ‘పదహారేళ్ళ వయసు’(1978)తో తెలుగులోనూ, ‘సోల్వా సావన్’(1979)తో హిందీలోనూ నాయికగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీదేవి.
అంతేకాదు… తెలుగులో మొదటి తరం అగ్ర కథానాయకులైన యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబుకి జంటగా రాణించడమే కాకుండా… తరువాతి తరం టాప్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌కి కూడా హిట్ పెయిర్‌గా నిలిచారు శ్రీదేవి. ఆసక్తికరమైన విషయమేమిటంటే… యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్ బాబు చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రీదేవి… వారి పక్కన కథానాయికగానూ అలరించడం విశేషం.
ఇక శ్రీదేవి నటన విషయానికొస్తే… లెజెండరీ యాక్టర్స్ అందరితోనూ నువ్వా-నేనా అని పోటీపడి మరీ నటించారు శ్రీదేవి. ముఖ్యంగా ‘బొబ్బిలిపులి’ చిత్రంలో “తెల్ల తెల్ల చీరలోన చందమామ” అని అందంగా కనిపిస్తూనే… అదే సినిమా క్లైమాక్స్‌లో వచ్చే సన్నివేశాలలో యన్టీఆర్‌కి దీటుగా నటించారు శ్రీదేవి. అలాగే ఏయన్నార్ `ప్రేమాభిషేకం`లో, శోభన్‌బాబు ‘దేవత’లో… ఇక సూపర్ స్టార్ కృష్ణ పలు సూపర్ హిట్స్‌లో తన అందానికి, అభినయానికి పోటీ అన్నట్టుగా నటించారు.
ఇక తరువాతి తరం స్టార్ హీరోలైన… చిరు (‘జగదేకవీరుడు అతిలోకసుందరి’), నాగ్ (‘ఆఖరి పోరాటం’), వెంకీ (‘క్షణక్షణం’)తోనూ పోటీపడి మరీ నటించారు శ్రీదేవి.
అంతేకాదు… తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లోనూ నంబర్ వన్ నాయికగా రాణించడమే కాకుండా… దాదాపు అక్కడి అగ్ర కథానాయకులందరికి జోడీగా నటించి పలు ఘనవిజయాలు అందుకున్నారు.
నటిగా పలు అవార్డులను, రివార్డులను సొంతం చేసుకున్న శ్రీదేవి… ఈ నాడు మనమధ్యన లేకపోయినా… ఆమె అందం, అభినయం, అమాయకత్వం, ఆమె నటించిన సినిమాల జ్ఞాపకాలు ఎప్పుడూ చిరంజీవిగానే ఉంటాయి.
[subscribe]
[youtube_video videoid=fKGECAkPyMA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: