(గత ఎపిసోడ్ తరువాయి భాగం)
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
* హీరోయిన్ గా చాలా బిజీగా ఉన్న టైమ్ లోనే మీరు దర్శకురాలిగా టర్న్ అయ్యారు… దర్శకత్వం వహించాలన్న ఆశయమే మిమ్ములను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కించింది కదా.. ఆ ఆశయానికి అంకురార్పణ ఎలా జరిగింది? దర్శకురాలిగా మీ అనుభవాలు ఏమిటి ?
విజయనిర్మల:
డైరెక్షన్ చేయాలి అనే ఆశయానికి అంకురార్పణ జరిగింది” సాక్షి” షూటింగ్ సమయంలోనే. ముఖ్యంగా బాపు గారు డైరెక్ట్ చేసే విధానం నాకు చాలా నచ్చేది. ప్రతి పాత్రకు చక్కగా స్కెచెస్ వేసుకుని వచ్చి ఎంతో ప్లాన్డ్ గా, క్రియేటివ్ గా డైరెక్ట్ చేసేవారాయన. ఆ వర్కింగ్ స్టయిల్ చూసి నాలో కూడా డైరెక్షన్ చేయాలి అనే కోరిక మొదలైంది. క్రమంగా ఆ కోరిక ఒక ఆశయంగా తయారైంది. అందుకే షూటింగ్ లో నా పని పూర్తయ్యాక కూడా ఏ ఏ డైరెక్టర్ ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేస్తుండేదాన్ని . మా పెళ్లైన కొత్తలోనే డైరెక్షన్ చేయాలన్న నా కోరికను కృష్ణ గారితో చెప్పినప్పుడు -ప్రస్తుతం హీరోయిన్ గా నీ కెరీర్ చాలా బాగుంది కదా.. దీన్ని డిస్టర్బ్ చేసుకోకుండా వంద సినిమాలు పూర్తయిన తర్వాతనే డైరెక్షన్ చేయమని సలహా ఇచ్చారు.
ఆ సలహా మేరకే హీరోయిన్ గా వంద సినిమాలు పూర్తయ్యాకే దర్శకత్వ ప్రయత్నాలు ప్రారంభించాను.
ముందుగా ట్రయల్ బేసిస్ మీద ఒక మలయాళ చిత్రానికి దర్శకత్వం వహిస్తే ఆ అనుభవంతో తెలుగులో చేయవచ్చు అనుకున్నాను. కృష్ణ గారు ఈ ఐడియా బాగుంది అన్నారు. కథ సిద్ధం చేసుకున్నాను. అయితే నిర్మాత ఎవరు అనే ప్రశ్న తలెత్తింది. “నిన్ను నీవు ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే నీ డబ్బులతో నీవే డైరెక్ట్ చెయ్”- అన్నారు కృష్ణ గారు. నిజమే…. అలా చేసినప్పుడే సినిమా ఎకనామిక్స్ మీద కూడా ఒక అవగాహన ఏర్పడుతుంది. సో… నేనే నిర్మాతగా మారి కృష్ణ గారి సమర్పణలో” సంగం మూవీస్” పతాకం మీద మలయాళంలో స్వీయ దర్శకత్వంలో నేను నిర్మించిన తొలి చిత్రం” కవిత”. నేటి మలయాళ అగ్ర దర్శకుడు ఐ.వి. శశి దానికి కోడైరెక్టర్. ఆ సినిమా మలయాళంలో 100 రోజులు ఆడింది. డైరెక్టర్ గా నాకు మంచి పేరు వచ్చింది. నాలో ఆత్మ విశ్వాసం బలపడింది.
ఇది జరిగింది 1972లో..
వెంటనే తెలుగు సినిమా డైరెక్ట్ చేయడం కోసం కథాన్వేషణలో పడ్డాను. నాకు బాగా నవలలు చదివే అలవాటు ఉంది. యద్దనపూడి సులోచనారాణి రచించిన” మీనా” నవల నాకు బాగా నచ్చింది.
ఆ నవలను సినిమాగా తీద్దామనుకొని ఎంక్వయిరీ చేస్తే ఆ నవల రైట్స్ ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి దగ్గర ఉన్నాయని తెలిసింది. ఆయన నిర్మించిన పూలరంగడు, ఆత్మీయులు చిత్రాల్లో నటించిన పరిచయాన్ని పురస్కరించుకుని ఆ రైట్స్ నాకు కావాలి అని అడిగాను. అది చాలా పాపులర్ నవల… జాగ్రత్తగా తీయాలి అని కొన్ని సలహాలు, సూచనలు చెబుతూ ఆ రైట్స్ నాకు ఇచ్చారు
మధుసూదన రావు గారు. అయితే కృష్ణ గారు ఒక స్ట్రాంగ్ యాక్షన్ హీరోగా స్థిరపడి ఉన్న ఆ సమయంలో
ఆయనను ‘మీనా’లో సాఫ్ట్ రోల్ చేయమని అడగటానికి నాకే మనస్కరించలేదు. నేను తటపటాయిస్తున్న సమయంలో ” ఏం పర్లేదు… ఆ క్యారెక్టర్ నేను చేస్తాను”- అన్నారు కృష్ణ గారు. అందులో తండ్రి పాత్రకు ఎస్. వి. రంగారావు గారిని బుక్ చేశాను. నా కెరీర్ ప్రారంభంలో “ఈ అమ్మాయిని హీరోయిన్ గా తీసేస్తారా లేక నన్నే మానేయమంటారా “- అని నిర్మాతలతో పేచీ పడి వాళ్లు నన్ను తీసివేయకపోతే తానే తప్పుకున్నఎస్.వి రంగా రావు గారితో ఆ తరువాత ఎన్నో సినిమాల్లో నటించడమే కాదు… ఇప్పుడు ఆయనను డైరెక్ట్ చేయబోతున్నాను అన్నది తలుచుకుంటే చాలా ఆనందంగా అనిపించేది.
కానీ దురదృష్టవశాత్తు ఆ సినిమా ప్రారంభానికి ముందే ఎస్.వి.రంగారావు గారు కన్నుమూశారు. అప్పుడు ఆ పాత్రకు గుమ్మడి గారిని తీసుకున్నాం. ఇంకా జగ్గయ్య, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, చంద్రకళ వంటి టాప్ గ్రేడ్ ఆర్టిస్టులతో గ్రాండ్ గా ప్రారంభమైంది తెలుగులో దర్శకురాలిగా నా తొలి చిత్రం” మీనా”.
ఆ సినిమా ఘన విజయాన్ని సాధించి శతదినోత్సవం జరుపుకుంది. ఇలా వరుసగా రెండు భాషలలో దర్శకత్వం వహించిన రెండు చిత్రాలు శతదినోత్సవ చిత్రాలు కావటంతో దర్శకురాలిగా నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చాయి.
* డైరెక్టర్ గా మీ మూడవ చిత్రం “దేవదాసు” పరాజయం పాలయింది. ఆ రిజల్ట్ మిమ్మల్ని ఏ స్థాయిలో డిసప్పాయింట్ చేసింది? ఒకసారి ఒక భాషలో పెద్ద హిట్ అయిన చిత్రాన్ని మరలా అదే భాషలో రీమేక్ చేయాలి అనే సాహసానికి ప్రేరణ, పూర్వాపరాలు ఏమిటి?
విజయనిర్మల:
“దేవదాసు” చిత్రాన్ని మరలా తీయటాన్ని అందరూ అర్థం చేసుకున్న విధానం వేరు… నేను అనుకున్నది వేరు. అద్భుతమైన ఆ విషాద కథాంశానికి అప్పట్లో టెక్నికల్ హెల్ప్ లేదు. ఎంతో లావిష్ గా తీయటానికి అవకాశం ఉన్న సబ్జెక్ట్ అది. దానికి తోడు టెక్నికల్ గా, క్రియేటివ్ గా కాలానుగుణంగా వచ్చిన మార్పులను ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఒక సరికొత్త పంథాలో హై స్టాండర్డ్స్ లో తీయాలనుకున్నాను… తీశాను.
మేము దేవదాసు నవల రైట్స్ కోసం కలకత్తా పంపించాము. శరత్ చంద్ర గారి సిస్టర్ పేరున ఉన్న ఆ రైట్స్ ను 35,000/ ఇచ్చి కొనుక్కున్నాం. ఆ తరువాత పాత దేవదాసు నిర్మాత డి ఎల్ నారాయణ గారు నా దగ్గరికి వచ్చి 90 వేలు ఇస్తే నెగిటివ్ రైట్స్ ఇస్తానన్నారు. ఒరిజినల్ రైటర్స్ నుండే రైట్స్ కొన్నాం కాబట్టి
ఈ సినిమా రైట్స్ కొననవసరం లేదు అన్నారు కృష్ణ గారు. అప్పుడు అతను ఆ రైట్స్ ను అక్కినేని నాగేశ్వరరావు గారికి అమ్మేశారు. అయితే మా దేవదాసు రిలీజ్ మీద పోటీగా పాత దేవదాసు ను రిలీజ్ చేస్తారని మేము ఊహించలేదు. కంపేరిజన్ లేకుండా మాది ఒక్కటే రిలీజ్ అయితే అది తప్పకుండా విజయవంతమయ్యేది.
అలా కాకుండా అఖండ విజయాన్ని సాధించిన ఆ దేవదాసుతో కంపారిజన్ రావడంతో సహజంగానే మా దేవదాసుకు కమర్షియల్ గా చేదు అనుభవం ఎదురైంది. అయితే కొందరు ప్రముఖుల నుండి ఆ చిత్రానికి వచ్చిన ప్రశంసలు నాకు చాలు. ఆ సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక షో వేశాం. రేలంగి, సావిత్రి, ఎల్.వి.ప్రసాద్ గార్ల వంటి ప్రముఖులు చాలా మంది చూశారు. రేలంగి గారు నేను సీట్ నుండి కదలను… నెక్స్ట్ షో కూడా చూస్తాను అని కూర్చుండిపోయారు. ఎల్.వి ప్రసాద్ గారు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. సినిమా ఆయనకు నచ్చలేదేమో అనుకున్నాను. కానీ రాత్రి 10:30 కు ఆయన నుండి ఫోన్ వచ్చింది.
” ఈ రోజు నుండి నేను నీ ఫ్యాన్ అయ్యానమ్మా… టెక్నికల్ గా, క్రియేటివ్ గా చాలా గొప్ప సినిమా తీశావు.. కంగ్రాట్స్”- అన్నారు. ఇండియన్ సినిమాకే తలమానికం లాంటి వ్యక్తి నుండి అంత గొప్ప కాంప్లిమెంట్ వచ్చాక కమర్షియల్ సక్సెస్ గురించి ఏ మాత్రం డిసప్పాయింట్ అవ్వవలసిన అవసరం లేదు అనిపించింది. ఇక ఆ తరువాత మలయాళంలో హిట్ అయిన నా తొలి చిత్రం “కవిత” ను తెలుగులోకి రీమేక్ చేశాను. అది కూడా తెలుగులో బాగా ఆడింది. ఆ తరువాత “దేవుడే గెలిచాడు” టెక్నికల్ గా నాకు గొప్పపేరు తెచ్చింది. ఇక ఆ తరువాత నేను ఒక సీజనల్ అండ్ రెగ్యులర్ కమర్షియల్ డైరెక్టర్ ను అయ్యాను. సంవత్సరానికి 3- 4 చిత్రాలకు దర్శకత్వం వహించేంత ఓర్పు, నేర్పు, ప్రొఫెషనలిజం అలవడ్డాయి. ముఖ్యంగా యాక్షన్ చిత్రాల కమర్షియల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాకు ” లేడీ కే. ఎస్. ఆర్.దాస్ ” అనే కాంప్లిమెంట్స్ వచ్చాయి.
అలా 1972 నుండి1996 వరకు నిర్విరామంగా సాగిన 43 చిత్రాల 25 సంవత్సరాల directorial కెరీర్లో ఎన్నెన్నో అద్భుత విజయాలు , అనూహ్య పరాజయాలు, మధురానుభూతులు ఉన్నాయి. అన్ని రకాల సబ్జెక్టులు చేశాను. అందులో “హేమాహేమీలు” చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణ గార్లను డైరెక్ట్ చేయడం, “బెజవాడ బొబ్బిలి” లో శివాజీ గణేషన్- కృష్ణ గార్ల కాంబినేషన్ చేయటం, “రామ్ రాబర్ట్ రహీమ్” లో కృష్ణ రజనీకాంత్ గార్లను డైరెక్ట్ చేయడం, “డాక్టర్ సినీ యాక్టర్” లో కృష్ణ గారితో ద్విపాత్రాభినయం , “రక్తసంబంధం” లో త్రిపాత్రాభినయం చేయించటం వంటి అరుదైన అనుభవాలు, సాహసాలు ఎన్నెన్నో ఉన్నాయి .
* విజయనిర్మల గారూ … దర్శకురాలిగా మీ విజయాలకు ప్రేరణ ఏమిటి? “గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”- లోకి ఎక్కే లక్ష్యంతోనే 43 చిత్రాలకు దర్శకత్వం వహించారా ?
(సశేషం)
(ఈ ఇంటర్వ్యూ ముగింపు భాగం
ఎల్లుండి july 7న చదవండి)
[subscribe]
[youtube_video videoid=sUL5AR4YwKI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: