షూటింగ్ సమయంలో అనుకోకుండా జరిగే ప్రమాదాలలో అనూహ్యంగా గాయాలపాలవ్వటం కొద్దిరోజుల్లో కోలుకుని మరలా షూటింగ్ లు పూర్తి చేయటం దశాబ్దాలుగా జరుగుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ మధ్య కాలంలో యువ కథానాయకులు వరుసగా ప్రమాదాలకు గురై గాయాల పాలు కావటం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదాల నుండి రెప్పపాటులో తప్పించుకుని స్వల్ప గాయాలతో బయట పడుతున్నప్పటికీ వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు షూటింగులకు అవరోధాలుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు టాలీవుడ్ లో జరిగిన, జరుగుతున్న ప్రమాదాల పూర్వాపరాలు ఒకసారి పరిశీలిద్దాం.
గాయాలు అంటే రక్తం చింది బీభత్సమైన పరిస్థితులు ఏర్పడటం కాదు. బయటకు కనిపించకుండా లోలోపలే ఎముకలు విరగటం, కదలలేని స్థితి ఏర్పడటం. అలాంటి స్థితి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలోని దాదాపు ప్రతి హీరోకు ఎదురైంది. షూటింగ్ సందర్భంగా గాయాల పాలవ్వని హీరో దాదాపు లేడనే చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోలు చాలా మంది గాయాలపాలవుతున్న నేపథ్యంలో ఒకసారి గత గాయాల చరిత్రను నెమరువేసుకుందాం.
టాకీ పుట్టిన 1931 నుండి 1951 వరకు 2 దశాబ్దాలపాటు ఏవో కొన్ని చెదురుమదురు సంఘటనలు రికార్డయ్యాయి. ఆ తరువాత జరిగిన అనేకానేక ప్రమాదాలలో అనేకమంది హీరోలు, సాంకేతిక నిపుణులు గాయాల బారిన పడ్డారు. అన్నింటిలో లాగానే గాయాలలో కూడా ‘నెంబర్ వన్’ ఎన్టీ రామారావు అనే చెప్పాలి. సో … టాలీవుడ్ లో “గాయాల చరిత్ర” ఏమిటో ఒకసారి చూద్దాం .
ఎన్టీ రామారావు:
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఒక హీరో షూటింగ్ సమయంలో గాయాల బారినపడటం విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ తోనే మొదలైంది అని చెప్పవచ్చు. బి.ఎ.సుబ్బారావు దర్శకత్వంలో తన రెండవ చిత్రమైన” పల్లెటూరి పిల్ల” లో నటిస్తున్న ఎన్టీఆర్ ఎద్దుతో ఫైట్ చేసే సన్నివేశంలో కుడి చేతి మణికట్టు వద్ద గాయం కావటాన్ని తొలి సినీ గాయంగా చెప్పుకోవాలి. అంతకుముందు కొన్ని సంఘటనలు జరిగినా చరిత్రకారులు దీనినే ప్రముఖంగా పేర్కోవటం జరుగుతుంది.
ఈ సంఘటనను ఇటీవల విడుదలైన “ఎన్టీఆర్ బయోపిక్” లో కూడా ప్రముఖంగా చిత్రీకరించారు. ఇక తన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో ఎన్టీఆర్ పలుమార్లు గాయాలపాలయ్యారు. లక్ష్మీ కటాక్షం, సర్దార్ పాపారాయుడు చిత్రాల షూటింగుల్లో ఎన్టీఆర్ తీవ్రంగా గాయపడ్డారని చెప్తారు.
చిరంజీవి:
ఇక మెగాస్టార్ చిరంజీవికి తనువంతా గాయాలే… సినిమా ఫైట్స్ లో, డాన్సుల్లో రియల్ ఎఫెక్ట్ కోసం డూప్స్ తో నిమిత్తం లేకుండా హీరో ఒళ్ళు వంచి పనిచేయటం అన్నది చిరంజీవితోనే ప్రారంభమైంది అని చెప్పాలి. అది వళ్ళు కాదు …విల్లు అన్నంతగా ఒళ్ళు వంచి పని చేసి ఒళ్లంతా గాయాలు చేసుకున్న ఓన్లీ హీరో మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ, సంఘర్షణ, పసివాడి ప్రాణం,గూండా తదితర చిత్రాల షూటింగ్ సమయంలో సాహసోపేతమైన ఫీట్స్ చేసి ఒళ్ళు గుల్ల చేసుకున్న తాలూకు గాయాలు ఇప్పటికీ చిరంజీవి వంటి నిండా కనిపిస్తాయి. కానీ వీటిలో ఒకటి రెండు సంఘటనలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి.
బాలకృష్ణ:
ఇక టాలీవుడ్ లో సీనియర్ స్టార్స్ లో అత్యంత దూకుడుగా వ్యవహరించే డేర్ డెవిల్ గా నందమూరి బాలకృష్ణను చెప్పుకోవాలి. దాదాపు 30 ఏళ్ల క్రితం “బాబాయ్ అబ్బాయ్” షూటింగ్ లో బాలకృష్ణ తీవ్రగాయాలపాలయ్యారు. ఆ విషయం ఈ జనరేషన్ కు తెలియకపోవచ్చు గానీ అప్పట్లో అది పెద్ద సంచలన సంఘటనగా నిలిచిపోయింది. ఇంకా చాలా సినిమాల సందర్భంగా బాలకృష్ణ గాయాలపాలైనప్పటికీ విజయేంద్ర వర్మ షూటింగ్ సమయంలో కాలికి తగిలిన గాయం చాలా కాలం బాలకృష్ణను ఇబ్బంది పెట్టింది.
రాజేంద్ర ప్రసాద్- నూతన్ ప్రసాద్:
తెలుగు సినిమా షూటింగ్ ప్రమాదాల్లో అత్యంత దారుణమైన ప్రమాదంగా చెప్పుకోవలసింది ఏవియం వారి “బామ్మ మాట- బంగారు బాట” షూటింగ్ లో జరిగిన ప్రమాదం గురించే. దాదాపు 40 అడుగుల ఎత్తులో క్రేన్ కు కారును వేలాడదీసారు. కారులో హీరో రాజేంద్ర ప్రసాద్ , నూతన్ ప్రసాద్ ఉన్నారు. చిత్రీకరణ జరుగుతుండగా ఉన్నట్టుండి వైర్లు తెగిపోవడంతో అంత ఎత్తు నుండి కారు కింద పడింది. ఆ ప్రమాదం నుండి రాజేంద్ర ప్రసాద్ తృటిలో తప్పించుకున్నప్పటికి నూతన్ ప్రసాద్ రెండు కాళ్ళు, వెన్నెముక తీవ్రంగా దెబ్బతిన్నాయి. విలన్ గా, కమెడియన్ గా, కేరక్టర్ యాక్టర్ గా అద్భుతమైన రైజ్ లో ఉన్న నూతన్ ప్రసాద్ జీవితంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నాయి. చనిపోయేవరకు ఆయన జీవితం వీల్ చైర్ కే పరిమితమైపోయింది.
వీరే కాకుండా టాలీవుడ్ లో చాలా మంది సీనియర్ యాక్టర్లు, ఫైట్ మాస్టర్స్, ఫైటర్స్ ప్రమాదాలకు గురైన సంఘటనలు చాలా ఉన్నాయి.
“కూలి” చిత్ర నిర్మాణ సమయంలో ఆల్ ఇండియా సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు జరిగిన ప్రమాదం సినీ ప్రమాదాల చరిత్రలో ఒక మరపురాని సంఘటన గా నిలిచిపోతుంది. దేశం యావత్తు ఆయన కోలుకోవాలని ప్రార్థనలు చేసింది. అందరూ ఆశలు వదులుకున్న తరుణంలో క్రమంగా కోలుకొని పునర్జీవితం పొందిన అమితాబచ్చన్ ఇప్పటికీ అలుపెరుగని అభినయ యోధుడిగా ఇండియన్ స్క్రీన్ మీద కొనసాగటం అదృష్టం, అభినందనీయం. ఇక టెలివిజన్ రంగంలో ప్రమాదాల విషయాన్ని పరిశీలిస్తే “The Sword of Tippu Sultan” షూటింగ్ బెంగళూరులో జరుగుతుండగా అత్యంత దారుణమైన అగ్ని ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో చాలా మంది చనిపోవడంతో పాటు టిప్పు సుల్తాన్ గా నటిస్తున్న “సంజయ్ ఖాన్” తీవ్రంగా గాయపడ్డారు.
ఎన్టీఆర్:
ఇక సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదం కాకపోయినా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు జరిగిన తీవ్రాతి తీవ్రమైన రోడ్డు ప్రమాదాన్ని ఎవరూ మర్చిపోలేరు. తెలుగుదేశం పక్షాన ప్రచారం చేసి హైదరాబాదుకు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తూ తిరిగి వస్తుండగా జరిగిన అంతటి తీవ్ర ప్రమాదం నుండి కోలుకుని పునర్జన్మ పొందిన ఎన్టీఆర్ ఒక అభినయ ప్రభంజనంగా విజృంభించడం చూస్తే అతనంతటి అదృష్టవంతుడు అతనేనేమో అనిపిస్తుంది. ఇదంతా గతం తాలూకు గాయాల చరిత్ర. ఇక ప్రస్తుత విషయానికి వస్తే యంగ్ హీరోలందరూ వరుసగా గాయాలపాలవుతూ కలకలం సృష్టిస్తున్నారు. ఒకవైపు వాళ్ల గాయాల బాధ మరోవైపు షూటింగ్ లకు అవరోధం కలసి టాలీవుడ్ ను తీవ్రంగా కలవరపరుస్తున్నాయి.
ఎన్టీఆర్, రామ్ చరణ్( త్రిబుల్ ఆర్) గోపీచంద్( చాణుక్య) వరుణ్ తేజ( వాల్మీకి) నాగ శౌర్య (అశ్వద్ధామ)సందీప్ కిషన్( తెనాలి రామకృష్ణ) శర్వానంద్(96) చిత్రాల షూటింగ్ లలో గాయాలపాలయ్యారు. ఈ వరుస ప్రమాదాల తీరు చూస్తే ఇది ప్రమాదాల సీజనేమో అనిపిస్తుంది. ఒకప్పుడు నెలకు ఒక్కరు చొప్పున సంభవించిన వరుస మరణాలలో శ్రీహరి, ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రామానాయుడు, ఆహుతి ప్రసాద్, కొండవలస వంటి హేమాహేమీలను కోల్పోయింది టాలీవుడ్.
నిజానికి షూటింగ్ లో ప్రమాదాలు జరగకుండా ఫైట్ మాస్టర్స్, దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అడపాదడపా జరిగే ప్రమాదాలు ఇప్పుడు తరచుగా జరగటం ఆందోళన కలిగిస్తున్న విషయం.ఏది ఏమైనా ఉజ్వల భవిష్యత్తు ఉన్న మన యంగ్ హీరోలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం ఇది….
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: