నిన్న సినీ నాటక రంగాలకు నిజమైన దుర్దినం. ఈ రెండు రంగాలకు ఎందరెందరో నటీనటులను పరిచయం చేసి, తర్ఫీదు ఇచ్చి గొప్ప కళాకారులుగా తీర్చిదిద్దిన “దీక్షితులు మాస్టారు” ఇక లేరు అన్న దుర్వార్తను మోసుకొచ్చిన నిజమైన దుర్దినం నిన్న. తాము ఇష్టపడిన రంగాలపట్ల కొందరు వ్యక్తులకు అమితమైన ప్రేమ ఉంటుంది.. అది సహజం… అలాగే నాటక సినీ రంగాల పట్ల చాలామందికి అభిమానం ఉంటుంది. చాలా కొద్ది మందికి మాత్రం “అంకిత భావం” ఉంటుంది. కానీ ఇష్టమైన నాటక సినీ రంగాల కోసం సర్వస్వాన్ని సమర్పించే
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“అర్పిత గుణం” ఒకే ఒక్కరికి ఉంది…
ఆయనే “దీక్షితులు మాస్టారు”
కొందరు ‘సారు’ అంటారు..
కొందరు ‘గురువుగారు’ అంటారు..
కొందరు ‘తండ్రీ’ అంటారు..
కొందరు ‘మాస్టారు’ అంటారు
ఎవరు ఎలా పిలిచినా అందరికీ తన అభిమాన ఆప్యాయతలను పంచి గురువుగా అభినయ విద్యను నేర్పించి ఆదరించిన దీక్షితులు మాస్టారి అకాల మరణాన్ని ఉభయ రాష్ట్రాల్లో వేలాదిగా కల ఆయన శిష్యులు, నాటకరంగ సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ముఖంలో ఏదో తెలియని వర్చస్సుతో, చూడగానే చేతులెత్తి నమస్కరించాలి అనిపించే దరహాస వదనంతో, చక్కని పలకరింపు, గొప్ప హుందాతనం ఉట్టిపడే దీక్షితులు మాస్టారు ఇంత హఠాత్తుగా తమను విడిచిపోతారని ఊహించని శిష్య ప్రశిష్యులు అందరూ శోకతప్త హృదయాలతో తల్లడిల్లిపోతున్నారు.
ఎందుకు ఆయన మరణం అందరిని ఇంతలా కుదిపేసింది… అంటే అందుకు కారణాలు కోకొల్లలు.
వేలకు వేలు డబ్బు తీసుకుని కార్పొరేట్ యాక్టింగ్ స్కూల్స్ యాక్టింగ్ కోర్సుల పేరుతో సొమ్ము చేసుకుంటుంటే ఈ దీక్షితులు మాష్టారు మాత్రం ఎందరెందరో నటీనటులకు ఉచిత భోజనాలు, ఉచిత బసలు ఏర్పాటు చేసి ఉచితంగా అత్యున్నత అభినయ ప్రమాణాలను నేర్పించారు కాబట్టి.
యాక్టింగ్ నేర్చుకోవాలంటే సూట్ కేసు లో బట్టలు సర్దుకుని నేరుగా బస్సు దిగి దీక్షితులు మాస్టారు ఇల్లు వెతుక్కుంటూ వెళ్తే చాలు… మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటారు అనే భరోసాతో బయలుదేరి వచ్చి
ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ తోపాటు ఫ్రీ యాక్టింగ్ ట్రైనింగ్ పొందినవాళ్లు ఎందరో .. ఎందరెందరో.
నాటకాల్లో నటించడం, నాటకాలకు దర్శకత్వం వహించటం, నాటకం కోసం ఎలాంటి కష్టానికైనా నష్టానికైనా ఎదురెళ్ళటం దీక్షితులు మాస్టారికి మాత్రమే తెలిసిన ఎదురీత.
ఇస్తే ఇచ్చింది తీసుకోవడం తప్ప దీక్షితులు మాస్టారు నట శిక్షణకు ఎప్పుడూ వెలకట్ట లేదు.
ఈ రోజున తెలుగు చలనచిత్రరంగంలో జిలుగు వెలుగుల తారలుగా వెలుగుతున్న ఎందరెందరో యువ నటులు దీక్షితులు మాస్టారు దగ్గర అభినయంలో ఓనమాలు దిద్దుకున్న వారే. ఎన్టీఆర్, సుమంత్, సునీల్, అల్లరి నరేష్, వరుణ్ తేజ్, కళ్యాణ్ రామ్ వంటి యంగ్ స్టార్స్ అందరూ ఆయన దగ్గరే అభినయ కళలో తొలి అధ్యాయాలు నేర్చుకున్నారు. ఈ రోజున ఈటీవీ జబర్దస్త్ ప్రోగ్రాంలో గొప్ప ప్రదర్శనలు ఇస్తున్న నటులు చాలామంది ఆయన దగ్గర తర్ఫీదు పొందారు. ఇక నటుడు, రచయిత, వక్త ఉత్తేజ్ దీక్షితులు మాస్టారికి పెంపుడు కొడుకు. ఆయన ఆకస్మిక మరణంతో తల్లడిల్లిపోయిన ఉత్తేజ్ కుటుంబ సభ్యులను ఓదార్చటం ఎవరి తరమూ కాలేదు. ఎవరైనా చనిపోయినప్పుడు ఆయన కుటుంబ సభ్యులు, సమీప బంధువులు ఏడుస్తారు… కానీ దీక్షితులు మాస్టారు మరణంతో నాటక సినీ రంగాలకు చెందిన ఎంతోమంది కళాకారులు కనులు వాచేలాగా , గుండెలు పగిలేలాగా ఏడవటం చూస్తే అంతమంచి మాస్టారిని ఆ మాయదారి దేవుడు ఇంత తొందరగా ఎందుకు తీసుకెళ్ళాడో అర్థం కాదు. దేవుడికి అంతగా యాక్టింగ్ నేర్చుకోవాలి అనిపిస్తే అంతకు ముందే చాట్ల శ్రీరాములు మాస్టర్ ని తీసుకెళ్లింది చాలదా…? ఇప్పుడు ఇక్కడ ఉన్నత ప్రమాణాల అభినయాన్ని అభ్యసించాలి అంటే ఎక్కడికి వెళ్లాలి…? ఎవరిని కలవాలి…?
అందుకే ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థ అభినయ శిక్షకుడు “దీక్షితులు మాష్టారు ” లేని లోటు తీర్చలేనిది పూడ్చలేనిది అంటూ ఆ అభినయ ఆచార్యుడికి అంజలి ఘటిస్తున్నాయి తెలుగు నాటక సినీ రంగాలు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: