టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ మూవీస్

Tollywood Best Political Dramas

వినోద ప్రధానంగా సాగే చలనచిత్ర రంగంలో ఎక్కువగా ప్రేమ కథలు అలాగే కుటుంబ కథా చిత్రాలు రూపొందుతుంటాయి. అయితే వీటికి భిన్నంగా రాజకీయ నేపథ్యం కలిగిన సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇవి ప్రేక్షకులను అలరించడంతోపాటు ఆలోచింపజేసేవిగా ఉంటుంటాయి. సామాజిక సమస్యలను ఎత్తిచూపడంలో, అలాగే వాటికి సరైన పరిష్కారాలను చూపడంలో ఇలాంటి తరహా చిత్రాలు ఉపయుక్తంగా ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నికల సీజన్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సినీ ప్రియులందరి కోసం తెలుగులో రాజకీయ కథాంశాలతో వచ్చిన బెస్ట్ తెలుగు చిత్రాలను ఒకసారి పరికిద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ పొలిటికల్ సినిమాల లిస్ట్

1. ఒకే ఒక్కడు (1999): కోలీవుడ్ స్టార్ హీరో అర్జున్ సర్జా మరియు బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. రఘువరన్, వడివేలు మరియు మణివణ్ణన్ కీలక పాత్రలు పోషించారు.

తెలుగులోకి డబ్ అయిన ఈ మూవీ 100 రోజులకు పైగా ప్రదర్శించబడి సూపర్ హిట్ అయింది. వృత్తిపట్ల నిబద్దత కలిగిన ఒక టీవీ రిపోర్టర్ (హీరో) రాష్ట్ర ముఖ్యమంత్రితో చేసిన ఇంటర్వ్యూ తన జీవితాన్నే మలుపు తిప్పుతుంది. ప్రత్యక్ష ప్రసారం జరుగుతుండగా.. ఆవేశానికి లోనైన ముఖ్యమంత్రి జర్నలిస్టును ఒక రోజంతా తన కుర్చీలో కూర్చోమని సవాల్ విసురుతాడు.

అందుకు సిద్దమైన హీరో ఒకరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉండి అనేక మంచి పనులను చేస్తాడు. అలాగే అవినీతిపరులైన అధికారులను మరియు నేతలను అరెస్ట్ చేయిస్తాడు. ఇది బెస్ట్ పొలిటికల్ మూవీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

2. ఆపరేషన్ దుర్యోధన (2007): అమన్ ఇంటర్నేషనల్ మూవీస్ పతాకంపై పోసాని కృష్ణ మురళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్, కళ్యాణి జంటగా నటించగా, ఎం. ఎం. శ్రీలేఖ సంగీతం అందించింది. రాజకీయ నేపథ్యంతో తీసిన ఈ చిత్రం 2005లో స్టింగ్ ఆపరేషన్ నుండి ప్రేరణ పొందింది.

నిజాయితీగల ఒక పోలీసు అధికారి కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకుల వల్ల భార్యను, పిల్లలను కోల్పోతాడు. దీంతో ఒకవిధమైన కసితో తన వేషాన్ని, పేరును మార్చుకుని రాజకీయాల్లోకి వచ్చి వ్యవస్థలో ఉన్న లోపాలను ప్రజలను ఎలా తెలియజేశాడన్నది మిగతా కథ. కాగా ఈ చిత్రాన్ని తమిళంలో ‘థీ’ పేరుతో, హిందీలో ‘ఆపరేషన్ ధుర్యోధన’ పేరుతో రీమేక్ చేయడం విశేషం.

3. ప్రస్థానం (2010): దేవా కట్టా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శర్వానంద్, సాయి కుమార్, సందీప్ కిషన్ప్రధాన పాత్రలు పోషించారు.

ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలోని ఒక ప్రముఖ కుటుంబ సభ్యుల మధ్య శత్రుత్వం మరియు ప్రతీకారాన్ని నొక్కి చెబుతుంది. అలాగే అధికార దాహంతో విపరీత చర్యలకు దిగితే ఎలాంటి ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో హైలైట్ చేస్తుంది.

ఈ పొలిటికల్ డ్రామా రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు రెండు నంది అవార్డులను గెలుచుకుంది, ఉత్తమ సహాయ నటుడిగా సాయి కుమార్, దర్శకుడు దేవా కట్టా ఉత్తమ విమర్శకుల అవార్డులను అందుకున్నారు.

4. లీడర్ (2010): సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ద్వారా రానా దగ్గుబాటి హీరోగా ఎంట్రీ ఇచ్చారు.

అమెరికా నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి తనయుడు.. తండ్రి హఠాన్మరణంతో, రాజకీయాలపై అంతగా ఆసక్తి లేకపోయినా అనుకోకుండా సీఎం పదవి చేపట్టాల్సి వస్తుంది.

అనంతరం పరిపాలనలో సొంతపార్టీ నేతలనుంచే సవాళ్లు ఎదురవ్వడంతో.. అవినీతి లేని పాలన అందించడానికై ఎన్నికల రణక్షేత్రంలో అడుగుపెట్టి ప్రత్యర్థులను ధీటుగా ఎదుర్కొని, విజయం సాధించి నూతన ఒరవడికి నాంది పలుకుతాడు.

5. రంగం (2011): తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కో’ సినిమాను తెలుగులో ‘రంగం’ పేరుతో దబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడా సూపర్ హిట్ అయింది. జీవా, కార్తీకా నాయర్ నాయకానాయికలుగా నటించగా, అజ్మల్ అమీర్, పియా బాజ్‌పాయ్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు కీలక పాత్రలు పోషించారు.

సీనియర్ ముఖ్యమంత్రిని అధికారం నుంచి దించివేయడానికి పోరాడే నిజాయితీ కలిగిన యువనేత అందుకు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాడు. అయితే దీనిని కనిపెట్టిన జర్నలిస్ట్ అయిన హీరో నిజాన్ని వెలికితీసినా.. రాజకీయాలపై యువతకు నమ్మకం కోల్పోకూడదనే కారణంతో బయటకు వెల్లడి చేయడు. ఒకవైపు రాజకీయాల్లోకి యువతరం రావాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూనే, వారిలోనూ అవినీతిపరులైనవారు ఉంటారని చూపిన ప్రయత్నమే ఈ సినిమా.

6. కెమెరామెన్ గంగతో రాంబాబు (2012): పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, ఆలీ, తనికెళ్ళ భరణి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

తన కళ్ళముందు జరిగే అన్యాయాలను ఎదురించే దైర్యశాలి అయిన రాంబాబు మెకానిక్ వృత్తిలో కొనసాగుతుంటాడు. అయితే ఒకసారి అతడి నైజాన్ని గమనించిన టీవీ చానల్ కెమెరామెన్ అయిన గంగ.. ఇతను జర్నలిస్టుగా అయితే ఎన్నో సంచలనాలు సృష్టిస్తాడని నమ్మి జాబ్ ఇప్పిస్తుంది.

ఈ క్రమంలో మాజీ సీఎం జవహర్ నాయుడు, అతని కొడుకు రానా నాయుడు రాష్ట్రంలో అల్ల కల్లోలం కలిగించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని, తాము అధికారంలోకి రావాలని కుట్రలు చేస్తుంటారు. కానీ హీరో రాష్ట్ర ప్రజలను విడగొట్టాలనే వీరి కుట్రలను బయటపెట్టి ప్రజలందరినీ ఎలా ఒక్కటి చేసాడనేదే సినిమా.

7. ప్రతినిధి (2014): నారా రోహిత్ హీరోగా ప్రశాంత్‌ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. శుభ్ర అయ్యప్ప, శ్రీవిష్ణు, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ మూవీ ‘ఏక్ లీడర్’ పేరుతో హిందీలోకి, ‘కో2’ పేరుతో తమిళంలోకి రిమేక్ చేయబడింది.

కథానాయకుడైన ‘మంచోడు’ శ్రీను హఠాత్తుగా ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేసి తన డిమాండ్లు తీర్చకపోతే ముఖ్యమంత్రిని చంపేసి తాను కూడా చనిపోతానని బెదిరిస్తాడు. అయితే అతని డిమాండ్లు తీర్చడం అధికారులకు తలకుమించిన భారం అవుతుంది. ఎందుకంటే..? అతడు అడిగేవన్నీ సొంతానికి కాకుండా సమాజానికి ఉపయోగపడేవిగా ఉంటాయి. కానీ అతడు ఎందుకోసం ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేశాడు? చివరిగా తాను చేసిన దానికి అతను ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ.

8. నేనే రాజు నేనే మంత్రి (2017): రానా దగ్గుబాటి హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. కాజల్ కథానాయికగా నటించగా.. నవదీప్, శివాజీరాజా, జయప్రకాశ్ రెడ్డి, సత్యప్రకాష్, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

వడ్డీ వ్యాపారం చేసుకునే కథానాయకుడైన జోగేంద్రకు తన భార్య రాధ అంటే చచ్చేంత ప్రేమ. అయితే గ్రామంలోని గుడి వద్ద దీపం వెలిగించే విషయంలో జరిగిన గొడవలో సర్పంచ్ భార్య వల్ల రాధ కింద పడి గర్భం పోగొట్టుకుంటుంది. దీంతో భార్య కోరిక కోసం సర్పంచిగా గెలిచి రాజకీయాల్లోకి అడుగు పెడతాడు జోగేంద్ర.

కానీ ఆ తర్వాత పరిస్థితులు ప్రభావంతో ఎంఎల్ఏ గా, ఆపై మంత్రి పదవి కూడా చేపడతాడు. ఒకానొక దశలో సొంతంగా రాజకీయ పార్టీ స్థాపించి సీఎం కుర్చీ కోసం పోటీ పడే స్థాయికి వెళతాడు. అయితే ఈ క్రమంలో అతడు నైతికంగా ఎలా దిగజారాడు? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే తన భార్యకు ఏమైంది? చివరకు అతనికి ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

9 యాత్ర (2019): మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు మహి. వి. రాఘవ్ దర్శకత్వం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాత్రను మమ్ముట్టి పోషించారు.

వైఎస్సార్‌ రాజకీయ జీవితంలో కీలక మలుపుగా చెప్పుకునే ‘పాదయాత్ర’కు సంబంధించిన కథ ఇది. ప్రతిపక్షనాయకుడిగా ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఆయన పాదయాత్ర చేయడం.. ఈ క్రమంలో 2004 ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రి పదవిని చేపట్టడం వంటి ఘట్టాలను ఆసక్తిగా చూపించారు.

10. భరత్ అనే నేను (2019): టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కధానాయకుడుగా నటించిన ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. కైరా అడ్వాణీ కథానాయికగా నటించగా.. రావు రమేష్, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్, ఆమని, పోసాని కృష్ణ మురళి, రవిశంకర్, బ్రహ్మాజీ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడైన కథానాయకుడు తండ్రి మరణం తరువాత రాష్ట్రానికి తిరిగి వచ్చి కొన్ని అనుకోని పరిస్థితుల్లో పార్టీ నేతలచే సీఎంగా ఎన్నుకోబడతాడు. అయితే తనకు ఎదురైన అవినీతిని చూసి విసిగిపోయిన అతడు వ్యవస్థలో మార్పు తీసుకురావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలను ఎదుర్కొన్నాడు? తాను అనుకున్నది సాధించగలిగాడా? అనేదే మిగిలిన కథ.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.