విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రెండు భాగాలుగా రూపొందిన “ఎన్టీఆర్ – కథానాయకుడు ” , “ఎన్టీఆర్- మహానాయకుడు” చిత్రాలలోని తొలి భాగమైన “ఎన్టీఆర్- కథానాయకుడు” ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవానికి ఈ సినిమా నిర్మాణ విశేషాలు ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకు బాగా తెలిసినప్పటికీ ఆ స్థాయిలో ఓపెనింగ్స్ హడావుడి కనిపించలేదు. బయోపిక్ కదా అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏముంటుందిలే అనే తాత్సారం కూడా కొన్నిచోట్ల వీక్ ఓపెనింగ్స్ కు కారణం అయి ఉండవచ్చు. అయితే మెయిన్ సెంటర్స్, మెయిన్ థియేటర్స్ దగ్గర మాత్రం ఆ హబ్ విపరీతంగా కనిపించింది.
ఇక వన్స్ థియేటర్ లోకి ఎంటర్ అయిన తరువాత, సినిమా ప్రారంభమైన తరువాత ప్రేక్షకుడి మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. తెరమీద ఆవిష్కృతమవుతున్న ఒకొక్క సన్నివేశాన్ని చూస్తూ అలా లీనమైపోవటం ప్రేక్షకుడి వంతయింది. నిజానికి ప్రజాబాహుళ్యంలో విశేష ప్రాచుర్యాన్ని పొందిన ఎన్టీ రామారావు లాంటి మహామహుడి జీవితాన్ని తెరకెక్కించటం అంటే జగమెరిగిన బ్రాహ్మణుడికి జంధ్యం తగిలించడం వంటి సాహసంగా చెప్పుకోవాలి. తెలుగు వారి జీవన విధానంలో ఒక అంతర్భాగంగా మమేకమైన ఒక మహానటుడి జీవితాన్ని ఆదరించిన ప్రజలకే చూపించటంలో ఉన్న సవాలును స్వీకరించి నందమూరి బాలకృష్ణ- దర్శకుడు జాగర్లమూడి క్రిష్ చేసిన ఈ ప్రయత్నాన్ని గొప్ప ఆవిష్కరణగా అభివర్ణించాలి.
సాధారణంగా బయోపిక్ అనగానే ఒక డాక్యుమెంటరీ ఫీలింగ్ కలుగుతుంది. కానీ” ఎన్టీఆర్ కథానాయకుడు” చూస్తుంటే ఒక ఫుల్ ఫ్లెడ్జిడ్ కమర్షియల్ సినిమాలో ఉండే ఇంట్రెస్ట్, స్టఫ్ ‘ఫస్ట్ ఫ్రేమ్ టూ లాస్ట్ ఫ్రేమ్’ దాకా మెయింటైన్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. అద్భుతమైన ప్రజెంటేషన్ వాల్యూస్ తో దర్శకుడు క్రిష్ చూపించిన ఎన్టీఆర్ జీవిత కథా క్రమం ఎలా సాగిందో చూద్దాం.
అడయార్ కాన్సర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఎన్టీఆర్ సతీమణి నందమూరి బసవతారకం ఆయన ఆల్బమ్ చూస్తూ అలా ఫ్లాష్ బాక్ లోకి వెళ్లటంతో ప్రారంభమవుతుంది నందమూరి తారక రాముని కథాక్రమం.అలా ప్రారంభమైన ఎన్టీఆర్ నట జీవిత ప్రారంభ దినాలలోని ఒక్కొక్క ఘట్టాన్ని చాలా వాస్తవికంగా, చాలా సహజంగా చిత్రీకరిస్తూ ఆ క్రమంలో ఆయనకు తారసపడిన ఎల్.వి.ప్రసాద్, నాగిరెడ్డి, చక్రపాణి, హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎ.సుబ్బారావు, టీవీ రాజు, కేవీ రెడ్డి, కమలాకర కామేశ్వరరావు వంటి ప్రముఖులతో ఏర్పడిన పరిచయాలను, ఆ పరిచయ ఫలితాలను, నటుడిగా ఎన్టీఆర్ ఎదుగుదలను ఆసక్తికరంగా చూపిస్తూనే మరోవైపు కుటుంబ సభ్యులైన భార్య నందమూరి బసవతారకం, తమ్ముడు త్రివిక్రమరావు, బావమరిది రుక్మాంగద రావు తదితర కుటుంబ సభ్యులతో అనుబంధాలను కూడా చాలా ఆసక్తిదాయకంగా ఆవిష్కరించారు దర్శకుడు క్రిష్. ఎన్టీ రామారావు వ్యక్తిత్వంలోని నిజాయితీని, నిర్భీతిని, మొండితనాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలను కూడా చాలా ఆహ్లాదంగా, వినోదాత్మకంగా చూపించారు.
ఎన్టీఆర్ ను పాతాళ భైరవి చిత్రంలో హీరోగా, మాయాబజార్ లో కృష్ణుడిగా ఎంపిక చేసుకునేటప్పుడు నాగిరెడ్డి, చక్రపాణి, దర్శకుడు కె.వి.రెడ్డి ల మధ్య జరిగిన చర్చను ఎంతో రసవత్తరంగా తెరకెక్కించారు. ఇక మాయాబజార్ సెట్ లో మేకప్ వేసుకుని కృష్ణుడి గెటప్ లో ఫ్లోర్ లోకి వస్తున్నప్పుడు ఆ గెటప్ లో ముమ్మూర్తులా ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌమున్ని తలపిస్తూ కనిపించిన బాలకృష్ణ ను చూసి థియేటర్ మొత్తం తనువులు మరచిన తన్మయంలో మునిగిపోయింది అంటే అందులో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. ఆ సెట్లోని జూనియర్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, దర్శక నిర్మాతలైన నాగిరెడ్డి, చక్రపాణి, కె.వి.రెడ్డి తదితరులు ఎలా ముగ్ధులై ఎన్టీఆర్ వైపు చూశారో ఈ రోజున కృష్ణుడి గెటప్ లో వస్తున్న బాలకృష్ణ వైపు థియేటర్లోని ప్రేక్షకులు అంతకు పదింతల ఆశ్చర్యంతో ఆనందంతో చూస్తూ కేరింతలు కొట్టారు. ఇక పి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన వెంకటేశ్వర మహత్యం చిత్రంలో ఆ ఏడుకొండలవాడి వేషధారణలో బాలకృష్ణ ను చూస్తే ఆ నందమూరి తారక రాముడే దిగి వచ్చాడా అన్నంత గొప్పగా ఆ గెటప్ లో ఒదిగిపోయారు బాలకృష్ణ.
ఇక పెద్ద కుమారుడు రామకృష్ణ చనిపోయిన వార్త తెలిసిన సన్నివేశాన్ని, సీతారామ కళ్యాణం కోసం రావణాసురుడి పది తలల ట్రిక్ షాట్ చిత్రీకరణ సన్నివేశాన్ని, దాన వీర శూర కర్ణ లో మూడు పాత్రలు పోషించటం గురించి ఎడిటర్ ఎన్టీఆర్ ను ప్రస్తుతించే సన్నివేశాన్ని – ఇలా ఒకటేమిటి ప్రతి సన్నివేశాన్ని చాలా అర్ధవంతంగా, ఆసక్తిదాయకంగా మలచిన దర్శకుడు క్రిష్ సృజనాత్మక ప్రమాణాలకు
హాట్సాఫ్..
హాట్సాఫ్..
హాట్సాఫ్.
ఇక ఎన్టీఆర్- ఏఎన్నార్ ల అనుబంధం, దివిసీమ ఉప్పెన సందర్భంగా ఆ ఇద్దరు మహానటులు చేసిన విరాళాల సేకరణ, యమగోల చిత్రంలో “చిలకకొట్టుడు కొడితే ” పాట విషయంగా కుటుంబ సభ్యుల నిరసన, రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంపై చర్చ, ఇలాంటి ఎన్నెన్నో సన్నివేశాలను చూస్తున్నప్పుడు థియేటర్లో ప్రేక్షకుడు వాటిని ఐడెంటిఫై చేసుకోవటం, రిలేట్ చేసుకోవటం ఈ సినిమాకు పెద్ద ప్లస్ గా చెప్పుకోవాలి. ఆ మహానటుడి జీవితం గురించి తమకు క్షుణ్ణంగా కొన్ని, చూచాయగా కొన్ని విషయాలు తెలిసి ఉండటంతో ప్రేక్షకులు వాటికి బాగా కనెక్ట్ అయ్యారు .
ఈ విధంగా అందరికీ తెలిసిన ఎన్టీఆర్ అనే matinee idol జీవిత చరిత్రను మరలా అందరి స్పురణకు తెచ్చే ఈ గొప్ప ప్రయత్నాన్ని చాలా గొప్పగా నిర్వహించిన నందమూరి బాలకృష్ణ- దర్శకుడు క్రిష్ ద్వయం నిజంగా అభినందనీయులు.
ఇక పర్ఫార్మెన్స్ ల విషయానికి వస్తే
నందమూరి తారక రామారావు అనే నట దిగ్గజం వెండితెర మీద పోషించిన పాత్రలనే కాకుండా నిజజీవితంలో కూడా ఆ స్పురద్రూపి ఆంగిక, ఆహార్యాలను అచ్చుగుద్దినట్లుగా దించేసిన నందమూరి బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూసి ముగ్ధులవ్వని ప్రేక్షకుడు ఉండడు అనటంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో దివిసీమ ఉప్పెన, ఎమర్జెన్సీ నాటి పరిస్థితులపై ప్రతిఘటన, రాజకీయ రంగ ప్రవేశ నిర్ణయంపై సంఘర్షణ, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ ప్రకటన ఇత్యాది సన్నివేశాలలో బాలకృష్ణ నటించారా లేక పై నుండి రామారావు గారే దిగివచ్చారా అన్నంత గొప్పగా ఉంది బాలకృష్ణ అభినయ చాతుర్యం.
ఇక బసవతారకంగా విద్యాబాలన్, అక్కినేని నాగేశ్వరావుగా సుమంత్, నారా చంద్రబాబునాయుడుగా రానా- ఇలా ఒకరేమిటి పాత్రలు-పాత్రధారుల ఎంపిక విషయంలో కూడా ఎక్కడ ఏ మాత్రం రాంగ్ సెలక్షన్ అనటానికి వీలు లేని విధంగా నటీనటుల ఎంపిక చేసుకుని అందరి నుండి గొప్ప పర్ఫార్మెన్స్ రాబట్టుకున్నారు క్రిష్.
ఇక తెర వెనుక ఈ అద్భుత ఆవిష్కరణకు ఎందరో గొప్ప టెక్నీషియన్స్ ఉన్నప్పటికీ దర్శకుడు క్రిష్, నిర్మాత బాలకృష్ణ, సంగీత దర్శకుడు కీరవాణి, సంభాషణల రచయిత బుర్రా సాయి మాధవ్ – ఈ నలుగురు నాలుగు స్తంభాలుగా రూపొందిన అద్భుత దృశ్య సౌధం ఎన్టీఆర్ కథానాయకుడు.
అందుకే రెగ్యులర్ సినిమాలకు ఇచ్చే ర్యాంకులు- రేటింగులు ఇలాంటి అరుదైన ప్రయత్నానికి ఇవ్వటం, ప్లస్ లు మైనస్ లు అంటూ సమీక్షల పేరున పోస్టుమార్టాలు చేయటం సమంజసం కాదని భావిస్తూ – ఇది ఆ విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత నటదిగ్గజం
ఎన్టీ రామారావుకు సమర్పించిన ఘన నివాళిగా భావిస్తూ యూనిట్ మొత్తానికి శుభాభినందనలు పలుకుతుంది
“దతెలుగుఫిలింనగర్.కామ్”
[youtube_video videoid=b-hgeOh5J48]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: