వాణిజ్యపరమైన సినిమాలతోనే కాదు.. ఆధ్యాత్మిక చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరించిన వైనం ‘కింగ్’ నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ద్వయం సొంతం. అలాంటి వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి ఆధ్యాత్మిక చిత్రం ‘అన్నమయ్య’. తన కీర్తనలతో ఆ పరంధాముడి హృదయ సామ్రాజ్యాన్నే ఏలిన కవి మహారాజు ‘అన్నమయ్య’ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా.. అటు నాగార్జునకు, ఇటు దర్శకేంద్రుడికి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చింది. ఇందులో నాగార్జునకి జోడిగా రమ్యకృష్ణ, కస్తూరి నటించగా.. శ్రీ వేంకటేశ్వరస్వామి పాత్రలో సుమన్ దర్శనమిచ్చారు. ఇక శ్రీదేవి, భూదేవిగా భానుప్రియ, శ్రీకన్య కనిపించారు. డా.మోహన్‌బాబు, రోజా, బాలయ్య, శుభ, ‘సుత్తి’ వేలు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, గుండు హనుమంతరావు, బాబుమోహన్, తనికెళ్ళ భరణి ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వేటూరి సుందరరామమూర్తి, జె.కె.భారవి సాహిత్యం సమకూర్చిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి అజరామరమైన బాణీలు అందించారు. “తెలుగుపదానికి”(వేటూరి), “ఏలే ఏలే మరదలా”(వేటూరి), “అస్మదీయ”(వేటూరి), “ఫాలనేత్రాల”(వేటూరి), “పదహారు కళలకు”(జె.కె.భారవి) మినహా.. మిగిలిన పాటలన్నీ అన్నమాచార్య సంకీర్తనలే కావడం విశేషం. ఆ సంకీర్తనలు కూడా సామాన్య ప్రజానీకం పాడుకునే విధంగా బాణీలు కట్టిన కీరవాణికి.. ‘ఉత్తమ సంగీత దర్శకుడు’గా ‘జాతీయ’ అవార్డు వరించడం విశేషం. అలాగే.. ‘స్పెషల్ మెన్షన్ యాక్టర్’గా నాగార్జున కూడా ‘జాతీయ’ అవార్డును కైవసం చేసుకున్నారు. ఇక ‘ఉత్తమ చిత్రం’, ‘ఉత్తమ దర్శకుడు’(కె.రాఘవేంద్రరావు), ‘ఉత్తమ నటుడు’(నాగార్జున), ‘ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్’(యస్.పి.బాలసుబ్రహ్మణ్యం), ‘ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్’(తోట బాబురావు), ‘ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్’(టి.మల్లికార్జునరావు), ‘ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్’(వి.భాస్కరరాజు), ‘ఉత్తమ ఛాయాగ్రాహకుడు’(ఎ.విన్సెంట్) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను సొంతం చేసుకోవడమే కాకుండా.. పలు ‘ఫిల్మ్‌ఫేర్ – సౌత్’లను కూడా తన ఖాతాలో వేసుకుందీ సినిమా. వి.ఎం.సి.ప్రొడక్షన్స్ పతాకంపై వి.దొరస్వామిరాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాదు.. ‘అన్నమయ్య’ జయంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా.. నాగార్జున పుట్టినరోజుకి (ఆగస్టు 29)కి శతదినోత్సవం జరుపుకోవడం విశేషం. 1997 మే 22న విడుదలై ఘనవిజయం సాధించిన ‘అన్నమయ్య’… నేటితో 23 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: