మరో శతాధిక చిత్ర దర్శక శిఖరం కూలిపోయింది. తన గురువు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు తరువాత శతాధిక చిత్ర దర్శకుడిగా పేరుపొందిన సుప్రసిద్ధ దర్శకుడు కోడి రామకృష్ణ ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ లో కనుమూశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న కోడి రామకృష్ణ ను 4 రోజుల క్రితం ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం విషమించడంతో నిన్నటి నుండి వెంటిలేటర్స్ పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో కోడి రామకృష్ణ, చనిపోయారని ప్రకటించారు వైద్యులు. ఈ వార్త తెలిసిన వెంటనే యావత్ చిత్రపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
సౌమ్యుడు, వివాదరహితుడు అయిన కోడి రామకృష్ణ 1982 లో చిరంజీవి హీరోగా నటించిన “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య” చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. అంతకుముందు దాసరి నారాయణరావు వద్ద పలు చిత్రాలకు అసిస్టెంట్ గా, అసోసియేట్ గా పని చేశారు కోడి రామకృష్ణ.
అత్యంత వేగవంతంగా సినిమాలను రూపొందించడం, నిర్మాత సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవడం, దర్శకుడిగా తన ఆత్మాభిమాన పతాకాన్ని ఎగుర వేస్తూ నే స్టార్స్ కు, స్టార్ డమ్ కు తగిన విలువ ఇస్తూ అటు టాప్ స్టార్స్ తోను, ఇటు నూతన నటీనటులతోను అద్భుత విజయాలను సాధించారు కోడి రామకృష్ణ. సామాజిక, కుటుంబ కథాంశాలతో జనరంజక చిత్రాలను రూపొందించడమే కాకుండా అమ్మోరు, దేవి, దేవుళ్ళు, దేవి పుత్రుడు, అంజి, అరుంధతి వంటి సోషియో ఫాంటసీ చిత్రాల ద్వారా అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు కోడి రామకృష్ణ.
నూతన నటీనటులను పరిచయం చేయడంలో కోడి రామకృష్ణ తన గురువు దాసరి నారాయణరావు లాగానే చాలా సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకునే వారు. తెలుగు చలనచిత్రరంగంలో ఒక ఎన్టీ రామారావు మినహా మిగిలిన టాప్ స్టార్స్ అందరినీ డైరెక్ట్ చేశారు కోడి రామకృష్ణ. దర్శకుడిగానే కాకుండా నటుడుగా కూడా కోడి రామకృష్ణ కొన్ని విశిష్ట పాత్రలు పోషించారు. దొంగాట, ఆస్తి మూరెడు ఆశ బారెడు, అత్తగారు స్వాగతం, ఇంటి దొంగ, మూడేళ్ళ ముచ్చట వంటి చిత్రాలలో కోడి రామకృష్ణ ప్రత్యేక తరహా పాత్రలు పోషించి మెప్పించారు. శతాధిక చిత్రాలకు దర్శకత్వం వహించడం ద్వారా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తోడ్పడిన నేపథ్యంలో కోడి రామకృష్ణ కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక “రఘుపతి వెంకయ్య అవార్డు”ను ప్రకటించింది. కానీ ఆ అవార్డును స్వీకరించకుండానే కోడి రామకృష్ణ కన్నుమూయటం దురదృష్టకరం.
ఆయనకు భార్య కోడి పద్మ, ఇద్దరు కుమార్తెలు దీపు, ప్రవల్లిక ఉన్నారు. ఆయన తమ్ముడు కోడి లక్ష్మణ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరున్న ఛాయాగ్రహకులు. ఆయన మరో సోదరుడు రామన్న ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవారు.
దర్శకుడిగా కోడి రామకృష్ణ విశిష్టత:
భారతదేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ భాషలోనూ ఏ దేశంలోనూ లేని విధంగా నలుగురు శతాధిక చిత్ర దర్శకులు కలిగిన ఘనత ఒక్క తెలుగువారికి మాత్రమే దక్కింది. అరుదైన ఈ ప్రతిష్ఠాత్మక ఘనతను సాధించిన వారిలో ప్రథముడు దర్శకరత్న డా. దాసరి నారాయణ రావు కాగా.. ఆయన తరువాత ఆయన శిష్య ప్రముఖుడు కోడి రామకృష్ణ ఈ రికార్డును అందుకున్నారు. ఆ తరువాత దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సీనియర్ డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్ శత సంఖ్యకు చేరుకున్నారు. 1982లో `ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య` అనే సంచలన విజయం ద్వారా దర్శకుడిగా పరిచయమైన కోడి రామకృష్ణ.. తన సుదీర్ఘ చలన చిత్ర జీవితాన్ని అద్భుత విజయాలతో సుసంపన్నం చేసుకున్నారు.
తన శతాధిక చిత్రాల జాబితాలో అత్యధిక శాతం అఖండ విజయాలుగా నిలిచిన చిత్రాలే ఉండడం విశేషం. తనతో పాటు తన కంటే ముందుగా దర్శకులైన వాళ్ళు సాధించలేని `శతచిత్ర ఘనత`ను కోడి రామకృష్ణ సాధించడానికి గల ప్రథమ కారణం.. ఆయన నిర్మాతల దర్శకుడు కావటమే. నిర్మాత సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే అగ్ర శ్రేణి చిత్ర నిర్మాణ సంస్థలు, నిర్మాతలు కోడి రామకృష్ణ డేట్స్ కోసం ఎదురుచూసేవారు. కథ-నిర్మాత-స్టార్.. ఇవీ కోడి రామకృష్ణ ప్రాధాన్యతాంశాలు. అవసరమైతే స్టార్స్‌ను తాను తయారుచేసుకున్నారు తప్ప.. తానెప్పుడూ స్టార్స్ వెనుక పరుగులు పెట్టిన సందర్భాలు కోడి రామకృష్ణ కెరీర్‌లో కనిపించవు. అలాగని స్టార్స్‌ను, స్టార్‌డమ్‌ను ఎప్పుడూ ఆయన నిర్లక్ష్యం చేయలేదు. స్టార్స్‌కు ఇచ్చే విలువను, గౌరవాన్ని ఇస్తూనే దర్శకుడిగా తనదైన పంథాను, వ్యక్తిత్వాన్ని నిలుపుకున్న అరుదైన దర్శకుడు కోడి రామకృష్ణ. అందుకే.. అటు స్టార్స్‌తోనూ, ఇటు నాన్ స్టార్స్‌తోనూ అద్భుత విజయాలను ఇవ్వగలిగారాయన. నాటి అగ్ర తారలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, అర్జున్, రాజశేఖర్, సుమన్ తదితరులకు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన కోడి రామకృష్ణ.. `తరంగిణి, అంకుశం, ఆహుతి, తలంబ్రాలు, భారత్ బంద్, అమ్మోరు, దేవి, దేవుళ్ళు, అరుంధతి` వంటి చిత్రాల దర్శకుడిగా తనలోని క్రియేటివ్ హైట్స్‌ను గొప్పగా ఆవిష్కరించుకోగలిగారు.
ఇక నూతన నటీనటులను పరిచయం చేసే విషయంలో కోడి రామకృష్ణ మొండి ధైర్యాన్ని మెచ్చుకుతీరాల్సిందే. రామిరెడ్డి, కాస్ట్యూమ్స్ కృష్ణ, బాబూ మోహన్, ముక్కా నరసింగరావు వంటి వాళ్ళను నటులుగా ప్రజెంట్ చేయడంలో కోడి రామకృష్ణ సహన సంయమనాలు అభినందనీయం. కొత్త నటీనటులకు అవకాశమివ్వటాన్ని గొప్ప శాక్రిఫైజ్‌గా ఫీలయ్యే కొంతమంది దర్శకులు ఈ విషయంలో కోడి రామకృష్ణను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే సెట్లో ఒక ఆర్టిస్ట్ రాలేదనో.. సెట్ ప్రాపర్టీస్ రాలేదనో.. మరేదైనా చిన్న కారణం వల్లనో.. తమ ఇగోలు ప్రదర్శిస్తూ షూటింగ్‌కు ప్యాకప్ చెప్పే ఇగోయిస్టిక్ డైరెక్టర్లు.. కోడి రామకృష్ణ సహనంలో సగం అలవర్చుకున్నా ఇండస్ట్రీ బాగుపడుతుంది.
ఇక వ్యక్తిత్వ విషయానికి వస్తే.. వివాదస్పదము విలాసమయము అయిన సినిమా అనే ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడూ ఎవరితో ఏ వివాదంలోనూ కోడి రామకృష్ణ పేరు వినిపించలేదు. విజయాలలో తప్ప వివాదాలలో తన పేరు, ప్రస్తావన రాకుండా తన గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ `శతచిత్ర సౌధం`గా ఎదిగిన కోడి రామకృష్ణ మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆ శతాధిక దర్శక శిఖరం ఆత్మశాంతిని ఆకాంక్షిస్తూంది `ద తెలుగు ఫిలింనగర్.కామ్`.
[youtube_video videoid=AfESksedsk8]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: