అక్కినేని వారి వరుడు- కొల్లిపర వారి వధువు- ఏడుపదుల నాటి ఏడడుగుల బంధం

70th Wedding Anniversary of ANR,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Wedding Anniversary of ANR,ANR 70th Wedding Anniversary Special,70th Wedding Anniversary of Akkineni Nageswara Rao
70th Wedding Anniversary of ANR

జనానికి సినిమాలు అంటే ఎంత ఇష్టమో… సినిమా వాళ్లు అంటే ఎంత మోజో చెప్పలేము.. కానీ సినిమా వాళ్లకు ఇల్లు అద్దెకు ఇవ్వాలన్నా, పెళ్లికి పిల్లని ఇవ్వాలన్నా అంతే బెరుకు. 1950కి ముందు తరంలో ఎక్కువ శాతం సినిమా వాళ్ళు సినిమా వాళ్లనే చేసుకునేవారు. ఇండస్ట్రీలోని మగవాళ్లకు బయటి సంబంధాలు దొరకాలి అంటే చాలా కష్టంగా ఉండేది. ఇక సినిమా ఇండస్ట్రీలోని ఆడవాళ్ళ సంగతి సరే సరి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అప్పట్లో సినిమా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ పెళ్లికి పిల్లను ఇవ్వటానికి మాత్రం ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు. ఎవరి సంగతో ఎందుకు అప్పటికే సూపర్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరరావుకు పిల్లను ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు. 1944లో ” సీతారామ జననం” చిత్రం ద్వారా హీరోగా పరిచయమై ఆ తరువాత వరుసగా ముగ్గురు మరాఠీలు, మాయాలోకం, పల్నాటి యుద్ధం, రత్నమాల, బాలరాజు చిత్రాలతో “ఫస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ టాలీవుడ్” గా ఎదిగారు అక్కినేని నాగేశ్వరరావు. అంత ఇమేజ్ వచ్చినప్పటికీ పెళ్లి చేసుకుందాం అంటే పిల్ల దొరకదాయే..! రెండు మూడు సంబంధాలు వచ్చినప్పటికీ చివరకు “సినిమా వాడు” అనేటప్పటికి పెదవి విరుపులతో అవి కాస్త చెడిపోయాయి. ఇలాంటి స్థితిలో ఏలూరు సమీపంలోని దెందులూరు గ్రామానికి చెందిన కొల్లిపర వెంకటనారాయణ – నాగభూషణమ్మల కుమార్తె అన్నపూర్ణతో అక్కినేని నాగేశ్వరరావు వివాహం ఖరారయింది. దీనికి కూడా వధువు తరపువారు తటపటాయిస్తుండగా వధువు అన్నపూర్ణ ” నేను చేసుకుంటాను” అని ధైర్యంగా ముందుకు రావటంతో 1949 ఫిబ్రవరి 18న అక్కినేని- అన్నపూర్ణల వివాహం ఘనంగా జరిగింది. అంటే కచ్చితంగా ఈ రోజుకు “అక్కినేని- అన్నపూర్ణ” ల వివాహ బంధానికి 70 ఏళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆ ఆదర్శ దంపతుల అనురాగ దాంపత్యాన్ని గుర్తు చేసుకుంటూ కొన్ని ముచ్చట్లు.

అప్పటి తెలుగు చలనచిత్రరంగ ప్రముఖులు చాలామంది ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. పెళ్లి జరిగిన మరుసటి రోజునే అంటే ఫిబ్రవరి 19- 1949న “కీలుగుఱ్ఱం” విడుదలై అద్భుత విజయాన్ని సాధించింది. అందరూ కొత్త కోడలు అడుగు పెట్టిన వేళా విశేషం అని అభినందించారు. అదే సంవత్సరం చివరిలో కూడా అక్టోబర్ 1వ తేదీన” లైలా మజ్ను” విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ రెండింటికీ మధ్య లో విడుదలైన” రక్ష రేఖ” యావరేజ్ గా ఆడింది. ఇలా పెళ్లి అయిన ఒకే సంవత్సరంలో రెండు సూపర్ హిట్స్ రావడంతో పాటూ అంతకుముందు పల్నాటి యుద్ధం, రత్నమాల, బాలరాజు చిత్రాల హ్యాట్రిక్ విజయాలతో గొప్ప స్టార్ డమ్ సాధించారు అక్కినేని నాగేశ్వరరావు.

ఇలా పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా వరుస విజయాలు సాధించడంతో అక్కినేని జీవితంలోకి అన్నపూర్ణమ్మ ప్రవేశాన్ని గొప్ప శుభసూచకంగా భావించారందరు. నిజానికి ఇది ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ అయినప్పటికీ ఆ సెంటిమెంట్ వారిద్దరి సుదీర్ఘ వైవాహిక జీవితం తుదిదాకా కొనసాగింది.

దేవున్నే నమ్మని అక్కినేనికి అన్నపూర్ణ రూపంలో అదృష్టం కలిసి వచ్చిందని అప్పట్లో అందరూ అనుకునేవారు. “ఈ నమ్మకాల సంగతేమోగానీ నా జీవితంలోకి అన్నపూర్ణ ప్రవేశం ఒక గొప్ప మలుపు” అనేవారు అక్కినేని.

1924 సెప్టెంబర్ 20న పుట్టిన అక్కినేని నాగేశ్వరరావుకు పెళ్లయ్యేనాటికి 27 సంవత్సరాలు.1933 ఆగస్టు 14న పుట్టిన అన్నపూర్ణమ్మకు పెళ్లయ్యేనాటికి 17 సంవత్సరాలు. 2011 డిసెంబర్ 28 న అన్నపూర్ణమ్మ చనిపోయారు.అంటే 62 సంవత్సరాల సుదీర్ఘ వైవాహిక బంధం వారిది. అన్నపూర్ణమ్మ చనిపోయిన తరువాత కచ్చితంగా 2 సంవత్సరాల 25 రోజులకు జనవరి 22 , 2014 న అక్కినేని నాగేశ్వరరావు పరమపదించారు. వయసు రీత్యా నాగేశ్వరరావు కంటే అన్నపూర్ణమ్మ పది సంవత్సరాలు చిన్నవారే అయినప్పటికీ వార్ధక్య భారం ముందుగా అన్నపూర్ణమ్మనే కమ్మేసింది. చివరి రోజుల్లో అన్నపూర్ణమ్మ మంచాన పడినప్పుడు అక్కినేని నాగేశ్వరరావు ఆమెను అపురూపంగా చూసుకునేవారు. నర్సులు, పనివాళ్లు ఎంత మంది ఉన్నప్పటికీ నాగేశ్వరరావు ఒక “male nurse” లాగా అన్నపూర్ణమ్మకు సేవలు చేసేవారు. నట జీవితంలో 70 మందికిపైగా కథానాయికల కలల నాయకుడిగా నటించిన అక్కినేని నిజ జీవిత నాయికకు మాత్రం గొప్ప ప్రాధాన్యతను, గౌరవాన్ని, సముచిత స్థానాన్ని ఇచ్చారు.

‘ఆయన’ ‘ఆమె’ కు ఇచ్చిన స్థాన విశిష్టతకు ” అన్నపూర్ణ పల్వరైజింగ్ మిల్స్, అన్నపూర్ణ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, అన్నపూర్ణ స్టూడియో, అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల ఆవిర్భావ, వికాసమే నిదర్శనం. ” మన జంట జంటలకే కన్ను కుట్టు కావాలి.. ఇంక వంటరిగా ఉన్న వాళ్లు జంటలై పోవాలి” – అని దసరాబుల్లోడు సినిమాలో కథానాయిక అలాపనలా కన్ను కుట్టుగా సాగిన అక్కినేని- అన్నపూర్ణల 70వ వివాహ దినోత్సవ సందర్భంగా ఇది ఓ చిన్న అక్షర స్మరణ… సంస్మరణ.

[subscribe]

[youtube_video videoid=VS5kEOGsH6E]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − seven =