హీరోగా కెరీర్ ప్రారంభించాక రెండవ చిత్రానికే ఫిలిం ఇండస్ట్రీకి ఒక సరికొత్త రికార్డును సెట్ చేసాడు రామ్ చరణ్. ఇది ఏ వారసత్వ హీరోకు దక్కని అరుదైన అదృష్టం. ఇది వ్యక్తిగతంగా తనకు మాత్రమే కాదు… తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక ప్రతిష్టాత్మక విశేషమనే చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో చాలామంది అగ్ర తారలు తమ కుమారులను హీరోలుగా పరిచయం చేసినప్పటికీ రెండవ సినిమాకే రికార్డులు బద్దలు కొట్టిన దాఖలాలు లేవు. ఆ ఘనత కుమారుడు రామ్ చరణ్ ద్వారా దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తొలి చిత్రం “చిరుత ” లోనే స్టన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ రెండవ చిత్రం “మగధీర” లోనే నటన పరంగా అంత ఇంప్రూవ్ అవుతాడని ఎవరూ ఊహించలేదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాధారణంగా వారసత్వ హీరోలను పరిచయం చేస్తున్నప్పుడే అతణ్ణి ఎస్టాబ్లిష్ చేయాలి అంటే కనీసం మూడు నాలుగు సినిమాల వరకు “రిస్క్ బేరింగ్” తప్పదు అనే మైండ్ సెట్ తో ప్రిపేర్డ్ గా ఉంటారు. కానీ రామ్ చరణ్ ను హీరోగా పరిచయం చేయటానికి గాని, హీరోగా ఎస్టాబ్లిష్ చేయడానికి గాని తండ్రిగా చిరంజీవి చేసింది ఏమీ లేదు. “చిరంజీవి కొడుకు” అనే ఒక టాగ్ లైన్ తప్ప నిజానికి చిరంజీవి రామ్ చరణ్ కు ఇచ్చింది ఇంకేమీ లేదు. అయితే ఆ ట్యాగ్ లైన్ ఒక్కటే నాకు చాలు అంటూ…కోట్ల విలువ చేసే ఆ ట్యాగ్ లైన్ తో జనాన్ని , జగాన్ని జయించగలనని ప్రూవ్ చేశాడు ఈ మెగా వారసుడు.
ఈ నేపథ్యంలో గమనార్హమైన విశేషం ఒకటుంది. అదేమిటో చూద్దాం.
చిరు పాత్రలతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగిన వైనం అందరికీ తెలిసిందే. దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ప్రతి అవకాశాన్ని ఒక ఆలంబనగా మలుచుకుంటూ చిరంజీవి అత్యున్నత శిఖరాలకు ఎదిగిన పరిణామ క్రమం ఏమిటో ప్రతి ఒక్కరికీ తెలుసు. దర్శక నిర్మాతల పట్ల భయభక్తులతో ప్రవర్తిస్తూ ఒక్కో మెట్టుగా అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు చిరంజీవి. అట్టడుగు స్థాయి నుండి అష్టైశ్వర్యాల స్థాయికి ఎదిగారు కాబట్టే చిరంజీవిలో గర్వం మచ్చుకైనా కనిపించదు. అలా నిగర్విగా నాలుగు దశాబ్దాల ప్రస్థానాన్ని కొనసాగించిన చిరంజీవికి ఈమధ్యనే ‘గర్వం’ ఎక్కువయింది అనే టాక్ వినిపిస్తుంది.నిజమే… తెలుగు చలన చిత్రరంగంలో అంచెలంచెలుగా ఎదిగి నిగర్విగా గుర్తింపు పొందిన చిరంజీవిలో ఇంత గర్వం పెరగటానికి కారణం ఏమిటి?.. కారకుడు ఎవరు ? అని వాకబు చేస్తే అందుకు కారకుడు, ప్రేరకుడు రామ్ చరణ్ అని తేలింది.
నిజమే…. ఎంత అణచుకున్నా అణచుకోలేనివి పుత్రోత్సాహము… పుత్రోత్సాహ జనితమైన గర్వం. ఏమీ సాధించలేని కొడుకులను చూసుకుని ఎగిరిపడే తండ్రులున్న ఈ లోకంలో రామ్ చరణ్ లాంటి సుపుత్రుడిని కన్న చిరంజీవిలో కించిత్ గర్వం తొంగి చూస్తే తప్పేంటి? అందుకే కొడుకు విజయాలను చూసుకొని మురిసిపోయే తండ్రిలో ఉండే సహజసిద్ధమైన గర్వమే చిరంజీవి లోనూ తొంగిచూస్తుంది. ఇది నిజంగా అభిలషణీయమైన గర్వం. అలాంటి గర్వాన్ని తండ్రికి తన వంతు కానుకగా ఇస్తున్న రామ్ చరణ్ ను చూస్తే గర్వం కూడా సగర్వంగా ఫీల్ అవుతుంది.
మార్చి 27 ఈ మెగా వారసుడి బర్త్ డే. ఈ సందర్భంగా రాసే ప్రత్యేక వ్యాసంలో రామ్ చరణ్ నటించిన సినిమాల లిస్టు ను, ఆయనకు వచ్చిన అవార్డుల జాబితాను తిప్పితిప్పి తిరగరాసే బదులు రామ్ చరణ్ వ్యక్తిత్వంలోని మానవతా కోణాన్ని విశ్లేషణాత్మకంగా విశ్లేషించుకుంటే అందమైన అతని వ్యక్తిత్వం ఆవిష్కృతమవుతుంది.
ఇంతకూ అంతగా విశ్లేషించవలసిన విశేషాలు రామ్ చరణ్ వ్యక్తిత్వంలో ఏమున్నాయి? అనే కోణంలో విశ్లేషిస్తే నిజంగా రామ్ చరణ్ ఒక అరుదైన వ్యక్తి అని అంగీకరిస్తారు ఎవరైనా.
ఒక మెగాస్టార్ కొడుకు, తనకు తానుగా మెగా పవర్ స్టార్ గా ఎదిగిన వారసుడు అయిన రామ్ చరణ్ లో గొప్ప మానవీయ కోణం ఉందన్న వాస్తవం చాలామందికి తెలియదు. మాట,మంచితనం, ఇతరుల కష్టసుఖాల గురించి ఆలోచించటం వంటి సత్ లక్షణాల సమాహారం రామ్ చరణ్ అని అతను పని చేసిన యూనిట్ లో ప్రతి ఒక్కరూ చెప్తారు. జగపతి బాబు లాంటి ఒక సీనియర్ యాక్టర్ “సైరా నరసింహారెడ్డి” చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆ చిత్ర నిర్మాత గా రామ్ చరణ్ నిర్మాణ దక్షతను, మంచితనాన్ని, మానవీయతను గురించి ప్రత్యేకంగా ప్రశంసించిన తీరు రామ్ చరణ్ నిండైన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది.
నిజానికి వృత్తిపరమైన ప్రతిభలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటాయి. ఒక చిత్రకారుడు గొప్పగా బొమ్మలు గీస్తాడు… ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక చాకలి, ఒక మంగలి – ఇలా ఎవరి వృత్తిలో వాళ్లు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. అలాగే గొప్పగా నటించటం నటీనటుల వృత్తి ధర్మం. అలాంటి వృత్తి ధర్మంలో గొప్పగా రాణించడంలో గొప్పేమీ లేదు. అయితే వృత్తి పరంగా ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినప్పటికీ మంచితనంలో మానవతా కోణంలో ఎవరు ఏమిటి అన్నదే వ్యక్తుల వ్యక్తిత్వానికి కొలమానంగా నిలుస్తుంది. ఈ కోణంలో విశ్లేషిస్తే 2007లో విడుదలైన తన తొలి చిత్రం ‘చిరుత’ మొదలు ఇప్పుడు నిర్మాణంలో ఉన్న “త్రిబుల్ ఆర్” వరకు సాగిన ఈ పుష్కర కాల ప్రస్థానంలో రామ్ చరణ్ మాట, మంచితనం, పద్ధతి గురించి మంచిగానే తప్ప నెగిటివ్ గా ఒక చిన్నమాట కూడా విన్న సందర్భం లేదు. అది క్యారెక్టర్ అంటే…. అది వ్యక్తిత్వం అంటే… ఎన్ని మగధీర లు, ఎన్ని రంగస్థలాలు వచ్చి ఎన్ని రికార్డులను బద్దలు కొట్టినప్పటికీ అవి శాశ్వతం కావు…. శాశ్వతమైనవి మాట, మంచితనం, మానవత్వం.
ఈ మూడింటిని తన వ్యక్తిత్వంలో నింపుకొని నటుడిగా కంటే మనిషిగా మహోన్నత శిఖరాల వైపు రామ్ చరణ్ ప్రస్తానం కొనసాగుతుందని ఆశిస్తూ, అభిలషిస్తూ, అభినందిస్తూ జన్మదిన శుభాభినందనలు పలుకుతుంది దతెలుగుఫిలింనగర్.కామ్.
[youtube_video videoid=e2ELtkhyMCw]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: