టాలీవుడ్ టాప్ సింగర్ సునీత తనయుడు ఆకాష్ హీరోగా గంగనమోని శేఖర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా సర్కారు నౌకరి. 1996 లో కొల్లాపూర్ లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈసినిమాను తెరకెక్కించారు మేకర్స్. మరి ఈసినిమా ఎలా ఉంది అనేది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. రోషన్, భావనా వళపండల్, తనికెళ్ల భరణి, సూర్య, సాయి శ్రీనివాస్ వడ్లమాని, మణిచందన, రాజేశ్వరి ముళ్లపూడి, రమ్య పొందూరి, త్రినాథ్
దర్శకత్వం.. గంగనమోని శేఖర్
బ్యానర్స్.. ఆర్.కె టెలీ షో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్
నిర్మాత..కే. రాఘవేంద్రరావు
సంగీతం.. శాండిల్య
సినిమాటోగ్రఫి.. గంగనమోని శేఖర్
కథ
గోపాల్(ఆకాష్ గోపరాజు) కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాడు. ఇక ప్రభుత్వ ఉద్యోగం కావడంతో సత్య(భవన)ని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత అతడికి ప్రమోషన్ వస్తుంది. ప్రమోషన్ మీద మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ గ్రామానికి వెళ్తాడు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కావటంతో గ్రామస్తులు అతడ్ని గౌవరిస్తూ ఉంటారు. అప్పట్లో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా అధికారులు గోపాల్‌కు కండోమ్స్ పంచే పనిని అప్పగిస్తారు. రోజులు గడిచే కొద్ది జనాలకు గోపాల్ మీద ఉన్న గౌరవం పోతుంది. గోపాల్‌ని చాలా చులకనగా చూస్తారు. చివరికి వారిని ఊరి జనం అంటరాని వాళ్లుగా పరిగణిస్తుంటారు. ఇది తట్టుకోలేక భార్య గోపాల్ ని వదిలి పుట్టింటికి వెళ్లిపోతుంది. మరోవైపు ఊర్లో ఎయిడ్స్ వచ్చి వరుసగా చనిపోతుంటారు. అందులో గోపాల్ ఫ్రెండ్ శివ కూడా ఉంటాడు. ఇలా వరుసగా ఎయిడ్స్ తో మరణిస్తుండటం, మరోవైపు ఊర్లో అందరు తనని అవమానించడం జరుగుతుంది. మరి దాన్ని గోపాల్ ఎలా ఎదుర్కొన్నాడు..? వారిలో అవగాహన పెంచేందుకు ఏం చేశాడు? తనని వదిలిపెట్టిన భార్య తిరిగి వచ్చిందా? అనేది `సర్కారు నౌకరి` మిగిలిన కథ.
విశ్లేషణ
సినీ ఇండస్ట్రీలో వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. ఎంతోమంది వారసులు ఇప్పటికే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడు తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చేశాడు ఆకాష్. ఇక మొదటి సినిమాతోనేే డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చాడని చెప్పొచ్చు. ఎలాంటి కమర్షియల్ హంగులకు, హడావుడికి వెళ్లకుండా కూల్ క్యారెక్టర్ తో వచ్చాడు.
నిజానికి ఇప్పుడు ఆడియన్స్ సినిమాను చూసే విధానం మారిపోయింది. కథలో కంటెంట్ ఉంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని చూడటంలేదు. ఈనేపథ్యంలోనే ఈసినిమా కూడా కంటెంట్ బేస్డ్ సినిమానే అని వచ్చిన అప్ డేట్లను బట్టి అర్థమయిపోయింది. ఈసినిమాలో తీసుకున్న పాయింట్ చాలా తక్కువ సినిమాల్లోనే వచ్చిందని చెప్పొచ్చు. అప్పట్లో ఎయిడ్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆకాలంలో ప్రజలకు దానిపై పెద్దగా అవగాహన లేకపోవడంతో చాలామంది మృత్యువాత పడ్డారు. ఇదే పాయింట్ ను ఎంచుకొని.. ఆ కథను ముందుకు తీసుకెళ్లటంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ఎలాగోలా తీయొచ్చు. హీరోయిజం చూపించి నాలుగు ఫైట్లు.. పాటలు ఉంటే సరిపోతుంది. కానీ మెసేజ్ ఒరియెంటెడ్ సినిమాలు తీయడం అంటే కత్తిమీద సాము లాంటిదే. కథతో, పాత్రలతోనే సినిమా అంతా నడవాలి.. అందులోనూ ఎలాంటి హడావుడి లేకుండా ఉండాలి.. మొదటి నుండీ ఎండింగ్ వరకూ సినిమాను ఎంగేంజింగ్ గా చూపించాలి. ఈ విషయంలో శేఖర్ కు ఫుల్ మార్కులు పడతాయి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా ఎంగేజ్ చేయగలిగాడు.
ఓ మంచి సందేశాన్ని కామెడీతో పాటు భావోద్వేగాలతో చెప్పడంలో శేఖర్ ప్రయత్నం ఫలించింది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా సాగుతుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. ఎయిడ్స్ ప్రభావం పెరగడం, వరుసగా మరణాలు సంభవించడం, మరోవైపు ఆ ఉద్యోగం మానేయాలని గోపాల్ భార్య సత్య ఒత్తిడి చేయడం, తన గర్భం తీయించుకుంటానని చెప్పడం, తీరా ఆయన్ని వదిలి పుట్టింటికి వెళ్లిపోవడం.. తన ఫ్రెండ్ శివ, మరదలు గంగ కూడా చనిపోవడం వంటివి చాలా ఎమోషనల్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్ కూడా ఆకట్టుకుంటుంది.
పెర్ఫామెన్స్
మొదటి సినిమాతోనే ఆకాష్ తన నటనతో మెప్పించాడని చెప్పొచ్చు. గోపాల్ పాత్రలో చాలా సెటిల్డ్ గా నటించాడు. అనుభవం ఉన్న నటుడిలాగే చేశాడు. సత్య పాత్రలో భావన బాగా చేసింది. సహజంగా కనిపించింది. గోపాల్ స్నేహితుడిగా శివ పాత్రలో మహదేవ్ మెప్పించాడు. ఆయన మరదలిగా గంగ పాత్రలో మధు లత అలరించింది. సర్పంచ్ గా తనికెళ్ళ భరణి మరోసారి తన అనుభవం చూపించారు. ఇక మిగిలిన పాత్రల్లో నటించిన రమ్య పొందూరి, మణి చందన, సమ్మెట గాంధీ, సత్య సాయిశ్రీనివాస్ తమ పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక విభాగం
ఈసినిమాకు సాంకేతిక విభాగం కూడా ప్రధానబలంగా నిలిచింది. దర్శకుడు గంగనమోని శేఖరే కెమెరా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక శేఖర్ అందించిన సినిమాటోగ్రఫి చాలా బాగుంది. ఆ కాలానికి తగ్గట్టు గా విజువల్స్ ను బాగా చూపించారు. శాండిల్య అందించిన సంగీతం కూడా సినిమాకు చాలా ప్లస్ అయింది. ఎడిటింగ్ కూడా బాగుంది. రన్ టైమ్ ఎక్కువ లేకుండా చూసుకోవడం కూడా ఈసినిమాకు కలిసొచ్చింది. లెంగ్త్ మరీ ఎక్కువగా ఉన్నా ల్యాగ్ అయిన ఫీలింగ్ వస్తుంది. అది జరగకుండా కరెక్ట్ గా ట్రిమ్ చేశారు. రాఘవేంద్రరావు నిర్మాత కాబట్టి ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. నిర్మాణ విలువులు బాగున్నాయి.
ఓవరాల్ గా చెప్పాలంటే సర్కారు నౌకరి ఒక మంచి సందేశాత్మక సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగి పోయిన రోజులు.. సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్న రోజులు కాబట్టి ఏ విషయం అయినా నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. కానీ అప్పట్లో ఎలాంటి సోషల్ మీడియా లేదు. ఆరోజుల్లో ప్రజలకు అవగాహన కల్పించడం అంటే మాములు విషయం కాదు. అలాంటి విషయాలను అప్పుడప్పుడు ఇలా సినిమాల ద్వారా చూపిస్తే కాస్త ఆలోచిస్తారు. అలాంటి ప్రయత్నమే ఈసినిమా. ఈసినిమాను అన్ని వర్గాల వారు ఒకసారి చూసి ఎంజాయ్ చేయొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: