మత్తు వదలరా మూవీ రివ్యూ

Mathu Vadalara Movie Review

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయులు వెండి తెరకు పరిచయం అవుతూ వస్తున్న న్యూ ఏజ్ మూవీ ‘మత్తు వదలరా’. రితేష్ రానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ద్వారా హీరోగా సింహ, మ్యూజిక్ డైరెక్టర్ గా కాలభైరవ పరిచయం అవుతున్నారు. ఇక పోస్టర్ల దగ్గరనుండి టీజర్,ట్రయిలర్ తో ఈ సినిమాతో మంచి అంచనాలను పెంచేసింది. మరి ఈ సినిమా ఎలా వుంది. కీరవాణి తనయులు సక్సెస్ అయ్యారా?లేదా? విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

నటీనటులు: శ్రీ సింహా కోడూరి, సత్య, నరేష్ అగస్త్య, అతుల్య చంద్ర, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ..
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాత: చిరంజీవి, హేమలత
సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం
మ్యూజిక్: కాల భైరవ

కథ:

బాబు మోహన్ (శ్రీ సింహా), అభి (నరేష్ అగస్త్య), ఏసుదాస్ (సత్య) రూమ్ మేట్స్. బాబు మోహన్, ఏసుదాస్ కొరియర్ బాయ్స్ గా పనిచేస్తుంటారు. నెల మొత్తం కష్టపడి పనిచేసినా నాలుగైదు వేలు కంటే ఎక్కువ సంపాదించలేకపోవడంతో ఉద్యోగానికి బై చెప్పి తన ఊరు వెళ్లిపోదామనుకుంటాడు. ఈ క్రమంలో ఒకరోజు ఏసుదాస్ ఇచ్చిన ఒక ఐడియా విని అది ఫాలో అవుతాడు బాబు. ఈ ప్రయత్నంలో భాగంగా ఆర్డర్ ఇవ్వడానికి ఒక అపార్ట్‌మెంట్‌కి వెళ్లి అక్కడ క్రైమ్‌లో ఇరుక్కుంటాడు. దానివల్ల అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. దాని నుంచి బయిటపడేందుకు బాబు ప్రయత్నాలు మొదలెడతాడు. ఈ ప్రాసెస్ లో రకరకాల ట్విస్ట్ లు, టర్న్ లు ఎదురవుతాయి.అసలు తనను ఇలా మర్డర్ కేసులో ఇరికించింది ఎవరు..?అసలు ఆ హత్యలు చేసింది ఎవరు? అసలు నిందితులు ఎవరు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
థ్రిల్లర్ సినెమాలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఏ ఉంటుంది. కథలో పట్టు, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుడిని కుర్చోపెడితే చాలు సినిమా హిట్ అయినట్టే. ఇక ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగింది. డైరెక్టర్ రితేష్ రానా తీసుకున్నది చిన్న పాయింట్ ఆ అయినా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. కొత్త దర్శకుడైనా ఆ తడబాటు ఎక్కడా కనపడకుండా రెండు గంటలు సేపు,ఏ విధమైన కమర్షియల్ హడావిడి లేకుండా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగాడు. లీడ్ క్యారెక్టర్స్ అనుకోకుండా ఒక క్రైమ్‌లో ఇరుక్కుపోవడం అనే బేస్ పాయింట్‌తో చక్కని కథను అల్లుకున్నాడు దర్శకుడు. తరువాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో మొదటి ప్రయత్నంలోనే సూపర్ అనిపించాడు.

ఇక ఈ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమైన కీరవాణి కొడుకు శ్రీ సింహా కొత్త వాడే అయినప్పటికీ బాగానే చేసాడు. అక్కడక్కడా కొత్త నటుడు అనే ఫీలింగ్ కలిగినప్పటికీ కన్ఫ్యూజన్ లో ఉన్న పాత్రకు అతను న్యాయం చేశాడు. మరో హీరో నరేష్ అగస్త్య కూడా పర్వాలేదనిపించాడు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కమెడియన్ సత్య గురించి. తనదైన శైలిలో కామెడీ పండించాడు. తన వన్ లైనర్స్ భలేగా వర్కౌట్ అయ్యాయి. చాలా కాలం తర్వాత సత్యకు మళ్ళీ అదిరిపోయే రోల్ పడింది. తన కామెడీతో ఈ సినిమాకి ఊపిరి పోసాడు. హీరో కాంబినేషన్ సీన్లు.. క్లైమాక్స్‌లో వచ్చే సీన్లలో.. సీరియస్ కథలోనూ ఫుల్ ఫన్ నింపాడు. ఇక మిగిలిన నటులైన బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, పావలా శ్యామల తమ పరిధి మేరకు చేసుకుంటూ వెళ్లిపోయారు.

సాంకేతిక విభాగానికి వస్తే కాల భైరవ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇరగదీసాడు. చాలా ట్రెండీ ఔట్పుట్ ఇచ్చాడు. గుడ్లగూబ సౌండ్ ను చాలా ఎఫెక్టివ్ గా వాడాడు. తొలి చిత్రంతోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. సిచ్యూవేషన్‌కు తగ్గట్టుగా బ్యాగ్రౌండ్‌లో వేరియేషన్స్ చూపిస్తూ కొత్త తరహా మ్యూజిక్ అందించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. తక్కువ బడ్జెట్‌లో కథకు ఏం కావాలో అది ఇచ్చారు నిర్మాత. సురేష్ సారంగం కెమెరా ప‌నిత‌నం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది.

ఓవరాల్ గా చెప్పాలంటే మొదటి సినిమాతోనే కీరవాణి తనయులు సూపర్ అనిపించారు. ఓ కొత్త తరహా అనుభూతిని పొందాలంటే మాత్రం మత్తు వదలరా సినిమాను చూడాల్సిందే.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here