రివ్యూ: అప్పుడో ఇప్పుడో ఎప్పుడో

Appudo Ippudo Eppudo Movie Review in Telugu

నటీనటులు: నిఖిల్, రుక్మిణి వ‌సంత్‌, దివ్యాంశ కౌశిక్, సత్య, సుదర్శన్, హ‌ర్ష చెముడు తదితరులు
సంగీతం: కార్తీక్, సన్నీ ఎంఆర్
సినిమాటోగ్ర‌ఫీ: రిచర్డ్ ప్ర‌సాద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాణం: శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి బ్యాన‌ర్‌
సమర్పణ: బాపినీడు.బి
నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్
దర్శకత్వం: సుధీర్ వ‌ర్మ

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. ద‌స‌రా సంద‌ర్భంగా రిలీజ్ చేసిన టీజ‌ర్‌కి, రీసెంట్‌గా విడుద‌ల చేసిన మూవీ ఫ‌స్ట్ లుక్‌ మరియు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్వామి రారా, కేశవ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ త‌ర్వాత నిఖిల్-సుధీర్ వ‌ర్మ కాంబోలో వస్తోన్న సినిమా కావ‌డంతో దీనిపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి.

ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ మూవీతో నిఖిల్-సుధీర్ వ‌ర్మ కాంబోలో హ్యాట్రిక్ కొట్టారా? పాన్ ఇండియా లెవెల్లో పేరు తెచ్చుకున్న నిఖిల్ ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాడా? యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

కథ:

హైదరాబాద్‌కు చెందిన యువకుడు రిషి (నిఖిల్). మంచి రేసర్ కావాలనేది అతడి యాంబిషన్. ఒకసారి తార (రుక్మిణీ వసంత్)ను చూసి ప్రేమలో పడతాడు. అయితే ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని పొరపడతాడు. దీంతో తన లక్ష్యం సాధించడం కోసం లండన్ వెళతాడు. ఒకవైపు ట్రైనింగ్ తీసుకుంటూ మరోవైపు పార్ట్ టైమ్ జాబ్ చేస్తుంటాడు. అక్కడ తులసి (దివ్యాంశ్ కౌశిక్) పరిచయమవుతుంది.

ఈ క్రమంలో వీరు ప్రేమించుకుని పెళ్ళికి సిద్ధమవుతారు. అందుకోసం గుడికి వెళ్లగా అక్కడ తులసి మాయం అవుతుంది. దీంతో తులసిని వెతికే క్రమంలో రిషికి అనేక విషయాలు తెలుస్తాయి. ఇదే సమయంలో లండన్ వెళ్లిన రెండేళ్లకు అనుకోకుండా తార అతనికి మళ్లీ కనపడుతుంది. అదే సమయంలో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని కూడా తెలుస్తుంది.

మరోవైపు లండన్ లోని లోకల్ డాన్ బద్రి నారాయణ (జాన్ విజయ్) మనుషులు వచ్చి రిషి, అతని స్నేహితుడు యాజీ అలియాస్ బాలాజీ (హర్ష చెముడు)ని ఎత్తుకెళ్తారు. అయితే వారిని బద్రి నారాయణ ఎందుకు కిడ్నాప్ చేయించాడు? రిషి, బాలాజీ అక్కడనుంచి తప్పించుకుని తమ ప్రాణాలు కాపాడుకున్నారా? మున్నా (అజయ్) ఎవరు? చుంబన ఎవరు? అసలు రిషి ఇంట్లో హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఇంతకూ తార, తులసి ఇద్దరిలో రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది మిగతా కథ.

విశ్లేషణ:

కథగా చెప్పాలంటే, ఇదొక రొటీన్ లవ్ అండ్ యాక్షన్ స్టోరీ. థ్రిల్లింగ్ అంశాలతో మొదలైన ఈ సినిమా ఆ తర్వాత లవ్ స్టోరీగా టర్న్ తీసుకుంటుంది. అనంతరం ముక్కోణపు ప్రేమ కథ తరహాలో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చి, చివరకు క్రైమ్ డ్రామాగా ముగుస్తుంది. అయితే దర్శకుడు దీనికి ఫారెన్ నేపథ్యం ఎంచుకోవడంతో సినిమా కొంచెం ఆసక్తికరంగా మారింది.

ఇటీవల నిఖిల్ ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తున్నాడు. కానీ ఈ సినిమా మాత్రం అందుకు భిన్నంగా రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల ఫార్మాట్‌లో సాగడం విశేషం. అయితే నిఖిల్ బాడీ లాంగ్వేజ్‌కి సరిగ్గా సరిపోయే కథ ఇదని చెప్పొచ్చు. వాస్తవానికి ఇది కరోనా పాండమిక్, లాక్ డౌన్ సమయంలోనిది. అందుకే అప్పటి చిత్రాల తరహాలో ఉంటుంది.

స్టార్ కమెడియన్ సత్య, మరో హాస్యనటుడు సుదర్శన్‌ కలిసి ఓ దొంగతనం ప్లాన్ చేయడంతో ఈ సినిమా మొదలు అవుతుంది. దీని తర్వాత హీరో నిఖిల్ గురించి సత్య చెప్పే ఫ్లాష్ బ్యాక్‌తో కథ ఊపందుకుంటుంది. నిఖిల్-రుక్మిణీ వసంత్, అలాగే నిఖిల్-దివ్యాంశ కౌశిక్ మధ్య వచ్చే లవ్ ట్రాక్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. ఇక మధ్య మధ్యలో సత్య, సుదర్శన్ కామెడీ నవ్వులు పూయిస్తుంది.

ఇలా ఫస్ట్ హాఫ్ ఎంట‌ర్‌టైనింగ్‌గా సాగుతుంది. ఇక నిఖిల్, రుక్మిణీ వసంత్ ఒక్కటవుతారు అనుకునే సమయంలో దివ్యాంశ కౌశిక్ ఎంట్రీతో మొత్తం మారిపోతుంది. అక్కడినుంచి కథ సీరియస్ మోడ్ లోకి వస్తుంది. ఈ క్రమంలో లండన్ సిటీలో ప్రైమ్ లొకేషన్లలో వచ్చే ఛేజ్ సీక్వెన్స్ ప్రేక్షకులకు థ్రిల్ పంచుతుంది.

ఇలాంటి సన్నివేశాలలో సుధీర్ వ‌ర్మ ఎక్స్‌పర్ట్ అన్న సంగతి తెలిసిందే. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్ మీద క్యూరియాసిటీ పెంచుతుంది. దీంతో సెకండాఫ్‌ కథాపరంగా ఆసక్తిగా కొనసాగుతుంది. అక్కడక్కడా జరుగబోయే సన్నివేశాలను ప్రేక్షకుడు ముందుగానే అంచనావేసేలా ఉంది. ఇదే క్రమంలో క్లైమాక్స్ ఆడియెన్స్ ఊహలకు తగ్గట్టే ఉంటుంది.

ఇక నటీనటుల విషయానికొస్తే, హీరోగా నిఖిల్‌పై ప్రేక్షకుల్లో ఇప్పటికే ఒక పాజిటివ్ ఫీల్ ఉంది. దీనికి ముఖ్య కారణం ఇప్పటివరకూ అతను చేసిన సినిమాలే. యాక్టింగ్‌లో ఈజ్‌తో పాటు తనకి సూటయ్యే కథలను ఎంచుకోవడం నిఖిల్ స్టైల్. ఇదేకోవలో తాజాగా ఈ సినిమా కూడా అతని టేస్ట్ ఏంటో మరోసారి చూపించింది. లవర్ బాయ్‌గా మెప్పించిన నిఖిల్, యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్లలోనూ తనదైన నటనతో మెప్పించాడు.

హీరోయిన్ కన్నడ భామ రుక్మిణి వ‌సంత్‌కి తెలుగులో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. సినిమాలో ఆమెకు మంచి ప్రాధాన్యమున్న పాత్రే లభించిందని చెప్పొచ్చు. తెరపై ఆమె అందంగా కనిపించింది. మరో నాయిక దివ్యాంశ కౌశిక్ కూడా పర్వాలేదనిపించే క్యారక్టర్‌లో కనిపించింది. ఇటీవలికాలంలో ఫుల్ ఫామ్‌లో ఉన్న సత్య మరోసారి తన కామెడీతో ఆడియెన్స్‌కి కితకితలు పెట్టాడు. అలాగే సుదర్శన్, హ‌ర్ష చెముడు తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు.

ఇక టెక్నికల్ విషయానికొస్తే, ఈ చిత్రం హై స్టాండర్డ్స్‌లో రూపొందింది. సింగర్ కార్తీక్ పాటలకు అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే సన్నీ ఎంఆర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా సన్నివేశాలని ఎలివేట్ చేసింది. రిచర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి, లొకేషన్స్ బావున్నాయి. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ ఎప్పటిలాగే షార్ప్‌గా ఉండి మూవీ ఎంగేజ్ చేసేలా ఉంది. అలాగే నిర్మాణ విలువలు చాలా రిచ్‌గా ఉన్నాయి. మేకర్స్ ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.

ఓవరాల్‌గా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఆడియెన్స్‌కి ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్‌లో వుంటూనే డిఫరెంట్ ప్రజెంటేషన్‌తో సాగుతుంది. ముఖ్యంగా యూత్ ఈ మూవీని లైక్ చేస్తారు. వారికి కావాల్సిన లవ్ అండ్ రొమాంటిక్ అంశాలు అలరించేలా ఉండటం దీనికి ముఖ్య కారణం. అలాగే యాక్షన్ సినిమాలను చూడటానికి ఇష్టపడే ప్రేక్షకులను కూడా ఈ చిత్రం మెప్పిస్తుంది. మొత్తానికి ఈ సినిమా అన్ని వర్గాల వారిని అలరించేలావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.