నటీనటులు: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ, త్రిగుణ్, సిరి హనుమంతు, పూజ, నవీన్ నేని తదితరులు
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నిర్మాణం: సాయి రాజేశ్, ఎస్‌కేయన్
దర్శకత్వం: రవి నంబూరి
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియల్
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ కాంబినేషన్‌లో, ‘బేబీ’ వంటి మైలురాయి లాంటి చిత్రాన్ని అందించిన మాస్ మూవీ మేకర్స్ మరియు అమృత ప్రొడక్షన్స్ (ఎస్‌కేఎన్, సాయి రాజేష్) నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. రవి నంబూరి దర్శకత్వంలో, మెలొడీ బ్రహ్మ మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.మరి ఈసినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ :
నివి (శ్రీ గౌరీ ప్రియ) తను ప్రేమించిన అబ్బాయి అజయ్ (త్రిగుణ్)తో పెళ్లికి సిద్ధమవుతుంది. కానీ, తీరా ముహూర్త సమయానికి పెళ్లి పీటలెక్కాల్సిన అజయ్.. తాను మరొకరిని ప్రేమించానని చెప్పి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ బాధ నుంచి బయటపడలేక నివి మందుకు బానిసవుతుంది.
ఆమెను చెన్నై తీసుకువెళ్లిన మిత్రుల గ్యాంగ్ వద్దకు దర్శకుడు కావాలనే ఆశయంతో స్టీవెన్ శంకర్ (కిరణ్ అబ్బవరం) అనే అనాథ అడుగుపెడతాడు. మొదట్లో అతని తింగరి పనులు చిరాకు తెప్పించినా, క్రమంగా అతని మాటలు-చేతలు నివిని బ్రేకప్ బాధ నుంచి బయటకు తెచ్చి, అతనికి దగ్గరయ్యేలా చేస్తాయి. మళ్లీ వారి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత వారి ప్రయాణం ఎలా సాగింది? నివి జీవితంలోకి అజయ్ మళ్లీ ఎందుకొచ్చాడు? ఆఖరికి నివి ఎవరిని పెళ్లి చేసుకుంది? అనేదే మిగతా కథ.
విశ్లేషణ :
ప్రేమలో విఫలమై దేవదాసులా మారిన హీరోయిన్ కోణం నుంచి కథను ఆరంభించిన తీరు ఆకట్టుకుంటుంది. హీరో ఎంట్రీ సాధారణంగా ఉన్నా, హీరోయిన్ ఇంటికి వచ్చాక కథ వేగం పుంజుకుంటుంది. ప్రథమార్థంలో వచ్చే ‘గుర్తుందా’ పాట, విరామ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా అలరిస్తాయి.
సెకండాఫ్‌లో లాజిక్‌ను పక్కన పెట్టి ఫాంటసీ/మ్యాజిక్ కోణంలో కథను నడిపించే ప్రయత్నం చేశారు (కొన్ని సన్నివేశాలు ‘ఎందుకంటే ప్రేమంట’ చిత్రాన్ని గుర్తుచేస్తాయి). ఈ ఫాంటసీ టచ్‌ను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారనే దానిపైనే చిత్ర ఫలితం ఆధారపడి ఉంటుంది. క్లైమాక్స్ ముందుకు వచ్చే నవ్వులు, ప్రీక్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి.
నటీనటుల పనితీరు :
హీరోగా కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లోనే బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చారు. స్టీవెన్ శంకర్ పాత్రలో ఆయన కామిక్ టైమింగ్, ఎమోషనల్ సీన్లలో కనబరిచిన నటన, డైలాగ్ డెలివరీ చాలా నాచురల్‌గా ఉంటాయి. ప్రేమికుడిగా ఆయన చూపించిన ఇంటెన్సిటీ అందరినీ కట్టిపడేస్తుంది.
తెలుగమ్మాయి శ్రీ గౌరీ ప్రియ ఈ సినిమాకి ప్రధాన బలం. బ్రేకప్ బాధను అనుభవించే అమ్మాయిగా, ఆ తర్వాత హీరో ప్రేమలో పడే క్షణాల్లో ఆమె పండించిన హావభావాలు, నటన అద్భుతమనే చెప్పాలి. క్లైమాక్స్ సీన్లలో ఆమె పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకుల చేత కంటతడి పెట్టిస్తుంది.ఇక త్రిగుణ్, సిరి హనుమంతు, పూజ, నవీన్ నేని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా ఫ్రెండ్స్ గ్యాంగ్ మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి.
సాంకేతిక వర్గం :
‘మెలొడీ బ్రహ్మ’ మణిశర్మ మరోసారి తన మార్క్ సంగీతంతో మ్యాజిక్ చేశారు. ప్రతీ పాట వినసొంపుగా ఉంటూ కథలో భాగమైపోతుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాలోని ప్రతి ఎమోషన్‌ను, లవ్ సీన్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.
సాయి రాజేష్ రాసిన కథ, మాటలు ఎంతో లోతుగా, యూత్‌ను ఆకట్టుకునేలా ఉన్నాయి. దర్శకుడు రవి నంబూరి ప్రేమలోని తీపిని మరియు బాధను చాలా అందంగా తెరకెక్కించారు.విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ చెన్నై నగరాన్ని చాలా కలర్‌ఫుల్‌గా చూపించింది. మాస్ మూవీ మేకర్స్ మరియు అమృత ప్రొడక్షన్స్ అందించిన ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.
చివరగా చెన్నై లవ్ స్టోరీ యూత్‌ని, లవర్స్‌ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించిన ఒక డీసెంట్ ఫీల్-గుడ్ ఎమోషనల్ లవ్ డ్రామా. కిరణ్ అబ్బవరం – శ్రీ గౌరీ ప్రియల నటన , మణిశర్మ అందించిన మెలోడీస్ మరియు సెకండాఫ్‌లోని మ్యాజికల్ కాన్సెప్ట్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























