చరిత్రలో ఒక్కో సంవత్సరం ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుంటుంది. అలాగే 2019 కూడా ఒక అరుదైన విషయంలో ఒక ప్రత్యేకతను నమోదు చేసుకుంది. గతంలో ఎప్పుడో ఒకటీ అరా అన్నట్లుగా వచ్చేవి నిజ జీవిత చరిత్రల ఆధారంగా నిర్మితమయ్యే బయోపిక్స్. కానీ ఈ సంవత్సరం బయోపిక్ చిత్రాల నిర్మాణం అత్యధికంగా జరగటంతో ‘ 2019 – ద ఇయర్ ఆఫ్ బయోపిక్స్ ‘ గా చరిత్రలో నిలిచిపోయింది. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ సంవత్సరం విడుదలైనన్ని బయోపిక్స్ గతంలో ఎప్పుడు విడుదల కాలేదు.. ఇక ముందు కాకపోవచ్చు కూడా. ఒక భాషలో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధికంగా 7 బయోపిక్స్ విడుదల కావటం ఒక రికార్డుగా చెప్పుకోవాలి. ఆ వివరాల్లోకి వెళితే…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ముందుగా విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, దివంగత మహానటుడు, మహానేత ఎన్టీ రామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు అనే టైటిల్స్ తో రెండు భాగాలుగా ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి నటించటం విశేషం. తెలుగు చలనచిత్ర, రాజకీయ రంగాలలో అత్యంత ప్రతిభాశాలి, ప్రభావశీలి అయిన ఎన్టీఆర్ జీవిత చరిత్రను ఆయన తనయుడే నిర్మించి టైటిల్ రోల్స్ పోషించడంతో ఆ సినిమాల పట్ల విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి. తండ్రి నిజజీవిత చరిత్రను పోషించిన తనయుడిగా చరిత్రలో నిలిచిపోయారు నందమూరి బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన రెండు భాగాలలో మొదటిదైన ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదల కాగా, ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22 న విడుదలైంది.
అలాగే ఎన్టీఆర్ జీవితంలో చివరి రోజులలో జరిగిన వివాదాస్పద విషయాలనే కథాంశంగా తీసుకుని సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నిర్మించిన’ లక్ష్మీస్ ఎన్టీఆర్’ మార్చి 29 న విడుదలైంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ సినిమా అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాలేదు.
ఇలా ఒకే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా 3 సినిమాలు నిర్మితం కావడం, ఒకే సంవత్సరంలో వరుసగా మూడు నెలల్లో 3 సినిమాలు విడుదల కావడం సినీ ధరిత్రి ఎరుగని ఒక రికార్డ్.
మరొక దివంగత ముఖ్యమంత్రి కీర్తిశేషులు వైయస్ రాజశేఖర రెడ్డి జీవిత కథ ఆధారంగా మహీ వీ. రాఘవ దర్శకత్వంలో నిర్మితమైన బయోపిక్” యాత్ర” ఫిబ్రవరి 8న విడుదల అయింది. వరుసగా ఇద్దరు దివంగత ముఖ్యమంత్రుల జీవిత చరిత్రల బయోపిక్స్ ఇలా వరుస నెలల్లో రిలీజ్ కావడం కూడా ఒక రికార్డ్ అని చెప్పుకోవాలి.
ఆ తరువాత జూన్ 21న చేనేత కార్మికుల జీవనశైలి నేపథ్యంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా అర్.రాజ్ దర్శకత్వంలో రాచకొండ విజయలక్ష్మి నిర్మించిన ‘ మల్లేశం’ విడుదలైంది. ఆ తరువాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుల చరిత్రలో ఒక ఉత్తుంగ తరంగంలాగ దూసుకొచ్చిన విద్యార్థి నాయకుడు జార్జి రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా జీవన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన’ జార్జి రెడ్డి’ నవంబర్ 22 న విడుదలయింది.ఇక తెలుగు చలనచిత్ర రంగ పితామహుడిగా కీర్తించబడే కీర్తిశేషులు రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా బాబ్జి దర్శకత్వంలో సతీష్ నాయుడు నిర్మించిన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ నవంబర్ 29న విడుదలైంది.
ఇలా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా – ఒక క్యాలెండర్ ఇయర్లో ఏడు బయోపిక్ లు విడుదల కావటం 2019 ప్రత్యేకత. దివంగత నటీమణి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన “మహానటి”అన్ని విధాల విజయవంతం కావటం బయోపిక్ ల నిర్మాణానికి ఊపు తెచ్చింది. బయోపిక్స్ నిర్మాణ, దర్శకత్వాలకు రోడ్ మ్యాప్ లాగా మహానటి ఉపకరించినప్పటికీ ఆ స్ఫూర్తితో వచ్చిన బయోపిక్స్ ఏవీ విజయవంతం కాకపోవడంతో బయోపిక్స్ ట్రెండ్ కు బ్రేక్ పడింది. నిజానికి బయోపిక్స్ కు అవార్డులు తప్ప ప్రజల రివార్డులు దక్కటం చాలా అరుదు అన్న వాస్తవం తెలిసి కూడా వాటి నిర్మాణానికి సాహసించిన ఆయా దర్శకనిర్మాతల గట్స్ కు హ్యాట్సాఫ్ చెప్పాలి. ఏది ఏమైనా ఒకే సంవత్సరంలో ఏడు బయోపిక్స్ అందించి జయాపజయాలకు అతీతమైన స్ఫూర్తిని అందించిన వారందరూ అభినందనీయులే .
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: