మంచి కథకు సాంకేతికత కూడా తోడైతే… వెండితెరపైన అద్భుతాలు చోటుచేసుకుంటాయి. అలా… తెలుగు తెరపై అద్భుతాలు ఆవిష్కరించిన దర్శకుడు స్వర్గీయ కోడి రామకృష్ణ. భక్తి రస చిత్రాలకు ఆధునిక సాంకేతికతను జోడించి… ఆయన రూపొందించిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలాంటి చిత్రాలలో `దేవి` ఒకటి. తనను కాపాడే సమయంలో ప్రాణాలు కోల్పోయిన ఓ ఆసామి పట్ల కృతజ్ఞతతో… అతని కూతురిని దుష్టశక్తుల బారి నుంచి నిరంతరం రక్షించే ఓ నాగదేవత కథగా `దేవి` తెరకెక్కింది. ప్రేమ టైటిల్ రోల్‌లో నటించిన ఈ చిత్రంలో భానుచందర్, సిజ్జూ, వనిత, అబూ సలీమ్, షావుకారు జానకి, బాబూ మోహన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్ కథను అందించగా… జొన్నవిత్తులు మాటలు, పాటలు అందించారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పనలో పాటలన్నీ ఆదరణ పొందాయి. ముఖ్యంగా `కుంకుమ పూల తోటలో`, `నీ నవ్వే` పాటలు ఇప్పటికీ నిత్యనూతనమే. 1999 మార్చి 12న విడుదలైన `దేవి`… నేటితో 20 వసంతాలను పూర్తిచేసుకుంటోంది
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`దేవి` – కొన్ని విశేషాలు :
* ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న దేవిశ్రీప్రసాద్‌కి ఇదే తొలి చిత్రం. ఈ సినిమా విడుదలయ్యేటప్పటికీ దేవిశ్రీ వయసు 20 కూడా నిండలేదు. మొదటి సినిమానే… ఇలా సాంకేతికతతో ముడిపడిన భక్తి రస చిత్రం కావడం ఎవరికైనా సవాల్‌తో కూడిన విషయమే. అయితే… డీఎస్పీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మెప్పించాడు. ఆ తరువాత చిత్ర చిత్ర ప్రవర్ధనమానంగా తెలుగు నాట అగ్రశ్రేణి స్వరకర్తగా దూసుకుపోయాడు. ఎన్ని చిత్రాలు చేసినా… ఎన్ని విజయాలు అందుకున్నా మొదటి సినిమా ఎప్పుడూ ప్రత్యేకమే. అలా `ప్రత్యేక`మైన సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన దేవిశ్రీ… నేటితో రెండు దశాబ్దాలు పూర్తిచేసుకోవడం స్వరాభిమానులకు ఆనందించదగ్గ పరిణామం.
* ఈ సినిమాతోనే ప్రముఖ నటుడు సిజ్జూ నటుడిగా తొలి అడుగులు వేశాడు. అలాగే ప్రముఖ నటి మంజుల, నటుడు విజయ్ కుమార్ పెద్ద కుమార్తె వనిత… విలన్ రోల్ ప్లే చేసిన అబూ సలీమ్‌కి కూడా ఇదే మొదటి సినిమా కావడం విశేషం.
* ఈ చిత్రంలో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్ర… `ఉత్తమ బాలనటుడు`గా `నంది` అవార్డు అందుకున్నాడు.
* తమిళ, హిందీ భాషల్లో డబ్ అయిన ఈ సినిమా ఆ యా చోట్ల మంచి ఫలితాన్ని అందుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: