ఆయనకంటే ముందు తెలుగు చలనచిత్రరంగంలో అద్భుత విజయాలు సాధించిన నిర్మాతలు చాలామంది ఉన్నారు. కానీ ఆయన రాక తరువాతనే నిర్మాత అనే పదానికి ఒక “గ్లామర్” ఏర్పడింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
జిలుగు వెలుగుల సినీ ప్రపంచంలో వెండితెర మీద తళుకులీనే హీరోలు హీరోయిన్లకు మాత్రమే ఉండే పాపులారిటీ , క్రేజ్ ఒక నిర్మాతకు కూడా ఏర్పడవచ్చు అని నిరూపించిన మొట్టమొదటి మోస్ట్ గ్లామరస్ అండ్ హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ ఆయనే.
డబ్బులు ఉన్న వారంతా నిర్మాతలు కాలేరు… డబ్బులు ఉండటమే నిర్మాత కావడానికి అర్హత కాదు… నిర్మాత అంటే చిత్ర నిర్మాణ రంగంలోని 24 శాఖల పట్ల సాధికారిక అవగాహన కలిగినవాడే నిర్మాత అని నిరూపించి నిర్మాత అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఆదర్శ నిర్మాత ఆయన. ఇంత చెప్పిన తరువాత ఇన్ని అభినందనలకు అర్హుడైన ఆ నిర్మాత ఎవరై ఉంటారబ్బా అని తడుముకోవాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. ఖచ్చితంగా ఈ అర్హతల కొలతలకు సరిపడే సినీ శిఖరం శతాధిక చిత్ర నిర్మాత
రామానాయుడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అవును… He is non-other than Dr. D. Ramanaidu.
8 దశాబ్దాల పైబడిన సినిమా చరిత్రలో లబ్దప్రతిష్టులైన అగ్ర నిర్మాతలు చాలా మంది ఉన్నప్పటికీ సినిమాయే ఊపిరిగా, సినిమాయే ప్రాణవాయువుగా బ్రతికిన నిజమైన “సినీజీవి” డాక్టర్ డి.రామానాయుడు. ఆ సినీ సౌధం మనలను విడిచి వెళ్లి అప్పుడే అయిదేళ్లు పూర్తయింది.
1936 జూన్ 6 న జన్మించిన రామానాయుడు 2015, ఫిబ్రవరి 18న తన 79వ ఏట కన్నుమూశారు. జనన మరణాల మధ్యకాలంలో చాలామంది బతుకుతారు. కానీ కొద్ది మంది మాత్రమే జీవిస్తారు. అలా జీవితాన్ని జీవించిన అతికొద్దిమందిలో రామానాయుడు ఒకరు. ఈరోజు ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని ఆ చిరస్మరణీయ నిర్మాత గురించి నాలుగు మంచి మాటలు…
నిర్మాత కావాలనే లక్ష్యంతో కారంచేడు నుండి అప్పటి దక్షిణ భారత సినీ రాజధాని మద్రాసుకు చేరుకున్న రామానాయుడు కన్ను మూసే వరకు ఒక నిరంతర సినీ శ్రామికుడిలా శ్రమించారు. నిర్మాత అంటే చెక్కుల మీద సంతకాల టిక్కులు పెడుతూ వినోదంగా, విలాసంగా కాలం గడిపే విలాస పురుషుడు అనే అభిప్రాయాన్ని, అపవాదును పూర్తిగా చెరిపివేసిన నిర్మాత రామానాయుడు.
నిజానికి టాలీవుడ్ చరిత్రలో రామానాయుడుది ఒక ప్రత్యేక స్థానం, ఒక ప్రత్యేక అధ్యాయం. వాస్తవంగా చెప్పుకోవాలంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రామానాయుడు గొప్ప “షో మ్యాన్”. చాలా మంది హీరోల కంటే అందగాడు రామానాయుడు. చాలామంది హీరోయిన్ల చేత నా పక్కన హీరోగా చేయొచ్చు కదా అని బ్రతిమిలాడించుకున్న హ్యాండ్సమ్ ప్రొడ్యూసర్ రామానాయుడు.
అయితే అందాలు – ఆనందాలు
విందులు- వినోదాలు,
ఖుషిలు -జల్సాలు ఇవన్నీ అవసరమే… కానీ సాధించవలసిన లక్ష్యాన్ని, చేరుకోవలసిన గమ్యాన్ని విస్మరించకుండా ఒకవైపు జీవితాన్ని అనుభవిస్తూనే మరోవైపు లక్ష్య సాధనలో ప్రథముడిగా నిలవవచ్చు అని నిరూపించిన కార్యసాధకుడు డాక్టర్ డి.రామానాయుడు. అందుకే ఆయన సుదీర్ఘ సినీ జీవితంలో ఎన్నెన్నో అఖండ విజయాల శిఖరారోహణ కనిపిస్తుంది. ఒక ప్రాంతీయ స్థాయి నిర్మాతగా కెరీర్ ప్రారంభించి జాతీయస్థాయిలో ఉత్తమ , అగ్రశ్రేణి నిర్మాతగా ఎదిగారు రామానాయుడు. అందుకే జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఆయనకు దక్కినన్ని అవార్డులు, రివార్డులు మరే నిర్మాతకు దక్కలేదు.
ఉత్తమ నిర్మాతగా ఎన్నో అవార్డులు సాధించిన రామానాయుడు అత్యధిక చిత్రాల నిర్మాతగా “గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ “లో చోటు దక్కించుకోవడం ఒక అనితరసాధ్యమైన కార్యసాధన.
భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన “పద్మభూషణ్”, ప్రాంతీయ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలందించినందుకు గాను ఇచ్చిన “రఘుపతి వెంకయ్య పురస్కారం”, జాతీయస్థాయిలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎనలేని సేవలందించినందుకుగాను ఇచ్చిన “దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు” , ఫిలింఫేర్ వారి” లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు” – ఇవన్నీ రామానాయుడు కార్యదక్షతకు దక్కిన పురస్కారాలు.
అలాగే 13వ లోక్ సభకు కారంచేడు నుండి ఎంపిక కావడం ఆ నియోజకవర్గానికి శక్తివంచన లేకుండా సేవలందించడం రామానాయుడు జీవితంలో ఒక గొప్ప పరిణామం. ఇక రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన అందించిన సేవలు ఆయన సహృదయతకు, వితరణ శీలతకు అద్దం పడతాయి. ఎప్పుడైనా, ఎవరిపట్లనైనా కృతజ్ఞతా రాహిత్యంగా ప్రవర్తించానేమోనని అనునిత్యం తన మనసును తడిమిచూసుకొనే సహృదయుడు, మానవతావాది రామానాయుడు. భారతదేశంలోని 13 భాషలలో చిత్ర నిర్మాణం గావించి ఏ ఇతర నిర్మాత సాధించలేని గొప్ప ఘనతను సాధించి తెలుగు వారందరికీ గర్వకారణంగా నిలిచిన ఆదర్శ అగ్రనిర్మాత రామానాయుడు.
ఒక వ్యక్తిగా ప్రారంభమై వ్యవస్థగా విస్తరిల్లి కొన్ని వందల కుటుంబాలకు జీవనోపాధిని కల్పిస్తూ Live and let live అనే సామాజిక ధర్మానికి ప్రతీకగా వెలిగిన రామానాయుడు తన సంపాదననే కాదు సంతానాన్ని కూడా చిత్ర పరిశ్రమకే అంకితమిచ్చారు.
నిర్మాతగా వృత్తిపరమైన విజయాలను సాధించడమే పరమావధి కాదు… మనిషిగా పుట్టినందుకు సాటి మనిషి పట్ల సహృదయతను, మానవతను చూపగలగడమే అసలు విజయం అని భావించే మంచి మనిషి అయిన రామానాయుడు ఆత్మ శాంతిని ఆకాంక్షిస్తూ తన తరఫున, తన పాఠకుల తరఫున ఆ “మూవీ మొగల్” కు శ్రద్ధాంజలి ఘటిస్తుంది “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కం”.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: