ఇక నటీనటుల విషయానికి వస్తే అన్నపూర్ణ సంస్థలో అగ్రనటిగా, సంస్థకు అత్యంత ఆప్తురాలిగా వెలిగిన నటి సావిత్రి. కాకినాడ పరిషత్తు పోటీలలో పృథ్వీరాజ్ కపూర్ చేతులమీదుగా బహుమతి అందుకున్నప్పటి నుండి సావిత్రి మధుసూదనరావుకు బాగా తెలుసు. ఆమెను ఎల్ వి ప్రసాద్ “సంసారం” చిత్రంలో బుక్ చేసి తీసేసినప్పుడు మధుసూదనరావు ఎంతో బాధ పడ్డారు.’ బతుకు తెరువు’ చిత్రంలో ఒక చిన్న పాత్ర చేసిన తరువాత” దేవదాసు” చిత్రం పెద్ద హిట్ అవటంతో సావిత్రి దశ తిరిగింది. ” దొంగ రాముడు” చిత్రంలో హీరోయిన్ గా భానుమతిని బుక్ చేయాలన్నది మధుసూదనరావు అభిప్రాయం.
వరవిక్రయం, స్వర్గసీమ, మల్లీశ్వరి చిత్రాలు చూసి భానుమతి అభిమాని అయ్యారు మధుసూదన రావు.
దానికితోడు పరిషత్తు కార్యక్రమాలకు వచ్చినప్పుడు భానుమతితో పరిచయం కలగడంవల్ల ఆమెను దొంగ రాముడు చిత్రంలో హీరోయిన్ గా పెట్టాలని ఉత్సాహపడ్డారు. అయితే దొంగరాముడులో హీరోయిన్ రోల్ కు భానుమతి అంతటి టాప్ స్టార్ అవసరం లేదు. అది అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ పై తీస్తున్న చిత్రం కాబట్టి హీరోయిన్ పాత్రకు ఒక వర్ధమాన నటి చాలు అన్నది కె.వి.రెడ్డి గారి అభిప్రాయం. అందుకే అప్పటికి వర్ధమాన దశలో ఉన్న సావిత్రిని బుక్ చేశారు. అలా అన్నపూర్ణ సంస్థలో ప్రవేశించారు సావిత్రి. తరువాత తోడికోడళ్ళు, మాంగల్య బలం, వెలుగునీడలు, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి చిత్రాల్లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అన్నపూర్ణ సంస్థలో సొంత మనిషి కంటే ఎక్కువగా మసలిన ఆత్మీయురాలు సావిత్రి. నేను ఎన్ని సినిమాల్లో చేసినా ” అన్నపూర్ణ నా మాతృ సంస్థ”- అని సగర్వంగా చెప్పుకునేవారావిడ. ఇక అన్నపూర్ణ సంస్థలో జగ్గయ్యగారిది ఒక విశిష్ట స్థానం. ఆయన విలక్షణ, విశిష్ట అభినయ చాతుర్యం అంటే మధుసూదనరావుకు ప్రత్యేక అభిమానం. అన్నపూర్ణ సంస్థలో దొంగ రాముడు, తోడి కోడళ్ళు, వెలుగునీడలు, డాక్టర్ చక్రవర్తి, ప్రేమ లేఖలు చిత్రాల్లో నటించారు జగ్గయ్య. మా అన్నపూర్ణ చిత్రాల్లో విశిష్టమైన, హుందా అయిన పాత్ర ఏదైనా ఉంటే అది జగ్గయ్య గారి కోసం రిజర్వు చేసే వాళ్ళం” అంటారు మధుసూదనరావు.
ఇక అన్నపూర్ణ సంస్థలో అత్యధిక చిత్రాలు చేసిన నటి సూర్యకాంతం. ప్రేమ లేఖలు, అమెరికా అబ్బాయి తప్ప మిగిలిన 16 చిత్రాల్లోనూ నటించారామె. మధుసూదన రావు గారిని గౌరవంగా, అభిమానంగా “ప్రిన్సిపాల్ గారు” అని సంభోదించేవారావిడ. ఒకసారి హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో
ఆమెకు సన్మానం జరిగితే” ఈ రోజున ఈ సన్మానం చేయించుకోవడానికి , మీ గౌరవం పొందటానికి మా ప్రిన్సిపాల్ గారైన మధుసూదనరావు గారే కారణం’ – అని ప్రసంగించి ఆయన పట్ల, అన్నపూర్ణ సంస్థ పట్ల తనకు గల గౌరవాభిమానాలను చాటుకున్నారు సూర్యకాంతం.
ఇక అన్నపూర్ణ సంస్థ తొలి చిత్రమైన దొంగరాముడు లో ప్రధాన హాస్య పాత్రను పోషించి ఎంతగానో రాణించారు రేలంగి. అప్పటినుండి వరుసగా సంస్థ చిత్రాల్లో నటిస్తూ హాస్యానికి చక్కని భాష్యం చెప్పి తాను వ్యక్తిగతంగా ఎదుగుతూ సంస్థ విజయాలకు కూడా కారకులయ్యారు రేలంగి వెంకట్రామయ్య.
ఇక అన్నపూర్ణ సంస్థలో అత్యధిక చిత్రాలు చేసిన నటుడు అల్లు రామలింగయ్య. “ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది ” పుట్టిల్లు” చిత్రం ద్వారానే అయినప్పటికీ అన్నపూర్ణ సంస్థకు ఆయన పర్మినెంట్ ఆర్టిస్ట్ అయ్యారు. అంతేకాకుండా నాకు చాలా సన్నిహిత మిత్రులు. సెట్లో అందరినీ నవ్విస్తూ , అందరితో కలిసిపోతూ అందరి మనిషిగా మెలుగుతూ సందడి చేసే వారు” అంటారు మధుసూదన రావు.
అన్నపూర్ణ సంస్థలో చేసినవి తక్కువ చిత్రాలే అయినప్పటికీ నటీనటులు శోభన్ బాబు, ఎస్ వి రంగారావు, నాగభూషణం, చలం, రమణారెడ్డి, పద్మనాభం, జమున, శారద, వాణిశ్రీ, విజయశాంతి, షావుకారు జానకి, కృష్ణకుమారి, జయప్రద, జయసుధ, కన్నాంబ, రాజసులోచన, ఇ.వి.సరోజ తదితరులంతా మా అన్నపూర్ణ సంస్థ పట్ల చూపే గౌరవాభిమానాలు మరువలేనివి. మా సంస్థ ఉన్నతికి, అభ్యున్నతికి వీరందరి సహకారం, వీరందరి ప్రతిభాపాటవాలే కారణం. ఏ సంస్థ అయినా ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి ఎందరో వ్యక్తుల సహకారం అవసరం. అది సహృదయంగా, సాదరంగా, గౌరవంగా మా సంస్థకు లభించినoదువల్లనే మాకు ఇన్ని విజయాలు సుసాధ్యాలు అయ్యాయి. మా సంస్థ ఉద్దీపనకు కరదీపికలైన వీరందరికీ నా తరఫున, మా సంస్థ తరఫున శత సహస్ర కృతజ్ఞతాభివందనాలు చెల్లించటం మా కర్తవ్యం అంటారు మధుసూదన రావు.
ఇక మా అన్నపూర్ణవారి కృతజ్ఞతల చెల్లింపు జాబితాలో ” lost but not the least”- గా చెప్పుకోవలసింది “అఖిలాంధ్ర ప్రేక్షక మహాశయులు”.ప్రేక్షకుల అభిరుచి పట్ల, వారు ఆదరించే అంశాలపట్ల కొన్ని నిర్దిష్టమైన అంచనాలు కలిగినవారు అన్నపూర్ణ అధినేతలు. ముఖ్యంగా ఈ సంస్థలో దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు ప్రారంభం నుండి కళారంగంలో కాకలు తీరిన వారు కావటంతో ఈ దృశ్య మాధ్యమం యొక్క అదృశ్య గుణాలను బాగా ఎరిగి ఉన్నారు. వారి దృష్టిలో ప్రేక్షకులు అంటే ఏదో డబ్బు పారేసి టికెట్ కొనుక్కుని మనం చూపిందల్లా చూసి వెళ్లే కాలక్షేపం రాయుళ్లు కాదు. ఎలాంటి మొహమాటాలకు తావివ్వ వలసిన అవసరం లేకుండా నచ్చిన దానిని మెచ్చడం, నచ్చని దానిని మొట్టడం మాత్రమే తెలిసిన ప్రేక్షకులకు ‘మొట్టే’ అవకాశం అట్టే ఇవ్వకుండా నెగ్గుకొచ్చింది అన్నపూర్ణ సంస్థ. తెలుగు తమిళ భాషల్లో కలిపి అన్నపూర్ణ వారు మొత్తం 22 చిత్రాలను నిర్మించగా వాటిలో 16 శతదినోత్సవ చిత్రాలు కాగా, ఆ 16లో 4 రజతోత్సవ చిత్రాలు కావడం విశేషం.
ఎవరి ఋణాన్నైనా ఏదో ఒక రూపంలో తీర్చుకోవచ్చు. కానీ’ఇంతైన’ మమ్ములను తమ ఆదరాభిమానాలతో ‘ఇంతింత’ గా ఎదిగేలా చేసిన అఖిలాంధ్ర, తమిళ, కర్ణాటక, కేరళ ప్రేక్షక మహాశయులకు
కృతజ్ఞతతో అంజలి ఘటిస్తున్నాను”- అంటారు మధుసూదనరావు.
ఇదీ అపురూప చిత్రాల అన్నపూర్ణ వారి సుదీర్ఘ సుసంపన్నమైన చిత్ర నిర్మాణ చరిత్ర. ఇప్పుడు దాదాపు నాలుగు దశాబ్దాల అన్నపూర్ణ వారి చిత్ర నిర్మాణ ప్రస్థానంలో ఆ సంస్థ ద్వారా పరిచయం గావింపబడిన నటీ నట సాంకేతిక వర్గ వివరాలను,సంస్థ నెలకొల్పిన రికార్డులను, వారు చేసిన నూతన ప్రయోగాలను ఒక్కసారి విహంగ వీక్షణంగా చూద్దాం.
First time in the History of Telugu Film Industry – అని పేర్కొనదగిన ప్రయోగాలు అన్నపూర్ణ వారు ఎన్నెన్నో చేశారు. ఏ సంస్థ అయినా సగర్వంగా చెప్పుకోదగిన ఆ విశేషాలు – వివరాలు ఇవే.
* 1962 లో రాష్ట్ర రాజధానిలో పని లేక మూసివేసిన సారథి స్టూడియోను 1963లో తెరిపించి వరుసగా 12 చిత్రాలను స్టూడియోలోనే నిర్మించి సారథి స్టూడియో పునరుజ్జీవనానికి కారణం అయింది అన్నపూర్ణ సంస్థ.
* 1963 లోనే “చదువుకున్న అమ్మాయిలు” చిత్రం షూటింగ్ మాత్రమే కాకుండా డబ్బింగ్ , రీ రికార్డింగ్ కూడా ఇక్కడే చేశారు.
* 1964లో “డాక్టర్ చక్రవర్తి” చిత్రానికి బ్యాక్ ప్రొజెక్షన్ సారథి స్టూడియోలోనే జరిపించారు.
* తెలుగు ప్రేక్షకులకు తొలిసారిగా ద్విపాత్రాభినయాన్ని ” ఇద్దరు మిత్రులు” చిత్రం ద్వారా పరిచయం చేసిన ఘనత అన్నపూర్ణ వారిదే.
* తెలుగులో తొలి నవల చిత్రాన్ని ( డాక్టర్ చక్రవర్తి) నిర్మించిన ఘనత అన్నపూర్ణ వారిదే… అంటారు దుక్కిపాటి మధుసూదనరావు . అయితే 1940 లలోనే ” బారిష్టర్ పార్వతీశం” అనే నవలా చిత్రం రూపొందిందని చరిత్రకారులు అంటుంటారు.
* ఊటీలో షూటింగ్ చేసిన తొలి తెలుగు చిత్రం అన్నపూర్ణ వారి ” మాంగల్య బలం”.
* ఆదరించిన ప్రజల సమక్షంలో తమ చిత్రాల శతదినోత్సవ వేడుకలను నిర్వహించిన తొలి సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్. విజయవాడలో “మాంగల్య బలం” శత దినోత్సవ వేడుకలను పబ్లిక్ లో నిర్వహించారు.
* పాటలను కూడా స్టూడియోల్లోనే సెట్స్ వేసి తీసే ఆ రోజుల్లో ” తోడి కోడళ్ళు” చిత్రంలో ‘ గాలిపటం – గాలిపటం’ అనే పాట చిత్రీకరణ కోసం మద్రాస్ సిటీ రోడ్లపైకి వచ్చిన తొలి సంస్థ అన్నపూర్ణ.
* తెలుగులో తొలి వెండితెర నవల “తోడి కోడళ్ళు”… రచన రాంచంద్.
అన్నపూర్ణ ద్వారా పరిచయాలు :
* నేటి మేటి దర్శకుడుగా , కళాతపస్విగా పేరు ప్రఖ్యాతులు పొందిన కె.విశ్వనాథ్ ను “ఆత్మగౌరవం” చిత్రం ద్వారా పరిచయం చేయడమైనది.
* కళాభినేత్రి వాణిశ్రీ ని నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సరసన హీరోయిన్ గా పరిచయం – చిత్రం
“ఆత్మీయులు”.
* ప్రముఖ రచయిత్రి కోడూరి కౌసల్యాదేవిని కథా రచయిత్రిగా పరిచయం- చిత్రం” డాక్టర్ చక్రవర్తి”
* ప్రముఖ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అన్నపూర్ణ సంస్థలో అత్యధిక చిత్రాలకు కథను సమకూర్చారు.చిత్రాలు: విచిత్రబంధం, ఆత్మీయులు, బంగారు కలలు, ప్రేమ లేఖలు, రాధాకృష్ణ.
* ఇద్దరు మిత్రులు చిత్రం ద్వారా సుప్రసిద్ధ గేయ రచయిత” దాశరధి”ని
పరిచయం చేశారు
* ఇద్దరు మిత్రులు చిత్రం ద్వారా ప్రఖ్యాత నాటక రచయిత “కొర్రపాటి గంగాధరరావు” ను సంభాషణల రచయితగా పరిచయం చేశారు.
* డాక్టర్ చక్రవర్తి చిత్రం ద్వారా సుప్రసిద్ధ నటులు , రచయిత, దర్శకుడు గొల్లపూడి మారుతీరావును స్క్రీన్ ప్లే రచయితగా పరిచయం చేశారు.
* అంకుర్ చిత్రం హీరో ” అనంత్ నాగ్” ను ప్రేమ లేఖలు చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం చేశారు.
* పూలరంగడు చిత్రం ద్వారా ముప్పాళ్ళ రంగనాయకమ్మను సంభాషణల రచయిత్రిగా పరిచయం చేశారు. కాగా పరిశ్రమలో సంభాషణల రచన చేసిన తొలి మహిళ ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారే కావటం విశేషం.
* చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా” ఆశాలత కులకర్ణి ” అనే గాయనిని పరిచయం చేశారు.
* పూలరంగడు చిత్రంలో’ చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగ మారినవి’ అనే పాట ద్వారా హైదరాబాద్కు చెందిన కే బి కే మోహన్ రాజ్ ను గాయకుడుగా పరిచయం చేశారు.
* విచిత్రబంధం చిత్రంలో” చిక్కావు చేతిలో చిలకమ్మా” అనే పాట ద్వారా గాయకుడు రామకృష్ణ ను పరిచయం చేశారు.
* ఇద్దరు మిత్రులు చిత్రం ద్వారా ఇ.వి.సరోజ ను తొలిసారిగా తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా పరిచయం చేశారు.
* ఆత్మగౌరవం చిత్రం ద్వారా “సుమతీ కౌశల్”ను నృత్య దర్శకురాలిగా పరిచయం చేశారు. తెలుగు చిత్రరంగంలో తొలిసారిగా దర్శకత్వం వహించిన మహిళ సుమతీ కౌశల్.
* ప్రముఖ దర్శకుడు శ్రీధర్ ను తమ తమిళ చిత్రాల ద్వారా సంభాషణల రచయితగా పరిచయం చేశారు.
* దర్శకుడు శ్రీధర్ వద్ద సహాయ దర్శకుడిగా పని చేసి ఆపై సుప్రసిద్ధ తమిళ దర్శకుడుగా పేరుపొందిన
కె ఎస్ గోపాలకృష్ణన్ ను ఎంగళ్ వీట్టు మహాలక్మి చిత్రం ద్వారా పాటల రచయితగా పరిచయం చేశారు.
* చదువుకున్న అమ్మాయిలు చిత్రం ద్వారా హైదరాబాద్కు చెందిన స్టేజ్ యాక్టర్ భాను ప్రకాష్ ను నటుడిగా పరిచయం చేసి ఆ తరువాత పలు చిత్రాల్లో అవకాశం కల్పించారు.
* అమెరికా అబ్బాయి చిత్రం ద్వారా
” జీడిగుంట శ్రీరామచంద్ర మూర్తి” ని కథా రచయితగా పరిచయం చేశారు.
* అమెరికా అబ్బాయి చిత్రం ద్వారా ” ఆర్ వీ ఎస్ రామస్వామిని సంభాషణల రచయితగా పనిచేశారు.
అన్నపూర్ణ వారి చిత్రాలకు వచ్చిన అవార్డులు:
* తోడికోడళ్ళు చిత్రానికి జాతీయ అవార్డులలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ లభించింది. మద్రాస్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ వారు “ఎంగల్ వీట్టు మహాలక్ష్మి”కి బెస్ట్ పిక్చర్ అవార్డును, సావిత్రి కి బెస్ట్ హీరోయిన్ అవార్డును ఇచ్చారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ అవార్డ్ కూడా సాధించింది తోడికోడళ్లు.
* మంజల్ మహిమయ్ చిత్రానికి జాతీయ అవార్డులలో సర్టిఫికెట్ ఆఫ్ మెరిట్ లభించింది. మద్రాస్ ఫిలిం ఫ్యాన్స్ వారు బెస్ట్ పిక్చర్ అవార్డు ఇచ్చారు.
* ఇద్దరు మిత్రులు చిత్రానికి మద్రాస్ ఫిలిం ఫాన్స్ వారి ఉత్తమ తెలుగు చిత్రం అవార్డు, నాగేశ్వరరావుకు బెస్ట్ హీరో అవార్డు లభించింది.
* అన్నపూర్ణ వారి చిత్రాలలో అత్యధిక సంఖ్యలో అవార్డులు పొందిన చిత్రం డాక్టర్ చక్రవర్తి. 1964లో రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన నంది అవార్డులలో తొలి” బంగారు నంది”ని అందుకున్న తొలి చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఇదే చిత్రానికి ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నేషనల్ అవార్డులలో రజిత పతకం లభించింది. ఇవికాక డాక్టర్ చక్రవర్తి కి స్థానిక సాంస్కృతిక సంస్థల అవార్డులు కోకొల్లలుగా వచ్చాయి.
* ఆత్మ గౌరవం చిత్రానికి ఉత్తమ కథా చిత్రంగా నంది అవార్డు లభించింది.
తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నంది లభించింది. మద్రాస్ ఫిలిం ఫాన్స్ అసోసియేషన్ వారు ఉత్తమ కథగా ఎంపిక చేశారు.
* ఆత్మీయులు చిత్రం ద్వితీయ ఉత్తమ చిత్రంగా రజిత నందిని పొందింది.
* అమాయకురాలు చిత్రం తృతీయ ఉత్తమ చిత్రంగా కాంస్య నందిని పొందింది.
* అమెరికా అబ్బాయి చిత్రంలో నటించిన మాస్టర్ శ్రావణ్ కు ఉత్తమ బాల నటుడిగా నంది అవార్డు లభించింది.
ఇవీ అన్నపూర్ణ వారి అద్భుత విజయాలు, వాటి ద్వారా వచ్చిన అవార్డులు రివార్డుల వివరాలు.
తెలుగు చలనచిత్ర రంగానికి స్వర్ణయుగంగా భావించబడిన 1950, 60, 70 – దశకాలలో అన్నపూర్ణ వారు సాగించిన అపురూప చిత్రాల జైత్రయాత్రకు అక్షర రూపం ఇచ్చే అవకాశం, అదృష్టం నాకు లభించటం నా పాత్రికేయ జీవితంలో గొప్ప మైలురాయి. గతంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖుల చరిత్రలు బయోగ్రఫీ, ఆటో బయోగ్రఫీ ల రూపంలో చాలా వచ్చాయి. కానీ ఒక సంస్థ చరిత్ర పుస్తక రూపంలో రావటం ఇదే ప్రథమం. ఈ సందర్భంగా చలన చిత్ర రంగ దిగ్గజాలుగా కీర్తించబడే అన్నపూర్ణ సంస్థ అధినేతలైన దుక్కిపాటి మధుసూదనరావుగారితో, అక్కినేని నాగేశ్వరరావు గార్లతో నాకు ఏర్పడిన అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ప్రముఖులు, సుప్రసిద్ధులు అయిన సీనియర్ పాత్రికేయులు ఎందరో ఉన్నప్పటికీ తమ సంస్థ చరిత్రను అక్షరబద్ధం చేసేందుకు నన్ను ఎంచుకున్న దుక్కిపాటి మధుసూదనరావు గారికి
నా కృతజ్ఞతలు.తెలుగు websites చరిత్రలో ఒక సినీ నవలను ధారావాహికగా ప్రచురించటం ఇదే ప్రథమం. First of its kind అనదగిన ఈ వెబ్ సీరియల్ ప్రచురణకు అనుమతించి, ప్రోత్సహించిన మా
Mango Group అధినేత” రామ్ వీరపనేని” గారికి కృతజ్ఞతలు. 43 భాగాలుగా “ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కామ్” లో ప్రచురితమైన “స్వర్ణయుగంలో అన్నపూర్ణ” ధారావాహికను ఆదరించిన పాఠక హాశయులందరికీ శతాధిక వందనాలు. ఈ ధారావాహిక నేపథ్యంలో పాఠక మహాశయులతో ఏర్పడిన అక్షరానుబంధానికి గానూ కృతజ్ఞతాంజలి ఘటిస్తూ సవినయ నమస్సులతో-
రచయిత ప్రభు
సమాప్తం
సెలవు
[youtube_video videoid=YGvYS-pTa3Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
తెలుగు ఫుల్ మూవీస్
Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.