స్వర్ణ యుగంలో అన్నపూర్ణ ధారావాహిక ముగింపు దశకు చేరుకుంటున్న క్రమంలో ప్రస్తుతం దుక్కిపాటి మధుసూదనరావు తమ సంస్థలో పనిచేసిన నటీ నట సాంకేతిక వర్గానికి, ఇతర ప్రముఖులకు కృతజ్ఞతలు చెబుతున్న ఘట్టంలో ఉన్నాం. గత ఎపిసోడ్ లో తమ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కు, తమ తొలి చిత్ర దర్శకుడు కేవీరెడ్డి, తమ సంస్థలో 12 చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆదుర్తి సుబ్బారావుకు, 14 చిత్రాలకు ఛాయాగ్రహణం నిర్వహించిన సెల్వరాజ్ ల గురించి దుక్కిపాటి వివరించిన విశేషాలను మీ ముందు వుంచాను. ఇప్పుడు మిగిలిన నటీనటులు సాంకేతిక వర్గానికి దుక్కిపాటి ఎలా తన కృతజ్ఞతాంజలి ఘటించారో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మా అన్నపూర్ణ సంస్థలో తొలి అడుగు పెట్టి ఆదుర్తి సుబ్బారావు గారి ఆశీర్వాదబలంతో ముందడుగు వేసి మొట్టమొదటిసారిగా మాకు “ఆత్మగౌరవం” చిత్రానికి దర్శకత్వం వహించి విజయాన్ని చేకూర్చి పెట్టడంతో పాటు తమ భవిష్యత్తుకు పునాదులు వేసుకున్నారు కె. విశ్వనాథ్ గారు. అలాగే మా అన్నపూర్ణ సంస్థ నిర్మించిన వేరు వేరు చిత్రాలకు దర్శకత్వం వహించిన డి. యోగానంద్, వి. మధుసూదన రావు, కె. రాఘవేంద్రరావు,బాపు, సింగీతం శ్రీనివాసరావు, ఛాయాగ్రహకులుగా పనిచేసిన విన్సెంట్,కె. ఎస్. ప్రకాష్, బాబా అజ్మీ, హరి అనుమోలు గార్లకు మేమెప్పుడూ కృతజ్ఞులమై ఉంటాము.
ఇక మా అన్నపూర్ణ సంస్థతో సంగీత దర్శకుడు ఎస్. రాజేశ్వరరావు గారి అనుబంధాన్ని గురించి చెప్పాలంటే అదొక సరదాల హరివిల్లు. ఎస్ రాజేశ్వరరావు గారికి కొంచెం’ బద్ధకిస్ట్’ అని పేరుంది. ఆయనకు కొన్ని విచిత్రమైన, విలక్షణమైన అలవాట్లు ఉన్నాయి. వాటి మూలంగా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయినప్పటికీ మధుసూదనరావు రాజేశ్వర రావు గారి అభిమాని కావటంతో అవన్నీ పరిగణలోకి వచ్చేవికావు. అన్నపూర్ణ సంస్థలో మొత్తం పది చిత్రాలకు ఎస్.రాజేశ్వరరావు సంగీత సారథ్యం వహించారు. సంగీతపరంగా అన్నపూర్ణ సంస్థ చిత్రాలకు అఖండ కీర్తి ప్రఖ్యాతులు రావడానికి ఎస్.రాజేశ్వరరావు గారి కృషి మరువలేనిది అంటారు మధుసూదన రావు.
అన్నపూర్ణ సంస్థలో అన్ని చిత్రాలకు పాటలు పాడి సంస్థలో అత్యధిక చిత్రాలు చేసిన వారి జాబితాలో టాప్ స్కోరర్ పి.సుశీల. ” దొంగ రాముడు” చిత్రంలో జమున పాత్రకు పి. సుశీలతో మూడు పాటలు పాడించారు మధుసూదన రావు. ఆ తరువాత తొలిసారిగా “తోడికోడళ్లు” చిత్రంలో హీరోయిన్ సావిత్రి పాత్రకు పాడించడంతో ఆ అవకాశం ఆమెకు గొప్ప ఆలంబన అయింది. తోడి కోడళ్ళు, ఎంగళ్ వీట్టుమహాలక్ష్మి చిత్రాలు హిట్టవటంతో తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ గాయనిగా ఎస్టాబ్లిష్అ య్యారు పి.సుశీల. ఒకసారి తన సంగీత జీవిత రజతోత్సవ సందర్భంగా హైదరాబాదు నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో క్టర్ టి.సుబ్బరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆమెకు గొప్ప సన్మానం జరిపి ” సంగీత సరస్వతి” బిరుదు ప్రధానం చేసిన సభలో మాట్లాడుతూ ” నేను ఈ స్థితికి రావటానికి కారకులు దుక్కిపాటి మధుసూదనరావు గారు. ఆయన 1956లో తోడి కోడళ్ళు చిత్రంలో సావిత్రి గారి పాత్రకు పాడించకపోతే చిన్న చిన్న పాత్రలకు పరిమితమైపోయేదాన్ని”- అన్నారు సుశీల కృతజ్ఞతతో.
” ఆది నుండి మధుసూదనరావు గారు నన్ను తండ్రిలాగా ఆదరించారు”- అంటారు పి సుశీల. అది విని నవయుగ శ్రీనివాసరావు ” మధుసూదన రావు గారికి నలుగురు కాదు.. ఐదుగురు కూతుళ్లు..పెద్దమ్మాయి పి. సుశీల”- అని చమత్కరించేవారు.
ఇక అన్నపూర్ణ సంస్థలో దొంగ రాముడు, వెలుగునీడలు చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన పెండ్యాల నాగేశ్వరరావు, ముదినేపల్లి ఎక్సెల్షియర్ క్లబ్ కాలం నుండి సుపరిచితులే. ఇంకా అన్నపూర్ణ సంస్థలో పనిచేసిన సంగీత దర్శకులు మాస్టర్ వేణు, కె.వి.మహదేవన్, సత్యం, ఎమ్మెస్ విశ్వనాథన్, జీకే వెంకటేష్ గారలు అందరూ సుమధుర, సుస్వర సంగీత సౌరభాలను వెదజల్లిన వారే. సంగీతపరంగా అన్నపూర్ణ వారి చిత్రాలు అగ్రగామిగా వెలుగొందడానికి ముఖ్య కారణాలలో మధుసూదనరావుకు ఉన్న సంగీత పరిజ్ఞానం ఒకటి.
అన్నపూర్ణ చిత్రాల పాటలన్నీ మ్యూజికల్ హిట్స్. ఆ పాటలను ఆణిముత్యాలుగా అత్యుత్తమ స్థాయిలో రికార్డు చేసిన వాహినీ సౌండ్ చీఫ్ ఏ. కృష్ణన్ గారికి మా కృతజ్ఞతలు. మా సంస్థ నిర్మించిన22 చిత్రాలలో 19 చిత్రాలకు ఎడిటర్ గా పనిచేసి సంస్థలో ఎక్కువ చిత్రాలకు చేసిన” టాప్ స్కోరర్”గా నిలిచారు ఎడిటర్ మణి. సంస్థ ప్రారంభ చిత్రం” దొంగ రాముడు”కు మణి గారిని మా సంస్థకు ఎడిటర్ గా నియమించారు కె.వి.రెడ్డి గారు. అప్పటినుండి ఆయనతో మా ప్రయాణం 19 చిత్రాల వరకు కొనసాగింది. ఇక మా కళాదర్శకుడు జి వి సుబ్బారావు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కలకత్తా యూనివర్సిటీ లో బి. ఏ., శాంతినికేతన్ లో ఫైన్ ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్, ఇటలీలోని అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు పొంది కొంతకాలం మద్రాస్ కళాక్షేత్రంలో పనిచేసి” మాంగల్య బలం” నుండి వరుసగా 12 చిత్రాలకు కళా దర్శకత్వం వహించిన ఘనత సుబ్బారావు గారిది అంటారు మధుసూదన్ రావు.
ఇక అన్నపూర్ణా వారి సమకాలీన స కుటుంబ కథా చిత్రాలకు తన అద్భుత రచనాచాతుర్యాన్ని జోడించి సంస్థ విజయాలలో సముచిత స్థానాన్ని, ప్రాధాన్యతను సొంతం చేసుకున్న రచయితలను తీసుకుంటే తొలి చిత్రం ” దొంగ రాముడు” కు సంభాషణల రచన చేసిన డి. వి. నరసరాజు గారితో ప్రారంభించాలి. ఈయన నాటక కళా పరిషత్తు అభివృద్ధికి మధుసూదన రావు గారితో కలిసి పని చేశారు. దొంగరాముడు తరువాత అన్నపూర్ణ సంస్థలో చాలాకాలానికి జై జవాన్ చిత్రానికి సంభాషణలు రచించారు. దొంగ రాముడు హిట్ కాగా జై జవాన్ నిరుత్సాహపరిచిన కారణాలు తెలిసినవే. అయితే నరసరాజు గారు జై జవాన్ చిత్రానికి రాసిన డైలాగులు వాటి పదును మరువలేనివి అంటారు మధుసూదనరావు.” నేను చాలా బాగా రాశాను అని నన్ను నేను అభినందించుకున్న జై జవాన్ చిత్రం ఫెయిల్ కావడం నన్ను చాలా బాధపెట్టింది”- అంటారు డి.వి.నరసరాజు.
దొంగరాముడు తరువాత తోడికోడళ్ళు చిత్రంతో అన్నపూర్ణ సంస్థలో అడుగుపెట్టారు మనసు కవి ఆత్రేయ. అన్నపూర్ణ సంస్థతో ఆత్రేయ అనుబంధం చాలా అందమైనది… విచిత్రమైనది కూడా. నిర్మాతలను ముప్పు తిప్పలు పెట్టే అలవాటు ఆత్రేయకు ఆది నుండే ఉంది.”రాయక నిర్మాతలను రాసి ప్రేక్షకులను ఏడిపించే వాడే ఆత్రేయ” అని పేరుపడిన ఆత్రేయ రాసినవన్నీ సువర్ణాక్షర రాశులే. అందుకే ఎన్ని తిప్పలు పెట్టినా ఆత్రేయే కావాలంటారు దర్శక నిర్మాతలు. అయితే అందరినీ తిప్పలు పెట్టే ఆత్రేయను మధుసూదన రావు ముప్పుతిప్పలు పెట్టేవారు. ఆత్రేయను ఆయన అలవాట్లకు, బంధుమిత్రులకు దూరంగా ఎక్కడో గెస్ట్ హౌస్ లు తీసుకొని అక్కడ కూర్చోబెట్టి మరీ రాయించుకునేవారు మధుసూదన రావు. “మాంగల్య బలం” చిత్రానికి కథాచర్చలు మొత్తం పూర్తయ్యాక సంభాషణల రచనా బాధ్యతను ఆత్రేయకు అప్పగించారు మధుసూదనరావు. అదే సమయంలో ఘంటసాల బలరామయ్య గారి అబ్బాయి దగ్గర ఒక చెవర్లెట్ కారు కొనుక్కున్నారు ఆత్రేయ. ఇక చెప్పేదేముంది? అప్పగించిన పని అవతల పెట్టేసి కొత్త కారు లో దసరాబుల్లోడులాగా చక్కర్లు కొట్టడం మొదలుపెట్టారు ఆత్రేయ. ఆదుర్తి, మధుసూదనరావులకు ఏం చేయాలో పాలుపోలేదు. ఇక లాభం లేదని గంటలో వస్తాను కారు తాళాలు ఇమ్మని అడిగి తీసుకొని ఆ కారేసుకుని మైసూర్ దసరా ఉత్సవాలకు వెళ్లిపోయారు మధుసూదన రావు. తిరిగి వచ్చేసరికి బుద్ధిగా కూర్చుని డైలాగ్స్ లో సగం పైగా పూర్తి చేశారు ఆత్రేయ. ఆత్రేయకు “రాత్రి కవి” అనే పేరు కూడా ఉండేది. ఆయన అలవాట్లు కూడా విచిత్రంగా ఉండేవి. రాత్రి 9 గంటల దాకా ఒక్కరే బీచ్ లో కూర్చుని అక్కడి నుండి జార్జి టౌన్ కి వెళ్లి అక్కడ స్వీట్లు కొనుక్కొని అన్నపూర్ణ ఆఫీసులో కూర్చుని తినేసి హాయిగా నిద్ర పోయేవారు. ఎప్పుడో తెల్లవారుజామున మూడు గంటలకు నిద్ర లేచి ఆరింటి దాక రాసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవారు. ఏది ఏమైనా, ఎవరిని ఎన్ని తిప్పలు పెట్టినా మనసుకవి మనసుకవే . పాత్రల ఆంతర్యంలోకి చొచ్చుకుపోయి సంభాషణలు వ్రాయటం ఆత్రేయ లోని గొప్పతనం అంటారు మధుసూదన రావు.
ఇంకా అన్నపూర్ణ సంస్థలో కొర్రపాటి గంగాధరరావు ” ఇద్దరు మిత్రులు” చిత్రానికి, గోపీచంద్ “చదువుకున్న అమ్మాయిలు” చిత్రానికి, గొల్లపూడి మారుతీ రావు” ఆత్మ గౌరవం” చిత్రానికి , ముప్పాళ్ల రంగనాయకమ్మ
” పూలరంగడు” చిత్రానికి, పినిశెట్టి శ్రీరామమూర్తి ఆత్మీయులు, అమాయకురాలు చిత్రాలకు, సత్యానంద్ ప్రేమ లేఖలు, రాధాకృష్ణ చిత్రాలకు , ముళ్ళపూడి వెంకటరమణ” పెళ్లీడు పిల్లలు” చిత్రానికి, ఆర్ వి ఎస్ రామస్వామి “అమెరికా అబ్బాయి” చిత్రానికి సంభాషణల రచన చేయగా, గోపి- మోదుకూరి జాన్సన్ లు సంయుక్తంగా ” బంగారు కలలు” చిత్రానికి రాశారు.ఇక అన్నపూర్ణ వారు నిర్మించిన ” ఎంగళ్ వీట్టు మహాలక్ష్మి , మంజల్ మహిమై,తూయ ఉల్లం చిత్రాలకు సంభాషణల రచయితగా శ్రీధర్, పాటల రచయితగా ప్రముఖ తమిళ కవి ఉడుములై నారాయణ కవి పని చేశారు. ఉడుమలై నారాయణ కవి తమిళంలో అన్నపూర్ణ వారి చిత్రాలకు రాసిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇతర తమిళ నిర్మాత ఎవరైనా ‘మీరు మా చిత్రానికి అన్నపూర్ణ వాళ్లకు రాసినంత బాగా రాయాలి’ అని అడిగితే ‘మీరు వాళ్లు తీసినంత బాగా తీయండి.. అలాగే రాస్తాను’- అనేవారట.
ఇక అన్నపూర్ణ వారి చిత్రాలకు పాటలు రచన చేసిన వారంతా సుప్రసిద్ధులే. విప్లవ గీతాలు, ప్రబోధాత్మక గీతాలు ఎక్కువగా శ్రీశ్రీ రాయగా, హాస్య గీతాలు, ఫోక్లోర్ కొసరాజు రాశారు. ఇంకా ఆరుద్ర, ఆత్రేయ, దాశరధి ప్రేమ గీతాలు ఎక్కువ రాశారు. తాపీ ధర్మారావు తోడికోడళ్లు చిత్రంలో ఒక పాట రాశారు. ఇక సి నారాయణ రెడ్డి 13 పాటలు మాత్రమే రాసినప్పటికీ చాలా మంచి పాటలు రాశారు అంటారు మధుసూదనరావు.మేము కథాంశాల్లోనూ , సాంకేతికంగానూ కొత్తవారితో ప్రయోగాలు చేసాము కాని పాటల పరంగా మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా అందరూ టాప్ రైటర్స్ తోనే రాయించాము. “అందుకే సంగీతపరంగా మా సినిమాలన్నీ సూపర్ హిట్ అనిపించుకున్నాయి”- అంటారు మధుసూదనరావు.
ఇక నటీనటుల విషయానికి వస్తే-
( సశేషం)
(ఈ సీరియల్ తరువాయి భాగం ఎల్లుండి జనవరి 7న చదవండి)
[youtube_video videoid=V_udfo4Gsek]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: