రివ్యూ: పొట్టేల్

Pottel Movie Review in Telugu

నటీనటులు: అనన్య నాగళ్ల, యువ చంద్ర కృష్ణ, అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్ర‌ఫీ: మోనిష్ భూపతి రాజు
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాణం: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్ సడిగే
దర్శకత్వం: సాహిత్ మోత్ఖూరి

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగమ్మాయి అనన్య నాగళ్ల, ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటించిన తాజా చిత్రం ‘పొట్టేల్’. తెలంగాణ రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కింది. స్టార్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా విడుదల చేసిన టీజర్‌ సంచలనం సృష్టించగా, ఇప్పటివరకూ విడుదలైన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో పొట్టేల్ నేడు ప్రేక్షకుల ముందుకువచ్చింది. తొలుత అంతగా అంచనాలు లేకున్నా ఇటీవల చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ నిర్వహించి సినిమాపై బజ్ పెంచింది. అయితే అసలు పొట్టేల్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి? ఇంతకూ ఈ సినిమా ఎలావుంది? సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న అనన్య నాగళ్లకు హిట్ పడిందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం..

కథ:

తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులకు దగ్గర్లో ఉండే విధర్భ ప్రాంతంలోని గుర్రంగట్టు ఊరిలో 1970, 80వ దశకంలో జరిగే కథ ఇది. ఆ ఊరి ఆచారాల ప్రకారం, గ్రామ దేవత బాలమ్మకు పుష్కరానికి (12 ఏళ్లకు) ఒకసారి జాతర జరిపి పొట్టేల్‌ను బలి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఆ ఊరి పటేల్‌కు బాలమ్మ పూనుతుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. ఇలా తరతరాలుగా పటేల్ వంశానికి అమ్మవారు పూనుతూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఆ ఊరి పటేల్ (అజయ్) పరమ క్రూరుడు. గ్రామంలోని బలహీన వర్గాల ప్రజలను బాలమ్మ పూనకం ముసుగులో రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తుంటాడు. అయితే చిన్నతనం నుంచి పటేల్‌కు బాలమ్మ పూనదు. కానీ తనకు బాలమ్మ పూనినట్టుగా నాటకం ఆడుతుంటాడు. ఈ విషయం బాలమ్మ పొట్టేల్‌కు కాపరిగా ఉండే గంగాధరీ (యువ చంద్ర)కి తెలుస్తుంది. దీని గురించి అతడు ఊరి జనాలకు చెప్పినా వారు నమ్మరు.

బాలమ్మ పూనకం అనే మూఢ నమ్మకం మాటున పటేల్ గుర్రంగట్టు ప్రజలపై అధికారం చలాయిస్తూ ఉంటాడు. బలహీన వర్గాల పిల్లలను విద్యకు దూరం చేస్తాడు. చదువుకోవడానికి ఆంక్షలు విధిస్తాడు. అలాంటి పటేల్‌కు వ్యతిరేకంగా గంగాధరీ తన కూతురు సరస్వతిని ఎవ్వరికీ తెలియకుండా ఆ ఊరి టీచర్ దుర్యోధన్ (శ్రీకాంత్ అయ్యంగార్) దగ్గర చదివిస్తుంటాడు. విషయం తెలుసుకున్న పటేల్, గంగాధరీ వద్ద ఉన్న పొట్టేల్‌ను మాయం చేస్తాడు.

దీంతో ఊరి జనం గంగాధరీ మీద ఆగ్రహం చెందుతారు. ఆ ఏడాది జాతర జరిపే సమయానికి ఆ పొట్టేల్‌ను తీసుకురావాలని ఆదేశిస్తారు. అంతేకాకుండా అప్పటివరకూ ఊరి నుంచి అతడిని వెలివేస్తారు. అయితే పొట్టేల్‌తో తిరిగి రాకపోతే దానికి బదులుగా గంగాధరీ కూతురిని బలి ఇస్తానని హెచ్చరిస్తాడు పటేల్. ఈ నేపథ్యంలో గంగా ఆ పొట్టేల్‌ వెతికి తీసుకురావడానికి సిద్దమవుతాడు.

ఇక ఈ పొట్టేల్ ఎక్కడుందో కనిపెట్టడంకోసం గంగాధరీ చేసిన ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో అతడికి ఎదురైన ఘటనలు ఏంటి? ఈ ప్రయాణంలో గంగాధరీ భార్య బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) అతడికి ఎలా తోడ్పడింది? గంగా పొట్టేల్‌ను తిరిగి తీసుకురాగలిగాడా? పటేల్ ఆగడాలకు అడ్డుకట్ట పడిందా? ఊరి ప్రజలకు నిజం తెలిసిందా? చివరకు ఏం జరుగుతుంది? అన్నది మిగతా కథ.

విశ్లేషణ:

పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కిన పొట్టేల్‌లో కథ పరంగా చాలా లేయర్స్ కనిపిస్తాయి. సామాజిక రుగ్మతలు, మూఢ నమ్మకాలు, బలహీన వర్గాల అణచివేత, చదువు ప్రాముఖ్యత, అది లేకపోవడం వల్ల జరిగే అనర్థాలు.. ఇలా ఎన్నో అంశాలను దర్శకుడు అద్భుతంగా చూపించాడు దర్శకుడు సాహిత్. పటేల్‌ను ఎదురించి తన కూతుర్ని చదివించుకోవాలనుకునే ఒక తండ్రి పడే తపన, తాపత్రయం ఇందులో మనకు కనిపిస్తుంది.

ప్రేక్షకుడికి పొట్టేల్ సినిమా ఓ జీవితాన్ని చూసిన ఫీలింగ్ కలుగజేస్తుంది. కథను చెప్పే విధానం ఆకట్టుకుంటుంది. ఈ విషయంలో దర్శకుడి మేకింగ్, నెరేషన్ టాలెంట్‌ కనిపిస్తుంది. అర్ధ శతాబ్దం కిందట ప్రజలు ఎలా బ్రతుకుతుండేవారో చూపిస్తూ మూవీ ప్రారంభంలోనే నేరుగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. అనంతరం ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ నెమ్మదిగా కథలో మెయిన్ ప్లాట్ వివరిస్తాడు. గంగాధరీ కూతురు చదువుకుంటుందనే విషయం పటేల్‌కు తెలిసాక ఉత్కంఠ పెరుగుతుంది.

దీంతో కీలక పాత్రల మధ్య కాన్‌ఫ్లిక్ట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలతో మూవీలో తర్వాత ఏం జరుగుతుంది? అనే ఇంట్రెస్ట్‌ను ఆడియెన్స్‌లో కల్పించాడు దర్శకుడు. క్లైమాక్స్ పార్ట్ అయితే సినిమాకి మంచి హై మూమెంట్‌లా అనిపిస్తుంది. పాప సెంటిమెంట్, చదువు విలువ గురించి చెప్పే సన్నివేశాలు గ్రిప్పింగ్‌గా ఉండి తాను చెప్పాలనుకున్నదాన్ని ఎక్కడా తడబాటు లేకుండా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనిపిస్తుంది.

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికొస్తే, ప్రతి ఒక్కరూ చాలా సహజంగా నటించారు. కొత్త కుర్రాడు యువ చంద్ర కృష్ణ చాలా బాగా నటించాడు. గంగాధరీ పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే అనన్య నాగళ్ల మరోసారి ఇంపార్టెన్స్ ఉన్న కారెక్టర్‌లో నటించింది. ఇంతకుముందు తను ‘వకీల్ సాబ్’, ‘మల్లేశం’ సినిమాల్లోని పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర అజయ్‌ది. ఇన్నాళ్లూ తనలోని ట్యాలెంట్‌ను మనవాళ్ళు సరిగా వాడుకోలేదనిపిస్తుంది. సినిమా విడుదలకు ముందు అజయ్‌ చెప్పినట్టే విక్రమార్కుడు తర్వాత మళ్ళీ ఆ రేంజ్ పాత్ర దొరికింది ఆయనకు. పటేల్ పాత్రలో క్రూరమైన విలన్‌గా తన సత్తాను చాటుకున్నాడు. నోయల్‌కి కూడా మంచి కారెక్టర్ దొరికింది. శ్రీకాంత్ అయ్యంగార్, ఛత్రపతి శేఖర్ ఉన్నంతలో బాగా నటించారు.

పొట్టేల్ టెక్నికల్‌ విషయానికొస్తే.. శేఖర్ చంద్ర అందించిన సంగీతం సినిమాకు మంచి బలం అయింది. అనేక సన్నివేశాల్లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇక మోనిష్ భూపతి రాజు సినిమాటోగ్ర‌ఫీ మూవీని మరో లెవెల్ కు తీసుకెళ్లింది. 1970ల నాటి పల్లెలు ఎలా ఉండేవో ఆర్ట్ డిపార్ట్‌మెంట్ అద్భుతంగా సృష్టించగా, భూపతి రాజు తన కెమెరాతో దానిని చక్కగా ఒడిసిపట్టాడు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్ గా ఉండి ఆకట్టుకునేలా ఉంది. ఖర్చుకు నిర్మాతలు రాజీపడలేదని అర్ధమవుతుంది.

పటేల్, పట్వారి వ్యవస్థలు రాజ్యమేలుతున్న కాలంలో నాటి పల్లె ప్రజలు, అణగారిన వర్గాలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాయి? అనే వాటిని దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించాడు. ఇప్పటితరంవారికి అంతగా తెలియని ఒకప్పటి తెలంగాణ పల్లె జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు.

పొట్టేల్‌లో సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశం ఉంటుంది. చదువుకి ఉన్న ప్రాముఖ్యతను తెలియచెబుతూ.. మూఢ నమ్మకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే విధంగా ఉంది. ఇది తెలంగాణ నేపథ్యంలోని కథ అయినప్పటికీ అన్ని ప్రాంతాల వారికీ నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా పల్లెటూర్లకు చెందినవారికి బాగా కనెక్ట్ అవుతుంది. మొత్తానికి పొట్టేల్ ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.