నటీనటులు: రావు రమేష్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, బిందు, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ తదితరులు
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాల్ రెడ్డి
ఎడిటింగ్: బొంతల నాగేశ్వరరావు
నిర్మాణం: పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్
నిర్మాతలు: బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య
సమర్పణ: తబితా సుకుమార్
దర్శకత్వం: లక్ష్మణ్ కార్య
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ విలక్షణ నటుడు రావు రమేష్ తొలిసారి కథానాయకుడిగా నటించిన చిత్రం ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ మూవీని క్రియేటివ్ జీనియస్ డైరెక్టర్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పిస్తున్నారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? రావు రమేష్ కథానాయకుడిగా మెప్పించాడా? అనేది ఇప్పుడు చూద్దాం..
కథ:
మారుతీనగర్‌కు చెందిన సుబ్రమణ్యం (రావురమేష్) ప్రభుత్వ ఉద్యోగం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. అందుకోసం ఒక్క పోలీసు ఉద్యోగానికి తప్ప మిగతా అన్ని పోటీ పరీక్షలు రాస్తాడు. ఈ క్రమంలో డీఎస్‌సీ పరీక్ష రాసిన సుబ్రమణ్యంకు టీచర్ జాబ్ వస్తుంది. అయితే అనుకోని కారణాల వలన కోర్టు స్టే విధించడం వలన ఆ జాబ్ పెండింగ్‌లో పడుతుంది. ఈ కేసు క్లియరై టీచర్ జాబ్ తనకు వస్తుందనే ఆశతో ఎదురుచూస్తూ పాతికేళ్లుగా వేరే ఉద్యోగం ఏదీ చేయకుండా ఖాళీగా ఉంటాడు.
దీంతో ఇంటి బాధ్యతలు అన్నీ ఆయన భార్య కళారాణిపై (ఇంద్రజ) పడతాయి. ఇక వీరి తనయుడు అర్జున్ (అంకిత్ కొయ్య)ది మరో వింత కథ. ఎల్లప్పుడూ పగటి కలలు కంటూ అందులోనే విహరిస్తుంటాడు. వాస్తవానికి తాను స్టార్ హీరో అల్లు అర్జున్ తమ్ముడినని, అయితే జీవితం విలువ తెలియడానికి తండ్రి అల్లు అరవింద్ తనను సుబ్రహ్మణ్యం దగ్గర పెంచుతున్నారనే భ్రమలో బ్రతుకుతుంటాడు.
ఇదిలా సాగుతుండగా.. ఒకసారి ఖర్చుల కోసం భార్యకు తెలియకుండా అత్తగారు (అన్నపూర్ణమ్మ) దాచుకున్న డబ్బును సుబ్రమణ్యం వాడుకుంటాడు. తల్లి మరణించిన తర్వాత కళారాణికి విషయం తెలిసి గొడవపెడుతుంది. చనిపోయిన తన తల్లి ఆఖరి కోరిక మేరకు ఆమె అస్థికలను పుణ్యనదుల్లో కలపడానికి తీర్థయాత్రలకు వెళుతుంది కళారాణి. ఆ సమయంలో తల్లి ఇన్సూరెన్స్ పది లక్షలు రావడంతో వాటిని ఇల్లు కట్టడానికి ఉపయోగించాలని భావించి ఆ డబ్బును భర్త అకౌంట్‌లో వేస్తుంది.
అయితే తన భార్యే ఈ డబ్బు వేసిందని తెలియక సుబ్రహ్మణ్యం ఆ డబ్బును ఖర్చుపెట్టేస్తాడు. విషయం తెలిసాక కంగారుపడతాడు. తీర్థయాత్ర నుంచి భార్య తిరిగి వచ్చే లోపు పది లక్షలు సంపాదించడానికి కొడుకు సాయం కోరతాడు. దీని తర్వాత ఏమైంది? డబ్బు కోసం వారు ఏం చేశారు? పది లక్షలు ఖర్చయిన విషయం కళారాణికి తెలిసిందా? అర్జున్ లవ్ చేసిన కాంచన (రమ్య పసుపులేటి) ఎవరు? ఆమె తండ్రి భాస్కర్ (హర్షవర్ధన్) కథేంటి? అర్జున్, కాంచన లవ్ స్టోరీ సక్సెస్ అయిందా? అన్నదే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం కథ.
విశ్లేషణ:
మారుతి నగర్ సుబ్రమణ్యం సినిమా కథ పరంగా చూస్తే.. థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా తీసినట్టు అర్ధమవుతోంది. ఆ ప్రయత్నం తొలి సన్నివేశం నుంచే కనపడింది. లాజిక్ కంటే సన్నివేశాల్లో మేజిక్‌నే నమ్ముకున్నట్టు కనిపిస్తుంది. అయితే విచిత్రంగా సినిమాకు ఇదే ప్లస్ పాయింట్ అయింది. దర్శకుడు లక్ష్మణ్ కార్య రైటింగ్‌లో కామెడీ టింజ్ బావుండటంతో బాగా వర్కవుట్ అయింది. దీంతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది.
దర్శకుడిగా, కథకుడిగా లక్ష్మణ్ కార్య స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ మీద పూర్తిగా కాన్సన్‍ట్రేట్ చేశాడని తెలుస్తోంది. అలాగని సినిమాలో ఎమోషన్స్ లేవని కాదు, కానీ వాటిని కూడా కామెడీ డామినేట్ చేసింది. ఇంటర్వెల్ వరకు కథ కంప్లీట్ కామెడీతో సాగుతుంది. సుబ్రహ్మణ్యం, అర్జున్ ఇరువురి పాత్రలు ఆడియెన్స్‌కి కితకితలు పెడతాయి. ఇక ఇంటర్వెల్ తర్వాత కథ కొంచెం ఎమోషన్ టచ్‌లో సాగుతుంది. అయినా ఎక్కడా కామెడీకి లోటుండదు.
తన ఖాతాలో పడిన పది లక్షలు ఖర్చు పెట్టేశాక, అది తన భార్య వేసిన డబ్బు అని నిజం తెలిసిన తర్వాత సుబ్రహ్మణ్యం పడే టెన్షన్ నవ్వు తెప్పిస్తుంది. ఇక ఆ డబ్బు కోసం బ్యాంకు అధికారులు పోలీసులను వెంటబెట్టుకుని ఇంటికి రావడం అనేది కొంచెం సినిమాటిక్ గా ఉన్నా.. కామెడీ క్రియేట్ చేసింది. ప్రవీణ్, జబర్దస్త్ నూకరాజు కామెడీ పర్వాలేదనిపిస్తుంది. అలాగే, ఓఎల్‌ఎక్స్ మోసాలపై తీసిన సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. రావు రమేష్ ఎలాంటి నటుడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏ పాత్ర ఇచ్చినా అందులోకి ఒదిగిపోయి తనదైన శైలిలో దానిని రక్తి కట్టిస్తాడు. ఈ సినిమాలోని సుబ్రహ్మణ్యం క్యారెక్టర్ సైతం అదే కోవలోకి వస్తుంది. ఇందులో ఆయన కామెడీ టైమింగ్, ఎమోషన్ సన్నివేశాల్లో ఆయన నటన మెప్పిస్తుంది. ఈ సినిమాతో తనలోని విలక్షణ నటనను మరోసారి ప్రదర్శించాడు.
ఇక అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి లవ్ ట్రాక్ యూత్ ని ఆకట్టుకునేలావుంది. ముఖ్యంగా అంకిత్.. నా తండ్రి అల్లు అరవింద్, నా అన్నయ్య అల్లు అర్జున్ అంటూ పదే పదే చెబుతుండటం హిలేరియస్ గా వుంది. తను ప్రేమించిన అమ్మాయిని ఊహించుకుంటూ పాడుకునే పాటల్లోనూ అల్లు అర్జున్ సూపర్ హిట్ సాంగ్స్ రీ క్రియేషన్ చేసిని విధానం చాలా హైలెట్‌గా ఉంది. ఇంద్రజ, హర్షవర్ధన్ తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు.
అలాగే టెక్నికల్ పరంగా ఈ సినిమా ఉన్నతంగా వుంది. కళ్యాణ్ నాయక్ పాటలు ఆకట్టుకున్నాయి. సిద్ శ్రీరామ్ పాడిన ‘మేడమ్ సార్ మేడమ్ అంతే’ ట్యూన్, చిత్రీకరణ సూపర్బ్. అలాగే నేపథ్య సంగీతం సైతం కామెడీ సన్నివేశాలకు తగ్గట్టుగా వుంది. ఎంఎన్ బాల్ రెడ్డి కెమెరా వర్క్ చాలా బావుంది. ఎడిటర్ బొంతల నాగేశ్వరరావు పనితనం కామెడీకి హెల్ప్ అయ్యింది. నిర్మాణ విలువలు బావున్నాయి. తబితా సుకుమార్ సమర్పణ వల్ల సినిమాకు మంచి ప్రచారం దక్కింది. మొత్తానికి మారుతీ నగర్ సుబ్రమణ్యం మూవీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























