రివ్యూ: తమ్ముడు

Thammudu Telugu Movie Review

నటీనటులు: నితిన్, సప్తమి గౌడ, లయ, వర్ష బొల్లమ్మ, శ్వాసిక విజయ్, సౌరభ్ సచ్‌దేవా, హరితేజ, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, చమ్మక్ చంద్ర, బలగం సంజయ్ కృష్ణ తదితరులు
సంగీతం: బి. అజనీష్ లోక్‌నాథ్
సినిమాటోగ్ర‌ఫీ: సమీర్ రెడ్డి, కెవి. గుహన్
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాణం: శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్
దర్శకత్వం: శ్రీరామ్ వేణు

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న మరో మూవీ ‘తమ్ముడు’. యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటి లయ చాలాయేళ్ల తర్వాత ఈ సినిమాతో మరోసారి టాలీవుడ్ లోకి కం బ్యాక్ ఇస్తోంది. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్‌కి సూపర్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో తమ్ముడు నేడు వరల్డ్ వైడ్‌గా థియేటర్లలోకి వచ్చేసింది. అయితే కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న నితిన్ ఈ సినిమాతో ఆ కోరిక నెరవేర్చుకోగలిగాడా? శ్రీరామ్ వేణు డైరెక్షన్ మెప్పించిందా? ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన లయ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుందా? సంక్రాంతికి వస్తున్నాం తర్వాత దిల్ రాజు మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకున్నారా? ఇంతకూ తమ్ముడు మూవీ ఎలావుంది? వంటి విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:-

కథానాయకుడైన జై (నితిన్) మిడిల్ క్లాస్ కుర్రాడు. తల్లిదండ్రులు, సోదరి స్నేహలత (లయ)తో కలిసి జీవిస్తుంటాడు. ఈ క్రమంలో స్నేహలత ప్రేమించిన వ్యక్తిని కాదనుకుని తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని వివాహం చేసుకోవలసి వస్తుంది. ఈ సమయంలో సోదరుడు జై తనకు అండగా నిలుస్తాడని ఆమె భావిస్తుంది. అయితే జై మౌనంగా ఉండి ఆమెను నిరాశపరుస్తాడు. దీంతో తమ్ముడి తీరుకి గుండె పగిలిన స్నేహలత ఇల్లు వదిలి వెళ్లి, అతన్ని మళ్ళీ చూడనని శపథం చేస్తుంది.

కొన్ని సంవత్సరాల తరువాత, వైజాగ్‌లో జరిగిన ఒక బాంబు పేలుడు నగరాన్ని కుదిపేస్తుంది. ఇందులో ప్రమేయమున్న ఒక ఫ్యాక్టరీ యజమాని ప్రభుత్వ అధికారులను బెదిరిస్తాడు. తనకు అనుకూలంగా నకిలీ నివేదికను సమర్పించమని వారిపై ఒత్తిడి తెస్తాడు. అయితే ఈ బృందంలో నిజాయితీగల అధికారిణి అయిన స్నేహలత ఈ కేసుకు నియమించబడిన వారిలో ఉన్నారు.

ఈ నేపథ్యంలో వైజాగ్ చుట్టుపక్కల అడవులలో జరిగే ఒక జాతరను వీక్షించేందుకు స్నేహలత కుటుంబంతో కలిసి ఆ గిరిజన గ్రామానికి వెళ్తుంది. ఇదే సమయంలో ఆమె ఇచ్చే రిపోర్ట్ వలన వలన తనకు ప్రమాదం ఉందని గ్రహించిన విలన్, కల్పిత నివేదికపై సంతకం చేయాలని డిమాండ్ చేస్తాడు. లేదంటే, ఆమె మొత్తం కుటుంబాన్ని హత్య చేస్తానని బెదిరిస్తాడు.

ఇక్కడినుంచి మిగిలిన కథ మొత్తం ఒక రాత్రిలో జరుగుతుంది. విషయం తెలుసుకున్న జై తన సోదరి కుటుంబాన్ని రక్షించడానికి సిద్దమవుతాడు. అయితే జై ప్రయత్నం ఫలించిందా? విలన్ బారినుంచి తన సోదరిని, ఆమె ఫ్యామిలీని సేవ్ చేయగలిగాడా? అభిప్రాయ భేదాలతో విడిపోయిన అక్క-తమ్ముడు మళ్ళీ కలిసిపోయారా? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:-

శ్రీరామ్ వేణు ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేస్తే, అన్ని దిల్ రాజు బ్యానర్‌లో తీసినవే కావడం గమనార్హం. ఇక కథ పరంగా చూస్తే.. ఇలాంటి సినిమాలు రావడం ఇదే మొదటిసారి కాదు. తెలుగు తెరపై ఇంతకుముందు ఇలాంటివి చాలా వచ్చాయి. అయితే దర్శకుడు శ్రీరామ్ వేణు దీనిని కొత్తగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఫ్యామిలీ డ్రామాలను అద్భుతంగా డీల్ చేయడంలో ఆయనకు మంచి పట్టుంది. ఇక ఇప్పుడు ఈ చిత్రం కూడా ఇదే తరహాలో రూపొందింది.

సినిమా ప్రారంభం కొంచెం స్లో గా మొదలవుతుంది. పాత్రల పరిచయానికి కొంచెం సమయం తీసుకున్నాడు దర్శకుడు. అయితే ఆ తర్వాత కథలో పెరుగుతుంది. విలుకాడు కావాలనే లక్ష్యంతో నితిన్ సాధన చేయడం, మరోవైపు అక్క లయ జీవితంలో ఒడిదుడుకులతో ఫస్టాఫ్ సాగుతుంది. సెకండాఫ్ నుంచి కథ యాక్షన్ వైపుకి టర్న్ తీసుకుంటుంది. ఇంటర్వెల్ ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ సినిమాకు బలం. అలాగే ఎమోషనల్ సీన్స్‌తో ముగిసే క్లైమాక్స్ మెప్పిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే.. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నితిన్ గురించి. ఇలాంటి కథను ఎంచుకున్నందుకు, ఈ పాత్రను సెలెక్ట్ చేసుకున్నందుకు ముందుగా ఆయనకు కంగ్రాట్స్. తన క్యారక్టర్‌లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. సాధారణ మధ్య తరగతి యువకుడిగా కనిపించిన నితిన్, అవసరమైతే తనలోని ఫైటర్‌ని కూడా చూపిస్తాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల కెరీర్‌లో ఇప్పటివరకు ఆయన విలుకాడుగా కనిపించలేదు, ఇదే ఫస్ట్ టైమ్. ఆ పాత్రకు ఆయన పర్‌ఫెక్ట్‌గా యాప్ట్ సరిపోయాడు.

అక్క ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం ఆరాటపడే తమ్ముడిగా నితిన్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆయన పలికించిన భావోద్వేగాలు ప్రేక్షకుడిని కంటతడిపెట్టిస్తాయి. ఇక ఈ చిత్రంలో మరో ముఖ్యమైన క్యారక్టర్ లయ. ఆమె మంచి సినిమాతో కం బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. మూవీ మొత్తానికి కీలకమైన పాత్ర ఆమెది. లయ కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాగా తమ్ముడు నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మిగిలిన వారిలో హీరోయిన్ సప్తమి గౌడకి మంచి పాత్ర లభించింది. కనిపించేది కొద్దిసేపే అయినా సినిమాని మలుపు తిప్పే పాత్రలో ఆమె నటన బావుంది. అలాగే వర్ష బొల్లమ్మ, శ్వాసిక విజయ్ లవి చిన్న పాత్రలే కానీ, వీరి స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. అలాగే హరితేజ, చమ్మక్ చంద్ర కామెడీ వర్కవుట్ అయింది. ఇక మిగిలినవారిలో సౌరభ్ సచ్‌దేవా, శ్రీకాంత్ అయ్యంగార్, టెంపర్ వంశీ, బలగం సంజయ్ కృష్ణ పాత్రలు కీలకమైనవి. వీరు తమ పాత్రల పరిధి మేరకు డీసెంట్‌గా నటించారు.

ఇక సాంకేతికంగా చూస్తే, సినిమా చాలా బావుంది. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించి. ‘కాంతారా’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ సినిమాకి బ్యాక్‌బోన్‌గా నిలిచింది. కేవలం పాటలే కాకుండా బీజీఎమ్ కూడా అద్భుతంగా ఉంది. చాలా సన్నివేశాలు కేవలం బీజీఎమ్ తో హైలైట్ అయ్యాయి. ప్రధానంగా యాక్షన్ సీన్స్‌, అలాగే క్లైమాక్స్ లోని భావోద్వేగ సన్నివేశాలను అజనీష్ తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో బాగా ఎలివేట్ చేశారు. ఇది ఆయనకు బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.

ఇక తమ్ముడు సినిమాకి మరో ఎస్సెట్ సమీర్ రెడ్డి, కెవి. గుహన్ సంయుక్తంగా అందించిన సినిమాటోగ్ర‌ఫీ. ఇలాంటి సినిమా ఆడియెన్‌కి కనెక్ట్ కావాలంటే ముఖ్యంగా కెమెరా వర్క్ చాలా ఇంపార్టెంట్. దీనికి తగ్గట్టే అడవి నేపథ్యంలో వచ్చే ప్రతి సన్నివేశం, షాట్ అద్భుతంగా ఉన్నాయి. థియటర్‌లో కూర్చున్న ప్రేక్షకుడికి చుట్టూ ఉన్న పరిసరాలు మర్చిపోయాడంటే అందుకు వీరిద్దరే కారణం. ప్రకృతి అందాలను వీరి కెమెరా చక్కగా ఒడిసిపట్టింది. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉండి విజువల్స్ అద్భుతంగా వున్నాయి.

ఇక ప్రవీణ్ పూడి ఎడిటింగ్ లో తన ప్రతిభ చూపాడు. కథ ప్రకారం అక్కడక్కడా కొంచెం స్లో అయినాకూడా ప్రేక్షకుడికి ఎక్కడా ఆ ఫీల్ కలుగకుండా చేశాడు. ఆయన ఎడిటింగ్ షార్ప్‌గా ఉండి సినిమాను బోర్ కొట్టకుండా చేసింది. అలాగే నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు హై క్వాలీటీతో సినిమాను నిర్మించినట్టు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మాత కావడంతో కథకి తగ్గట్టుగా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతోంది. మొత్తానికి ఈ మూవీ టెక్నికల్లీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు.

ఓవరాల్‌గా తమ్ముడు చిత్రం అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నితిన్ నటన, లయ పాత్రలోని ఎమోషన్, సప్తమి గౌడ సహా మిగిలిన నటీనటుల పాత్రలు, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం, శ్రీరామ్ వేణు డైరెక్షన్ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ముఖ్యంగా ఇది ఫ్యామిలీ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. దీనికితోడు డైరెక్టర్ శ్రీరామ్ తనదైన ట్రీట్‌మెంట్‌తో ఈ చిత్రాన్ని యాక్షన్ పరంగానూ స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి తమ్ముడు సినిమాతో నితిన్ చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నాడని చెప్పొచ్చు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.