యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరో. పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటైన ‘ఆర్ఆర్ఆర్’ లో ఎన్టీఆర్ భాగం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఆయన పాపులారిటీ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఒక దశాబ్దం క్రితం ఆయనకు ఇంత ఇమేజ్ లేదు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే తను స్టార్ హీరో. కానీ, ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపుతిప్పి తను ఈ స్థాయికి చేరుకోవడంలో, మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా కీర్తించబడటంలో కీలక భూమిక పోషించింది మాత్రం ఓ సినిమా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదే ‘టెంపర్’. డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా 2015లో రిలీజైన ఈ చిత్రంతో ఎన్టీఆర్ ఫేట్ మారిపోయింది. 19 ఏళ్లకే హీరోగా ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్న జూనియర్ చిన్నవయస్సులోనే స్టార్‌డమ్ సొంతం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయ్యాడు. ఆయన నటించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సరైన హిట్ కోసం ఆయన చేయని ప్రయత్నం లేదు.
అయితే అప్పటికే ఎంతో ట్యాలెంట్ ఉన్న నటుడిగా ప్రూవ్ చేసుకున్న ఎన్టీఆర్‌కి సరైన కథ పడితే చాలు మళ్ళీ ఆయన తారాజువ్వలా పైకి లేస్తాడని అందరికీ తెలుసు. అదుగో.. అలాంటి సమయంలో ఆయన కెరీర్‌కి ఊపిరినందించింది టెంపర్ సినిమా. కథ, కథనం, మాటలు, పాటలు, ట్విస్టులు, ఎలివేషన్స్, గూంజ్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు, హీరో క్యారక్టరైజేషన్, అద్భుతమైన క్లైమాక్స్.. వెరసి టెంపర్ సినిమా రూపంలో ఆయనకు అందింది.
అంతే.. విజయం అనే ఆకలితో నకనకలాడుతున్న ఎన్టీఆర్.. దరికి వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. సరైన కథ పడితే తనలోని నటుడు ఎలా విజృంభిస్తాడో అందరికీ తెలియజెప్పాడు. సినిమాలో కథానాయకుడైన ‘దయా’ పాత్రను ఆయన తప్పితే మరెవ్వరూ అంత గొప్పగా పోషించలేడు అనిపించుకున్నాడు. ప్రారంభంలో ప్రతినాయక ఛాయలుండే హీరో పాత్ర చివరికి వచ్చేసరికి దేవుడు అనే రేంజ్‌లో హైలైట్ అవుతుంది. దీనిని నభూతో.. అనే రీతిలో పోషించాడు ఎన్టీఆర్.
దయాగాడి దండయాత్రకు పదేళ్లు
టెంపర్ చిత్రం విడుదలై నేటికి దశాబ్దం పూర్తవుతోంది. గ్రిప్పింగ్ స్టోరీలైన్‌కు ఎన్టీఆర్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తోడై సినిమా అఖండ విజయం సాధించింది. నైతికంగా సంఘర్షణ ఉంటూ డైనమిక్‌గా కనిపించే పోలీసు ఆఫీసర్ దయా పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. ఇక దర్శకుడు టెంపర్ కోసం పూరి జగన్నాధ్ రాసిన తన మార్క్ ఐకానిక్ డైలాగ్‌లు అత్యంత జనాదరణ పొందాయి.
సాధారణంగా తాను దర్శకత్వం వహించే సినిమాలకు స్వయంగా కథను రాసుకునే పూరి, ఈ మూవీ కథను మాత్రం వక్కంతం వంశీ దగ్గరనుండి తీసుకోవడం గమనార్హం. ఎన్నో ఏళ్లుగా నటుడిగా, రచయితగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వంశీకి ఇన్నేళ్ళుగా రాని గుర్తింపు ఈ ఒక్క సినిమాతో వచ్చిందంటే, అర్ధం చేసుకోవచ్చు.. ఈ చిత్రం ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో.
సినిమాలోని ప్రధాన పాత్రధారుల మధ్య స్వభావరీత్యా వైరుధ్యాలు, మానసిక సంఘర్షణ, స్వార్ధపరుడైన కథానాయకుడు తాను చేసేది తప్పు అయినా ఒప్పుకోలేని అహం, అనూహ్య పరిణామాల మధ్య అతడిలోని మానవత్వం బయటికి రావడం.. ఇలా ప్రతిదీ చూసే ప్రేక్షకుడిని కట్టిపడేస్తుంది. సినిమా ఆరంభంలో హీరోని చూసి ‘ఛీ’ అనుకునే ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ కి వచ్చేసరికి అతడిని చూసి ముచ్చటపడతారు. ఆ పాత్రను అలా మలిచారు రచయిత, దర్శకుడు.
పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మించిన టెంపర్ 2015 ఫిబ్రవరి 13న విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, అలీ, సప్తగిరి, ప్రగతి, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేయడం విశేషం. స్వరబ్రహ్మ మణిశర్మ, యంగ్ కంపోజర్ అనూప్ రూబెన్స్ ఇరువురూ ఈ సినిమా కోసం పనిచేసారు. అనూప్ రూబెన్స్ అందించిన పాటలు ఇన్‌స్టెంట్ హిట్ అయ్యి చార్ట్ బస్టర్ అనిపించుకున్నాయి. అలాగే మణిశర్మ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చిత్రాన్ని మరోస్థాయిలో నిలబెట్టింది.
టెంపర్ కథ ఏంటంటే.. ?
కథానాయకుడైన దయా ఒక అనాథ. చిన్నతనంలో తాను ఎదుర్కొన్న కష్టాల కారణంగా త్వరగా డబ్బు సంపాదించి సెటిల్ అవ్వాలని కోరుకుంటాడు. తనకళ్లముందే పోలీసులు తరచుగా లంచాలు తీసుకోవడం చూసి అందుకు పోలీసు జాబ్ కరెక్ట్ అని భావిస్తాడు. దీంతో అడ్డదారిలో ఉద్యోగం సంపాదించి అవినీతిపరుడిగా మారతాడు.
ఈ క్రమంలో సబ్-ఇన్‌స్పెక్టర్ గా విశాఖపట్నంకు బదిలీ అవుతాడు. గాంధీ జయంతి నాడు స్మగ్లింగ్ కేసులో లోకల్ డాన్ వాల్తేర్ వాసు నలుగురు తమ్ముళ్లు రవి, మణి, వంశీ, సందీప్‌లను జైలు నుండి విడుదల చేస్తాడు. అయితే తన కింద పనిచేసే నిజాయితీపరుడైన కానిస్టేబుల్ నారాయణ మూర్తి అతడి తీరుని తప్పుపడతాడు.
ఇదిలా సాగుతుండగా.. బ్లూ క్రాస్ సభ్యురాలైన కథానాయిక సాన్వితో ప్రేమలో పడతాడు. అయితే సాన్వి పుట్టినరోజు నాడు వాసు అనుచరులు ఆమెను అపహరించి చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ, తాము కిడ్నాప్ చేసి చంపాల్సిన అమ్మాయి సాన్వి కాదని తెలుసుకుని వదిలేస్తారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో దయా, వాసు గొడవపడతారు.
ఈ సంఘటనతో షాక్ అయిన సాన్వి తన పుట్టినరోజు బహుమతిగా, వారు చంపడానికి ప్రయత్నిస్తున్న అమ్మాయిని కాపాడమని కోరుతుంది. దీంతో దయా మరోసారి వాసుతో కయ్యానికి సిద్దమవుతాడు. దీనిలో భాగంగా సదరు అమ్మాయి లక్ష్మిని రక్షించడానికి పూనుకుంటాడు. ఇది వాసుకి కోపం కలిగిస్తుంది. అయితే ఇంతకూ దయా లక్ష్మిని రక్షించగలిగాడా? అందుకు వాసు కోరిన ప్రతిఫలం ఏంటి? మధ్యలో మానభంగానికి గురై ప్రాణాలు కోల్పోయిన దీప్తి ఎవరు? చివరికి దయాలో మార్పు వస్తుందా? అనేదే మిగతా సినిమా.
కాగా టెంపర్ చిత్రం నుంచి ఇప్పటివరకూ.. అంటే ఈ పదేళ్లుగా ఎన్టీఆర్ కెరీర్‌లో అన్ని హిట్ సినిమాలే ఉండటం విశేషం. ఈ మూవీ నుంచి ఆయన స్టోరీ సెలక్షన్ మారిపోయింది. కాంబినేషన్స్, ఇతర కమర్షియల్ లెక్కలను పట్టించుకోకుండా కేవలం కథకి ప్రాధాన్యత ఇస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు తారక్. ఇక టెంపర్.. హిందీలో ‘సింబా’ (2018) పేరుతో, తమిళంలో ‘అయోగ్య’ (2019) పేరుతో పునర్నిర్మితమైంది. అయితే తమిళంలో సినిమా క్లైమ్యాక్స్ ను మార్చి తీశారు మేకర్స్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: