నటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా, ఈశ్వర్ రచిరాజు, మణికంఠ పరసు, శరణ్య సురేష్, తేజస్వి రావు, విషిక, షణ్ముకి నాగుమంత్రి తదితరులు
సంగీతం: అనుదీప్ దేవ్
సినిమాటోగ్రఫీ: ఎదురురోలు రాజు
ఎడిటింగ్: అన్వర్ అలీ
నిర్మాణం: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్
నిర్మాత: నిహారిక కొణిదెల, పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక
దర్శకత్వం: యదు వంశీ
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా డాటర్ నిహారిక కొణిదెల తొలిసారి నిర్మాతగా మారి తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. యదు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అందరూ కొత్త నటీనటులే నటించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి విడుదల చేశారు. ఇక ఈ చిత్రం విజయం సాధించిందా? లేదా? అన్నది ఇప్పుడు చూద్దాం.
కథ:
గోదావరి జిల్లాల్లోని ఓ మారుమూల గ్రామం పురుషోత్తంపల్లి. అక్కడ పన్నెండేళ్లకు ఒకసారి భరింకాళమ్మ జాతర వస్తుంది. ఈ జాతరలో ‘బలి చాట’ ఉత్సవం అనే ఘట్టానికి చాలా ప్రాముఖ్యత వుంటుంది. క్రితంసారి జాతరలో బలి చాటకు ఎదురువెళ్లిన ఆత్రం అనే యువకుడు మరణిస్తాడు. దీనితోపాటు స్థానికంగా ఉండే కులాల గొడవలు, రిజర్వేషన్లు తదితర అంశాలలో ఏర్పడిన గొడవల కారణంగా శివ (సందీప్ సరోజ్), సుబ్బు (త్రినాథ్ వర్మ), విలియం (ఈవ్వర్)తో పాటు చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన ప్రాణ మిత్రుల మధ్య దూరం ఏర్పడుతుంది.
ఈ నేపథ్యంలో మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత జాతర జరగనుండటంతో ఎలాంటి గొడవలు జరుగుతాయోనని ఊరి ప్రజలు భయపడుతుంటారు. జాతరలో బలి చాటను ఎత్తుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మరోవైపు ఈసారి జాతర జరిగిన పది రోజులకు ఆ ఊరి సర్పంచ్ ఎన్నికలు కూడా ఉంటాయి. ఇక ఆ ఊరికి చాలా ఏళ్లుగా సర్పంచ్‌గా కొనసాగుతుంటాడు పొలిశెట్టి బుజ్జి (సాయికుమార్). తన స్వార్థ రాజకీయాల కోసం ఊరి ప్రజల మధ్య కులాల గొడవలు రగిలించి వారు కలవకుండా చూస్తుంటాడు.
ఈ క్రమంలో వచ్చిన ఎన్నికల్లో శివ (సందీప్ సరోజ్) బుజ్జికి వ్యతిరేకంగా సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి ముందుకు వస్తాడు. పోయినసారి జాతరలో జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని జాతర జరిగే వరకు ఎటువంటి ఎన్నికల ప్రచారం వద్దని ఊరి పెద్దలు పంచాయితీలో తీర్పు ఇస్తారు.
దీని తర్వాత ఏం జరిగింది? ఎన్నికల్లో ఎవరు గెలిచారు? రిజర్వేషన్స్, కులాలు గొడవల వలన విడిపోయిన స్నేహితులు మళ్లీ కలిశారా? పన్నెండేళ్ల క్రితం జరిగిన గొడవను సమసిపోకుండా రగిలిస్తూ ప్రయోజనం పొందాలనుకునే వారు ఎవరు? ఇందులో ప్రెసిడెంట్ పోలిశెట్టి బుజ్జి పాత్ర ఏమిటి? జాతరలో బలిచాట ఎత్తడానికి ఎవరూ లేకపోతే శివ, అతని స్నేహితులు ఏం చేశారు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
‘కమిటీ కుర్రోళ్ళు’ స్వచ్ఛమైన పల్లెటూరి కథ. కల్లాకపటం తెలియని అమాయక జనాలు, వారి మధ్య అనుబంధాలు, స్థానిక రాజకీయాలు వీటన్నింటిని దర్శకుడు యదు వంశీ చాలా నాచురల్‌గా ప్రజెంట్ చేశాడు. కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అందుకు అనుగుణంగా స్పందించే పాత్రలు, అలాగే విచక్షణతో వ్యవహరించే అనుభవజ్ఞులు ఇందులో మనకు కనిపిస్తారు.
సినిమా ఫస్టాఫ్ లో ఈ పాత్రలతో ప్రేక్షకులను పురుషోత్తంపల్లిని పరిచయం చేస్తాడు. ఊహ తెలియని వయసులో, కులాల గురించి అవగాహన లేని మనసుల మధ్య స్నేహాన్ని యదు వంశీ చక్కగా ఆవిష్కరించారు. మొబైల్స్ లేని రోజుల్లో పిల్లల జీవితం ఎలా ఉండేదో చూపిస్తూ నోస్టాల్జియాలోకి తీసుకు వెళ్లారు. దీనికి అనుదీప్ దేవ్ మంచి మ్యూజిక్ తోడు కావడంతో కథ గురించి ఆలోచించకుండా కామెడీని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళతారు ప్రేక్షకులు.
ఒక అమ్మాయి ‘వాడు నాకు ముద్దు పెట్టాడు, నాకు కడుపు వస్తుంది’ అని ఏడవడం, సీడీల్లో కొన్ని సీన్లు కోసం కుర్రాళ్లు వెళ్లి అడిగే సన్నివేశం, 2003 వరల్డ్ కప్‌లో రికీ పాంటింగ్ బ్యాట్‌లో స్ప్రింగ్స్ పెట్టుకుని సిక్సులు కొట్టాడని డిస్కస్ చేయడం.. ఇలా ప్రతిదీ నవ్విస్తుంది. దీనిని కొనసాగిస్తూ కథను నెమ్మదిగా కామెడీ నుంచి సీరియస్ ఇష్యూ వైపుకు మళ్లించిన విధానం చాలా బావుంది.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే 15 ని.లు సినిమా మొత్తంలోకి హైలైట్ గా నిలుస్తుంది. దీన్ని చూసే ప్రేక్షకుడికి ఒక్కసారిగా ఉత్కంఠ, ఉద్విగ్నత పెరిగిపోతాయి. అయితే.. సెకండాఫ్ స్టార్ట్ అయ్యాక కథ అనుకున్నంత వేగంగా నడవదు. ఎప్పుడైతే సినిమా కామెడీ నుంచి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుందో అప్పుడే కథలో స్పీడు తగ్గింది.
అయితే వాస్తవానికి కులాల కుంపట్లు, రిజర్వేషన్స్ వంటి విషయాలను డీల్ చేయడం ఏ దర్శకుడికైనా సవాల్. ఈ విషయంలో డైరెక్టర్ యదు వంశీ వీటిని బాగా డీల్ చేశాడు. కానీ, కులాల కారణంగా దూరమైన స్నేహితులు మళ్లీ కలిసిప్పుడు వారి మధ్య దీనిపై కనీస చర్చ లేకుండా ముగించడం కొంచెం వెలితిగా అనిపిస్తుంది.
ఇక సర్పంచ్ ఎన్నికల ఎపిసోడ్ నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్లలో డైలాగ్స్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పీచ్ లను గుర్తు చేస్తాయి. అలాగే ఎన్నికలకు ముందు పల్లెటూళ్లలో జరిగే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కితకితలు పెడతాయి. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు వేసే ఎత్తులు, జాతరను సక్రమంగా నిర్వహించేందుకు స్నేహితులు చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా అనిపిస్తాయి.
ఇక సినిమాలో నటీనటులు అందరూ కొత్తవాళ్లే అయినా చాలాబాగా నటించారు. ప్రతి పాత్ర గోదావరి యాసలో మాట్లాడటం సినిమాకు ప్రత్యేకతను తీసుకొచ్చింది. అనుదీప్ దేవ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్ళింది. జాతర ఎపిసోడ్ సమయంలో వచ్చే రీ రికార్డింగ్ గూజ్ బంప్స్ తెప్పిస్తుంది. ఎదురురోలు రాజు కెమెరా వర్క్ అద్భుతంగా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. నిహారిక ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.
మొత్తానికి కమిటీ కుర్రాళ్లు సినిమా పల్లెటూర్లలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ఎంతటివారికైనా తమ చిన్ననాటి జ్ఞాపకాలను తట్టిలేపేలా ఉంది. ప్యూర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ మూవీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునేలా ఉంది. అలాగే విలేజ్ యువత ఒకవైపు చిలిపి పనులతో నవ్విస్తూనే మరోవైపు కులాల కుంపట్లు జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయో కూడా ఆలోచింపజేసేలా ఉంది. ఒక మంచి సినిమాను చూసిన అనుభూతిని కలగజేస్తుంది ఈ చిత్రం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: