రేణు దేశాయ్ గ్రీన్ ఛాలెంజ్ – ఛాలెంజ్ కాదు అందరూ ముందుకు రావాలి..!

Actress Renu Desai Urges Everyone To Come Forward To Take Part In Green Challenge

టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చాలా మంది ఇప్పటికే సెలెబ్రిటీస్ పాల్గొన్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను రేణు దేశాయ్ కూడా పూర్తి చేసింది. సంతోష్‌కుమార్ ప్రారంభించిన 3వ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయభాను ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి రేణు దేశాయ్ జూబ్లీహిల్స్ లోని పార్కులో తన కూతురితో మొక్కలు నాటించి గ్రీన్ ఛాలెంజ్ ను పూర్తి చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పుడు అందరూ అపార్ట్మెంట్ లలో ఉండటానికే ఇష్టపడుతున్నారు… మన చిన్నతనంలో మన ఇళ్లల్లోనే ఉండడంవల్ల ఆ చుట్టు పక్కల అప్పుడప్పుడు మన పెద్ద వాళ్ళు మొక్కలు నాటి పెంచుతూ ఉంటే మనం చూసి నేర్చుకునే వాళ్లం. కానీ ఈ కొత్త తరానికి చెట్లను ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం లేదు. కాబట్టి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఉదయభాను నాకిచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ రోజు నా కూతురు ఆద్య మరియు కూతురు స్నేహితురాలు యషిక ఇద్దరినీ నేను ఇక్కడికి తీసుకు వచ్చాను. వారికి మొక్కలను ఏ విధంగా నాటాలి.. మొక్కలు నాటడం వల్ల ఉపయోగం ఏమిటి.. అనే విషయాలు చెపుదామని వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది…ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా కూతురుతో కలిసి మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉంది. నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ముగ్గురికి ఛాలెంజ్ ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత’ అని తెలిపారు.

ఇక ఈ గ్రీన్ ఛాలెంజ్ లో ఇప్పటికే పలువురు టాలీవుడ్‌ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రభాస్, చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, సచిన్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, పీవీ సింధు, సైనా నెహ్వాల్‌, గోపీచంద్‌, వీవీ వినాయక్‌, యాంకర్‌ సుమ, అనసూయ, రష్మి తదితరులు ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించి.. పలువురికి ఈ సవాల్ ను విసిరారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here