‘లోకనాయకుడు’ కమల్ హాసన్, ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌ది కళాత్మకమైన కలయిక. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’, ‘శుభసంకల్పం’.. ఇలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు తెలుగునాట ‘క్లాసిక్స్’ స్టేటస్‌ను పొందాయి. అంతేకాదు.. ఇటు రివార్డులతోనూ అటు అవార్డులతోనూ వార్తల్లోకెక్కాయి. ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’ వంటి బ్లాక్‌బస్టర్స్ తరువాత కమల్, విశ్వనాథ్ కలయికలో వచ్చిన ‘శుభసంకల్పం’ వారిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా నిలిచింది. అలాంటి ‘శుభసంకల్పం’ విడుదలై నేటికి సరిగ్గా పాతికేళ్ళు. ఈ సందర్భంగా ఆ సినిమా జ్ఞాపకాల్లోకి వెళితే..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఊరి పెద్ద రాయుడు(కె. విశ్వనాథ్), అదే ఊరిలో రాయుడుని దేవుడిలా కొలిచే బెస్తవాడు దాసు (కమల్ హాసన్) మధ్య సాగిన కథే ‘శుభసంకల్పం’ సినిమా. ఇందులో కమల్‌కు జోడిగా ఆమని నటించగా.. ప్రియారామన్ కీలక పాత్రలో దర్శనమిచ్చింది. గొల్లపూడి మారుతీరావు, రాళ్ళపల్లి, కోట శ్రీనివాసరావు, ‘సాక్షి’ రంగారావు, ఏవీయస్, మల్లికార్జునరావు, శ్రీలక్ష్మి, వైష్ణవి ముఖ్య భూమికలు పోషించారు.
వేటూరి సుందరరామమూర్తి కలం నుంచి జాలువారిన పాటలకు స్వరవాణి కీరవాణి స్వరాలు సమకూర్చారు. “సీతమ్మ అందాలు”, “మూడుముళ్ళు వేసినాక చాటు లేదు”, “హైలెస్సో హైలెస్సో”, “శ్రీశైలంలో మల్లన్నా”, “హరిపాదాన పుట్టావంటే గంగమ్మా”, “నరుడి బ్రతుకు నటన”, “చిరంజీవి సౌభాగ్యవతి”, “చుక్కలన్నీ కలిసి చిత్ర కావేరి”.. ఇలా ప్రతీ పాట ప్రేక్షకాదరణ పొందింది. శ్రీ కోదండపాణి ఫిల్మ్ సర్క్యూట్ పతాకంపై గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రం.. ఉత్తమ నటి(ఆమని), ఉత్తమ గుణ చిత్ర నటుడు(కె.విశ్వనాథ్), ఉత్తమ సహాయనటి(వైష్ణవి), ఉత్తమ నేపథ్య గాయని(ఎస్.పి.శైలజ), ఉత్తమ ఎడిటర్(జి.జి.కృష్ణారావు) విభాగాల్లో ‘నంది’ పురస్కారాలను కైవసం చేసుకుంది. అలాగే, సౌత్‌కి సంబంధించి బెస్ట్ మూవీ(ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం), బెస్ట్ డైరెక్టర్(కె.విశ్వనాథ్), బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్(కీరవాణి) విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులను కూడా సొంతం చేసుకుందీ సినిమా. 1995 ఏప్రిల్ 28న విడుదలై ఘనవిజయం సాధించిన ‘శుభసంకల్పం’.. నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.




‘శుభసంకల్పం’ – కొన్ని విశేషాలు:
* కమల్ హాసన్, ఆమని జంటగా నటించిన తొలి సినిమా ఇది. అలాగే కమల్, ప్రియారామన్ స్క్రీన్ షేర్ చేసుకున్న ఫస్ట్ ఫిల్మ్ కూడా ఇదే.
* కమల్, కె.విశ్వనాథ్ కాంబినేషన్ మూవీకి తొలిసారి బాణీలు అందించారు కీరవాణి.
* ఈ సినిమాలోని “సీతమ్మ అందాలు” పాటకు గాను ‘నంది’ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు నేపథ్య గాయని ఎస్.పి.శైలజ. ఆమె కెరీర్‌లో ఇదే తొలి ‘నంది’ కావడం విశేషం.
* కమల్, విశ్వనాథ్ గత చిత్రాలు ‘సాగరసంగమం’, ‘స్వాతిముత్యం’కు సంబంధించి ఉత్తమ నటుడిగా కమల్ హాసన్, ఉత్తమ దర్శకుడిగా కె.విశ్వనాథ్ ‘నంది’ పురస్కారాలను అందుకోగా.. ‘శుభసంకల్పం’తో ఉత్తమ నటిగా ఆమని, ఉత్తమ గుణ చిత్ర నటుడిగా కె.విశ్వనాథ్ ‘నంది’ని సొంతం చేసుకున్నారు.
* కమల్, కె. విశ్వనాథ్ కాంబినేషన్ మూవీని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం నిర్మించడం ఇదే తొలిసారి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: