హగ్గింగ్ కూడా లేని హాంటింగ్ లవ్ స్టోరీ జాను

jaanu-movie-review

బోల్డన్ని ట్విస్టులు, మలుపులు, సెంటిమెంటల్ మెలో డ్రామాలు ఉన్న కథను ఒక భాష నుండి మరొక భాషలోకి రీమేక్ చేయడం ఈజీ. కానీ
అప్రకటిత ప్రేమల భావోద్వేగాల నేపథ్యంలో ఒక భాషలో రూపొంది విజయవంతమైన చిత్రాన్ని ఆ ఒరిజినల్ ఫీల్ అండ్ డెప్త్ మిస్ అవ్వకుండా మరొక భాషలోకి రీమేక్ చేయటం చాలా కష్టం. అందుకే చాలా వరకూ ఫీల్ గుడ్ ఫిలింస్ మాత్రం రీమేక్ అవ్వకుండా అనువాదాలుగా  మాత్రమే ఇతర భాషల్లోకి వెళుతుంటాయి. కానీ కొందరు అభిరుచి గల నిర్మాతలు మాత్రం అలాంటి చిత్రాలను కూడా ఒరిజినల్ ఫీల్ మిస్స్  అవ్వకుండా రీమేక్ చేయగలము అనే నమ్మకంతో ముందడుగు వేస్తారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి నిర్మాతగా అద్భుత విజయాలను అందుకుంటున్న ‘దిల్ రాజు’ తమిళంలో విజయవంతమైన 96 చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నానని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు…. కొందరు కామెంట్స్ కూడా చేశారు. అయితే నిర్మాతగా తన జడ్జిమెంట్ మీద గొప్ప కాన్ఫిడెన్స్ ఉన్న దిల్ రాజు ఒరిజినల్ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలోనే శర్వానంద్- సమంత లీడ్ పెయిర్ గా జాను పేరుతో ’96 ‘చిత్రాన్ని రీమేక్ చేసి ఈ రోజు విడుదల చేశారు.

[custom_ad]

తమిళంలో ఒరిజినల్ వెర్షన్ పెద్ద హిట్ కావటంతో పాటూ దిల్ రాజు మేకింగ్ మీద ఉన్న నమ్మకం కారణంగా జాను మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు విడుదలైన జాను ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.

కథాంశం :

మూస కథలు, మూస నేపథ్యాల చిత్రాలు చూసి చూసి మొహం మొత్తిన ప్రేక్షకులకు జాను నిజంగా ఒక వైవిధ్య చిత్రం అనే చెప్పాలి. దాదాపుగా ప్రతి వ్యక్తి జీవితంలోనూ కొన్ని అనూహ్య సంఘటనల అందమైన ఫ్లాష్ బాక్ ఉంటుంది. ముఖ్యంగా స్కూల్ అండ్ కాలేజీ లైఫ్ లో ఏర్పడే అపరిపక్వ ప్రేమల గతం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అప్పట్లో అనివార్య కారణాల వల్ల తమ ప్రేమను సక్సెస్ చేసుకోలేక పోయిన ప్రేమికులు 17 ఏళ్ల తరువాత అనుకోకుండా తారసపడితే కట్టలు తెంచుకునే వారి భావోద్వేగాలు ఎలా ఉంటాయి? ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి..? మనసుల ఆరాటానికి పరిస్థితుల ఒత్తిడికి మధ్య ఎలాంటి సంఘర్షణాత్మక స్థితి ఎదురవుతుంది అన్నదే జానులో ప్రధాన ఇతివృత్తం.

[custom_ad]

కథ :

రామచంద్ర (శర్వానంద్), జానకి ఉరఫ్ జాను( సమంత) విశాఖపట్టణం సెంట్ ఆన్స్ స్కూలులో చదువుతుంటారు. వారి మధ్య ఏర్పడిన అనుబంధాన్ని ప్రేమ అనాలో, ఆకర్షణ అనాలో చెప్పటం కష్టం. అవ్యక్త భావాల ఆ అందమైన అనుబంధం అనుకోకుండా విడిపోతుంది. కాలచక్రంలో 17 సంవత్సరాలు దొర్లిపోయాక ఓల్డ్ ఫ్రెండ్స్ మీట్ లో కలుసుకున్నారు రామ్ అండ్ జాను…. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే మిగిలిన కథ.

ఎలా ఉంది:

అద్భుతంగా లేదు.. అట్టహాసంగా లేదు.. భారీగా లేదు.. బరువుగా లేదు… కానీ హాయిగా, అందంగా, ఆహ్లాదంగా ఉంది… గిలిగింతగా.. పులకింతగా… గత స్మృతుల నెమరు వేతగా ఉంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హైస్కూల్ ఎపిసోడ్స్ చాలా ప్లజెంట్ గా సాగాయి.. ఇక 17 ఏళ్ల తరువాత కలిసిన రామ్ అండ్ జానుల భావోద్వేగాలను దర్శకుడు డీల్ చేసిన విధానం చాలా హుందాగా, కల్చర్డ్ గా అనిపిస్తుంది. ఎక్కడా క్యారెక్టర్ల క్యారెక్టర్ ఫాల్ అవ్వకుండా ఒకరిపట్ల ఒకరికి ఎంత ప్రగాఢమైన ప్రేమలు ఉన్నాయో దర్శకుడు చాలా హృద్యంగా చెప్పాడు. నిజానికి అలాంటి సందర్భాల్లో మనసుకు శరీరానికి మధ్య జరిగే సంఘర్షణలో క్యారెక్టర్ ను నిలుపుకోవటం అందరికీ సాధ్యపడదు. తమకు తామే కొన్ని ఎక్స్క్యూజ్ లు ఇచ్చుకుని బలహీనపడి లొంగిపోయే పరిస్థితిలో వారి మానసిక సంఘర్షణను చాలా హార్ట్ టచింగ్ గా తీశాడు దర్శకుడు ప్రేమ్ కుమార్.

[custom_ad]

ఎలా చేశారు:
ఇక పెర్ఫార్మెన్స్ పరంగా జాను చిత్రానికి గొప్ప అభినందనలు దక్కాలి. రామ్ అండ్ జాను పాత్రలకు శర్వానంద్- సమంతలను ఎంపిక చేసుకోవడమే తొలి విజయంగా అభినందించవచ్చు. నిజంగా ఆ పాత్రల మధ్య ఉన్న అమలిన ప్రేమను , పదిహేడేళ్ల నిరీక్షణ తాలూకు అలసటను, ఇన్నేళ్ళ తరువాత కలిసినప్పటి మెరుపును , చివరకు విడిపోయే  సందర్భంలోని భారమైన క్షణాల ఆర్ధతను అద్భుతంగా అభినయించారు శర్వానంద్ సమంత. ఈ ఇద్దరిలో ఏ ఒక్కరో గొప్పగా చేశారు అని చెప్పటం కరెక్ట్ కాదు. తమ తమ పాత్రల  లోతులను ఆకలింపు చేసుకుని  గొప్ప అభినయ ప్రమాణాలను  ఆవిష్కరించారు వారిద్దరు. ఇంకొక విశేషం ఏమిటంటే ఈ ఇద్దరిలో ఏ ఒక్కరో గొప్పగా నటించడానికి అవకాశం లేని ఈక్వల్ కెమిస్ట్రీ ఉన్న పాత్రలవి. ఇక యూత్ పెయిర్ గా నటించిన అబ్బాయి అమ్మాయి, వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్  కూడా చాలా  చాలా బాగున్నారు. ఇక స్కూల్ వాచ్ మెన్ గా రఘు బాబు, హీరో ఫ్రెండ్స్ గా వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, వర్ష తదితరులు వెల్డన్ అనిపించారు.

[custom_ad]

ఇక సాంకేతికంగా ప్రతి ఒక్కరి నుండి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ తీసుకోగలిగాడు దర్శకుడు ప్రేమ్ కుమార్. ఇక నిర్మాణ పరంగా శ్రీ వెంకటేశ్వర ఫిలింస్ అధినేత అయిన దిల్ రాజు  మేకింగ్ వాల్యూస్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అయినా జాను  లాంటి చిత్రాల నిర్మాణంలో  బడ్జెట్  కంటే నిర్మాత అభిరుచిని మాత్రమే అభినందనీయమైన అంశంగా పరిగణించాలి. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలా స్కేలింగ్ తో, ఫీలింగ్ తో ఇలాంటి   రేర్ ఫిలిమ్స్ ను రేటింగ్ చేయకూడదు. ఇలాంటి అరుదైన ప్రయత్నాలకు మినహాయింపులు లేని అభినందనలు అందించటం అవసరం. ముఖ్యంగా దిల్ రాజు లాంటి అభిరుచి, దక్షత గల నిర్మాతలు మాత్రమే చేయగల ఇలాంటి ఎటెంప్ట్స్ కు “రిమార్క్ లెస్ రివ్యూ” దక్కాలి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here