అందరూ ‘నిమ్మి’ అని ముద్దుగా పిలుచుకునే నిర్మల… విజయనిర్మల ఎలా అయింది!?

2019 Latest Telugu Movie News, Actress Vijaya Nirmala movies, Actress Vijaya Nirmala professional life story, Telugu Film Udates, Telugu Filmnagar, Tollywood Cinema News, Vijaya Nirmala Biography – Part 2, Vijaya Nirmala life story, Vijaya Nirmala real life story
Vijaya Nirmala Biography – Part 2
( గత ఎపిసోడ్ తరువాయి భాగం) మరి బాలనటి నుండి కథానాయికగా ఎదిగిన కథ ఏమిటి? హీరోయిన్ గా మీకు తొలి అవకాశం ఎలా వచ్చింది? విజయనిర్మల: బాలనటిగా నటించడం గానీ, హీరోయిన్ గా నటించడం గానీ ప్రయత్నపూర్వకంగా జరగలేదు. అంటే నాకై నేను ప్రయత్నించకుండానే వచ్చిన అవకాశాలను మాత్రం వెల్కమ్ చేశాను… సద్వినియోగం చేసుకున్నాను.” పాండురంగ మహత్యం” తరువాత గ్యాప్ వచ్చింది. అంటే అది బాలనటికి ఎక్కువగా- హీరోయిన్ కు తక్కువగా అనిపించే టీనేజ్. అలాంటి ఏజ్ లో వచ్చిన గ్యాప్ ను చదువుకు, డాన్స్ ప్రాక్టీస్ కు బాగా ఉపయోగించుకున్నాను. నేను వాణీ మహల్లో ఇచ్చిన ఒక నాట్య ప్రదర్శనకు ఎన్టీ రామారావు గారు చీఫ్ గెస్ట్ గా వచ్చి నాకు ప్రైజ్ ఇవ్వటం చాలా ఆనందంగా అనిపించింది. పదవ తరగతి పూర్తయ్యాక పెద్ద ఆసక్తి లేకపోవడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాను. అదే సమయంలో మా నాన్నగారి మిత్రుడు ప్రముఖ కెమెరామెన్ అయిన విన్సెంట్ గారు మలయాళంలో నిర్మిస్తున్న” భార్గవ నిలయం” సినిమాలో హీరోయిన్ కోసం అన్వేషిస్తున్నారు. అనుకోకుండా ఒక ఫంక్షన్లో నన్ను చూసిన విన్సెంట్ గారు నాన్న గారిని అడగటం.. ఆయన ఓకే అనటంతో కథానాయికగా నా జీవితం మరో మలుపు తిరిగింది. ఆ విధంగా తొలి చిత్రంతోనే మలయాళంలో టాప్ హీరో ప్రేమ్ నజీర్ గారి కాంబినేషన్లో  నటించే అవకాశం రావడం ఆ సినిమా పెద్ద హిట్ అవడంతో నాకు మలయాళ   రంగం నుండి ఆఫర్లు విపరీతంగా వచ్చాయి. ఇదిలా ఉండగా ఆ  మలయాళ సినిమా ఎడిటింగ్, డబ్బింగ్, ప్రింటింగు వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వాహినీ ల్యాబ్ లో జరుగుతుండగా బి.ఎన్.రెడ్డి గారు చూసి ఈ అమ్మాయి ఎవరు అని వాకబు చేశారట. మన సౌండ్ ఇంజనీర్ రామ్ మోహన్ రావు గారి అమ్మాయి అని చెప్పగానే ఆయన వెంటనే నాన్న గారిని పిలిపించి నన్ను తెలుగులో ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా చెప్పారు. నాన్నగారు, నేను చాలా ఆనందపడ్డాo. దానితో మలయాళంలో వచ్చిన ఆఫర్స్ ను కూడా నెగ్లెక్ట్ చేశాను. నేను మద్రాసులో పుట్టి పెరగడం వల్ల నా తెలుగు బాగా యాసగా ఉండేది. అప్పుడు నాకు, చంద్రమోహన్ కు స్పెషల్ గా క్లాసులు పెట్టించి తెలుగు నేర్పించారు. అలా తెలుగులో హీరోయిన్ గా ప్రారంభమైన నా తొలి చిత్రం” రంగులరాట్నం”. ఆ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం రోజున నాకు మేకప్ వేస్తున్న ఒక పెద్దాయన అజాగ్రత్తగా ఉండటంతో బ్రష్ నా కంట్లో గుచ్చుకుంది. కన్ను ఎర్రబడి నీళ్లు ధారగా కారుతున్నాయి. బి.ఎన్.రెడ్డి గారు సీరియస్ గా వచ్చి’ ఏంటి ఆలస్యం’ అని గదమాయించడంతో అందరం  కంగారుపడ్డాం… జరిగిన విషయం చెప్పాం. అప్పుడాయన ” మాధవరావు ఆ అమ్మాయికి నువ్వే మేకప్ వేసి తీసుకురావయ్యా” అని చెప్పి వెళ్లిపోయారు. అలా తొలిసారిగా తెలుగులో నాకు మేకప్ వేసిన మాధవరావు ఆ తరువాత కాలంలో మా కుటుంబానికి అత్యంత సన్నిహితులయ్యారు. తరువాత కాలంలో ఆయన కృష్ణ గారి పర్సనల్ మేకప్ మ్యాన్ గా సెటిలై నాలుగు దశాబ్దాల నుండి మాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే నా నట జీవితం ప్రారంభమైన ముహూర్త బలం ఏమిటో తెలియదు గానీ ఏరోజు నేను అవకాశాల వెంట పడలేదు… అవకాశాలే నన్ను వెతుక్కుంటూ రావడం నా అదృష్టం. ఒకవైపు “రంగులరాట్నం” షూటింగ్ జరుగుతుండగానే తెలుగులో హిట్ అయిన “షావుకారు” చిత్రాన్ని విజయా వారే తమిళంలో “ఎంగ్ వీట్టు పెన్” పేరుతో రీమేక్ చేస్తూ ఆ టైటిల్ రోల్ నాకు ఆఫర్ చేశారు. చాలా ఆనందంగా ఆ సెట్ లోకి ఎంటరయ్యాను. ఎదురుగా పెద్దపులిలాగా కూర్చుని ఉన్నారు ఎస్.వి.రంగారావు గారు. పక్కన ఎవరో ఈ అమ్మాయే హీరోయిన్ అని పరిచయం చేశారు. నమస్కారం పెట్టాను…”ఊ… ఊ ఈ అమ్మాయి హీరోయిన్ ఏమిటి? ఇంత పెద్ద బ్యానర్లో నా పక్కన ఇంత ముఖ్యమైన క్యారెక్టర్ ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తీసేయండి… వేరే అమ్మాయిని పెట్టండి” –  అనేసి వెళ్లిపోయారు. నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. దీవించాల్సిన పెద్దాయనే తీసేయండి అని చెప్పటంతో ఇక నాకు ఆ సినిమా లేనట్లే అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాను. అయితే మరుసటి రోజు ఉదయాన్నే మా ఇంటికి కారు వచ్చింది. యాజ్ టీజ్ గా మీకు షూటింగ్ ఉంది. అర్జెంటుగా తీసుకురమ్మన్నారు అన్నాడు మేనేజర్. వెంటనే రెడీ అయి సెట్ కు  వెళ్ళాను. అక్కడ ఎస్ వి  రంగారావు గారికి బదులుగా ప్రముఖ తమిళ నటుడు s v సుబ్బయ్య గారిని చూసి షాక్ అయ్యాను. ఇదేంటి అని అడగ్గా ” మిమ్మల్ని తీసేయమన్నందుకు డైరెక్టర్ గారు రంగారావు గారినే తీసేశారు’ అని చెప్పటంతో నాకు నోట మాట రాలేదు. అంటే ఆ రోజుల్లో దర్శక నిర్మాతలు ఎంత కమాండింగ్ గా వ్యవహరించేవారో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణగా చెప్తున్నానే తప్ప ఎస్.వి.రంగారావు గారిని తక్కువ చేయడం కాదు. ఆ తరువాత రంగారావు గారి కాంబినేషన్లో నేను చాలా సినిమాలు చేశాను. దర్శకనిర్మాతల కన్విక్షన్, కమాండింగ్ ఎంత పవర్ ఫుల్ గా ఉండేవో చెప్పటమే ఇక్కడ నా ఉద్దేశం.  ఇదిలా ఉండగా తెలుగులో “రంగులరాట్నం”, తమిళంలో” ఇంగ్ వీట్టు పెన్” కొద్ది రోజుల తేడాతో విడుదలై విజయవంతం కావడంతో హీరోయిన్ గా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే నా అసలు పేరు ‘నిర్మల’. ఓన్లీ నిర్మల అంటే కురసగా ఉందని పేరుకు ముందు ‘విజయ’ అని చేర్చు తున్నాం… కాబట్టి ఇక మీదట నీ పేరు “విజయనిర్మల” అని ఖరారు చేశారు విజయాధినేతలు. అప్పట్లో హిందీలో ‘ నిమ్మీ’ అనే ఒక పాపులర్ హీరోయిన్ ఉండేది. నిర్మల అయిన నన్ను అందరూ ‘నిమ్మి’ అని పిలిచేవారు. నిజానికి నేను ఆ హిందీ హీరోయిన్ ‘నిమ్మి’ కి ఫ్యాన్ను. అలాంటిది అందరూ నన్నే’నిమ్మి’ అంటుంటే చాలా ఆనందపడేదాన్ని. అయితే విజయా వారు నిర్మలకు ముందు విజయ చేర్చి నన్ను విజయనిర్మలను చేయడంతో అలాగే పాపులర్ అయ్యాను. అలా హీరోయిన్ గా తొలి చిత్రం మలయాళంలో, రెండవ చిత్రం తెలుగులో, మూడవ చిత్రం తమిళంలో చేయటం మూడూ కొద్ది నెలల గ్యాప్ లో విడుదల కావటం,మూడూ హిట్ అవటంతో హీరోయిన్ గా నాకు చాలా మంచి పేరు, గుర్తింపు వచ్చాయి. “రంగులరాట్నం” చిత్రానికి నేను తొలిసారిగా నంది అవార్డు కూడా అందుకున్నాను. * ఇలా వరుసగా 3 భాషలలో హిట్స్ సాధించి హ్యాట్రిక్ కొట్టిన మీకు ఏ రంగం అంటే ఇష్టం? అక్కడ నుండి మీ కెరీర్ ఎలా సాగింది? మీ జీవితంలోకి కృష్ణగారి ప్రవేశం ఎలా జరిగింది? విజయనిర్మల: మన ఇష్టాఇష్టాల కంటే మన అదృష్టం ఎక్కడ రాసి ఉంటే అక్కడే అవకాశాలు ఎదురొస్తాయి. నేను పుట్టి పెరిగింది మద్రాసులోనే అయినా స్వతహాగా తెలుగు అమ్మాయిని కావటంతో తెలుగు వైపే మొగ్గు చూపే దాన్ని. ఆశించినట్లుగానే తెలుగు లోనే మంచి ఆఫర్లు వచ్చేవి. ఇక బాపు గారి దర్శకత్వంలో వచ్చిన “సాక్షి” హీరోయిన్ గా నా 4వ సినిమా. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే నా నిజ జీవితానికి, సినీ జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన పరిణామాలు సంభవించాయి. నేను కృష్ణ గారిని” రంగులరాట్నం” షూటింగ్ జరుగుతున్నప్పుడే చూశాను. ” తేనె మనసులు” పూర్తయ్యాక ఆయన ఫ్రెండ్స్ తో వాహినీ స్టూడియోకు వస్తుండేవారు. నేను రంగులరాట్నం షూటింగ్ లో  ఉండేదాన్ని. ” హలో అంటే హలో” అనుకోవటం జరిగేది. ఇక” సాక్షి” షూటింగ్ కోసం పులిదిండి అనే ఫారెస్ట్ ఏరియాలో నెల రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు బాపు గారు. అందులో కృష్ణ గారు, నేను హీరో హీరోయిన్స్. కృష్ణ గారిది అమాయకమైన పాత్ర. కథ ప్రకారం మా అన్న జగ్గారావు హీరోను చంపటానికి వస్తుంటాడు. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే అప్పుడు మా అన్నయ్య నిన్ను చంపడు అని చెప్తాను నేను. అప్పటికప్పుడు అక్కడ ఉన్న దేవాలయంలో పెళ్లి చేసుకుంటాం. ఇదీ ఆ సన్నివేశం… ప్రతి షాట్ ను అద్భుతంగా, డీటెయిల్డ్ గా తీసే బాపు గారు ఆ పెళ్లి సన్నివేశాన్ని కూడా చాలా శాస్త్రోక్తంగా తీశారు. అప్పుడు రాజబాబు సరదాగా మమ్మల్ని ఆటపట్టిస్తూ” కృష్ణుడికి మీసాలు ఉన్న దాఖలాలు లేవు… ఇది మీసాల కృష్ణుడి గుడి… చాలా మహిమ కలిగింది… ఇప్పుడు మీకు జరిగింది ఉత్తుత్తి పెళ్లే అయినా సంవత్సరం తిరగకుండానే మీరు దంపతులు అవుతారు”- అని ఆటపట్టించడం మొదలు పెట్టాడు. మేము దాన్ని సరదాగా తీసుకుని నవ్వుకున్నాం. కానీ ఆ తరువాత వరుసగా నా చిత్రాలన్నీ  కృష్ణ గారి కాంబినేషన్లోనే కావటంతో మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఆ సాన్నిహిత్యం ప్రేమగా, ప్రేమ పెళ్లిగా పరిణమించింది. రాజబాబు అన్నట్లు సంవత్సరం తిరగకుండానే తిరుపతిలో మా పెళ్లి జరిగింది. ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడ్యూసర్ రాఘవ గారు, రమాప్రభ, సంధ్యారాణి, జర్నలిస్టులు కాగడా శర్మ, మోహన్ కుమార్ ఇంకా ఇతర మిత్రుల సమక్షంలో తిరుపతిలో మా పెళ్లి జరిగింది. *  అప్పట్లో మీ పెళ్లి చిత్ర పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది కదా.. మీ కుటుంబాలలో ఏవైనా అభ్యంతరాలు ఎదురయ్యాయా? గొడవలు జరిగాయా? (సశేషం) ( ఈ ఇంటర్వ్యూ తరువాయి భాగం ఎల్లుండి బుధవారం july 3 న చదవండి)

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=97Eh1bi1J7c]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here