20ఏళ్ళలో 25 – రాజకుమారుడు నుండి మహర్షి దాకా మహేష్ బాబు ప్రస్థానం

Journey of Mahesh Babu From Rajakumarudu to Maharshi,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Film Journey Starts From Rajakumarudu Movie,Super star Mahesh Babu Journey in TFI,Tollywood Super star Mahesh Babu Movies List,on Which Movie Mahesh Babu Started His Film Career,Film Journey of Mahesh Babu
Journey of Mahesh Babu From Rajakumarudu to Maharshi

సాధారణంగా ఒక స్టార్ కాంపౌండ్ నుండి ఒక నట వారసుడు పరిచయం అవుతున్నాడు అంటే అంచనాలు ఎంత గొప్పగా ఉంటాయో .. సందేహాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. కానీ “రాజకుమారుడు” చిత్రం ద్వారా సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు పరిచయం అవుతున్నప్పుడు మాత్రం అతని సక్సెస్ పట్ల ఎవరికి ఎలాంటి సందేహాలు లేవు. కారణం అంతకుముందే most successful చైల్డ్ ఆర్టిస్ట్ గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు మహేష్ బాబు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రసిద్ధ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించిన “రాజకుమారుడు” డెబ్యూ హీరోగా మహేష్ బాబుకు మంచి ఐడెంటిటీ ఇచ్చింది.అలా తొలి చిత్ర ఘన విజయంతో ప్రారంభమైన మహేష్ బాబు ప్రస్థానం అద్భుత విజయాలతో కొన్ని అనూహ్య పరాజయాలతో మిశ్రమ ఫలితాల సంగమంగా కొనసాగుతుంది.

1999 జులై 30న విడుదలయిన “రాజకుమారుడు” నుండి ఈ 20 సంవత్సరాల ప్రస్థానంలో మహేష్ బాబు హీరోగా నటించిన 24 చిత్రాలు విడుదల కాగా 2019 మే 9న విడుదల కానున్న  “మహర్షి” మహేష్ బాబు కు 25 వ చిత్రం గా ఒక ల్యాండ్  మార్కింగ్ ఫిల్మ్ కానుంది. జయాపజయాలను పక్కన పెట్టి ఇప్పటి వరకు విడుదలైన 24 చిత్రాలు మహేష్ బాబు కు ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క వైవిధ్యమైన అనుభవాన్ని ఇచ్చింది. వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగాను మహేష్ బాబు కెరీర్ ను ప్రభావితం చేస్తూ ఏ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో… ఎలాంటి అనుభవాలను, అనుభూతులను తనకు, తన అభిమానులకు అందించిందో విహంగ వీక్షణంగా చూద్దాం.


1) రాజకుమారుడు: 


హీరోగా మహేష్ బాబు పరిచయ చిత్రం “రాజకుమారుడు”  జులై 30-1999న విడుదలైంది.తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోగా పలు విజయవంతమైన చిత్రాలనునిర్మించిన అగ్రనిర్మాత అశ్వినీ దత్, అగ్ర దర్శకుడు కె.రాఘవేంద్రరావుల కాంబినేషన్లో తన తొలి చిత్రం “రాజకుమారుడు” రూపొందటంతో  నిర్మాణపరంగానే కాకుండా డెబ్యూ హీరోగా నటన పరంగా బలమైన పునాది పడింది. దానికి తోడు వారసత్వంగా వచ్చిన కృష్ణ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ మహేష్ బాబుకు శ్రీరామ రక్షగా నిలవటంతో తొలి చిత్రం అద్భుత విజయాన్ని సాధించి హీరోగా గొప్ప స్టాండింగ్ ఇచ్చింది. నటన, డాన్సులు, ఫైట్స్, అప్పియరెన్స్ ఇలా ప్రతి అంశంలోనూ తనదైన స్టైల్ తో అభిమానులను, ప్రేక్షకులను విశేషంగా అలరించి టాలీవుడ్ లో తన లాంగెస్ట్ ఇన్నింగ్స్ కు స్ట్రాంగెస్ట్ ఫుట్టింగ్ ఏర్పరచుకున్నారు మహేష్ బాబు.


2) యువరాజు :   

14 ఏప్రిల్ 2000 న విడుదలైంది     మహేష్ బాబు రెండవ చిత్రం “యువరాజు”. తొలి చిత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించిన మహేష్ బాబు రెండవ చిత్రాన్ని ఆయన శిష్యుడు వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో చేశారు. ఈ సినిమా బాగానే ఆడినప్పటికీ  అంచనాలు హై లెవెల్ లో ఉండటంతో వాటి హైట్స్ ను అందుకోలేకపోయింది. 9 పాటల ఈ సినిమా ఆడియో పెద్ద హిట్ అయినప్పటికీ రెండవ సినిమాకే  “యువరాజు” టైటిల్ కు భిన్నంగా హీరో ఆరేళ్ల బాబుకు తండ్రిగా నటించటం అభిమానులకు ఏ మాత్రం రుచించలేదు. దానికి తోడు ఈ సినిమాకు ముందు ఏప్రిల్ 5న విడుదలైన ” నువ్వొస్తావని”, ఏప్రిల్ 20న విడుదలైన” బద్రి” చిత్రాలు పెద్ద హిట్ కావడంతో సగటు ప్రేక్షకుడి మంత్లీ వ్యూవర్షిప్  బాగా చీలిపోవడంతో “యువరాజు” యబో యావరేజ్ కి పరిమితమైంది.


3 )వంశీ : 


అక్టోబర్ 4, 2000 న మహేష్ బాబు మూడో చిత్రంగా విడుదలైన ‘వంశీ’ సక్సెస్ పరంగా డిసప్పాయింట్ చేసినప్పటికీ  వ్యక్తిగతంగా తనకు రెండు మెమరీస్ ను అందించింది. తన తండ్రిగారైన సూపర్ స్టార్ కృష్ణ తో రెండవసారి (ఇప్పటివరకు ఆఖరి సారి) స్క్రీన్ షేర్ చేసుకోవడం … ఆ చిత్ర కథానాయిక “నమ్రతా శిరోద్కర్” మహేష్ బాబు నిజ జీవిత కథానాయిక కావడం వంటి రెండు అనుభూతులను మహేష్ బాబుకు అందించింది “వంశీ” చిత్రం.


4) మురారి : 


ఫిబ్రవరి 17, 2001న విడుదలైన  “మురారి”ని మహేష్ బాబుకు స్టార్ డమ్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతమైన హైప్  తీసుకువచ్చిన మ్యూజికల్ అండ్ విజువల్ బొనంజాగా  చెప్పుకోవచ్చు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్. రామలింగేశ్వరరావు నిర్మించిన “మురారి” మహేష్ బాబుకు ఒక మెమొరబుల్ హిట్ గానే కాకుండా నటుడిగా గొప్ప గుర్తింపు తెచ్చింది. మొదటి మూడు చిత్రాలు రాజకుమారుడు, యువరాజు, వంశీ మహేష్ బాబు ప్రవేశ, పరిచయాలకు ఉపకరిస్తే నాలుగో చిత్రమైన “మురారి” మహేష్ బాబు అసలు జైత్రయాత్రకు ప్రారంభ చిత్రంగా చెప్పుకోవచ్చు.


5) టక్కరి దొంగ:


జనవరి 12, 2002 న విడుదలైన “టక్కరి దొంగ” చిత్రాన్ని జయాపజయాలకు అతీతంగా ఒక స్టైలిష్ యాక్షన్ ఫిలింగా చెప్పుకోవాలి. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్ కు పరిచయం చేసిన “కౌబాయ్” కాన్సెప్టును చాలా కాలం తర్వాత రిపీట్ చేసిన వన్ అండ్ ఓన్లీ యంగ్ హీరో మహేష్ బాబు అని చెప్పాలి. జయంత్ పరాన్జీ నిర్మాణ, దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్  కమర్షియల్ గా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయినప్పటికీ మహేష్ బాబుకు ఒక స్టైలిష్ యాక్టర్ గా గొప్పపేరు తెచ్చింది.ఇందులోని “నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదులే” – అన్న పాట తెరమీద పాత్రకే కాదు నిజజీవితంలో కూడా మహేష్ బాబు వ్యక్తిత్వానికి, స్టయిల్ కు గొప్పగా షూట్ అయింది.


6) బాబీ: 


1 నవంబర్, 2002 న విడుదలైన “బాబి” చిత్రాన్ని మహేష్ బాబుకు ఎదురైన మొదటి డిజాస్టర్ గా చెప్పుకోవాలి. హీరోగా తన తొలి చిత్ర దర్శకుడైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు నిర్మాతగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మహేష్ బాబు అభిమానులను అన్ని విధాలా డిజప్పాయింట్ చేసింది. తొలిసారిగా ఒక డెబ్యూ డైరెక్టర్ కు అవకాశం ఇచ్చిన మహేష్ బాబు ఇప్పటివరకు విడుదలైన తన 23  చిత్రాలలో మరొకసారి అందుకు సాహసించ లేదు. మహేష్ బాబు ద్వారా ఒక డైరెక్టర్ పరిచయం కావటం అదే ఫస్ట్ అండ్ లాస్ట్.


7) ఒక్కడు: 


జనవరి 15, 2003న విడుదలైన “ఒక్కడు” మహేష్ బాబు కెరీర్ లోనే ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. కలెక్షన్ల పరంగా, పర్ఫార్మెన్స్ పరంగా, ఒక సరికొత్త ఇమేజ్ పరంగా, అవార్డుల పరంగా మహేష్ బాబు కెరీర్ లో ఒక మెమోరబుల్  ఫిల్మ్ గా నిలిచింది “ఒక్కడు”. ఈ సినిమా విషయంలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ కు ముందు హీరో మహేష్ బాబు, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత ఎమ్మెస్ రాజు, హీరోయిన్ భూమిక, సంగీత దర్శకుడు మణిశర్మ – ఈ ఐదుగురు ప్లాప్స్ లో ఉన్నారు. మహేష్ బాబుకు టక్కరి దొంగ, బాబి.. దర్శకుడు గుణశేఖర్ కు మనోహరం, మృగరాజు – హీరోయిన్ భూమికకు స్నేహమంటే ఇదేరా, వాసు వంటి ఫ్లాప్ లు ఉన్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మకు ఒక్కడు 50వ చిత్రం కాగా అంతకుముందు తనకి బాబి, చెన్నకేశవరెడ్డి వంటి ప్లాపులు ఉన్నాయి.. ఇక నిర్మాత ఎమ్మెస్ రాజు విషయానికి వస్తే అంతకు ముందు ఆయన వరుస విజయాలతో దూసుకుపోతున్నప్పటికీ ” నీ స్నేహం” ఆయన స్పీడ్ కు కొంచెం బ్రేక్ వేసింది. ఇలా అందరికీ ఒక మంచి బ్రేకింగ్ హిట్ కావలసిన తరుణంలో వచ్చిన టైమ్లీ  కమ్ బ్యాక్ ఫిలిం “ ఒక్కడు”.


8)నిజం: 


ఒక హిట్ వెనుక ఒక ప్లాప్ తప్పదు అన్న సెంటిమెంటును నిజం చేస్తూ వచ్చిన చిత్రం “నిజం ”. దర్శకుడిగా ఒక రేంజిలో చలరేగిపోతున్న తేజ దర్శకత్వంలో ఫస్ట్ అండ్ లాస్ట్ గా మహేష్ బాబు చేసిన చిత్రం “నిజం”. మే 23, 2003న విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ అయినప్పటికీ మహేష్ బాబుకు తొలిసారి బెస్ట్ యాక్టర్ గా “నంది అవార్డ్” తెచ్చిపెట్టిన చిత్రం “నిజం”. ఈ సినిమా విషయంలో మహేష్ బాబుకు, ఆయన అభిమానులకు దక్కిన ఊరట ఇదే.


9)నాని:


తొలిసారిగా  అక్క మంజుల కోసం తమ్ముడు మహేష్ బాబు చేసిన సినిమా ఇది. అలాగే  మహేష్ బాబు ఒక పరభాషా దర్శకుడి సినిమా చేయటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ” నాని” చిత్రాన్ని ఒక వికటించిన ప్రయోగంగా చెప్పుకోవాలి. 2004 మే 14న విడుదలైన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగినప్పటికి రిలీజ్ తరువాత బయ్యర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది.


10) అర్జున్: 


భారీ సెట్టింగులు, భారీ మేకింగ్, భారీ అంచనాల మధ్య 2004 ఆగస్టు 20 న విడుదలైన “అర్జున్” ఆ అంచనాలను అందుకోలేకపోయినప్పటికీ వెల్ మేడ్ ఫిలిం గా అభినందనలు అందుకుంది. అక్క మంజుల తర్వాత అన్నయ్య రమేష్ కు ఈ సినిమా చేశారు మహేష్ బాబు. అప్పట్లో ఈ సినిమా కోసం వేసిన మధుర మీనాక్షి దేవాలయం సెట్టింగ్ చూడటం కోసం సామాన్య జనంతో పాటు సినీ ప్రముఖులు కూడా క్యూ కట్టడం విశేషం. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ల ముందు అలాంటి క్యూలు  కనిపించక పోవటం బ్యాడ్ లక్.


11) అతడు: 


2005 ఆగస్టు 10న విడుదలైన “అతడు” చిత్రం గురించి రెండు విభిన్నమైన ఫలితాలను చెప్పుకోవాలి. థియేట్రికల్ గా జస్ట్ యావరేజ్ అయిన “అతడు” టీవీ ఛానల్ వ్యూవర్షిప్ విషయంలో ఒక ప్రభంజన విజయం అనే చెప్పాలి. టీవీ ప్రసారాలలో ఇన్ని ఎక్కువసార్లు టెలికాస్ట్ అయిన సినిమా కానీ… ఛానల్ కు ఇంత హైయెస్ట్ రెవిన్యూ తెచ్చిన సినిమా కానీ మరొకటి లేదు అనటంలో అతిశయోక్తి  ఏ మాత్రం లేదు. డైలాగ్ రైటర్ గా ఒక సరి కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి దర్శకుడిగా మారి త్రివిక్రమ్ శ్రీనివాస్ సృష్టించిన ఒక గొప్ప ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “అతడు”. సో… రిజల్ట్ పరంగా చెప్పాలంటే వెండితెర మీద ‘కలెక్షన్ డల్లు-బుల్లి తెరమీద హౌస్ ఫుల్లు’ అన్నట్లుగా విభిన్న ఫలితాలను ఇచ్చిన విలక్షణ చిత్రం “అతడు”.


12) పోకిరి:
అప్పటికి ఏడు పదుల పైబడిన తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డ్  ఏదీ  అంటే తిట్టు లాంటి  “పోకిరీ” – అని చెప్పటానికి కొంచెం ఇబ్బందిపడినప్పటికీ అది నిజం కాబట్టి ఆ ప్రభంజనాన్ని,ఆ సంచలనాన్ని అలా చూస్తూ ఉండిపోయింది టాలీవుడ్. వ్యక్తిగతంగా మహేష్ బాబు కెరీర్ లోనే కాకుండా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ హిట్ గా సంచలన విజయాన్ని సాధించిన “పోకిరి” కమర్షియల్ సినిమాకు సరి కొత్త నిర్వచనాలు చెప్పింది.2006 ఏప్రిల్ 28 న విడుదలైన” పోకిరి” చిత్ర నిర్మాణంలో తన అక్క మంజులని కూడా భాగస్వామిని చేసి “నాని” లాస్ కు డబల్ కాంపెన్సేషన్ గా అద్భుత విజయాన్ని అక్కకు బహూకరించాడు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. 


13) సైనికుడు: 


కథాపరంగా బాబి, నాని తరువాత మహేష్ బాబు నటించిన మోస్ట్ మీనింగ్ లెస్ subject ఏదైనా ఉంది అంటే అది “సైనికుడు” అనే చెప్పుకోవాలి. తలా తోకలేని కథతోరూపొందిన ఈ చిత్రం నవంబర్ 30 2006 న విడుదలైంది. తన తొలి చిత్ర నిర్మాత అశ్వినీ దత్ రెండవసారి రిపీట్ కాగా , తనకు” ఒక్కడు” లాంటి చిరస్మరణీయ విజయాన్ని అందించిన గుణశేఖర్ ఈ సినిమాతో మూడవ సారి రిపీట్ అయ్యారు. ఇలా  దర్శకుడు, నిర్మాత రిపీట్ అయినప్పటికీ రాజకుమారుడు, ఒక్కడు లాంటి హిట్  మాత్రం రిపీట్ కాలేదు. 


14) అతిధి:


2007 అక్టోబర్ 18న విడుదలైన మహేష్ బాబు 14 వ చిత్రం “ అతిధి” కూడా ఆశించిన విజయాన్ని అందుకోలేదు. తొలిసారిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన అతిధికి ఒక యాక్షన్ క్లాసిక్ గా మంచి పేరు వచ్చినప్పటికీ కమర్షియల్ గా సినిమా డిజప్పాయింట్ చేసింది. అన్నయ్య రమేష్ కోసం మహేష్ బాబు చేసిన రెండవ ప్రయత్నం కూడా ఫెయిల్ అవ్వటం బ్యాడ్ లక్.


15) ఖలేజా : 


అతడు తరువాత తనను మరలా డైరెక్ట్ చేయటానికి ” ఖలేజా” కథతో సిద్ధమైన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రిన్స్ మహేష్ బాబు.  అక్టోబర్ 7 2007న    విడుదలైన  ఈ సినిమా కూడా వీళ్ళ కాంబినేషన్ తొలి చిత్రం “అతడు” లాగానే రెండు డిఫరెంట్  రిజల్ట్స్ ఇచ్చింది. థియేట్రికల్ రిలీజ్ లో ఫెయిల్ అయిన ఈ చిత్రం శాటిలైట్ లో కుమ్మేసింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కోసం ఇప్పటికీ పార్టీలు ఆసక్తి చూపటం విశేషం.


16) దూకుడు:

2011 సెప్టెంబర్ 23 న విడుదలైన “దూకుడు”  చిత్రాన్ని మహేష్ బాబు కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా  చెప్పుకోవాలి. శ్రీను వైట్ల దర్శకత్వంలో మహేష్ బాబు తొలిసారిగా నటించిన”దూకుడు” కలెక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో చెప్పుకోదగిన ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడూ అండర్ యాక్టింగ్ చేసే మహేష్ బాబు తొలిసారి లౌడ్  యాక్టింగ్ తో అలరించటం విశేషం. ప్రస్తుత సంగీత సంచలనం తమన్ తొలిసారిగా మహేష్ బాబుకు మ్యూజిక్ చేసిన సినిమా దూకుడు.


17) బిజినెస్ మేన్:


2006లో “పోకిరి” లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తరువాత మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్ ఆరేళ్ల తరువాత “బిజినెస్ మాన్”తో  2012లో రిపీట్ అయింది. తొలిసారికమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు కొంత  నెగిటివ్ టచ్ ఉన్న ప్రాక్టికల్ క్యారెక్టర్  చేసిన మహేష్ బాబు కు మరోసారి మంచి హిట్ ఇచ్చాడు పూరి జగన్నాథ్. పోకిరి తర్వాత మహేష్ బాబు చేసిన మరొక స్టైలిష్ క్యారెక్టర్ ను బిజినెస్ మేన్ లొనే చూస్తాం. 2012 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు సంక్రాంతి హిట్స్ లో ఒకటిగా నిలిచింది. 


18) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: 


2013 జనవరి 11న విడుదలైన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” తో మహేష్ బాబు కు వరుసగా రెండవ సంక్రాంతి హిట్ లభించినట్లయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మహేష్ బాబు తొలిసారి విక్టరీ వెంకటేష్ తో  స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తరువాత మరో జనరేషన్ స్టార్ వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న మహేష్ బాబుకు  మంచి ఫలితం దక్కింది. ఇది దిల్ రాజు నిర్మించిన 25 వ చిత్రం కావడం ఒక విశేషమైతే అదే దిల్ రాజు మహేష్ బాబు 25వ చిత్ర నిర్మాతలలో ఒకరు  కావడం  మరో విశేషం. ఇక రిజల్ట్ దృష్ట్యా ” సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చక్కని ఫ్యామిలీ క్లాసిక్ గా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో  మహేష్ బాబుకు దూకుడు, బిజినెస్ మేన్ విజయాలను కలుపుకొని “హ్యాట్రిక్” లభించింది.


19) 1 – నేనొక్కడినే:


“దూకుడు” తరువాత 14 రీల్స్ సంస్థకు మహేష్ బాబు చేసిన రెండవ చిత్రం”1నేనొక్కడినే”. సెన్సిటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ఈ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించనప్పటికీ జనరేషన్ యూత్ కు కనెక్ట్ కావడం… విమర్శకుల ప్రశంసలు లభించటం కొంత ఊరట. జనవరి 10 ,2014న విడుదలయిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం వహించారు.


20 ) ఆగడు: 

ఒక టాప్ స్టార్ ఒక సంస్థకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయటం చాలా అరుదు.1 నేనొక్కడినే తరువాత వెంటనే 14 రీల్స్ సంస్థకు మహేష్ బాబు చేసిన సినిమా ఆగడు. దూకుడు వంటి సూపర్ హిట్ తరువాత శ్రీనువైట్ల కాంబినేషన్ రిపీట్ చేయగా 2014 సెప్టెంబర్ 19న విడుదలైన “ఆగడు” రిజల్ట్ పరంగా అందరికీ చేదు అనుభవాన్ని ఇచ్చింది. ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన తమన్ కు ఇది 50వ చిత్రం కాగా ఆయన గురువైన మణిశర్మ 50వ చిత్రమైన  “ఒక్కడు” హీరో కూడా మహేష్ బాబు కావడం విశేషం


21) శ్రీమంతుడు:


దూకుడు, బిజినెస్ మేన్ ,సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల హ్యాట్రిక్ తో మంచి ఊపు మీదున్న మహేష్ బాబుకు 1 నేనొక్కడినే, ఆగడు చిత్రాలు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ అయ్యాయి. అయితే  ఫ్లాపుల్లో హ్యాట్రిక్ అనే ప్రమాదంలో పడకుండా మహేష్ బాబును సేవ్ చేసిన బ్లాక్ బస్టర్ “శ్రీమంతుడు” ఆగస్టు 7, 2015 న విడుదలైంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు ప్రారంభ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన “శ్రీమంతుడు” మహేష్ బాబును కలెక్షన్లలో శ్రీమంతుడుగా నిలబెట్టింది. ఈ సినిమాతో ఊర్లను దత్తత తీసుకునే కాన్సెప్టు విపరీతంగా పాపులర్ అయింది.


22 )బ్రహ్మోత్సవం:


ఒక సూపర్ హిట్ వెనకాలే రెండు సూపర్ ప్లాపులు రావటం మరోసారి రిపీట్ అయింది. దానికి ప్రారంభ చిత్రంగా వచ్చింది” బ్రహ్మోత్సవం”. ఏ మాత్రం కథా బలంలేని భారీ కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన బ్రహ్మోత్సవం హీరోగా మహేష్ బాబుకే కాకుండా దర్శకుడు అడ్డాల శ్రీకాంత్, నిర్మాత పొట్లూరి వి ప్రసాద్ లకు ఒక ఘోర పరాజయంగా మిగిలింది. టాప్ యాక్టర్ లను సైతం జూనియర్ యాక్టర్లు గా చూపించేంత భారీ తారాగణంతో రూపొందిన ఈ కుటుంబ కథా తతంగం మే 20, 2016న విడుదలైంది.


23) స్పైడర్:


సాధారణంగా జయాపజయాలకు చలించని మహేష్ బాబును, ఆయన అభిమానులను తీవ్రంగా కలవరపరచిన డిజాస్టరస్ ప్లాప్ స్పైడర్. మహేష్ బాబు  నటించిన తొలి ద్విభాషా చిత్రం కూడా ఇదే. ఎస్.జె.సూర్య తరువాత మహేష్ బాబు పరభాషా దర్శకుడైన మురుగదాస్ దర్శకత్వంలో నటించి మరోమారు నిరాశజనకమైన ఫలితాన్ని పొందారు. కాగా తన తొలి పరభాషా దర్శకుడు ఎస్ జె  సూర్య ఇందులో మెయిన్ విలన్ కావటం మరో పెద్ద  డ్రా బ్యాక్ అయింది. శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత వరుసగా రెండు భారీ ఫ్లాప్ లను ఎదుర్కొన్నారు మహేష్ బాబు.


24) భరత్ అనే నేను:


1-నేనొక్కడినే, ఆగడు చిత్రాల వరుస ఫ్లాపుల తర్వాత హ్యాట్రిక్ ప్లాప్స్ ఎదురవకుండా” శ్రీమంతుడు” కాపాడితే మరలా బ్రహ్మోత్సవం,స్పైడర్ తర్వాత మరో హ్యాట్రిక్ ప్లాప్స్ ఎదురవకుండా నిలువరించిన సేవియర్” భరత్ అనే నేను”. ఈ రెండు చిత్రాలకు కొరటాల శివ దర్శకుడు కావడం విశేషం.


25) మహర్షి:


“భరత్ అనే నేను” మహేష్ బాబు కెరీర్లో టాప్ గ్రాసర్ గా నిలిచిన నేపథ్యంలో తదుపరి చిత్రం మీద అంచనాలు అంబర చుంబితంగా ఉండటం సహజం. దానికి తోడు అశ్వనీదత్, దిల్ రాజు, పొట్లూరి వి ప్రసాద్ వంటి ముగ్గురు అగ్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని నిర్మించడం ప్రత్యేక ఆకర్షణ. ఈ ముగ్గురు నిర్మాతలు మహేష్ బాబు తో విడివిడిగా సినిమాలు తీసినవారే. ఈ ముగ్గురు టాప్ ప్రొడ్యూసర్స్ కు వంశీ పైడిపల్లి అనే ఒక ప్రామిసింగ్ డైరెక్టర్ తోడవటంతో ” మహర్షి” మీద అంచనాలు చాలా హై లెవెల్ లో ఉన్నాయి. మే 9, 2019 న విడుదల కానున్న “మహర్షి” మహేష్ బాబు కెరీర్ లో మరొక మరపురాని ఘనవిజయంగా నిలుస్తుందని ఆశిద్దాం.


ఇవీ…20 ఏళ్లలో 25 చిత్రాల ప్రస్థానంలో మహేష్ బాబు జయాపజయాల విశేషాలు. 8 నంది అవార్డులు, ఐదు ఫిలింఫేర్ అవార్డులు, 3 సినీ’మా’ అవార్డులు- ఇంకా ఎన్నో సాంస్కృతిక సంస్థల అవార్డులు, కోట్లాది అభిమానుల రివార్డులు అందుకొని సూపర్ స్టార్ కృష్ణకు తగిన వారసుడిగా , మోస్ట్ డిసైర్డ్ హ్యాండ్సమ్ హీరోగా, రిచెస్ట్ సెలబ్రిటీగా ఎన్నోసార్లు ఫోర్బ్స్ వంటి అంతర్జాతీయ పత్రికల జాబితాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న మహేష్ బాబు 25 వ చిత్రం”మహర్షి” విడుదల సందర్భంగా తన తరఫున, తన పాఠకుల తరఫున హృదయపూర్వక శుభాభినందనలు పలుకుతోంది “దతెలుగుఫిలింనగర్.కమ్” .

[subscribe]


[youtube_video videoid=RpVd4bspD4k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 7 =