వివాదాలతో ప్రారంభమైన “లక్ష్మీస్ ఎన్టీఆర్” చివరకు అనేకానేక వివాదాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను డైరెక్ట్ చేయమని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఆఫర్ ఇచ్చి ఉండకపోతే అసలు ఈ “లక్ష్మీస్ ఎన్టీఆర్” అనే సినిమానే ఉండేది కాదు. ఎన్టీఆర్ బయోగ్రఫీ అంటే ఆయన చివరి క్షణం వరకు జరిగిన అన్ని విషయాలు ఉండితీరాలి అప్పుడే అది సమగ్రమైన జీవిత చరిత్ర అవుతుంది అన్నది రాంగోపాల్ వర్మ నిశ్చితాభిప్రాయం. ఆ విషయంలో ఏకాభిప్రాయం కుదరక పోవడం వల్లనే రాంగోపాల్ వర్మ “లక్ష్మీస్ ఎన్టీఆర్” రూపకల్పనకు పూనుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ రోజునే ఈ చిత్ర కథాంశం లక్ష్మీపార్వతి వైపు పాజిటివ్ స్టాండ్ , ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, చంద్రబాబు నాయుడుల వైపు నెగిటివ్ స్టాండ్ తీసుకుంటుంది అని అర్థమైంది. అయితే మొదట్లో దీనిని లక్ష్మీపార్వతి కోణం నుండి ఇంత పాజిటివ్ గా, చంద్రబాబు నాయుడు కోణం నుండి ఇంత నెగిటివ్ గా తీసే ఉద్దేశం వర్మకు లేకపోయినప్పటికీ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి చెలరేగిన వివాదాలు, పెరిగిన అంచనాలు, వేడెక్కిన రాజకీయ వాతావరణం ఇవన్నీ కలిసి “లక్ష్మీస్ ఎన్టీఆర్” ను పూర్తిగా లక్ష్మీపార్వతికి అనుకూలంగా తీసే లాగా వర్మ మైండ్ సెట్ ను మార్చాయి అనిపిస్తుంది.
ఈ సినిమా చూశాక లక్ష్మీపార్వతిని తెలుగు సినిమాల్లోని గొప్ప త్యాగశీలి అయిన ఉదాత్త కథానాయికగా , చంద్రబాబు నాయుడును ఫక్త్ తెలుగు సినిమా ప్రతి నాయకుడిలా అనుకుంటే అది ప్రేక్షకుడి తప్పు కాదు. వాస్తవాల పేరుతో వర్మ ఆనాడు జరిగిన రాజకీయ పరిణామాలను వాస్తవికంగానే తీస్తాడు అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడును, నందమూరి కుటుంబ సభ్యులను మరీ ఇంత ప్రతినాయక ధోరణిలో చూపిస్తాడని ఊహించలేదు. కాబట్టి లక్ష్మీస్ ఎన్టీఆర్ ను రెగ్యులర్ సినిమా ఫార్మేట్ లో విశ్లేషిస్తే ఇందులో నిస్సహాయ కథానాయకుడిగా ఎన్టీఆర్ ను, ఉదాత్త కథానాయికగా లక్ష్మీపార్వతిని, దుష్ట దుర్మార్గ ప్రతినాయకుడిగా చంద్రబాబు నాయుడును చూస్తాం.
ఇక రివ్యూ లో భాగంగా కథాంశం విషయానికి వస్తే – 1989 ఎన్నికలలో పరాజయంపాలై ఒక్కడిగా, ఒంటరిగా మిగిలిపోయిన ఎన్టీ రామారావు జీవితంలోకి జీవిత చరిత్ర రాస్తాను అంటూ లక్ష్మీపార్వతి ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా. అలా ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించిన లక్ష్మీపార్వతి క్రమంగా ఆయనకు ఎలా చేరువైంది… ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఎలా విరోధి అయింది చూపించే క్రమంలో సహజంగానే లక్ష్మీపార్వతి పాత్రను చాలా ఉదాత్తంగా చూపించాడు వర్మ. అందులో ఆక్షేపణీయమైనదేమీ లేదు.
అయితే అదే సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను, చంద్రబాబు నాయుడును, కొందరు ఎమ్మెల్యేలను దుష్ట కూటమిగా చిత్రీకరించటంలోని సమర్థనీయత ప్రశ్నార్థకంగా అనిపిస్తుంది. ఆనాడు ఎన్టీఆర్ కుటుంబంలోని ఆంతరంగిక సంక్షోభాన్ని ఏకపక్షంగా జడ్జి చేయటంతో ఇది రాంగోపాల్ వర్మ ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ ను సూచించింది. నిజానికి ఆనాటి మొత్తం వ్యవహారంలో ఎవరి దృష్టికోణంలో వాళ్లు కరెక్ట్. ఒంటరితనంతో బాధపడుతున్న ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి సహచర్యాన్ని కోరుకోవటంలో తప్పులేదు. లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ కు చేరువ కావటంలో ఆమె తప్పు లేదు. 1989 ఎలక్షన్స్ తరువాత నాచారం స్టూడియోలో ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఎన్టీఆర్ ను కుటుంబ సభ్యులు ఆదరించలేదు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. మొదటి నుండి ఎన్టీఆర్ కు ఆయన సంతానానికి మధ్య ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో… అంత దూరం కూడా ఉంది. అడవిలో మృగరాజును మిగిలిన జీవరాశి దూరం నుండి భయభక్తులతో చూసినట్లుగానే ఎన్టీఆర్ అనే సింహాన్ని కుటుంబ సభ్యులు కూడా దూరం నుండి భయ భక్తులు ప్రదర్శించే వారు తప్ప ఆయన ఒడిలో కూర్చునేంత చనువు, చొరవ ఉండేవి కావన్నది అందరికీ తెలిసిన వాస్తవం. నిజానికి ఆయన ఆలనాపాలనా చూసుకోవటానికి అంత మంది కుటుంబ సభ్యులలో ఎవరూ లేరు అన్నది వాస్తవం కాదు.
89 ఎలక్షన్స్ లో ఓటమిపాలైన తరువాత ఆయన ఎక్కువగా ఒంటరితనాన్ని ఇష్టపడేవారు. ఈలోపులో ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశం జరిగింది. ఇది ఎవరు ఊహించని పరిణామం. దీని పట్ల నందమూరి కుటుంబ సభ్యులు పాజిటివ్ గా స్పందించాలని, స్పందిస్తారని అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ ఎన్టీఆర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీఆర్, లక్ష్మీ పార్వతి పాయింట్ ఆఫ్ వ్యూ లో లక్ష్మి పార్వతి, నందమూరి కుటుంబ సభ్యుల పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్లు కరెక్ట్. ఇది వాళ్ల వాళ్ల అంతరంగిక సంఘర్షణకు, భావోద్వేగాలకు సంబంధించిన ఆంతరంగిక కుటుంబ వ్యవహారం. దీన్ని జడ్జి చేస్తూ వీళ్లు కరెక్టు.. వాళ్లు కరెక్టు.. అని తీర్పులు చెప్పటం కరెక్ట్ కాదు. ఈ మొత్తం ఎపిసోడ్ లో విలన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ‘విధి’ మాత్రమే. నిజానికి ఎన్టీ రామారావు మహానటుడు, మహామహుడే అయినప్పటికీ ఆయనది విపరీతమైన భావోద్వేగ మనస్తత్వం. ఇలాంటి నేపథ్యంలో చేజారిపోతున్న పరిస్థితులను చేజిక్కించుకోవటానికి ఎవరి చాకచక్యం, ఎవరి చాణక్యం వారిది. అయితే ” లక్ష్మిస్ ఎన్టీఆర్” లో వాస్తవ పరిస్థితుల సమతుల్యతను ఆవిష్కరించడానికి బదులుగా ఏకపక్షంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను, నారా చంద్రబాబు నాయుడును పూర్తిస్థాయి సినిమా “విలన్స్ గ్యాంగ్” గా చూపించటంతో వాస్తవాల ఆవిష్కరణ మరుగున పడిపోయింది… వాస్తవాల ఆవిష్కరణలో సమతుల్యత లోపించింది. ఆ సమతుల్యతా లోపాన్ని మినహాయిస్తే “లక్ష్మీస్ ఎన్టీఆర్” మిగిలిన అంశాలలో బాగుంది అని చెప్పవచ్చు.
లక్ష్మీపార్వతి ప్రవేశం, ఆమె ఎన్టీఆర్ కు చేరువైన విధానం, వీరగంధం సుబ్బారావు నిస్సహాయత, ఎమ్మెల్యేల అసంతృప్తి, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నిరసన వంటి అంశాలను ఆసక్తికరంగా తెరకెక్కించారు రాంగోపాల్ వర్మ. అయితే ఎన్టీఆర్ మేజర్ చంద్రకాంత్ ఫంక్షన్లో లక్ష్మీపార్వతి ని వేదికపైకి పిలిచి ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రకటించిన ఇంటర్వెల్ బ్యాంగ్ ఈ సినిమాకు చాలా కీలకం. కానీ ఆ సన్నివేశ చిత్రీకరణ చాలా పేలవంగా అనిపించింది. అయితే వాస్తవ అవాస్తవాల జడ్జిమెంట్ సంగతి పక్కన పెడితే ఆనాటి పరిణామాలన్నింటికి ప్రత్యక్ష సాక్షులు అయిన జనం వాటికి తప్పకుండా రిలేట్ అవుతారు. అలా రిలేట్ అవుతారు అన్న నమ్మకమే ఈ సినిమా రూపకల్పనకు పునాది.
ఇక నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని ఒక ట్రయాంగిల్ మెలోడ్రామా గా అనుకుంటే ఆ ట్రయాంగిల్లో కనిపించే మూడు ప్రధాన పాత్రలు ఎన్టీఆర్ (విజయ్ కుమార్) లక్ష్మీపార్వతి (యజ్ఞ శెట్టి) చంద్రబాబు నాయుడు (శ్రీ తేజ్). ఈ ముగ్గురి సెలక్షన్ విషయంలో రాంగోపాల్ వర్మ కు హ్యాట్సాఫ్ చెప్పక తప్పదు. ఎవరి పాత్రకు వాళ్ళు గొప్పగా నప్పారు… గొప్పగా నటించారు. ముఖ్యంగా లుక్ అండ్ ఫీల్ విషయంలో చంద్రబాబు నాయుడు పాత్ర పోషించిన శ్రీ తేజ్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. మిగిలిన పాత్రలు-పాత్రధారుల విషయాన్ని వర్మ లైట్ గా తీసుకున్నట్లున్నాడు.
ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే రాంగోపాల్ వర్మ – నరేంద్రల డైలాగ్ వెర్షన్ బాగుంది. కళ్యాణ్ మాలిక్ మ్యూజిక్ అండ్ బ్యా గ్రౌండ్ స్కోర్ లు సినిమాను నిలబెట్టాయి. వాస్తవంగా డాక్యుమెంటరీ ఫీచర్స్ ఉండే ఇలాంటి సినిమాలో పాటలు అవసరం లేకపోయినా ఇందులో చాలా సిచువేషనల్ సాంగ్స్ ఉన్నాయి. సిరాశ్రీ రాసిన అన్ని పాటలు బాగున్నాయి. మిగిలిన సాంకేతిక అంశాలు ఓకే. ఎన్హెచ్ స్టూడియోస్, ఆర్జివి గన్ షాట్ ప్రొడక్షన్స్ మేకింగ్ స్టాండర్డ్స్ అవసరమైన మేరకు బాగానే ఉన్నాయి.
ఇక రాంగోపాల్ వర్మ తన కో- డైరెక్టర్ అగస్త్య మంజు తో సంయుక్త దర్శకత్వాన్ని నిర్వహించడం ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన విశేషం. మొత్తం మీద సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకు రాంగోపాల్ వర్మ సృష్టించిన వివాదాలు, కురిపించిన స్టేట్మెంట్స్, తెలుగుదేశం వర్గాల నిరసనలు, నిలిపేసే ప్రయత్నాలు వెరసి లక్ష్మీస్ ఎన్టీఆర్ పట్ల అంచనాలను, ఎదురుచూపులను రెట్టింపు చేశాయి. ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ ” లక్ష్మీస్ ఎన్టీఆర్” ను మంచి అటెన్షన్ డ్రాయింగ్ సెన్సేషన్ గా చెప్పుకోవచ్చు.
[wp-review id=”18023″]
[youtube_video videoid=MlUjnyJJdZ0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: