తెలుగు చలనచిత్ర రంగంలో మంచు మోహన్ బాబు స్థాన విశిష్టత చాలా విశిష్టమైంది. నాలుగున్నర దశాబ్దాల చలనచిత్ర జీవిత ప్రస్థానంలో మోహన్ బాబు సాధించిన విజయాలు, నెలకొల్పిన రికార్డులు, ఎదుర్కొన్న ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, సుఖసౌఖ్యాలు, వివాదాలు, సృష్టించిన సంచలనాలు మరే నటుడి జీవితంలోనూ కనిపించవు. సాధారణంగా ఒక నటుడు మంచి గుర్తింపును పొంది విజయాల బాట పట్టిన తరువాత మిగిలిన జీవితం అంతా నల్లేరు మీద బండి నడకలా సాఫీగా సాగిపోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ మోహన్ బాబు జీవితం అలా సాగలేదు. నటుడు కాకముందు ఈ జిలుగు వెలుగుల సినీరంగంలో స్థానం సంపాదించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్నిసార్లు పస్తులు పడుకున్నారో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎంత దుర్భర దయనీయ జీవితాన్ని చూసారో నటుడిగా మంచి గుర్తింపు పొందిన తరువాత కూడా ఆయన జీవితంలో అన్ని కష్టాలు, అంత పోరాట పటిమ కనిపిస్తాయి. నట జీవితం చాలా మందికి “వడ్డించిన విస్తరి”అయితే మోహన్ బాబుకు “వడ్డించుకున్న విస్తరి”. ఈనాటి అష్టైశ్వర్యాలు, ఈ పేరు ప్రఖ్యాతులు మోహన్ బాబుకు ఓవర్ నైట్ గా వచ్చి పడలేదు. నిరంతర శ్రమ, పట్టుదల, కార్యదక్షత, క్రమశిక్షణ వంటి సత్ లక్షణాల సమన్వయంతో సాధించుకున్న గొప్ప జీవితం అది.
ఈరోజు అంటే ‘మార్చి 19 ‘ మోహన్ బాబు జన్మదినం. ఈ సందర్భంగా ఆ విలక్షణ, విశిష్ట నటుడికి జన్మదిన శుభాభినందనలు తెలియజేస్తూ ఆయన నట, నిజ జీవితాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రస్తావించుకుందాం.
* సాధారణంగా ఎవరైనా పిల్లలు చదువును నిర్లక్ష్యం చేసి సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నిస్తాము అంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. కానీ చదువు సరిగా అబ్బని తన కుమారుడు మంచు భక్తవత్సలంకు సినిమా రంగమే సరైన ప్లాట్ ఫామ్ అవుతుందని విశ్వసించి తనని సినిమాల్లో వేషాల కోసం ప్రయత్నించమని చెప్పిన మొదటి వ్యక్తి ఆయన తండ్రి మంచు నారాయణ స్వామి నాయుడు. “నూతన నటులు కావలెను” అని ఒక పత్రికలో వచ్చిన ప్రకటన చూసి వంద రూపాయలు ఇచ్చి అప్లై చేయించారు నారాయణస్వామి. కానీ అవన్నీ బోగస్ ప్రకటనలు అని తర్వాత తెలిసింది. మొత్తానికి మోహన్ బాబులో నటుడుకి కావలసిన పర్సనాలిటీ, ఫీచర్స్ ఉన్నాయని గ్రహించిన మొదటి వ్యక్తి ఆయన తండ్రి నారాయణస్వామియే కావటం విశేషం.
* మోహన్ బాబు తొలి విదేశీ ప్రయాణం, తొలి విదేశీ షూటింగ్ చాలా విచిత్రంగా జరిగాయి. మోహన్ బాబును తొలిసారిగా విదేశీ ప్రయాణం చేయించింది ఎవరో తెలుసా? మహానటులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ గ్రహీత, నడిగర తిలకం శివాజీ గణేషన్. ఒక సినిమాలో కలిసి నటించిన వీరిద్దరి మధ్య తొలి పరిచయంలోనే గొప్ప అనుబంధం ఏర్పడింది. పరిచయమైన తొలి రోజునే శివాజీ గణేషన్ మోహన్ బాబును చనువుగా ‘ఒరేయ్’ అని’ బాబాయ్’ అని సంబోధించటం మొదలుపెట్టారు. అంతటి మహానటుడి నుండి అంత అభిమానం, ప్రేమ లభించటంతో మోహన్ బాబు పొంగిపోయారు. అదే రోజున “రేయ్ మోహన్ బాబు – నీకు పాస్ పోర్ట్ ఉందా అని అడిగారు. ‘లేదండీ’ అన్నారు మోహన్ బాబు.
నా సొంత సినిమా “వియత్నాం వీడు సుందరం” లో నీకు ఒక క్యారెక్టర్ ఇస్తున్నాను. షూటింగ్ మొత్తం వియత్నాంలో జరుగుతుంది. మా మేనేజర్ వచ్చి పాస్ పోర్ట్ ఏర్పాట్లు చూస్తాడు.. ప్రయాణానికి సిద్ధంగా ఉండు” అని చెప్పారు. అంత గొప్ప నటుడి సొంత బ్యానర్లో ఆయనకు ఆపోజిట్ గా మెయిన్ విలన్ క్యారెక్టర్ చేయడం, తొలిసారిగా ఫారిన్ వెళ్ళటం, శివాజీ గణేశన్ తో గొప్ప అనుబంధం ఏర్పడటం – ఇవన్నీ మోహన్ బాబుకు నటుడిగా పరిచయమైన తొలి రోజుల్లోనే ఎదురైన గొప్ప అనుభవాలు.
* “నా సినిమాకు పోటీగా నీ సినిమా విడుదల చేస్తావా? ఎంత ధైర్యం నీకు? అంత పెద్ద వాడివైపోయావా? అని గద్దించింది మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు స్వరం. “అది కాదు సార్”- అని ఏదో సర్ది చెప్పబోయారు మోహన్ బాబు.అంతలోనే సరదాగా నవ్వేస్తూ
” ఊరికే తమాషాకి అన్నాను లేవయ్యా”- అని గలగలా నవ్వేశారు అక్కినేని నాగేశ్వరరావు. ఇంతకీ విషయం ఏమిటంటే – విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీ రామారావు చేతుల మీదుగా శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ స్థాపించి తొలి ప్రయత్నంగా “ప్రతిజ్ఞ” చిత్రాన్ని నిర్మించారు మోహన్ బాబు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే సమయానికి అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఒక సినిమా రిలీజ్ కు సిద్ధమైంది. అనివార్యంగా రెండు సినిమాలు ఒకేరోజు విడుదలయ్యాయి. ఆ సందర్భంగా అక్కినేని నాగేశ్వరరావు మోహన్ బాబుల మధ్య జరిగిన సరదా సంభాషణ అది. అయితే నిర్మాతగా, హీరోగా మోహన్ బాబు నిర్మించిన తొలి చిత్రం” ప్రతిజ్ఞ” సూపర్ హిట్ అవగా అక్కినేని చిత్రం ఫెయిల్ అయింది. అయితే అదేమీ మనసులో పెట్టుకోకుండా ప్రతిజ్ఞ శతదినోత్సవ వేడుకకు అతిథిగా వెళ్లారు అక్కినేని నాగేశ్వరరావు.
* ఈ రోజున ఉభయ తెలుగు రాష్ట్రాలలో అత్యధికంగా అమ్ముడుపోయే పాలు హెరిటేజ్ మిల్క్. ఈ హెరిటేజ్ మిల్క్ పుట్టుపూర్వోత్తరాల వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ హెరిటేజ్ మిల్క్ లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన మెయిన్ పార్టనర్ మోహన్ బాబు అని మీకు తెలుసా? 90వ దశకంలో మోహన్ బాబు అల్లుడుగారు, అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న రోజులవి. అప్పుడు మోహన్ బాబు వద్దకు హెరిటేజ్ స్థాపన అనే ప్రతిపాదనతో వచ్చారు ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తనకు పెద్దగా ఆసక్తి లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు సలహా మరియు ఒత్తిడి మేరకు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థలో మేజర్ పార్ట్నర్ గా చేరారు మోహన్ బాబు. ఆ తరువాత కొంతకాలానికి తీవ్ర విభేదాలతో వారిద్దరు విడిపోయారు. హెరిటేజ్ ఫుడ్స్ నుండి తనకు తానుగా తప్పుకున్నారు మోహన్ బాబు.
* స్థిరత్వాన్ని, సెక్యూరిటీని ఇవ్వలేని సినిమా రంగంలో ఉంటున్నప్పుడు ఎవరైనా ఇతరత్రా వ్యాపకాలను, వ్యాపారాలను ప్రారంభించి డబ్బు సంపాదించాలి అనుకోవటం సహజం. అది చాలా మంది చేస్తున్న పనే. అయితే ఎలాంటి వ్యాపారాన్ని ప్రారంభించాలి ? సమాజానికి మేలు తప్ప కీడు చేయని వ్యాపారం చేస్తూ డబ్బు సంపాదించటం ధర్మమైన మార్గం. అంటే క్లబ్బులు, పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ లు ప్రారంభించి డబ్బు సంపాదిస్తుంటారు చాలామంది.
కానీ నటన,చిత్ర నిర్మాణాలకు అదనంగా ఇతరత్రా వ్యాపకం ఏదైనా చేయాలి అనుకుంటున్న తరుణంలో మోహన్ బాబు మదిలో మెదిలిన వన్ అండ్ ఓన్లీ కాన్సెప్ట్ “స్కూల్”. ఉన్నత ప్రమాణాలతో ఒక విద్యాలయాన్ని స్థాపించి డబ్బు సంపాదనతో పాటు కొందరు బీద విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలి అనే లక్ష్యాన్ని ఏర్పరచుకోవటం, దాన్ని అమలు చేయటం అభినందనీయం.
* మోహన్ బాబు కెరీర్ లో ఉన్నన్ని హెచ్చుతగ్గులు, పరిణామాలు మరే నటుడిలోనూ కనిపించవు. కెరీర్ ప్రారంభ దినాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్న రోజులలో తను చేస్తున్న సినిమాలలో ఏమైనా చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ వేషాలు ఉంటే ఆ డైరెక్టర్ నో కో డైరెక్టర్ నో బతిమిలాడు కొని ఆ వేషాలు వేసిన మోహన్ బాబు 1975 నవంబర్ 22న విడుదలయిన “స్వర్గం నరకం” చిత్రంతో హీరో అయిన విషయం తెలిసిందే. అలా హీరో గా ఎంట్రీ ఇచ్చిన మోహన్ బాబు కొద్దిరోజులకు విలన్ పాత్రలు వేయవలసి వచ్చింది. విలన్ గా చేస్తుండగానే హీరోగా ఆఫర్స్ వచ్చేవి. హీరోగా చేస్తుండగా విలన్ ఆఫర్స్ వచ్చేవి. హీరో గా చేయాలో విలన్ గా కంటిన్యూ అవ్వాలో తేల్చుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడేవారు మోహన్ బాబు. అయితే మోహన్ బాబు హీరోగా నటించిన సినిమా విలన్ గా నటించిన సినిమా ఎదురు బొదురు థియేటర్లలో ఆడుతుంటే ఆ రెండు సూపర్ హిట్ అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
అందుకే ఎన్టీ రామారావు లాంటి మహా నటుడు ఒక సందర్భంలో “ అసలు ఏమిటి ఈ మోహన్ బాబు ఇమేజ్..? కాసేపు విలన్ అంటారు.. వెంటనే హీరో అంటారు… కమెడియన్ అంటారు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటారు.. దేవుడు వారిని అన్ని రకాల పాత్రలలో ఆశీర్వదిస్తున్నారు” అన్నారు.
ఇవి మోహన్ బాబు సుదీర్ఘ ప్రస్థానం లోని కొన్ని “మెచ్చు”తునకలు. నటనలోనూ, వ్యక్తిత్వంలోనూ తనకంటూ ఒక ప్రత్యేక స్థాన విశిష్టతను సాధించుకుని “నా రూటే సెపరేటు” అంటూ ముందుకు సాగుతున్న విశిష్ట నటుడు, నిర్మాత, విద్యావేత్త పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబుకు హృదయ పూర్వక జన్మదిన శుభాభినందనలు పలుకుతుంది ” ద తెలుగు ఫిలిం నగర్ డాట్ కాం”
[youtube_video videoid=3lyE7NwKvKc]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: