తన విలువ ఏమిటో తెలుసుకునేలోపే కరిగిపోయే మంచుగడ్డ లాంటిది కాలం. అలా కరిగిపోయే కాల ప్రవాహంలో కరిగిపోని చెరిగిపోని జ్ఞాపకాల నిక్షిప్త నిధులు ఎన్నో ఎన్నెన్నో… పైన కనిపిస్తున్న ఆర్ట్ వర్క్ లో శివుడి గెటప్ లో కనిపిస్తున్న చిరంజీవి ముఖచిత్రాన్ని చూస్తుంటే అలనాటి మధురానుభూతులు జ్ఞాపకాల కళ్ళముందు సాక్షాత్కరిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది 1992 జూన్ 5 డేట్ లైన్ తో వెలువడిన “శివరంజని ” సినిమా వార పత్రిక ముఖచిత్రం. ఈ రోజున ప్రింట్ మీడియా పట్ల మోజు, ఆసక్తి తగ్గాయి కానీ ఆ రోజుల్లో సినిమా పత్రికల కోసం పాఠకులు వేయి కళ్లతో ఎదురు చూసేవారు. ఈనాడు దినపత్రికకు అనుబంధంగా ‘సితార’ సినీ వార పత్రిక, ఆంధ్రజ్యోతి దిన పత్రిక కు అనుబంధంగా ‘జ్యోతిచిత్ర’ సినీ వార పత్రిక, ఆంధ్ర పత్రిక దిన పత్రికకు అనుబంధంగా ‘సినిమారంజని’ వార పత్రిక ఉండేవి. వాటికి విశేష ప్రజాదరణ ఉండేది. అలాంటి తరుణంలో శతాధిక చిత్ర దర్శకులు దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు సంచలనాత్మకంగా “ఉదయం” దినపత్రికను ప్రారంభించి కొద్ది రోజుల తరువాత దానికి అనుబంధంగా “శివరంజని” సినీ వార పత్రికను ప్రారంభించారు. సినీ వార పత్రికల చరిత్రలో ‘శివరంజని’ ఒక సంచలనం, ఒక ప్రభంజనం. 1990 దశకారంభంలో శివరంజనికి ఏ. బాల్ రెడ్డి ఎడిటర్ గా పనిచేసేవారు. సినిమా పత్రికా రంగాన్ని బాల్ రెడ్డి ఉరుకులు పెట్టించారు అనటంలో ఏ మాత్రం సందేహంలేదు. ఆయన సంపాదకత్వంలో వారం వారం మార్కెట్ లోకి విడుదలయ్యే ‘శివరంజని’ ఇతర సినిమా పత్రికలకు సవాలు విసిరినట్లుగా ఉండేది. సినిమా పత్రికల్లో గొప్ప కాంపిటీటివ్ స్పిరిట్ తెచ్చిన ఎడిటర్ బాల్ రెడ్డి.
ఇదిలా ఉంటే “ఘరానా మొగుడు” ఘనవిజయం తరువాత చిరంజీవి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో “ఆపద్బాంధవుడు” చిత్రంలో నటిస్తున్న రోజులవి. అందులో ఒక బ్యాలే లో చిరంజీవి శివుడి గెటప్ లో కనిపిస్తారు. ఆ నృత్య రూపక చిత్రీకరణ రవీంద్రభారతిలో జరుగుతుంది. అప్పుడు శివుడి గెటప్ లో చిరంజీవి స్టిల్ ను ముఖచిత్రంగా వేయటం కోసం సినిమా పత్రికలన్నీ పోటీ పడ్డాయి. అయితే ఆ గెటప్ ను అంత ఎర్లీగా బయటకు రివీల్ చేయడానికి చిరంజీవి, కె.విశ్వనాథ్ నిరాకరించారు. అయితే ఎలాగైనా చిరంజీవిని శివుడి గెటప్ లో ముందుగా ఆవిష్కరించిన క్రెడిట్ తమ శివరంజని పత్రికకే దక్కాలన్న ఉత్సాహంతో బాల్ రెడ్డిఉదయం చీఫ్ డిజైనర్ అండ్ ఆర్టిస్ట్ శివ ప్రసాద్ తో శివుడి గెటప్ లో చిరంజీవి ఆర్ట్ వర్క్ ను గీయించి దానిని ముఖచిత్రంగా ప్రచురించారు. గొప్ప చిత్రకారుడైన శివ ప్రసాద్ చిరంజీవిని ముమ్మూర్తులా శివ రూపంలో దించేశారు. అద్భుతంగా వచ్చిన ఆ ముఖచిత్రం చూసి మెగాస్టార్ చిరంజీవి, కళాతపస్వి కె.విశ్వనాథ్, చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు చాలా అభినందించారు. పాఠకులు కూడా శివుడి గెటప్లో మెగాస్టార్ ముఖ చిత్రాన్ని చూసి పత్రికను హాట్ కేక్ లాగా ఎగరేసుకుపోయారు. అప్పుడు ఈ వ్యాసకర్తనైన నేను (ప్రభు)
శివరంజని పత్రిక రిపోర్టర్ గా చేస్తుండేవాడిని.
ఇన్నేళ్ల తరువాత అనుకోకుండా ఆ కవర్ పేజిని ఒక మిత్రుడు ఫార్వర్డ్ చేయటంతో ఒక్కసారిగా ఆనాటి విషయాలన్నీ నా జ్ఞాపకాల కళ్ళముందు కదలాడాయి. అప్పట్లో సినిమా పత్రికల మధ్య ఎంత ఆరోగ్యకరమైన పోటీ ఉండేదో, అగ్ర తారలు, సుప్రసిద్ధ దర్శక నిర్మాతలు , టెక్నీషియన్స్ సినిమా పత్రికలకు, సినీ పాత్రికేయులకు ఎంత విలువను, ప్రాధాన్యతను ఇచ్చేవారో గుర్తుకు వచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా పత్రికలతోనూ , సినీ పాత్రికేయులతోను పెంచుకున్న అనుబంధం, ఇచ్చిన ప్రోత్సాహం మరువలేనిది. ఈ సందర్భంగా అసలు శివుడి తోనూ, శివ నామం తోను, శివుడి గెటప్ తోనూ చిరంజీవికి ఉన్న అనుబంధం ఏమిటో ఒకసారి గుర్తు చేసుకుందాం.
చిరంజీవి మొదటిసారిగా శివుడు టైటిల్ తో చేసిన సినిమా’ శివుడు శివుడు శివుడు’ . ఈ సినిమాకు దర్శకుడు ఏ. కోదండరామిరెడ్డి. మూడు కన్నుల ముక్కంటి పేరుతో చిరంజీవి చేసిన మరో సినిమా
” త్రినేత్రుడు”. ఈ చిత్రానికి కూడా దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. అలాగే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శివనామ స్పర్శ తో కూడిన “రుద్రనేత్ర “, కె.బాలచందర్ దర్శకత్వంలో ” రుద్రవీణ” చిత్రాలలో నటించారు చిరంజీవి. ఆ తరువాత “ఆపద్బాంధవుడు” చిత్రంలో ఒక సన్నివేశంలో శివుడి గెటప్ లో గొప్ప శివ తాండవ ప్రదర్శన చేశారు చిరంజీవి. అప్పటిదే ఈ కథా కమామీషు అంతా…
ఇక చివరిగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే “మంజునాధ” చిత్రంలో ఏకంగా ఆ గరళకంఠుడి పాత్రను అద్భుతంగా పోషించి మెప్పించారు మెగాస్టార్ చిరంజీవి.
ఇవి అందరికీ తెలిసినంతవరకు, ప్రచారంలో ఉన్నంతవరకు ‘శివ’ నామ రూపాలతో చిరంజీవి అనుబంధం. తన 4 దశాబ్దాల సుదీర్ఘ నట జీవితంలో ఇంకేవైనా చిత్రాలలో చిరంజీవి శివుడి గెటప్ వేశారేమో …?
మొత్తం మీద ఈ శివరాత్రి పర్వదినాన ఎప్పటిదో 27 ఏళ్ల నాటి ఒక పాత స్టిల్లు దొరకటంతో ఆనాటి జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటూ చిరంజీవి ‘శివం’జీవి కి తన తరఫున, తన పాఠకుల తరఫున శివరాత్రి శుభాకాంక్షలు పలుకుతుంది’దతెలుగుఫిలింనగర్.కాం’.
[youtube_video videoid=RbDo1VN814E]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: