తెలుగు చిత్ర పరిశ్రమకు సినిమాల జయాపజయాల పరంగా మిశ్రమ ఫలితాలను అందించిన 2018 వివాదాలు, విషాదాలు, వినోదాల పరంగా కూడా రకరకాల అనుభవాలను అందించింది. ఆ అనుభవాలలో శుభ వార్తలు ఉన్నాయి, అశుభాలు ఉన్నాయి, అనూహ్యమైన వివాదాలు ఉన్నాయి, ఆశ్చర్యకర పరిణామాలు ఉన్నాయి. ఎన్నో అంచనాలతో విడుదలైన సినిమాలు ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఫెయిల్ కాగా ఏ అంచనాలు లేకుండా విడుదలైన కొన్ని సినిమాలు అద్భుత విజయాలను సాధించి ఆశ్చర్యానికి గురిచేసాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే కొన్ని సంఘటనలు, విషాదాలు వివాదాలు అనూహ్య పరిణామాలకు దారి తీశాయి. అవన్నీ అందరికీ తెలిసినవే అయినా కొత్త సంవత్సరారంభంలో గడచిన సంవత్సరపు సంగతులను ఒక్కసారి విహంగవీక్షణంగా వీక్షించటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో 2018 విశేషాలను, సంఘటనలను నెలల వారీగా ఒకసారి తిరగేద్దాం.
జనవరి వినోదాలు, వివాదాలు, విషాదాలు
* జనవరి 1. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, వెరోనికా దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. ఇద్దరు కవల ఆడపిల్లలు తరువాత విష్ణు దంపతులకు పుట్టిన మగ బిడ్డ. ఆ బాబుకి తాత మోహన్ బాబు అసలు పేరానా భక్త వత్సలం నాయుడులోని ‘భక్త’ అని కలిసొచ్చేలా వాక్రమ్ భక్త మంచు అని నామాకరణం పెట్టారు.
* ఇదే జనవరిలో మరొక పెద్ద వివాదమే బయటకొచ్చింది. జనవరి 2వ తేదీన ప్రముఖ గజల్ గాయకుడు, నటుడు గజల్ శ్రీనివాస్ పై ఓ మహిళా చేసిన ఫిర్యాదు మేరకు గజల్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన సంస్థలో పనిచేస్తున్న కుమారి అనే మహిళ.. గజల్ శ్రీనివాస్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని చేసిన ఆరోపణలు పెద్ద సంచలనమే సృష్టించాయి.
* వివాదాలతో పాటు విషాదాలు కూడా చోటుచేసుకున్నాయి ఈ జనవరి నెలలో. జనవరి 18 వ తేదీన సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత కాశీనాథ్ తుది శ్వాస విడిచారు. అపరిచితుడు చిత్రాన్ని కన్నడ, హిందీ భాషల్లో రూపొందించారు. అంతేకాదు…తెలుగులో ఆయన సినిమాలు వింతశోభనం, అనుభవం, పొగరుబోతు పెళ్ళాం, సుందరాంగుడు వంటివి విడుదలయ్యాయి. కన్నడ స్టార్ ఉపేంద్ర ఈయన శిష్యుడే.
* జనవరి 1 వ తేదీన మోహన్ బాబుకు మనవడు పుట్టగా.. ఇదే జనవరిలో మరో శుభపరిణామం చోటుచేసుకుంది మంచు ఫ్యామిలీకి. జనవరి 22వ తేదీన మోహన్ బాబు ఫిల్మ్ నగర్ లోని దైవసన్నిధానం ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఈ పదవిలో శ్రీ.వి.బి రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ ఈ పదవిలో ఉన్నారు.
ఇక ఇదే రోజు నటి భావన వివాహం కూడా జరిగింది. కన్నడ సినీ నిర్మాత నవీన్ తో త్రిసూర్ లోని తిరువంబడి శ్రీకృష్ణాలయంలో నిరాడంబరంగా జరిగింది.
* జనవరి 24 వ తేదీన అలనాటి అందాల నటి కృష్ణ కుమారి బెంగళూరులో అనారోగ్యంతో కన్నుమూశారు. నవ్వితే నవరత్నాలు సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన కృష్ణ కుమారి.. ఎన్టీఆర్, ఏఎన్నార్ జగ్గయ్య, కాంతారావు సరసన ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు .తన సినీ కెరీర్లో వివిధ భాషల్లో దాదాపు 150 సినిమాల్లో నటించారు. తాను నటించిన ఆఖరి చిత్రం దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఫూల్స్ సినిమా.
* సంగీత జ్ఞాని, మాస్ట్రో ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించింది కూడా ఈ నెలలోనే. జనవరి 25వ తేదీన ఇళయరాజాకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ ప్రకటించింది. 2010లో ఆయన పద్మ భూషణ్ అవార్డును అందుకున్నారు.
* జనవరి 30వ తేదీన యువనటుడు సామ్రాట్ రెడ్డిపై అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామ్రాట్ రెడ్డి తనను మానసికంగా, శారీరకంగా హింసించాడని.. తన వస్తువులను దొంగతనం చేశాడని ఫిర్యాదు చేయడంతో పోలీసులు సామ్రాట్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు.
* హీరోయిన్ అమలాపాల్ ప్రముఖ పారిశ్రామిక వేత్త అళగేశన్ తనతో అసభ్యంగా.. అశ్లీల భావంతో మాట్లాడారని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అళగేశన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జనవరి 31 వ తేదీన జరిగింది.
ఫిబ్రవరి
* గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలో హీరో బాలకృష్ణ భుజానికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3 వ తేదీన కాంటినెంటల్ హాస్పిటల్ లో బాలకృష్ణ భుజానికి ఆపరేషన్ జరిగింది.
* ఇదే ఫిబ్రవరి 3వ తేదీన ప్రముఖ రంగస్థలం నటి, నట శిక్షకురాలు దేవదాస్ కనకాల సతీమణి.. రాజీవ్ కనకాల తల్లి శ్రీ లక్ష్మీదేవి కనకాల గుండెపోటుతో మరిణించారు.
* ఫిబ్రవరి 14వ తేదీన ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలోని “మాణిక్య మలరాయ పూలి” పాటలో ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా పదాలు ఉన్నాయని ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ లో నటి ప్రియా ప్రకాశ్ వారియర్, దర్శకుడు ఒమర్ లులుపై పలువురు కేసు పెట్టారు. అదే రోజు వీరిద్దరితో పాటు నిర్మాతపైనా ముంబైలో మరో కేసు నమోదైంది.
* ప్రముఖ గాయని ఆశాభోస్లేకు యశ్ చోప్రా మెమోరియల్ నేషనల్ అవార్డ్ ను ఫిబ్రవరి 16వ తేదీన ముంబైలో టి.సుబ్బిరామిరెడ్డి ప్రదానం చేశారు.
* దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీఎస్టీ ఎపిసోడ్ పై మహిళా సంఘం నాయకురాలు దేవి హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు రామ్ గోపాల్ వర్మను మూడు గంటలపాటు విచారించి జీఎస్టీ గురించి వివరాలు సేకరించారు. ఈ ఘటన ఫిబ్రవరి 17న జరిగింది.
* ఫిబ్రవరి 19వ తేదీన ప్రముఖ హాస్యనటుడు గుండు హనుమంతరావు మృతి చెందారు. రంగస్థలం నటుడైన గుండు హనుమంతరావు… ‘సత్యాగ్రహం’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. దాదాపు 400 చిత్రాల్లో నటించిన గుండు హనుమంతరావు…పలు టీవీ సీరియల్స్ లో నటించారు. మూడు నంది అవార్డులు కూడా ఆయనకు లభించాయి.
* ఫిబ్రవరి నెలలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన అలనాటి అందాల తార శ్రీదేవి మరణించడం. దుబాయ్ లోని తమ బంధువుల వివాహ వేడుకకు హాజరై బాత్ రూమ్ టబ్ లో మునిగి మరణించింది. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన శ్రీదేవి పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది.
ఇదే రోజు ప్రముఖ రచయిత మునిపల్లె రాజు అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన రాసిన ‘పూజారి’ నవలను ప్రముఖ దర్శకుడు బి.ఎన్.రెడ్డి ‘పూజాఫలం’ పేరుతో సినిమాగా రూపొందించారు.
మార్చి
* మార్చి 1 వ తేదీన ప్రముఖ రచయిత, ప్రచురణ కర్త నాయుని కృష్ణమూర్తి బెంగళూరులో కన్నుమూశారు. ఆయన కొన్ని సినిమా పాటలు కూడా రాశారు. ‘మహర్షి’ సినిమాలోని ‘సుమం ప్రతి సుమం’ పాట ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది.
* మార్చి 2 డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ కు, దక్షిణ చలన చిత్ర జాయింట్ యాక్షన్ కమిటీ మధ్య చర్చలు విఫలం కావడంతో థియేటర్స్ నిరవధిక బంద్ ప్రకటించాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా, ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో పాక్షికంగా థియేటర్స్ బంద్ జరిగింది.
* మార్చి 5 వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో 90వ ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. ‘ది షేప్ ఆఫ్ వాటర్’ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యింది. ఉత్తమ నటుడిగా గ్యారీ ఓల్డ్ మన్, నటిగా ఫ్రాన్సెన్, దర్శకుడిగా గుల్లెర్మో డెల్టోరో ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.
* మార్చి 6వ తేదీన సీనియర్ బాలీవుడ్ నటీమణి షమ్మి ముంబైలో కన్నుమూశారు. దాదాపు 200 సినిమాలో నటించిన షమ్మి పలు టీవీ సిరియల్స్ లోనూ నటించింది.
* మార్చి 7 వ తేదీన డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ తో దక్షిణ చలన చిత్ర జాయింట్ యాక్షన్ కమిటీ మధ్య జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయి. దాంతో మళ్లీ చిత్రాల ప్రదర్శన తిరిగి ప్రారంభించాలన్న నిర్ణయం జరిగింది.
* మార్చి 8వ తేదీన నటి సీత, దర్శక నటుడు పార్తీబన్ కమార్తె కీర్తన (అమృత ఫేమ్) వివాహం ప్రముఖ ఎడిటర్ శ్రీకర ప్రసాద్ తనయుడు, దర్శకుడు అక్షయ్ తో చెన్నయ్ లో జరిగింది.
* మార్చి 11వ తేదీన సినీ నటి కవిత టీడీపీని వదిలి అమరావతిలో బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీలో చేరారు.
అదే రోజున తెలుగు దర్శకుల సంఘంకు జరిగిన ఎన్నికల్లో ఎన్.శంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. దీని పదవికాలం రెండేళ్లు .
* మార్చి 12వ తేదీన నటి శ్రియ శరణ్ వివాహం జరిగింది. రష్యన్ టెన్నిస్ ప్లేయర్ బిజినెస్ మెన్ ఆండ్రీ కొశ్చివ్ తో వివాహం జరిగింది.
* మార్చి 14వ తేదీన ప్రముఖ బాలీవుడ్ నటుడు నరేంద్ర ఝా అనారోగ్యంతో ముంబై సమీపంలోని ఫామ్ హౌస్ లో కన్నుమూశారు. టీవీ సీరియల్స్ తో పాటు హిందీ చిత్రాల్లోనూ నటించిన నరేంద్ర ఝా తెలుగులో ‘ఛత్రపతి, యమదొంగ, లెజెండ్’ తదితర సినిమాల్లో నటించారు.
* మార్చి 16వ తేదీన గాయకుడు, సంగీత దర్శకుడు కొండా బాబూ కృష్ణమోహన్ రాజు (84) కన్ను మూశారు. 1934 మార్చి 23న విజయవాడలో జన్మించిన ఆయన ఐదు దశాబ్దాలు ఆల్ ఇండియా రేడియోలో గాయకుడిగా పనిచేశారు. దాదాపు 25 చిత్రాల్లో యాభై వరకూ పాటలు పాడారు. పూల రంగడు, సాక్షి, దేవుడమ్మ, తాసిల్దారు గారి అమ్మాయి తదితర చిత్రాల్లో ఆయన పాటలు పాడారు.
* మార్చి 17వ తేదీన గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ పురస్కారాన్ని 2017కు గానూ ‘ఏ డెత్ ఇన్ ది గుంజ్’ దర్శకురాలు కొంకణాసేన్ కు ఇస్తున్నట్టు గొల్లపూడి శ్రీనివాస్ ఫౌండేషన్ ప్రకటించింది.
* మార్చి 19వ తేదీన సీనియర్ ఎడిటర్ అనిల్ మల్నాడ్ (62) అనారోగ్యంతో కన్ను మూశారు. బాపు దగ్గర సహాయ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన అనిల్ తర్వాత ఎడిటర్ గా మారారు. కర్ణాటక చిక్ మంగళూర్ కి చెందిన అనిల్ తొమ్మిది భాషల్లో దాదాపు 200 చిత్రాలకు కూర్పరిగా వ్యవహరించారు. ‘సితార’ చిత్రానికి జాతీయ అవార్డు, ‘అన్వేషణ’ కు నంది అవార్డ్ అందుకున్నారు.
* మార్చి 20వ తేదీన రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా ఇళయరాజా పద్మవిభూషణ్ పురస్కారం పొందారు.
* మార్చి 21వ తేదీన ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా.. కొందరు హీరోయిన్లపై ట్వీట్ చేశారు. కొందరు హీరోయిన్లు సెక్స్ వర్కర్స్ కంటే దారుణంగా తయారయ్యారని.. హీరోయిన్ల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ట్వీట్ చేశారు.
* మార్చి 23వ తేదీన జీనత్ అమన్ సర్ఫరాజ్ అలియాస్ అమన్ ఖన్నాపై లైంగిక ఆరోపణలు చేసింది. సర్ఫరాజ్ లైంగిక దాడికి పాల్పడటంతో పాటు రూ.15 కోట్ల వరకూ ముంచారని జూహు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దాంతో అమన్ ను అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేశారు.
* ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న హోదా ఉద్యమంకు తమ మద్దతు తెలుపుతున్నామని మార్చి 30వ తేదీన పలువురు సినీ ప్రముఖులు కె.రాఘవేంద్రరావు, అశ్వనీదత్, సి.కిరణ్, కె.ఎల్.నారాయణ చంద్రబాబుకు తెలిపారు.
ఏప్రిల్
* ఏప్రిల్ 5వ తేదీన కృష్ణజింకల వేట కేసులో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు చేదు అనుభవం ఎదరైంది. సల్మాన్ ఖాన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది జోద్ పూర్ కోర్టు.
ఇదే రోజు సీనియర్ నటుడు చంద్రమౌళి మృతి చెందారు. 1971వ సంవత్సరంలో ‘అంతా మన మంచికే’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన చంద్రమౌళి రెండు వందలకు పైగా చిత్రాల్లో నటించారు.
* ఏప్రిల్ 7 వ తేదీన శ్రీరెడ్డి ఫిల్మ్ ఛాంబర్ దగ్గర అర్ధనగ్నంగా నిరసన చేసింది. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆతరువాత వదిలిపెట్టారు.
* శ్రీరెడ్డి చేసిన చర్యను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. అంతేకాదు…ఇలాంటి చర్యలు తగవని…ఇలా చేస్తే మా సభ్యత్వం ఇవ్వమని చెబుతూ..తనతో కలిసి ఎవరూ నటించకూడదని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 8వ తేదీన ఈ నిర్ణయం తీసుకున్నారు.
* ఏప్రిల్ 12వ తేదీన.. గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఫిల్మ్ ఛాంబర్ ‘కమిటీ అగనెష్ట్ సెక్స్ వల్ హెరాస్ మెంట్’ ను ఏర్పాటు చేసినట్టు జెమినీ కిరణ్ తెలిపారు.
అదే రోజు శ్రీరెడ్డిపై వస్తున్న వార్తలు, మీడియా కథనాలపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించి.. వార్తా కథనాలను సుమోటోగా స్వీకరించి తెలంగాణ ప్రభుత్వాన్ని నివేదిక కోరింది.
* ఏప్రిల్ 13వ తేదీన 65వ జాతీయ సినీ అవార్డుల ప్రకటనలో ‘బాహుబలి -2’ ఉత్తమ చిత్రంగా, బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్పెషల్ ఎఫెక్ట్స్, ఇలా పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ‘ఘాజీ’ ఎంపికైంది. వినోద్ ఖన్నాకు దాదా సాహెబ్ పాల్కే పురస్కారం దక్కింది. ఉత్తమ నటిగా శ్రీదేవి కి అవార్డ్ దక్కింది.
* ఏప్రిల్ 22వ తేదీన సంగీత, సాహిత్య విద్వన్మణి బాలాంత్రపు రజనీకాంతరావు కన్నుమూశారు. నళినీకాంత్, తారానాథ్ అనే ఆయన కలం పేర్లతో పలు గీతాలు రాశారు.
అదే రోజు నటుడు, మోడల్ మిలింద్ సోమన్ వివాహం అంకిత కొన్వర్ తో జరిగింది.
* ఏప్రిల్ 23వ తేదీన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఎస్.వి.బి.సి ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
* ఏప్రిల్ 27వ తేదీన సీనియర్ డైరెక్టర్ ఈరంకి శర్మ కన్నుమూశారు. చెన్నైలోని మైలాపూర్ లో ఈరంకి శర్మ మృతి చెందారు. నాలాగ ఎందరో, కుక్క కాటుకు చెప్పుదెబ్బ, చిలకమ్మ చెప్పింది, సీతాదేవి, అగ్నిపుష్పం తదితర చిత్రాలను
ఆయన రూపొందించారు.
మే
* మే 2వ తేదీన కన్నడ కథానాయిక ‘బెండు అప్పారావు ఆర్.ఎం.పి’ ఫేమ్ మేఘనా రాజ్ వివాహం చిరంజీవి సర్జాతో జరిగింది.
* మే 3వ తేదీన ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో 65వ జాతీయ సినీ అవార్జుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. రాష్ట్రపతి రాంనాధ్ కోవింద్ చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురికి అవార్డులు దక్కగా…దాదాపు యాభైమంది అవార్డు గ్రహీతలు ఈ కార్యక్రమాన్ని బాయ్ కట్ చేశారు.
* మే 5వ తేదీన క్యాస్టింగ్ కౌచ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాధవీలత బీజేపీలో చేరారు.
* మే 8వ తేదీన బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూతురు హీరోయిన్ సోనమ్ కపూర్ వివాహం జరిగింది. ఆనంద్ అహూజాతో సోనమ్ కపూర్ వివాహం జరిగింది.
* మే 10వ తేదీన నటి నేహా ధూపియా వివాహం అంగద్ బేడీతో జరిగింది. కాగా వివాహానికి ముందే నేహా ధూపియా ప్రెగ్నంట్ అని తెలిసింది.
* మే 12వ తేదీన బాలీవుడ్ సంగీత దర్శకుడు, గాయకుడు, నటుడు హిమేశ్ రేష్మియ్యా వివాహం సోనియా కపూర్ తో జరిగింది.
* మే 16వ తేదీన సీనియర్ డైరెక్టర్ దుర్గా నాగేశ్వరరావు హైదరాబాద్ లో కన్నుమూశారు. ఇ.ఎన్.మూర్తి, దాసరి దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసి విజయ సినిమాతో దర్శకుడిగా మారి.. ‘పసుపు కుంకుమ’, ‘ బొట్టు కాటుక, సీతాలు, స్వర్గం, సుజాత వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.
* మే 21వ తేదీన ప్రముఖ రచయిత్రి, ఆంధ్రుల అభిమాన నవలాసామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనా రాణి కన్ను మూశారు. చదువుకున్న అమ్మాయిలు చిత్రంతో కథా రచయిత్రిగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఆమె రాసిన 15 నవలలు సినిమాలుగా వచ్చాయి.
* మే 27వ తేదీన మాదాల రంగారావు కన్నుమూశారు. 1974 లో వచ్చిన ‘ఛైర్మన్ చలమయ్య’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన రంగారావు దాదాపు 70 సినిమాల్లో నటించారు. 15 సినిమాలను నిర్మించారు.
జూన్
* జూన్ 15వ తేదీన అమెరికాలో టాలీవుడ్ నటీమణులతో వ్యభిచారానికి పాల్పడుతున్నాడని సహ నిర్మాత కిషన్ మోదుగుమూడిని అతని భార్య చంద్రపై స్థానిక పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేసిన విషయాన్ని అక్కడి షికాగో ట్రిబ్యూట్ పత్రిక ప్రచురించింది. దాంతో టాలీవుడ్ లో అప్పట్లో ప్రకంపనలు మొదలయ్యాయి.
జులై
* ‘ఫిట్టింగ్ మాస్టర్’, ‘ఆలస్యం అమృతం’ తదితర చిత్రాల్లో నటించిన మదాలస శర్మ వివాహం జులై 10వ తేదీన జరిగింది. మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్ తో జరిగింది.
* జులై 14 వ తేదీన సీనియర్ ఆర్టిస్ట్ వినోద్ బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. ‘కీర్తి కాంత కనకం’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన వినోద్ దాదాపు 300 చిత్రాల్లో నటించారు. వినోద్ పలు టీవీ సీరియల్స్ లోనూ నటించారు.
అదే రోజు ప్రముఖ గాయని కె.రాణి మృతిచెందారు. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలీ, సింహళ భాషల్లో 500 లకు పైగా పాటలు పాడారు. సింహళ జాతీయ గీతాన్ని ఈమెనే పాడారు.
* జులై 28వ తేదీన వైజాగ్ కు చెందిన వీరినాయుడు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా ఎంపికయ్యారు.
* జులై 30వ తేదీన ప్రముఖ నిర్మాత కె.రాఘవ కన్ను మూశారు. దాదాపు 30 చిత్రాలను నిర్మించిన కె.రాఘవ దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ, రాజశ్రీ తదితరులను దర్శకులుగా పరిచయం చేశారు.
ఆగష్ట్
* డీఎంకే ప్రతినిధి, ఐదు సార్లు ముఖ్యమంత్రిగా తమిళనాడు రాజకీయాలను శాసించిన కరుణానిధి ఆగష్ట్ 7వ తేదీన కన్నుమూశారు. సినీ రచయితగా ఆయన తమిళ చిత్రసీమకు సేవలు అందించారు.
* ‘ఎ డెత్ ఇన్ ది గుంజ్’ చిత్రానికి గానూ కొంకణాసేన్ శర్మ గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు దక్కింది. ఆగష్ట్ 12 వ తేదీన రాజమౌళి చేతుల మీదుగా కొంకణాసేన్ చెన్నయ్ లో ఈ అవార్డును స్వీకరించింది.
* ఆగష్ట్ 21 వ తేదీన చిన్న చిత్రాలకు రాయితీలను ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 4 కోట్ల బడ్జెట్ లో ఏ.పీలో తీసే సినిమాలకు స్టేట్ జీఎస్టీ ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు అమరాతిలో ఇరవై ఎకరాలలో ఎన్టీఆర్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ ఏర్పాటు చేస్తామని తెలిపింది. వైజాగ్ లో 316 ఎకరాలలో స్టూడియోస్ నిర్మాణానికి అనుమతి ఇస్తామని ఎపిఎఫ్ డిసి ఛైర్మన్ అంబిక కృష్ణ ప్రకటించారు.
* ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి వివాహం ఆత్రేయపురంకు చెందిన లక్ష్మీ శిరిషతో ఆగష్ట్ 25న జరిగింది.
* ఆగష్ట్ 26వ తేదీన సంతోషం సౌతిండియన్ ఫిల్మ్ అవార్స్ వేడుక అంగరంగ వైభవంగా హైదరాబాద్ లో జరిగింది. ఉత్తమ నటుడిగా చిరంజీవి, ఉత్తమ నటిగా శ్రియా, అక్కినేని స్మారక అవార్డును రాజేంద్ర ప్రసాద్ అందుకున్నారు.
* నందమూరి తారకరామారావు తనయుడు..నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ‘శ్రీకృష్ణావతారం’ సినిమాలో బాలనటుడిగా నటించిన హరికృష్ణ ఆ తరువాత పలు చిత్రాల్లో నటించారు. ఈ విషాదఘటన ఆగష్ట్ 29వ తేదీన జరిగింది.
* ఆగష్ట్ 30వ తేదీన ప్రముఖ దర్శకురాలు, జర్నలిస్ట్, కార్టూనిస్ట్ బి.జయ గుండెపోటుతో మరణించారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, లవ్ లీ, వైశాఖం చిత్రాలను ఆమె రూపొందించారు.
* అదే రోజు హీరోయిన్ స్వాతి వివాహం జరిగింది. కొచ్చికి చెందిన వికాస్ వాసుతో స్వాతి వివాహం జరిగింది. మలేసియన్ ఎయిర్ లైన్స్ లో వికాస్ ఫైలెట్ గా పనిచేస్తున్నారు.
సెప్టెంబర్
* సెప్టెంబర్ 12వ తేదీన ప్రముఖ గీత రచయిత కొసరాజు తనయుడు భాను ప్రసాద్ కన్నుమూశారు. దక్షిణ భారత చలన చిత్ర వాణిజ్య మండలి, తెలుగు నిర్మాతల మండలి కార్యవర్గ సభ్యులుగా భాను ప్రసాద్ సేవలు అందించారు.
* ఇదే నెల సెప్టెంబర్ 13వ తేదీన అవార్డ్ విన్నింగ్ చిత్రాల దర్శకుడు కె.ఎన్.టి శాస్త్రి అనారోగ్యంతో మృతిచెందారు. సినీ రచయితగా, విమర్శకుడిగా, దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డులు అందుకున్నారు.
* 1981 రక్తం చిత్రంతో నటుడిగా మారిన బహుభాషా నటుడు కెప్టెన్ రాజు మరణించారు. తెలుగులో బలిదానం, శత్రువు, రౌడీ అల్లుడు, కొండపల్లి రాజా, గాండీవం తదితర సినిమాల్లో నటించారు. ఈ ఘటన సెప్టెంబర్ 17వ తేదీన జరిగింది.
అక్టోబర్
* అక్టోబర్ 21వ తేదీన ప్రముఖ నటుడు, రంగస్థల కళాకారుడు వైజాగ్ ప్రసాద్ మృతిచెందారు. ‘బాబాయ్ అబ్బాయ్’ తో వైజాగ్ ప్రసాద్ సినీ రంగ ప్రవేశం చేశారు.
* ప్రముఖ నిర్మాత డి.శివప్రసాద్ రెడ్డి అక్టోబర్ 27న అనారోగ్యంతో కన్నుమూశారు. కార్తిక పౌర్ణమి, శ్రావణ సంధ్య, ముఠామేస్త్రీ, విక్కీదాదా, ఆటో డ్రైవర్, ఎదురులేని మనిషి, సీతారామరాజు, నేనున్నాను, కింగ్, కేడి, రగడ, దడ, గ్రీకువీరుడు చిత్రాలను ఆయన నిర్మించారు.
* అక్టోబర్ 31వ తేదీన గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ‘మహానటి’ చిత్రం ఎంపికయ్యింది. పనోరమా కేటగిరిలో మెయిన్ స్ట్రీమ్ కి చెెందిన నాలుగు చిత్రాల్లో ‘మహానటి’ ఒకటి.
నవంబర్
* నవంబర్ 1వ తేదీన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పదవికి అనుపమ్ ఖేర్ రాజీనామా చేశారు. పలు అంతర్జాతీయ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఈ పదవికి తగిన సమయం కేటాయించలేకపోతున్నాని ఆయనఈ పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.
* బాలీవుడ్ టాప్ హీరో హీరోయిన్లు రణవీర్ సింగ్, దీపికా పడుకొనే నవంబర్ 14వ తేదీన ఇటలీలోని లేక్ కోమాలో వివాహం చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి విహహం జరిగింది.
* నవంబర్ 20వ తేదీన అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రారంభమైంది
* ప్రముఖ కన్నడ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, నటి సుమలత భర్త అంబరీష్ నవంబర్ 24వ తేదీన కన్నుమూశారు. కన్నడలో రెబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈయన ఎన్నో సినిమాల్లో నటించారు.
* నవంబర్ 27వ తేదీన ఇటాలియన్ డైరెక్టర్ బెర్నార్డో బెర్టొలుచి రోమ్ లో కన్నుమూశారు. ఆయన రూపొందించిన ‘ది లాస్ట్ ఎంపరర్’ చిత్రం తొమ్మిది ఆస్కార్ అవార్డులను పొందింది.
డిసెంబర్
* అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న నటి ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ ల వివాహం డిసెంబర్ 1 వ తేదీన జరిగింది. జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ లో వీరి వివాహం జరిగింది.
అదే రోజు సీనియర్ హీరోయిన్ పుష్పలత మృతి చెందారు. ‘సంసారం’, ‘పెళ్ళిచేసి చూడు ‘తదితర చిత్రాల్లో ఆమె నటించారు.
* ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ వివాహం ప్రియురాలు గిన్ని ఛాత్రత్ తో డిసెంబర్ 12వ తేదీన జలంధర్ లో జరిగింది.
* హీరో విశాల్ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని అతనిపై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర్మాతల మండలి కార్యాలయంకు తాళం వేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన డిసెంబర్ 19వ తేదీన చోటుచేసుకుంది.
* డిసెంబర్ 20 వ తేదీన విశాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
* డిసెంబర్ 21వ తేదీన దిల్ రాజు మేనల్లుడు, నిర్మాత హర్షిత్ రెడ్డి వివాహం ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కుమార్తె గౌతమితో గోవాలో జరిగింది.
* డిసెంబర్ 23వ తేదీన హర్షిత్ రెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: