టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని, స్వర్ణయుగాన్ని సృష్టించిన ఏకైక వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కేవలం ఒక నటుడిగా మాత్రమే కాకుండా, ఒక నృత్యకారుడిగా, పరోపకారిగా, రాజకీయ నాయకుడిగా మరియు బాధ్యత కలిగిన సమాజ సేవకుడిగా లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిత్వం ఆయనది. నేడు ఆయన జన్మదినం. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు కేవలం ఒక సెలబ్రేషన్ కాదు, అది ఒక పండుగ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తెలుగు సినీ ప్రపంచానికి ఆయన అందించిన విశేష సేవలు, సామాజికంగా ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకునే సందర్భం ఇది. ఈ పుట్టినరోజు సందర్భంగా, మెగాస్టార్ సినీ ప్రయాణం, ఆయన కుటుంబ వారసత్వం, మరియు సమాజానికి ఆయన చేసిన సేవలను ఒకసారి స్మరించుకుందాం.
నటుడిగా అరంగేట్రం
1978లో ‘పునాదిరాళ్లు’ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేశాడు. అయితే, బాక్సాఫీస్ వద్ద ముందుగా విడుదలైంది మాత్రం ‘ప్రాణం ఖరీదు’. నాటినుంచి నేటివరకూ 157 సినిమాలకు పైగా దిగ్విజయంగా సాగుతోంది. ఈ క్రమంలో ఎన్నో హిట్స్, ఎన్నెన్నో సూపర్ హిట్స్, మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు చిరంజీవి. అలాగే నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రయాణంలో 156 చిత్రాలలో 537 పాటల్లో 24,000 నృత్య భంగిమలను ప్రదర్శించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు.
మెగా వారసత్వం:-
మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం ఒక్క హీరో కాదు, ఆయన ఒక తరానికి ఆదర్శం, ఒక సినీ సామ్రాజ్యానికి పునాది. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని, ఈరోజు తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది ప్రతిభావంతులైన నటులు తమ సత్తా చాటుకుంటున్నారు.
‘గ్లోబల్ స్టార్’ గా ఎదిగిన ఆయన కుమారుడు రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘మగధీర’తో టాలీవుడ్‌ను శాసించి, ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచానికి తన సత్తా చూపించారు. చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే.
ఇక మెగా ఫ్యామిలీ నుండి సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి యువ హీరోలు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చిరంజీవికి బావ మరిది అవుతారు. ఆయన తనయుడు, ‘పుష్ప’ సినిమాతో గ్లోబల్ రేంజ్ కు వెళ్ళిన ‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ కూడా చిరంజీవికి మేనల్లుడు వరుస అవుతాడు.
ఈ విధంగా మొత్తం ఆరు-ఏడుగురు హీరోలు ఒకే కుటుంబం నుండి వచ్చి, పరిశ్రమను ప్రభావితం చేయడం అనేది అసామాన్యమైన విషయం. చిరంజీవి గారి శ్రీమతి సురేఖ, కుమార్తెలు సుస్మిత, శ్రీజ మరియు మనవరాల్ల గురించి కూడా అందరికీ తెలిసిందే.
రాజకీయాల్లోనూ తనదైన ముద్ర:-
చిరంజీవి కాకుండా రాజకీయాలలోనూ తనదైన ముద్రను వేశారు. సామాజిక న్యాయమే లక్ష్యంగా 2009లో సొంతంగా ‘ప్రజారాజ్యం’ పార్టీని స్థాపించి తనతోపాటు 18మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. ఈ క్రమంలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా తొలిసారి కీలక పదవిని చేపట్టారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న చిరంజీవి తన పూర్తి దృష్టిని సినిమాలపైనే కేంద్రీకరించారు.
సమాజ సేవ:-
సేవకుడుగా చిరంజీవి! చిరంజీవి గారి గొప్పతనం కేవలం నటనకు, డాన్స్ లకు మాత్రమే పరిమితం కాదు. సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలన్న తపనతో ఆయన ‘చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్’ ను స్థాపించారు. ముఖ్యంగా, ‘చిరంజీవి బ్లడ్ బ్యాంక్’ మరియు ‘చిరంజీవి ఐ బ్యాంక్’ ఆయన జీవితంలో అత్యంత విలువైన ఘట్టాలు.
చిరంజీవి బ్లడ్ బ్యాంక్:-
1998లో స్థాపించబడిన ఈ రక్త నిధి కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో వేలాది మంది ప్రాణాలను కాపాడింది. సరైన సమయంలో రక్తం దొరక్క ప్రాణాలు కోల్పోతున్న వారిని చూసి చలించిపోయి, చిరంజీవి ఈ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించారు. ఆయన పిలుపు మేరకు లక్షలాది మంది అభిమానులు, స్వచ్ఛంద సంస్థలు రక్తదానం చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇలా 25 ఏళ్లకు పైగా నిరంతరం సేవలు అందిస్తూ, రక్తం లేనివారికి జీవితాన్ని అందిస్తోంది. ఈ బ్లడ్ బ్యాంక్ సేవలకు గాను అనేకసార్లు ప్రభుత్వ పురస్కారాలు కూడా అందుకుంది.
చిరంజీవి ఐ బ్యాంక్:-
ఇక దీనితోపాటు చిరంజీవి ‘ఐ’ బ్యాంక్ కూడా నెలకొల్పారు. రక్తదానంతో పాటు, నేత్రదానం ప్రాముఖ్యతను కూడా గుర్తించిన చిరంజీవి గారు కంటి చూపు కోల్పోయినవారికి తిరిగి చూపును అందించేందుకు కళ్ళ బ్యాంక్‌ను స్థాపించారు. వేలాది మందికి కంటి చూపును తిరిగి అందించేందుకు ఈ ఐ బ్యాంక్ విశేషంగా కృషి చేస్తోంది. ఆయన తన అభిమానులను కంటిదానానికి ప్రోత్సహిస్తూ, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు.
కరోనా సమయంలో సేవ:-
2020లో ప్రపంచం మొత్తాన్ని ఒణికించిన కరోనా మహమ్మారి సమయంలో షూటింగులు ఆగిపోయి సినీ కార్మికులు ఇల్లు గడవక ఇబ్బంది పడుతుంటే వారికి నిత్యావసరాలు అందించి ఎంతో సాయం చేశారు. అలాగే వారికి, వారి కుటుంబసభ్యులకు కరోనా చికిత్స కోసం ఆర్ధికంగా కూడా చేయుట అందించారు.
అవార్డులు & గౌరవాలు:-
చిరంజీవి గారు తన నటనకు గాను అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి:
పద్మ విభూషణ్ (2024): భారత ప్రభుత్వం అందించే అత్యున్నత రెండవ పౌర పురస్కారం ఇది. చిరంజీవి గారి కళా సేవలను, సామాజిక సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఈ అత్యున్నత గౌరవాన్ని అందించింది.
పద్మ భూషణ్ (2006): కళా రంగానికి ఆయన చేసిన కృషికి గాను, భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ భూషణ్ ను అందుకున్నారు.
రఘుపతి వెంకయ్య అవార్డు (2016): తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఆయన అందించిన విశేష సేవలకు గాను, తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత అవార్డు అయిన రఘుపతి వెంకయ్య అవార్డును అందుకున్నారు.
గౌరవ డాక్టరేట్ (2006): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. అలాగే తొమ్మిది ఫిలింఫేర్ మరియు నాలుగు నంది అవార్డులను అందుకున్నారు.
విశ్వంభర: ఒక సరికొత్త శకం!
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి రెండు అత్యంత ఆసక్తికరమైన చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ‘విశ్వంభర’. ‘బింబిసార’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. గతంలో తెలుగు ప్రేక్షకులు చూడని సోషియో-ఫాంటసీ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మెగాస్టార్ స్టైల్, నటన, వశిష్ట విజన్ కలగలిపి ‘విశ్వంభర’ తెలుగు సినిమాకు ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ సినిమా నిర్మాణం జరుగుతోంది. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Mega157: మాస్ ఫెస్టివల్!
ఇక మెగాస్టార్ చేస్తున్న మరో సినిమా, ప్రస్తుతానికి #Mega157 అనే వర్కింగ్ టైటిల్ తో పిలవబడుతోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తోంది బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. పక్కా మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మెగాస్టార్ కామెడీ టైమింగ్, అనిల్ రావిపూడి ట్రేడ్ మార్క్ ఎంటర్టైనర్ మేకింగ్.. ఈ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ముగింపు:-
చిరంజీవి గారు కేవలం వెండితెర మీదనే కాకుండా, ప్రజల హృదయాల్లోనూ నిజమైన మెగాస్టార్. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన భవిష్యత్ ప్రయాణం విజయవంతం కావాలని ఆశిద్దాం. ఇది ఆయనకు మాత్రమే కాదు, ఆయనను ప్రేమించే ప్రతి ఒక్క అభిమానికి కూడా ఒక పండగే. చిరంజీవి గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజానికి సేవ చేయాలని ఆశిస్తూ, ఆయన చేసే అన్ని చిత్రాలు ప్రేక్షకులను అలరించాలని కోరుకుందాం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























