నటీనటులు: నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సర్బ్, దలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునయన తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మిరెడ్డి
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
నిర్మాణం: అమిగోస్ క్రియేషన్స్, శ్రీవేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి బ్యానర్స్
నిర్మాతలు: శేఖర్ కమ్ముల, సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు
దర్శకత్వం: శేఖర్ కమ్ముల
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధానపాత్రల్లో నటించిన లేటెస్ట్ హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘కుబేర’. ప్రముఖ హాలీవుడ్ నటుడు జిమ్ సర్ఫ్ కీలక పాత్రలో కనిపించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘ధనం మూలం ఇదం జగత్’ అనే కాన్సెప్టుతో తెరకెక్కింది. ఈసారి ఆయన తన స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాను రూపొందించడం విశేషం.
ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. అలాగే దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతులమీదుగా ట్రైలర్‌ని లాంచ్ చేసిన తర్వాత మూవీపై మరింత బజ్ పెరిగింది. ధనుష్ ఉండటంతో తమిళంలోనూ దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో కుబేర చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలయింది.
అయితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల సహా స్టార్ కాస్టింగ్ అంతా తొలిసారి తమ కంఫర్ట్ జోన్స్ నుంచి బయటకువచ్చి చేసిన ఈ మూవీ ప్రేక్షకులను అలరించిందా? ఈ చిత్రంతో ధనుష్ తెలుగులో రెండోసారి కూడా హిట్ అందుకున్నాడా? నాగార్జున సరికొత్తగా సీబీఐ ఆఫీసర్‌గా కనిపించడం ఆడియెన్స్‌ని ఆకట్టుకుందా? రష్మిక లక్ ఈ సినిమాకీ కలిసొచ్చిందా? ఇంతకూ సినిమా రిజల్ట్ ఎలావుంది? అన్న విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
నీరజ్ మిత్ర (జిమ్ సర్భ్) ఒక పెద్ద పారిశ్రామికవేత్త. దేశంలోనే అత్యంత సంపన్నుడైన ఆయన ప్రపంచంలోనే ధనవంతుడు అనిపించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంటాడు. తన కంపెనీకి 15 ఏళ్లుగా సరిపడే చమురు నిల్వలు దొర్కుతాయి. మంత్రితో రహస్య ఒప్పందం చేసుకుంటే ఆ నిల్వలపై పూర్తి హక్కులు తనకే ఉంటాయి అని భావిస్తాడు. అయితే ఇక్కడే అతనికి ఓ చిక్కు ఎదురవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం సాఫీగా జరగాలంటే కొన్ని అక్రమాలకు పాల్పడాల్సి వుంటుంది. ఈ క్రమంలో నాలుగు బినామీ ఖాతాలలో రూ.50వేల కోట్లు బదిలీ చేయాల్సి వస్తుంది.
దీనికోసం నీరజ్ దీపక్ (నాగార్జున)ని ఎంచుకుంటాడు. దీపక్ నిజాయితీగల ఒక సీబీఐ అధికారి. కొన్ని కారణాలతో అతడు జైలులో ఉంటాడు. వ్యవస్థ పైన అతనికి చాలా కోపం ఉంటుంది. ఈ నేపథ్యంలో తన పని పూర్తి చేసుకోవడానికి దీపక్‌ని ఉపయోగించుకోవాలనుకుంటాడు నీరజ్. అతడిని జైలు నుంచి బయటకు రప్పించి తన సహాయంతో నలుగురు బినామీలను రిక్రూట్ చేసుకుకోవాలి అనుకుంటాడు. దీపక్కి ఇది అక్రమం అని తెలిసినా, జైలు నుండి బయటికి వచ్చి కుటుంబంతో గడపాలి అనే ఉద్దేశంతో ఈ పనికి ఒప్పుకుంటాడు.
ఇక బినామీలను రిక్రూట్ చేసే క్రమంలో దీపక్ చాలా ఆలోచిస్తాడు. ఆ నలుగురు బినామీలు బిచ్చగాళ్ళు అయితే ఫ్యూచర్లో రిస్క్ ఉండదు అని బిచ్చగాడైన దేవా (ధనుష్)తో పాటుగా మరో ముగ్గురు బెగ్గర్స్‌ని కలుస్తాడు. అయితే డబ్బు వస్తుంది కదా అని ఈ పనికోసం తొలుత ఒప్పుకున్న దేవా, ఆ తర్వాత ఇందులో ఏదో మతలబు ఉందని, భవిష్యత్తులో తన లైఫ్‌కి రిస్క్ ఉండొచ్చు అని ఎస్కేప్ అవుతాడు.
అయితే దీపక్కి దేవా దొరికాడా? విషయం తెలిసిన నీరజ్ ఏం ప్లాన్ వేశాడు? దేవా ప్రాణాలకు నిజంగానే ప్రమాదం ఏర్పడిందా? బిచ్చగాడైన దేవా ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోగలిగాడు? నిజాయితీ కలిగిన ఆఫీసర్ అయిన దీపక్ చివరివరకూ నీరజ్ పక్కన నిలబడగలిగాడా? దీపక్ దేవాని కాపాడాడా? ఆర్ధికంగా, రాజకీయంగా బలమైన నీరజ్‌ని దేవా ఎదుర్కోగలిగాడా? నీరజ్ వేసిన ఈ బడా స్కెచ్‌కి కౌంటర్ ప్లాన్ వేశాడా? అసలు దేవా ఎవరు? తను బిచ్చగాడిగా ఎందుకు మారాడు? అలాగే ఈ కథలో సమీరా (రష్మిక) పాత్ర ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది మిగతా కథ.
విశ్లేషణ:-
తెలుగు దర్శకుల్లో శేఖర్ కమ్ములది ప్రత్యేక శైలి. ఇటు ఇండస్ట్రీలోనే కాకుండా అటు ప్రేక్షకుల్లో సైతం ఆయనకు సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరుంది. ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాలన్నీ చాలా సింపుల్‌గా ఉంటాయి. ప్రేక్షకుడికి వర్షం పడేటప్పుడు ఒక చక్కని కాఫీ తాగిన అనుభూతినిస్తాయి. తన చిత్రాలలో ఎక్కడా ఎలాంటి ఎలివేషన్ సీన్స్, భారీ యాక్షన్ సీన్స్, అదిరిపోయే ట్విస్టులు, అనవసరమైన హంగులు.. ఇవేవీ కనిపించవు. తేలికపాటి అలలపై ఒక పడవ ప్రయాణంలా ఆయన సినిమాలు సాగుతాయి.
‘ఆనంద్, హ్యాపీడేస్, గోదావరి, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ వంటి చిత్రాలతో శేఖర్ కమ్ముల సూపర్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాలన్నీ ఆడియెన్స్‌కి ఒక ఫీల్ గుడ్ మూవీస్ భావనను కలిగిస్తాయి. అయితే ఇప్పుడు తన స్టైల్‌కి భిన్నంగా ఆయన కుబేర సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ధనవంతుడు-పేదవాడు అనే కాన్సెప్టుతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. భూమిపైన జీవించే ప్రతి ఒక్కరికీ నీరు, ఆహారం ఎంత అవసరమో, అవి సమకూరాలంటే తప్పనిసరిగా ధనం అంతే అవసరం.
నిద్రలేస్తే డబ్బు సంపాదించడం ఒక్కటే అందరి టార్గెట్. అందుకే ఈ కథతో తెరకెక్కే సినిమాలకు జనం బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు శేఖర్ కమ్ముల కూడా ఈ కాన్సెప్టుతోనే కథని తయారుచేశారు. చూసిన ప్రతి ఒక్కటీ సొంతం చేసుకోవాలనుకునే ఒక కుబేరుడు, జీవితంలో తనకేమీ అక్కరలేదనుకునే ఒక బిచ్చగాడు పాత్రల మధ్య డ్రామాతో అద్భుతమైన కథను రూపొందించారు. కథగా చూస్తే ఇది మామూలు సినిమానే అనిపించినా, దీనికి తన మార్క్ స్క్రీన్ ప్లేను జోడించి స్పెషల్ మూవీగా మార్చేశారు.
సినిమా ప్రారంభం లోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. ఇద్దరు హీరోల ఇంట్రో సీన్స్ అన్ ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. సీబీఐ ఆఫీసర్‌గా నాగ్, బెగ్గర్‌గా ధనుష్ తమ పాత్రలలో చక్కగా ఒదిగిపోయారు. ఒకవైపు ధనుష్‌ని ఈ పథకంలోకి లాగడానికి నాగ్ చేసే ప్రయత్నాలు, మరోవైపు బెగ్గింగ్ మాఫియా చిన్నపిల్లలతో చేసే అకృత్యాలు.. ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ వరకూ సినిమా ఫుల్ హైతో ఎక్కడా తగ్గకుండా పరుగెత్తుతుంది. ఇక ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్‌తో సెకండ్ హాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది.
దీనికి తగ్గట్టే కథ ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. ఫస్టాప్ కన్నా సెకండాఫ్ ఆసక్తికరంగా అనిపిస్తుంది. ధనుష్‌కి రష్మిక పరిచయమవడం, అతడి వలన తన ప్రాణాలకూ ప్రమాదం ఏర్పడటం, తప్పనిసరి పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి ప్రయాణం చేయడం ఉత్కంఠకు గురిచేస్తాయి. ముఖ్యంగా ఫ్రీ క్లైమాక్స్ మరియు క్లైమాక్స్‌లో వచ్చే సీన్స్ సినిమాకే హైలైట్. నాగ్-ధనుష్, ధనుష్-రష్మిక మధ్య వచ్చే సీన్స్ బాగా అలరిస్తాయి. మొత్తానికి ప్రేక్షకుడికి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అద్భుతమైన సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే కింగ్ నాగార్జున ఎంత గొప్ప నటుడో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తన సుదీర్ఘ కెరీర్లో ఆయన ఎన్నో రకాల పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. కొత్త దర్శకులతో చాలా ప్రయోగాలు చేసి సూపర్ హిట్స్ కొట్టారు. ‘శివ, గీతాంజలి, అన్నమయ్య, మన్మథుడు’ వంటి సినిమాలు ఆయన నటనా వైవిధ్యానికి ఉదాహరణగా నిలుస్తాయి. కుబేరలో సైతం నాగ్ కొత్త తరహా పాత్రలో మెరిశారు. మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన సీబీఐ ఆఫీసర్ క్యారెక్టర్లో నాగ్ కనిపించారు. తన కెరీర్లో ఇది నిలిచిపోయే క్యారక్టర్ అవుతుంది.
ఇక కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ విషయానికొస్తే, ఒక సినిమాకి, మరో సినిమాకి సంబంధం లేకుండా రకరకాల కథలతో, పాత్రలతో దూసుకెళ్తున్నాడు. తెలుగులో ఆయన తొలిసారిగా ‘సార్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు రెండో ప్రయత్నంగా కుబేరతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇందులో ఆయన బెగ్గర్‌గా కనిపించి ఆడియెన్స్‌ని సర్ప్రైజ్ చేశారు. తన స్వాగ్తో స్క్రీన్‌పై మ్యాజిక్ చేశాడు. ఈ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేం అన్నట్టుగా నటించారు. తప్పకుండా కుబేర ఆయన కెరీర్లో నిలిచిపోయే సినిమా అవుతుంది.
ఇక ఫిమేల్ లీడ్‌లో రష్మిక మందన్న మరోసారి అద్భుతమైన నటనను కనబరిచింది. తన అదృష్టమో ఏమోకానీ ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలలోని ప్రతి పాత్రా ఆమెకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఈ చిత్రంలో కూడా రష్మికది చాలా కీలకమైన పాత్ర. తన కథలలో స్త్రీ పాత్రలను బలంగా చూపించే శేఖర్ కమ్ముల వంటి డైరెక్టర్ తోడైతే ఆమె నటన ఇంకెలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి తగ్గట్టే ఇందులో కూడా ఆమె తన తన స్క్రీన్ ప్రజెన్స్‌తో మెప్పిస్తుంది.
ఇక ఇతర నటుల విషయానికొస్తే.. హాలీవుడ్ నటుడు జిమ్ సర్బ్ పాత్రకు మంచి ఇంపార్టెన్స్ వుంటుంది. ఇంతకుముందు ఆయన బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘పద్మావతి’లో కీలక పాత్రలో మెప్పించాడు. ఇందులో కూడా సర్బ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. సినిమాలో ఆయనది నెగటివ్ రోల్. ప్రపంచంలో తాను కోరినవన్నీ తనకు దక్కాలనుకునే రూత్ లెస్ బిజినెస్‌మేన్‌గా కనిపించాడు. అలాగే మిగిలినవారిలో దలీప్ తాహిల్, కల్నల్ రవి శర్మ, సునయన తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక సాంకేతికంగా చూస్తే, సినిమా చాలా బావుంది. టెక్నికల్లీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించి. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకి బిగ్గెస్ట్ బ్యాక్‌బోన్‌గా నిలిచింది. కేవలం పాటలే కాకుండా బీజీఎమ్ కూడా చాలా బావుంది. చాలా సన్నివేశాలను బీజీఎమ్ ఎలివేట్ చేసింది. కొన్ని ఎమోషనల్ సీన్స్‌ను దేవి తన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో హృద్యంగా ఆవిష్కరించారు. ఇది ఆయనకు మరో బెస్ట్ మ్యూజికల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు.
అలాగే నికేత్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయింది. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్గా ఉండి విజువల్స్ అద్భుతంగా వున్నాయి. నిడివి ఎక్కువే వున్నా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ షార్ప్‌గా ఉండి సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా చేసింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. నిర్మాతలు దీనిని సూపర్ క్వాలీటీతో సినిమాను నిర్మించారు. దర్శకుడు కూడా నిర్మాతల్లో ఒకరు కావడంతో కథకి తగ్గట్టుగా ఖర్చుకి ఎక్కడ వెనుకాడలేదని అర్ధమవుతోంది.
ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన కుబేర ఆ అంచనాలను అందుకుందనే చెప్పొచ్చు. నాగార్జున, ధనుష్, రష్మికల నటన, దేవి మ్యూజిక్, శేఖర్ కమ్ముల డైరెక్షన్ వెరసి సినిమాను సక్సెస్ చేశాయి. ఇది డబ్బు చుట్టూ తిరిగే ఎమోషనల్ డ్రామా కావడంతో ప్రతిఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. దీనికితోడు డైరెక్టర్ తనదైన ట్రీట్మెంట్తో స్పెషల్‌గా మార్చారు. దీంతో ఈ మూవీ అన్ని వర్గాల వారినీ అలరించేలావుంది. మొత్తానికి కుబేరతో శేఖర్ కమ్ముల చాలా రోజుల తర్వాత మంచి హిట్ అందుకున్నారని చెప్పొచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























