నటీనటులు: కమల్ హాసన్, శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్, అలీ ఫజల్, రోహిత్ సరాఫ్, బాబురాజ్ తదితరులు
సంగీతం: ఏఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి కె. చంద్రన్
ఎడిటింగ్: ఎ. శ్రీకర్ ప్రసాద్
నిర్మాణం: రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ బ్యానర్స్
నిర్మాతలు: కమల్ హాసన్; R. మహేంద్రన్; మణిరత్నం; శివ అనంత్
దర్శకత్వం: మణిరత్నం
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘థగ్ లైఫ్’. దాదాపు 37 సంవత్సరాల తర్వాత వీరి కాంబో రిపీట్ అవ్వడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘నాయకన్’ సూపర్ హిట్ అందుకుంది. ఇక థగ్ లైఫ్ మూవీలో శింబు, త్రిష కృష్ణన్, అభిరామి, జోజు జార్జ్, నాజర్ కీలక పాత్రలు పోషించారు.
ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య ఈ చిత్రం నేడు థియేటర్లలోకి వచ్చింది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో హ్యూజ్ రిలీజ్ అయింది. ఇక తెలుగులో ఈ సినిమాను టాలీవుడ్ హీరో నితిన్ తండ్రి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఎన్ సుధాకర్ రెడ్డి శ్రేష్ట్ మూవీస్ ద్వారా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇక్కడా దీనిపై హై ఎక్స్‌పెక్టేషన్సే వున్నాయి.
అయితే గతంలో ఎన్నో కల్ట్ క్లాసిక్ చిత్రాలను రూపొందించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేశారా? అలాగే ‘విక్రమ్’తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న కమల్ ఆ తర్వాత ‘ఇండియన్ 2’తో నిరాశపరిచారు. ఈ క్రమంలో ఇప్పుడు థగ్ లైఫ్‌తో వచ్చిన ఆయన ఆడియెన్స్‌ని అలరించారా? మణిరత్నం-కమల్ హాసన్ కాంబో రెండోసారీ సక్సెస్ అయిందా? శింబు, త్రిష ఈ మూవీతో హిట్ అందుకున్నారా? వంటి విషయాలు తెలియాలంటే, రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
కథ 1994 సంవత్సరంలో ప్రారంభమవుతుంది. రంగరాయ శక్తివేల్ (కమల్ హాసన్) ఒక గ్యాంగ్‌స్టర్. ఒకసారి గిరిజన గన్ ఫైట్ టైమ్‌లో అమర్ అనే 4 సంవత్సరాల పిల్లవాడిని అతడు కాపాడతాడు. అయితే ఈ ఘర్షణలో అమర్ తండ్రి చనిపోతాడు. దీంతో శక్తివేల్ అమర్‌ని తన వద్దే ఉంచుకుని పెంచి పెద్ద చేస్తాడు. ప్రస్తుతానికి వస్తే, శక్తివేల్ మరింత పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్ అవుతాడు. అమర్ (శింబు) అతని కుడి భుజంగా వ్యవహరిస్తుంటాడు.
ఈ నేపథ్యంలో ఒక కేసు విషయంలో శక్తివేల్‌ని అరెస్ట్ చేశాడు. దీంతో అమర్ ఢిల్లీలోని ఒక రాజకీయ నాయకుడైన సదానంద్ (మహేష్ మంజ్రేకర్)తో చేతులు కలుపుతాడు. అయితే ఇది శక్తివేల్‌కి ఇష్టం ఉండదు. దీని తర్వాత ఒకరోజు శక్తి మీద హత్యాప్రయత్నం జరుగుతుంది. ఈ ఎటాక్ వెనుక అమర్ ఉన్నాడని అనుమానిస్తాడు. ఇక్కడినుంచి వీరిద్దరి మధ్య దూరం పెరుగుతుంది.
అయితే వీరి మధ్య వైరం చివరికి ఎటు దారితీసింది? నిజంగానే శక్తివేల్ అనుమానించినట్టు అమర్ ఈ ఎటాక్ చేయించాడా? సదానంద్ అంటే శక్తికి ఎందుకు పడదు? పోలీసు అధికారి సాల్మన్ (అశోక్ సెల్వన్) ఎలాంటివాడు? అదే కథ. శక్తివేల్ జీవితంలోని ఇంద్రాణి, లక్ష్మి (అభిరామి), మాణిక్యం (నాజర్), జోజు జార్జ్ పాత్రలేంటి? చివరికి శక్తివేల్, అమర్ తిరిగి కలుసుకున్నారా? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:-
దర్శకుడు మణిరత్నంది డిఫరెంట్ శైలి. ఇండియాలోని దిగ్గజ దర్శకుల్లో ఆయన ఒకరు. 1990-2000 దశకం మధ్య ఆయన తెరకెక్కించిన ‘రోజా, బొంబాయి, సఖి’ సినిమాలు నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టించాయి. అనంతరం ‘గురు, రావణ్’ సినిమాలతో తన మార్క్ చూపించిన ఆయన, ఇటీవలే ‘పొన్నియన్ సెల్వన్ -1 & 2’ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు థగ్ లైఫ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు.
కథగా చూస్తే.. ఈ సినిమా అనేక ట్విస్టులతో కూడి వుంటుంది. మూవీ ప్రారంభం లోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ప్రేక్షకుడికి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ లభిస్తుంది. హీరో ఇంట్రో సీన్ నుండి ఇంటర్వెల్ వరకూ సినిమా ఫుల్ హైతో ఎక్కడా తగ్గకుండా పరుగెత్తుతుంది. గ్యాంగ్ స్టర్‌గా కమల్ చెలరేగిపోయాడు. ఎలివేషన్ సీన్లు బాగా వర్కవుట్ అయ్యాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలైతే ఐ ఫీస్ట్.
ఇక్కడ వచ్చే ట్విస్ట్‌తో సెకండ్ హాఫ్‌పై మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. దీనికి తగ్గట్టే కథ ఎక్కడా డిజప్పాయింట్ చేయదు. కమల్-శింబు కాంబోలో సీన్స్ సినిమాకే హైలైట్. కమల్-త్రిష, కమల్-అభిరామి మధ్య వచ్చే సీన్స్ అలరిస్తాయి. యాక్షన్ ఘట్టంతో ముగిసే క్లైమాక్స్ ఆకట్టుకుంటుంది. మొత్తానికి ప్రేక్షకుడికి ఈ సినిమాలో వింటేజ్ కమల్‌ని చూసిన ఫీలింగ్ వస్తుంది.
ఇక నటీనటుల విషయానికి వస్తే లోకనాయకుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనలో ఆయన పర్వత శిఖరం అని చెప్పొచ్చు. దాదాపు 5 దశబ్దాలుగా కమల్ తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన చేయని పాత్ర లేదు, అలాగే చేయని ప్రయోగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఎంతోమంది నటులకు కమల్ హాసన్ ఫెవరెట్ యాక్టర్.
ఆయనను చూసే తాము స్ఫూర్తి పొందామని ఎంతోమంది నటులు బహిరంగ వేదికలపైనే ప్రకటిస్తుంటారు. అలాంటి కమల్ హాసన్, మణిరత్నం లాంటి క్రియేటివ్ డైరెక్టర్‌తో సినిమా అంటే, ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా ఆయన డిఫరెంట్ రోల్‌లో కనిపించారు. ఈ పాత్రలో ఆయనను తప్ప మరొకరిని ఊహించలేం అన్నట్టుగా నటించారు. థగ్ లైఫ్ కమల్ కెరీర్‌లో నిలిచిపోయే సినిమాగా అవుతుంది.
ఈ సినిమాలో యంగ్ హీరో శింబు కీలక పాత్రను పోషించాడు. ఎనర్జిటిక్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. తన స్వాగ్‌తో స్క్రీన్‌పై వన్ మ్యాన్ షో చేశాడు. ఇంకా ఫిమేల్ లీడ్‌లో త్రిష మెప్పించింది. తన స్క్రీన్ ప్రజెన్స్ బావుంది. సీనియర్ నటి అభిరామి చాలారోజుల తర్వాత తెరపై కనిపించారు. ఆమె పాత్రకు మంచి ఇంపార్టెన్స్ వుంటుంది. అలాగే మిగిలినవారిలో ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, జోజు జార్జ్, నాజర్ తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక టెక్నికల్ పరంగా చూస్తే, సినిమా చాలా బావుంది. టెక్నికల్లీ టాప్ నాచ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సంగీతం గురించి. ఏఆర్ రహమాన్ అందించిన మ్యూజిక్ సినిమాకి ప్లస్ అయింది. కేవలం పాటలే కాకుండా బీజీఎమ్ కూడా చాలా బావుంది. చాలా సన్నివేశాలను బీజీఎమ్ ఎలివేట్ చేసింది. కొన్ని సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పించ్చేలావుంది.
అలాగే రవి కె. చంద్రన్ సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉండటంతోపాటు విజువల్స్ చాలా కలర్ ఫుల్‌గా వున్నాయి. డైరెక్టర్ విజన్‌కి తగ్గట్టుగా గ్రాండియర్‌గా వుంది. సీనియర్ ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ గురించి చెప్పేదేముంది.. ఆయన ఎడిటింగ్ షార్ప్‌గా ఉండి సినిమాపై ఆసక్తిని కోల్పోకుండా చేసింది. హీరో, డైరెక్టర్లే నిర్మాతలు కూడా కావడంతో కథకి తగ్గట్టుగా బాగా ఖర్చు పెట్టారు. సూపర్ క్వాలీటీతో సినిమాను నిర్మించారు.
ఓవరాల్‌గా భారీ అంచనాల మధ్య వచ్చిన థగ్ లైఫ్ ఆ అంచనాలను అందుకుందని చెప్పొచ్చు. కమల్ హాసన్, శింబు, త్రిషల నటన రెహమాన్ మ్యూజిక్, మణిరత్నం డైరెక్షన్ వెరసి సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలబెట్టాయి. ఇది గ్యాంగ్‌స్టర్ డ్రామా కావడంతో యాక్షన్ ప్రియులకి బాగా నచ్చుతుంది. అలాగే యూత్ ఆడియెన్స్ వెంటనే కనెక్ట్ అవుతారు. వీరితోపాటు మిగతా వర్గాల వారినీ ఈ సినిమా అలరిస్తుంది. మొత్తానికి లేట్ వయస్సులో కమల్-మణిరత్నం మరోసారి మ్యాజిక్ చేశారనే చెప్పొచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: