నటీనటులు: ప్రియదర్శి, రూప కొడయూర్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, తనికెళ్ల భరణి, వి.కె. నరేష్, హర్ష చెముడు, రూప లక్ష్మి తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
సినిమాటోగ్రఫీ: పి.జి. విందా
ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాణం: శ్రీదేవీ మూవీస్
నిర్మాత: శివలెంక కృష్ణ ప్రసాద్
దర్శకత్వం: మోహన కృష్ణ ఇంద్రగంటి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటులలో ప్రియదర్శి ఒకరు. ప్రస్తుతం ఆయన వరుస విజయాలతో మంచి ఊపు మీద ఉన్నారు. ఇటీవలే ‘కోర్ట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రియదర్శి.. హీరోగా నటించిన తాజా చిత్రం ‘సారంగపాణి జాతకం’. క్రియేటివ్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే వున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.
అయితే ఇంతకూ సారంగపాణి జాతకం ఎలా ఉంది? విభిన్న తరహా పాత్రలను ఎంచుకుంటున్న ప్రియదర్శి.. ఇందులో తన కామెడీ టైమింగ్‌ని మరోసారి చూపించారా? అలాగే స్క్రీన్ ప్లే, టేకింగ్ బావుంటుందని పేరు తెచ్చుకున్న మోహనకృష్ణ ఇంద్రగంటి ఈ చిత్రంతో అది నిలబెట్టుకున్నారా? వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల పాత్రలేంటి? అసలు జాతకాలు నమ్మొచ్చా? లేదా? అనే విషయాలు తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.
కథ:-
జాతకాలను ఎక్కువగా నమ్మే యువకుడు సారంగపాణి (ప్రియదర్శి). ఒక కారు కంపెనీలో సేల్స్‌మెన్‌గా పని చేస్తుంటాడు. అదే కంపెనీలో మైథిలీ (రూపా కొడవయూర్) మేనేజర్‌గా వర్క్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్న వీరు ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంటారు. అయితే సారంగపాణి జాతకం చూసిన జిగేశ్వరానంద (శ్రీనివాస్ అవసరాల) ఓ షాకింగ్ విషయం వెల్లడిస్తాడు.
జాతకం ప్రకారం నువ్వు ఒక హత్య చేస్తావని ఉందని చెప్పడంతో సారంగపాణి భయపడతాడు. ఒక వేళ జాతకంలో ఉన్నట్టు పెళ్లి తరువాత ఆ హత్య చేస్తే మైథిలీ జీవితం పాడవుతుందని ఆలోచిస్తాడు. దీంతో ఈ సమస్యకి పరిష్కారంగా పెళ్లికి ముందే ఆ హత్య చేసేయాలని నిర్ణయించుకుంటాడు. దీనికోసం తన స్నేహితుడు చందు (వెన్నెల కిషోర్)తో కలిసి రకరకాల ప్రయత్నాలు చేస్తాడు సారంగపాణి.
అయితే చందుతో కలిసి సారంగపాణి చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ క్రమంలో అతడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? తన టార్గెట్‌గా అహోబిల రావు (తణికెళ్ల భరణి)ని ఎందుకు ఎంచుకున్నాడు? జాతకంలో చెప్పినట్టు అతడు నిజంగానే హత్య చేస్తాడా? చివరకు సారంగపాణి ఏం చేశాడు? తాను ప్రేమించిన మైథిలీతో అతని పెళ్లి అయిందా? లేదా? అన్నదే మిగతా కథ.
విశ్లేషణ:-
సారంగపాణి జాతకం సినిమా కథ గమనిస్తే.. ఇది ఇంతకుముందు అడపాదడపా కొన్ని సినిమాల్లో చూసినట్టే వుంటుంది. అప్పుడెప్పుడో రాజేంద్రప్రసాద్-ఈవీవీ కాంబోలో వచ్చిన ‘ఆ ఒక్కటీ అడక్కు’ తరహాలో వుంటుంది. అయితే ఇక్కడే దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తన మ్యాజిక్ చూపించాడు. కథలో కామెడీతోపాటు భావోద్వేగాలకు పెద్ద పీట వేశాడు. ఒక మామూలు కథని మనసుకు హత్తుకునేలా అద్భుతంగా తెరకెక్కించాడు. జాతకాల పిచ్చి ఉండే యువకులు ఎలా ప్రవర్తిస్తారు? జీవితం పట్ల వారి దృక్పథం ఎలా వుంటుంది? అన్న విషయాలను వినోదాత్మకంగా చూపించారు.
సినిమా ప్రారంభంలోనే ప్రేక్షకుడిని నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. జాతకాలను నమ్మే హీరో, అతడికి పూర్తి విరుద్ధ స్వభావం కలిగిన హీరోయిన్, వీరి మధ్య ప్రేమకథ.. వీటితో ఫస్టాఫ్ సరదాగా సాగుతుంది. అలాగే వెన్నెల కిషోర్, హర్ష సహజమైన హాస్యంతో ఆకట్టుకుంటారు. ఇక సెకండాఫ్ అయితే మరింత హిలేరియస్‌గా వుంటుంది. కొన్ని సన్నివేశాల్లో ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారంటే అతిశయోక్తిలేదు. క్లైమాక్స్ మెప్పిస్తుంది.
నటీనటుల విషయానికొస్తే.. ‘మల్లేశం, బలగం’ చిత్రాలతో ప్రియదర్శి ఇప్పటికే మంచి నటుడిగా నిరూపించుకున్నాడు. అయితే తన బలం మాత్రం కామెడీ. ఇది ఇంతకుముందు పలు సినిమాల్లో ప్రూవ్ అయింది. ఇందులో కూడా మరోసారి అదే తరహా పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. జాతకాల పిచ్చి ఉన్న యువకుడిగా నటించిన తీరు మెప్పిస్తుంది. అలాగే హీరోయిన్ రూప కొడయూర్ స్క్రీన్ పైన చాలా అందంగా కనిపించింది. మిగతా నటులు తమ పాత్రల పరిధిమేరకు చక్కగా నటించారు.
ఇక టెక్నిషియన్ల విషయానికొస్తే.. వివేక్ సాగర్ సంగీతం సినిమాకి ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇలాంటి కథలకు ఎంతవరకు అవసరమో వివేక్ అదే చేశారు. పి.జి. విందా సినిమాటోగ్రఫీ మూవీకి మరో ఎస్సెట్. ప్రతి ఫ్రేమ్ కలర్ ఫుల్‌గా కనిపిస్తుంది. అలాగే ఎంతో సీనియారిటీ ఉన్న ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ పనితనం బావుంది. ఇంకా నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకి రాజీపడలేదని అర్ధమవుతుంది.
సారంగపాణి జాతకం సినిమా ఒకవైపు ఎంటర్‌టైన్ చేస్తూనే మరోవైపు మనుషులలో గూడుకట్టుకునిపోయిన మూఢ నమ్మకాలను, మానసిక దుర్బలత్వాన్ని, వాటి ప్రభావాలను గుర్తుచేస్తుంది. ముఖ్యంగా యువత జాతకాలను పట్టించుకోకూడదని, కష్టపడి పనిచేయాలని అంతర్లీనంగా సందేశం ఇస్తుంది. కథ, పాత్రలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ అన్నీ సహజంగా ఉన్నాయి. ఇది కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్ ఒక్కరినే కాకుండా ప్రతి ఒక్కరిని అలరించేలావుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























