నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ, వడ్లమాని శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, రోహిణి, ప్రమోదిని తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: సుజాత సిద్దార్థ్
ఎడిటింగ్: చింతల మధు
నిర్మాణం: థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్
నిర్మాతలు: కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి
దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ నటుడు సప్తగిరి హీరోగా నటించిన లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘పెళ్లి కాని ప్రసాద్’. హ్యూమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్‌తో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఈ నేపథ్యంలో పెళ్లి కాని ప్రసాద్ నేడు థియేటర్లలోకి వచ్చింది.
TFDC చైర్మన్, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నేతృత్వంలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే ఈ చిత్రం ప్రేక్షకులను అలరించిందా? పెళ్లి కాని ప్రసాద్‌గా సప్తగిరి నటన మెప్పించిందా? సప్తగిరి మార్క్ కామెడీ వర్కౌట్ అయిందా? వంటి విషయాలు తెలుసుకోవాలంటే రివ్యూ చూడాల్సిందే.
కథ:-
కథానాయకుడైన ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలోని ఒక స్టార్ హోటల్‌లో పని చేస్తుంటాడు. తనకి 36 సంవత్సరాలు వచ్చినా పెళ్ళి కావట్లేదని బాధపడిపోతుంటాడు. అయితే మరోవైపు అతని తండ్రి (మురళీధర్) మాత్రం తమ పూర్వీకుల కట్నం నిబంధలను అనుసరించి ప్రస్తుతం మార్కెట్ ప్రకారం కొడుకుకి రెండు కోట్ల కట్నం ఇచ్చే సంబంధం వచ్చినప్పుడే పెళ్లి చేస్తానని భీష్మించుకుంటాడు.
ఈ క్రమంలో ప్రసాద్‌కి ప్రియ (ప్రియాంక శర్మ) పరిచయం అవుతుంది. ఆమెకి తన ఫ్యూచర్ గురించి పెద్ద కలలు ఉంటాయి. తల్లిదండ్రులతో కలిసి విదేశాల్లో సెటిల్ అవ్వాలని భావిస్తుంటుంది. ప్రసాద్‌తో పరిచయం అయ్యాక తన సంపాదన చూసి ఒక పథకం ప్రకారం అతడికి దగ్గరవుతుంది. చివరికి ప్రసాద్ తనను ప్రేమించేలా చేసుకుంటుంది.
ఈ నేపథ్యంలో ప్రియ మెడలో పైసా కట్నం తీసుకోకుండా తాళి కట్టేస్తాడు ప్రసాద్. అనంతరం కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అయితే ఇక్కడినుండే అసలు కథ మొదలవుతుంది. ఓ వైపు ఫారిన్‌లో సెటిల్ అవ్వాలనే ప్రియ ప్లాన్, మరోవైపు ప్రసాద్ ఇండియాలోనే జీవించాలని పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి.
అయితే ఆ తర్వాత ఏం జరిగింది? విదేశాల్లో ఉంటాడనే ఒకే ఒక్క కారణంగా ప్రసాద్‌ను పెళ్ళాడిన ప్రియ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అతడితో ఎలా ఆడుకున్నారు? ఇంతకూ ప్రసాద్ తన భార్య కోరిక ప్రకారం విదేశానికి వెళ్ళాడా? లేక ఆమెనే ఇండియాలో ఉండటానికి ఒప్పించాడా? చివరికి పెళ్లికాని ప్రసాద్ ఏం చేశాడు? అనేదే అసలు కథ!
విశ్లేషణ:-
సాధారణంగా కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ అంటే, కథలు కొంచెం అటుఇటుగా ఒకే తరహా ఫార్మాట్ లోనే ఉంటాయి. అయితే డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ విషయంలో జాగ్రత్త పడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన కామెడీనే నమ్ముకున్నా అది రొటీన్ గా ఉండకుండా చూసుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. దీనికోసం అభిలాష్ ఒక కొత్త పాయింట్ ని ఎంచుకున్నాడు.
గతంలో ఎప్పుడో తమ వంశ పూర్వీకులు ఏర్పర్చిన శాసనాల గ్రంధం ప్రకారం హీరో పెళ్లి చేసుకోవడం అనే కాన్సెప్ట్ ని ఇందులో ప్రవేశపెట్టాడు. ఇది వినడానికి చాలా కొత్తగా ఉండటంతోపాటు దీని ట్రీట్‌మెంట్ కూడా డిఫరెంట్‌గా ఉండేలా చూసుకున్నాడు. ఇలా కామెడీ సీన్స్‌లో కొత్తదనంతో పాటు బిగువైన స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా మలిచాడు.
సినిమా ప్రారంభంలోనే నేరుగా కథలోకి తీసుకెళ్లిపోయాడు దర్శకుడు. ఒకవైపు వయస్సు పెరుగుతున్నా హీరోకి పెళ్లి కాకపోవడం, దీనికోసం అతడు రకరకాల ప్రయత్నాలు చేయడం వంటి సీన్స్ అలరిస్తాయి. మరోవైపు వచ్చే సంబంధాలన్నీ తమ శాసనాల గ్రంథం నియమాలకు లోబడిఉండకపోవడం వంటి కారణంగా పెళ్లి ఆగిపోవడం ఫన్నీగా అనిపిస్తాయి.
ఇలా ఫస్టాఫ్ అంతా సరదా సన్నివేశాలతో ఎక్కడా బోర్ కొట్టించకుండా సాగిపోతుంది. మధ్య మధ్యలో సప్తగిరి, కుటుంబ సభ్యుల మధ్య వచ్చే సీన్స్, హీరోయిన్ తో లవ్ ట్రాక్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. ఇక సెకండాఫ్‌లో స్టోరీ కొంచెం ఎమోషనల్ టర్న్ తీసుకుని ఆసక్తి పెంచుతుంది. అయితే క్లైమాక్స్ ప్రేక్షకుల ఊహకు తగ్గట్టుగానే ఉన్నా మెప్పిస్తుంది.
ఇక నటీనటుల విషయానికొస్తే.. సప్తగిరి కామెడీ టైమింగ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఒకవైపు హాస్య ప్రధానపాత్రల్లో నటిస్తూనే మరోవైపు హీరోగా నటించడమనే బిగ్ ఛాలెంజ్ తీసుకుని పయనిస్తున్నాడు. ఈ క్రమంలో తనకి సరిపోయే కథలను ఎంచుకుంటూ, తన బాడీ లాంగ్వేజ్‌కి సరిపోయే క్యారెక్టర్స్ చేస్తూ మంచి నటుడనిపించుకున్నాడు. ఈ సినిమాలోని పెళ్లి కాని ప్రసాద్ పాత్ర కూడా ఆయనకు టైలర్ మేడ్ తరహాలోనిదే.
ఇలాంటి క్యారెక్టర్స్ సప్తగిరి అతనికి కొట్టిన పిండే. అందుకే ఈ పాత్రను ఆయన చాలా అలవోకగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రతి సీన్ ని తన డైలాగ్ డెలివరీతో రక్తి కట్టించాడు. అలాగే హీరోయిన్ ప్రియాంక శర్మ ఇందులో గ్లామర్ రోల్ పోషించింది. ఆకట్టుకునే అభినయం ప్రదర్శించింది. ఇంకా వడ్లమాని శ్రీనివాస్, మురళీధర్ గౌడ్, రోహిణి, ప్రమోదిని తమ పాత్రల పరిధిమేరకు డీసెంట్‌గా నటించారు.
ఇక టెక్నికల్ విషయానికొస్తే.. శేఖర్ చంద్ర సంగీతం వినసొంపుగావుంది. ఇలాంటి కథకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అదే చేశాడు. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫీ మరో ఎస్సెట్ అని చెప్పొచ్చు. ప్రతి ఫ్రేమ్ కలర్‌ఫుల్‌గా ఉంది. అలాగే చింతల మధు ఎడిటింగ్ షార్ప్‌గా ఉంది. ఇంకా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉండి నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదని అర్ధమవుతుంది.
ఓవరాల్‌గా చూస్తే, పెళ్లి కాని ప్రసాద్ పక్కా ఫన్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. యూత్, ఫ్యామిలీ, క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించేలావుంది. అలాగే హీరో సప్తగిరి కెరీర్‌లో మరో హిట్ సినిమాగా నిలుస్తుంది. మొత్తానికి రెండున్నర గంటలు మంచి టైమ్ పాస్ మూవీ అనిపించుకుంటుంది. కుటుంబంతో కలిసి చూసి హాయిగా నవ్వుకునేలా వుంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: